S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అసలైన స్వాతంత్య్రం!

పలుసార్లు ప్రత్యక్ష యుద్ధాల్లో పరాభవం పొందిన పాకిస్తాన్ చివరికి కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని రావణకాష్టంలా రాజేసింది. జిహాదీ ఉగ్రవాద సంస్థలను భారత్‌పైకి ప్రేరేపించడం, కశ్మీర్‌లోని అమాయక యువకులకు తీవ్రవాద కలాపాల్లో శిక్షణ ఇవ్వడం వంటి అనైతిక పనులకు పాక్ పాల్పడుతోందన్నది జగమెరిగిన సత్యం. ఆశించిన స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం కాకపోవడంతో కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని పాక్ ప్రోత్సహిస్తూ భారత్‌తో పరోక్ష యుద్ధం చేస్తోంది

డెబ్బయి మూడవ స్వాతంత్య్ర సంబరాలకు యావత్ భారతావని సన్నద్ధమవుతోంది.. ఈ ఏడాది ‘జెండా పండుగ’కు ఇదివరకెన్నడూ లేని ఓ విశిష్టత ఏర్పడింది.. ఏడు దశాబ్దాల పాటు అనేకానేక సమస్యలతో అతలాకుతలమైన కశ్మీర్‌కు ఇపుడు నిజమైన స్వాతంత్య్రం సిద్ధించింది.. అందుకే ఈ ఏడాది ‘పంద్రాగస్టు’ పర్వదినం దేశ చరిత్రలోనే చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుంది..
***
ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు.. రెండు జెండాలు.. ఇద్దరు ప్రధానులు.. దేశంలో మిగతా ప్రజానీకం కన్నా తాము ‘ప్రత్యేకం’ అన్న భావన.. ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కానరాని శాంతి భద్రతలు.. ఇదంతా గతం.. ఇకపై అక్కడ పరిస్థితులన్నీ మారబోతున్నాయి.. ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ అలనాడు రాజ్యాంగంలో చేర్చిన ‘370వ అధికరణం’ రద్దు కావడంతో కశ్మీర్ ఇపుడు అఖండ భారత్‌లో అంతర్భాగమేనని మనం గర్వంగా గొంతెంతవచ్చు..
***
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం ఉపసంహరణకు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయానికి పార్లమెంటులోని ఉభయ సభలూ ఆమోద ముద్ర వేయడంతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త శకానికి అంకురార్పణ జరిగింది. ‘పాపాల భైరవి’గా మారిన ‘370 అధికరణాన్ని’ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సందర్భంలోనే- ‘పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్’ (పీవోకే) కూడా భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరాఖండీగా ప్రకటించారు. 370 అధికరణం రద్దు ‘చారిత్రక తప్పిదం’ కాబోదని, చరిత్రలో జరిగిన పొరపాటుకు ఇది ‘దిద్దుబాటు చర్య’ అని ఆయన అభివర్ణించారు. ‘370 రద్దు’ క్రతువు సంపూర్ణం కావడంతో ‘కశ్మీర్ మనదే’ అని ఎలుగెత్తే గళాల్లో భావోద్వేగం మరింత చిక్కనైంది. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ సంకెల తెగిన వేళ.. భారత్‌లో కశ్మీర్ ‘విలీనం’ సంపూర్ణమైంది. ఏడు దశాబ్దాలుగా రావణకాష్టంలా రగులుతున్న సమస్యను మోదీ సర్కారు చల్లార్చడంతో ఇపుడు ‘ఒకే దేశం- ఒకే జెండా’ నినాదం ఆసేతుహిమచాలం మార్మోగుతోంది. భూతకాలంలో తప్పు జరిగిందని తేల్చారు, వర్తమానంలో దిద్దుబాటు జరిగింది.. భవిష్యత్‌లో కశ్మీర్ కల్లోల రహిత ప్రాంతంగా విలసిల్లాలని ప్రతి భారతీయుడు మనసారా వాంఛిస్తున్నాడు..
