దేశమంటే మట్టి కాదోయ్..
Published Saturday, 10 August 2019ఆలిండియా రేడియోలో దేశభక్తి గీతాలెన్నో పాడాను. పాడించాను. దేశభక్తి గేయాలంటూ ఎవరు రాసినా ఒక్కటే కథా వస్తువు.
చెప్పినదే పదిసార్లు చెప్తారు. అంటే.. మన భౌగోళిక సంపద, చుట్టూ ఉన్న జీవనదులు, ఎతె్తైన పర్వతాలు, గుహలు ప్రాచీనులు కట్టేసి వెళ్లిపోయి ఆనవాళ్లుగా మిగిల్చిన గుళ్లూ గోపురాలు, శిల్పాలు.. శాశ్వత కట్టడాలు.. ఇవే.
మానవత్వాన్ని మేలుకొలుపుతూ గుండెలోతుల్లోకి వెళ్లి, ఉత్తేజాన్నీ ఉత్సాహాన్నీ నింపగల పాటలు అరుదు. మనిషిని మార్చేది భౌగోళిక సంపద కాదు. దేశభక్తి పుట్టవలసినది ముందు మనస్సులోనే.
ఇది చెబితే రాదు. సహజంగానే రావాలి.
తల్లిదండ్రుల్ని ప్రేమించమని ఒకరు చెప్పాలా? మరచిపోవద్దని బోధించాలా? సంస్కారమున్న వారికి చెప్పవలసిన పని కాదు. పుట్టిన గడ్డపై మమకారం ఒకరు చెబితే వస్తుందా? సామాన్యుడికైనా అసామాన్యుడికైనా ఈ సామాజిక స్పృహ సహజంగా ఉండి తీరాలి. తన వాళ్లెంత ముఖ్యమో, తోటివారూ అంతేనన్న భావం లేనిదే మనిషి మనుగడ లేదు. ఇదే ఇప్పుడున్న లోపం.
పదిమందితో సహజీవనం లేనిదే ఒక్క క్షణం ఎవరికీ గడవదు.
జన హితం జన సుఖం కోరుకోవటమే దేశభక్తి పరమార్థం.
ఉపయోగం లేనివీ, ఆచరణ సాధ్యంకాని కబుర్లెన్ని చెప్పినా ప్రయోజనం సున్నా.
ఈ గడ్డ మీద పుట్టి మన ప్రక్క ఇక్కడే విజయనగరంలోనే పెరిగి పరుల హితమే ఊపిరిగా పరమార్థంగా బ్రతికిన కవిశేఖరుడు, మహాకవి గురజాడ అప్పారావు.
పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. శ్రేయో రాజ్యం కోసమే తపించాడు. కీర్తి శరీరుడై నిలిచిపోయాడు. ఈవేళ ఆయన ఆశించిన సమాజంలోనే ఉన్నామా? అలాగే బ్రతుకుతున్నామా? మన ఇళ్లల్లో తల్లిదండ్రుల ఫొటోలుంటాయి. లేదా తాతలు మామ్మలవి వుంటాయి. కానీ ముత్తాతలు, వారివారి తల్లిదండ్రులూ కనీసం వారి పేర్లు గుర్తు పెట్టుకోగలిగిన వారెందరు.
కానీ ఈ ప్రజలు నా వాళ్లు నా సోదరులు, నా అక్కచెల్ళెళ్లు. వారి కష్టమే నా కష్టం. తోటివారు బాధలు పడుతూంటే చూసి సహించగలనా? ‘ఇదిగో! నేనున్నాను. మీకు తోడై ఉంటాను’ అంటూ స్వాతంత్య్ర సిద్ధి వచ్చేవరకూ (చనిపోయేవరకూ) పోరాడుతూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ, పరుల కోసమే పాటుబడని జన్మ జన్మకాదంటూ వీధులెక్కి, వాడవాడా తిరిగి ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపి ఈ జాతికి జవసత్త్వాలందించి, తానే తండ్రియై జన హృదయనేతగా భాసిల్లిన ‘జాతిపిత’ మనందరిలోనూ కొలువైన భాగ్యం ఆయనదా? మనదా?
ఉద్యమమే ఊపిరిగా బ్రతికిన మహాత్ముడి వెంట ఎంత మంది నడిచారో? మరెందరు ప్రాణాలర్పించారో? ఎంతమంది ఆస్తులమ్ముకున్నారో? ఆనాటి స్వాతంత్య్రోద్యమాన్ని కళ్ళారా చూసిన వారు మాత్రమే చెప్పగలరు. ఆ మహానుభావులంతా క్రమంగా మరుగై పోయారు.