***
స్వాతంత్య్రం వచ్చినా శాంతి లేదు..
మంచుకొండలతో, మనోహర దృశ్యాలతో కనువిందు చేసే కశ్మీర్ చరిత్ర ఎంతో సంక్లిష్టమైనది. అది సవాలక్ష సంక్షోభాలకు సాక్షీభూతం. పురాతన కాలంలో ఈ రాజ్యాన్ని చాలా వంశాలు పాలించాయి. 1947 ఆగస్టు 15నాటికి జమ్మూ కశ్మీర్ నిజానికి ఓ ప్రత్యేక దేశంగానే ఉండేది. భారత్, పాకిస్తాన్‌లుగా ఈ దేశం విడిపోయినపుడు జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. కశ్మీర్‌లో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నందున ఆ రాష్ట్రం తమ దేశంలోనే కలుస్తుందని పాకిస్తాన్ భావించింది. కానీ, దేశ విభజన సమయంలో అప్పటి కశ్మీర్ మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేశాడు. అప్పటి నుంచి కశ్మీర్ భూభాగంపై భారత్, పాక్‌ల మధ్య వివాదం రగులుతూనే ఉంది.
1339లో షా మీర్ తొలి ముస్లిం పాలకుడిగా కశ్మీర్‌పై ఆధిపత్యం వహించగా, 1751 వరకూ మొఘలులు, 1819 వరకూ ఆఫ్ఘన్ దుర్రానీలు ఇక్కడ పాలకులుగా చెలామణి అయ్యారన్నది చరిత్ర. అనంతరం ఈ ప్రాంతం పంజాబ్ సిక్కుల అజమాయిషీలోకి వెళ్లగా, 1846లో జరిగిన తొలి ఆంగ్లో-సిక్కు యుద్ధంలో మహారాజా రంజిత్ సింగ్ ఓటమి చెందాడు. అదే సమయంలో బ్రిటన్ దొరలకు, సిక్కు ప్రభువులకు మధ్య కుదిరిన ‘అమృత్‌సర్ ఒప్పందం’ప్రకారం కశ్మీర్‌ను జమ్మూ మహారాజైన డోగ్రా వంశీకుడు గులాబ్ సింగ్‌కు కేవలం 75 లక్షల రూపాయలకు బ్రిటన్ ప్రభుత్వం విక్రయించింది. ఈ కారణంగానే కశ్మీర్ ప్రాంతం యుద్ధంలో జయించిన రాజ్యంగా గాక, ‘డబ్బులిచ్చి కొనుక్కొన్నది’గా ముద్ర వేసుకొంది. ‘విక్రయం’ ఫలితంగా ఆవిర్భవించిన జమ్మూ కశ్మీర్‌లో పన్నుల విధింపు వంటి అధికారాలు మహారాజుకు ఉండగా, రాజ్య సంరక్షణ బాధ్యతలు మాత్రం బ్రిటీష్ ప్రభుత్వానికే ఉండేవని చరిత్రకారులు చెబుతారు. గులాబ్ సింగ్ కుమారుడు రణబీర్ సింగ్, ఆ తర్వాత రణబీర్ సింగ్ మనవడైన హరిసింగ్ 1925లో పగ్గాలు చేపట్టాడు. తెల్లదొరల బానిసత్వం నుంచి మన దేశం విముక్తి పొందినపుడు- ‘ప్రత్యేక ప్రతిపత్తి’ కలిగి ఉండాలన్న కొన్ని షరతులు విధించి రాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు సమ్మతించాడు.
మూడు ముక్కలు.. నాలుగు యుద్ధాలు
భారత్ విభజన అనంతరం కశ్మీర్ ప్రాంతం మూడు ముక్కలు కాగా, నాలుగు యుద్ధాలు చోటు చేసుకొన్నాయి. దేశ విభజనకు పూర్వం అతి పెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కశ్మీర్ హిందూ మతస్థుడైన మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటీష్ పాలకులు ఆయా సంస్థానాధీశుల, రాజుల నిర్ణయానికే వదిలి వేసింది. భారత్‌లో కలుస్తారా? పాక్ పరిధిలోకి వెళతారా? తటస్థంగా ఉంటారా? అన్నది సంస్థానాధీశులే తేల్చుకోవాలని బ్రిటన్ దొరలు స్పష్టం వేశారు. ఈ క్రమంలో రాజా హరిసింగ్ భారత్‌లో కలుస్తారనే అనుమానంతో పాకిస్తాన్ 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌పై యుద్ధం చేసింది. ‘మొదటి కశ్మీర్ యుద్ధం’గా పిలిచే ఈ దండయాత్రలో ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ ఆవిర్భవించింది. కశ్మీర్‌ను భారత్‌లోనే విలీనం చేస్తానని ప్రకటించిన రాజా హరిసింగ్ అపుడు మన దేశ సైనిక సాయాన్ని కోరారు. ఆ సమయంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు ‘వాస్తవాధీన రేఖ’ ఏర్పడ్డాయి. ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఇరు వర్గాలు కాల్పుల విరమణకు సమ్మతించాయి. కశ్మీర్ లోయలో కొంత భాగం భారత్‌కు చెందగా, పాక్ ఆక్రమించిన ప్రాంతాన్ని ‘ఆజాద్ కశ్మీర్ గిల్బిత్ బెలుచిస్తాన్’లుగా వ్యవహరిస్తున్నారు.
పాక్ పలాయనం..
1965లో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ తీవ్రస్థాయిలో పన్నాగం పన్నింది. చొరబాట్లకు పాక్ దళాలు బరితెగించగా భారత్ పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ప్రకటించింది. ‘రెండవ కశ్మీర్ యుద్ధం’గా పేరొందిన ఈ సమరంలో ఉభయ పక్షాలకూ భారీగానే నష్టం జరిగింది. చివరికి భారత్‌దే పైచేయిగా నిలిచింది. అమెరికా, రష్యాల జోక్యంతో ‘తాష్కెంట్ డిక్లరేషన్’ అమలులోకి రావడంతో దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం చల్లబడింది.
బంగ్లాదేశ్ ఆవిర్భావంలోనూ..
1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించినపుడు భారత్‌ను దెబ్బతీయాలని ప్రయత్నించిన పాక్ భంగపడింది. ఈ యుద్ధం ప్రత్యక్షంగా కశ్మీర్‌కు సంబంధించింది కాకున్నా ఆ రాష్ట్ర ప్రమేయం మాత్రం ఉంది. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌ల మధ్య విద్వేషాలు విషమించినపుడు తూర్పు పాకిస్తాన్ ( ప్రస్తుత బంగ్లాదేశ్)కు భారత్ అండగా నిలిచింది. పాకిస్తాన్ పాలకుల ఆగడాలు భరించలేని తూర్పు పాకిస్తాన్ వాసులు ఎదురు తిరిగారు. తమ ప్రాంత విముక్తి కోసం బంగ్లాదేశ్ పాలకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ పాకిస్తాన్‌తో యుద్ధం చేశారు. బంగ్లాదేశ్‌కు బాసటగా నిలిచిన భారత్‌పై పాక్ యుద్ధానికి దిగింది. ఇదే సందర్భంలో పాక్ అధీనంలో ఉన్న సుమారు 5,800 చదరపుమైళ్ల భూ భాగాన్ని భారత సైన్యం దక్కించుకుంది. లాహోర్‌లో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఆ భూభాగాన్ని భారత్ తిరిగి పాక్‌కు దఖలు పరచింది. ఉభయ దేశాల మధ్య శాంతి వర్థిల్లాలని భారత్ ఆ నిర్ణయం తీసుకున్నా- ఆ తర్వాత పాక్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
కార్గిల్ యుద్ధం..