కానీ వారు కీర్తికాయులనటానికి సాక్ష్యమే దేశభక్తి పూరితమైన వారి పాటలు.
‘దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా॥
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్॥
ఉపయోగం లేని ఊకదంపుడు ఉపన్యాసాలెన్నాళ్లు వింటాం? ఉత్తేజాన్ని నింపే వాతావరణం కావాలి. ఉద్వేగం ఉద్రేకం కాదు. సంగీత సాహిత్యాలు రెండూ ఉద్ధరించటం కోసమే పుట్టాయి. ఆ ప్రయోజనం లేని రెండూ నిరర్థకమే!
ఒక్కో మాట ఓ చురకత్తిలా గుండెల్ని తాకాలి. మనసు కరిగిపోవాలి. మైమరచి పాడుకోవాలి.
పదిమందికీ ఉపయోగపడని బ్రతుకు ‘ఏపాటిదనే’ భావం పుట్టాలి. దేశభక్తి ప్రచోదిత భావాలు తరంగాల్లా ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసి పడాలి. జన జీవనంలో ఒక భాగమై నిత్య పూజా విధానంలో చేరిపోవాలి. అప్పుడే జాతికి మనుగడ.
పాటకూ పద్యానికీ ఇదే ప్రయోజనం. జన సుఖం, జన హితం కోరని పాట పాడితే ఏమి? పాడకపోతే ఏమి? ఈ మహాకవులంతా నా ఇల్లు, నా పొల్లు, నా ఆస్తి, నా కుటుంబం అనుకుంటూ బ్రతకలేదు.
మనం, మన కుటుంబం, మన జాతి అంటూనే పాడేసి వెళ్లిపోయారు. గురజాడ చివరి క్షణాల్లో కూడా. ‘బ్రతికుంటే ఆహార శాస్త్రం మీద పుస్తకం రాయాలని వుందనీ, రాస్తాననీ’ డాక్టరుకు చెప్పారట. ఆయన మరణించినా జీవించాలంటే కనీసం దేశభక్తిని చాటే పాటలు పిల్లలకైనా కంఠోపాఠాలవ్వాలి. భవిష్యత్‌లో వారి వల్లైనా సురాజ్యం కళ్లబడుతుందేమో? ధర్మమార్గంలో చేయి పట్టుకుని నడిపించే నాయకులు కరువయ్యారు. ఉత్తమ సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.
జనంలో ‘నేను నా దేశం’ అనే భావం గగన కుసుమమైంది. ప్రపంచ స్వార్థపు ఆలోచనలతోనే నిండిపోయింది. ఎవరెలా పోతే మనకెందుకులే అనే ధోరణి పెరిగింది.
సమాజంలో మనుషులంతా సుఖశాంతులతో బ్రతకాలని కోరుకునే సత్కవులే మన మార్గదర్శకులు.
పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలుగును
కండ గలవాడే మనిషోయి దేశమును ప్రేమించుమన్నా
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ దేశము
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
1910లో గురజాడ వారు వ్రాసిన ఈ పాటను మొదటిసారిగా 1913 ఆగస్టు 9వ తేదీన ‘కృష్ణా పత్రిక’లో ప్రచురించారు. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి పాడారు. సుస్వర సునాదవినోది ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు మొదట ఈ పాటను స్వరపర్చారు.
ఈ పాట ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధి పొందింది. సూర్యకుమారి స్వస్థలం రాజమండ్రి. టంగుటూరి ప్రకాశం పంతులుగారి తమ్ముడు శ్రీరాములుగారి కూతురు. చిన్నప్పటి నుంచే పెదనాన్నగారితో జాతీయోద్యమంలో పాల్గొనటం, వెళ్లినచోటల్లా దేశభక్తి గీతాలు పాడటంతో నలుగురికీ ఆమె పేరు తెలిసింది. మద్రాసులో తన అక్కతో ఉన్న రోజుల్లో ఆమె గొంతు విన్న సినిమా వాళ్లతో ఏర్పడిన పరిచయంతో సినిమా నటిగా అవకాశాలు రావటం మొదలయ్యాయి. కొన్ని సినిమాల్లో నటించారు.
తను పాడే సంగీత కచేరీలతో వచ్చిన సొమ్మును వితరణతో విరాళాలిచ్చింది.
సూర్యకుమారిని గుర్తుకు తెచ్చేవి ఆమె పాడిన లలిత గీతాలే.
డా.బాలాంత్రపు రజనీకాంతరావు గారి పాటలెన్నో పాడింది. ఏదో సినిమా కోసం రాసిన శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగుతల్లి’ పాటను ఆమె కావాలని సుందరాచారి నడిగి తీసుకుని గ్రామఫోన్ రికార్డుగా విడుదల చేసింది.