వాస్తవాధీన రేఖ వెంబడి 1999 జూలైలో కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోకి చొరబడిన పాక్ సైనిక దళాలు మరోసారి యుద్ధానికి కాలుదువ్వాయి. దాయాది దేశం ఆగడాలను నిలువరించేందుకు భారత్ భారీగా తన బలగాలను మోహరింపజేసింది. పాక్ ఆక్రమించిన ప్రాంతంలో దాదాపు 80 శాతం వరకూ భారత్ అధీనంలోకి వచ్చాయి. కార్గిల్ యుద్ధంతో పాక్ సుమారు నాలుగువేల మంది సైనికులను కోల్పోవడమే గాక ఆర్థికంగా చితికిపోయింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సగం నౌకాదళాన్ని, నాల్గవ వంతు వైమానిక దళాన్ని, మూడొంతుల సైన్యాన్ని కోల్పోయింది. ఘోర పరాభవం చెందడంతో చివరికి పాకిస్తాన్ తోకముడవక తప్పలేదు. యుద్ధరంగం నుంచి తప్పుకొని మరో ఓటమిని తన ఖాతాలో వేసుకొంది.
చైనాతోనూ సమరమే..
జమ్మూ కశ్మీర్ సరిహద్దు వివాదాలపై భారత్ 1962లో చైనాతో యుద్ధరంగంలో తలపడింది. లడఖ్‌ను సరిహద్దుగా నిర్ణయించుకున్న పాత ఒప్పందాన్ని చైనా బేఖాతరు చేసింది. టిబెట్‌ను ఆక్రమించిన చైనా లడఖ్ సమీపంలోని ప్రాంతమంతా తనదేనని భారత్‌తో సమరానికి దిగింది.
పరోక్ష యుద్ధాలకు..
పలుసార్లు ప్రత్యక్ష యుద్ధాల్లో పరాభవం పొందిన పాకిస్తాన్ చివరికి కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని రావణకాష్టంలా రాజేసింది. జిహాదీ ఉగ్రవాద సంస్థలను భారత్‌పైకి ప్రేరేపించడం, కశ్మీర్‌లోని అమాయక యువకులకు తీవ్రవాద కలాపాల్లో శిక్షణ ఇవ్వడం వంటి అనైతిక పనులకు పాక్ పాల్పడుతోందన్నది జగమెరిగిన సత్యం. ఆశించిన స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం కాకపోవడంతో కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని పాక్ ప్రోత్సహిస్తూ భారత్‌తో పరోక్ష యుద్ధం చేస్తోంది. కశ్మీర్‌లో ఏటా అక్టోబర్ 26న అధికారికంగా విలీన దినోత్సవం జరుపుతుండగా, వేర్పాటువాదుల చేత నల్లజెండాలను ఎగురవేయించి జాతివ్యతిరేక భావాలను పాక్ నూరిపోస్తోంది. లష్కర్ ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కార్యకర్తలను కశ్మీర్‌లోకి పంపుతూ అనేక విధ్వంసక చర్యలకు పాక్ ఊతమిచ్చింది. మందుపాతరలు, తుపాకులు పేల్చడంతో పుల్వామా వంటి ఎన్నో ఘటనల్లో భారీ సంఖ్యలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల తండాలపై భారత సైనికులు ‘సర్జికల్ దాడుల’ను పలుసార్లు జరిపినా పాక్ బుద్ధిలో మార్పు రావడం లేదు. 1949 జనవరి ఒకటో తేదీన ఇరు దేశాల మధ్య నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ని అధికారికంగా నిర్ణయించారు. ఇదే ప్రస్తుతం ఉభయ దేశాల మధ్య తాత్కాలిక సరిహద్దుగా కొనసాగుతోంది. అయితే, అన్ని ఒప్పందాలను కాలరాస్తూ పాక్ సైనిక దళాలు తరచూ ‘నియంత్రణ రేఖ’ను దాటుతూ చొరబాట్లకు పాల్పడడం, భారతీయ జవాన్లపై కవ్వింపులకు పాల్పడడం సర్వసాధారణంగా మారింది.
ఫలితం ఇవ్వని ‘ప్రత్యేకం’
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో రాజ్యాంగంలో 370 అధికరణాన్ని ప్రవేశపెట్టినా, గత ఏడు దశాబ్దాలుగా ఆశించిన ఫలితాలు రాలేదు.
ప్రత్యేక ప్రతిపత్తి

కశ్మీర్ అభివృద్ధి చెందకపోగా, అక్కడ సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటువాదం పడగవిప్పాయి. దాయాది దేశమైన పాకిస్తాన్ కశ్మీరీ యువతను పెడదోవ పట్టిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో విభిన్న సంస్కృతులు, ఆచారాలు, భౌగోళిక రూపురేఖలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తాము భారతీయులమనే భావిస్తారు. అయితే, కశ్మీర్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు విభిన్నం. ప్రత్యేక ప్రతిపత్తితో పాటు ఎన్ని వెసులుబాట్లు కల్పించినా కశ్మీర్‌లోని కొంతమంది ప్రజల్లో తాము ‘్భరతీయులం కాదన్న’ భావన బలపడింది. జాతీయతా భావం లోపించడంతో తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తూ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల మేరకు దేశవ్యాప్తంగా బడుగువర్గాలకు రిజర్వేషన్ల సౌకర్యం, అభివృద్ధి ఫలాలు అందుతుండగా, కశ్మీర్‌లో మాత్రం నిరుపేదలు నానాపాట్లు పడుతున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లంటే కశ్మీర్ ప్రజలకు తెలియదు. కొన్ని రాజకీయ కుటుంబాలు, సంపన్న వర్గాలు మాత్రమే లాభం పొందుతున్నాయి. దేశమంతటా అమలు చేస్తున్న విధానాలు కశ్మీర్‌లో అమలు కాకపోవడమే ఇందుకు కారణం. ఉగ్రవాదం కారణంగా ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రానందున కశ్మీర్‌లో యువతకు ఉపాధి అవకాశాలు లేవు. ఉగ్రవాద సంస్థలు వేసే ఎరలకు లొంగిపోయి చాలామంది యువకులు విధ్వంస కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. యువకులకు డబ్బులిచ్చి భారతీయ సైనికులపై రాళ్లు రువ్వించడం కశ్మీర్‌లో నిత్యకృత్యంగా మారింది. ఈ పరిస్థితులకు కారణమైన 370వ అధికరణం తక్షణం రద్దు కావాల్సిందేనని భావించి, ఆ దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ అధికరణం తాత్కాలికమేనని అలనాడు ప్రధాని నెహ్రూ చెప్పినా, అది కాలగర్భంలో కలవడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. ఇది అమలులో ఉన్నంత కాలం కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాదు, అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని మోదీ భావించారు.
ఈ దేశం నుంచి కశ్మీర్‌ను వేరు చేస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేయాలని జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు దశాబ్దాల క్రితమే పోరాటం ప్రారంభించారు. అయితే, 370వ అధికరణాన్ని రద్దు చేసేందుకు ఇన్నాళ్లూ పాలకులు ఎలాంటి సాహసం చేయలేదు. కశ్మీర్‌లో అరాచక పరిస్థితులను ఎన్నాళ్లు సహించాలి? దీన్ని ఎలాగైనా అదుపు చేయలనే ఉద్దేశంతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించి, ఆ అధికరణాన్ని ఉపసంహరిస్తూ పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేశారు. అన్నింటికన్నా ముందు- కశ్మీర్ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమన్న నిజాన్ని అక్కడి ప్రజలు, పాక్ ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం గుర్తించాలని మోదీ ఇపుడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంతో పాటు వేల కోట్ల రూపాయల నిధులను కశ్మీర్ కోసం ఖర్చు చేస్తున్నా, వేర్పాటువాద సంస్థల నాయకులను చర్చలకు పిలిచినా, శిఖరాగ్ర సమావేశాలు జరిపినా, బస్సుయాత్రలు జరిపినా కశ్మీర్ పరిస్థితిలో మార్పు లేనందున నేడు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొంది. జమ్మూ కశ్మీర్‌ను శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగాను, లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగాను విభిజిస్తూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకొంది. ఇదంతా అభివృద్ధి కోసమే అన్న వాస్తవాన్ని కశ్మీర్ ప్రజలు గ్రహించి, పాక్ ప్రేరిత ఉగ్రవాదుల విష వలయంలో చిక్కుకోకుండా జాతీయ ప్రధాన స్రవంతిలో భాగస్వామ్యం కావాల్సిఉంది.

ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం..
‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ అన్నది జన్‌సంఘ్ నినాదం. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణం రద్దు కోసం జన్‌సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ మంత్రివర్గంలో ఉన్నపుడే తన గళం వినిపించారు. కశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ ఆయన ఆ పార్టీ నుంచి, నెహ్రూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి జన్‌సంఘ్‌ను స్థాపించారు. దేశమంతటా ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం అమలవుతుండగా కశ్మీర్‌కు ఎందుకు మినహాయింపు? అని ఆయన పోరాటం ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలకూ గవర్నర్లు ఉండగా కశ్మీర్‌కు ప్రధాని ఉండడం ఏమిటని ఆయన నిలదీశారు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు ఆయన దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించారు. 1953 మే 11న ఆయన ఎలాంటి అనుమతి లేకుండానే కశ్మీర్‌లో అడుగుపెట్టారు. ముఖర్జీతో పాటు వచ్చిన అటల్ బిహారీ వాజపేయిని పోలీసులు అరెస్టు చేశారు. 1953 జూన్ 23వ తేదీన జమ్మూ కశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న ముఖర్జీ అనుమానాస్పదంగా మరణించారు. ఆ తర్వాత కేంద్రం కొన్ని ఆంక్షలను సడలించింది. ఎన్నికల కమిషన్, ‘కాగ్’ సంస్థల పరిధి కశ్మీర్‌కు విస్తరించింది. కశ్మీర్‌లో ‘ప్రధానమంత్రి’ హోదా తొలగిపోయినా, 370వ అధికరణం కారణంగా దేశంలో రెండు రాజ్యాంగాలు కొనసాగాయి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలను సాకారం చేస్తూ తాజాగా మోదీ ప్రభుత్వం 370 అధికరణాన్ని రద్దు చేసింది.
అనర్థాలు కొనసాగాలా?

370వ అధికరణం వల్ల జమ్మూ కశ్మీర్‌లో అనర్థాలు తప్ప అభివృద్ధి మృగ్యమన్న విషయాన్ని గుర్తించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో తన వాదాన్ని బలంగా వినిపించారు. 370వ అధికరణం రద్దుపై విమర్శలు చేస్తున్నవారు- ఆ అధికరణం వల్ల కశ్మీర్‌కు ఇన్నాళ్లూ ఎలాంటి మేలు జరిగిందో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. భారత పార్లమెంటు చేసిన కొన్ని కీలక చట్టాలు కశ్మీర్‌లో అమలు కావడం లేదని ఆయన పలు ఉదాహరణలిచ్చారు. వాటిలో కొన్ని..
* దేశమంతటా బాల్య వివాహాల నిరోధక చట్టం అమలులో ఉంది. దేశమంతా వివాహ అర్హత వయసు ఒకటైతే.. కశ్మీర్‌లో మాత్రం విభిన్నంగా ఉంటోంది. అక్కడ మైనార్టీ తీరని పిల్లలకు కూడా వివాహం చేయవచ్చు. ఇది అన్యాయం కాదా?
* కేంద్రం జాతీయ మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసింది. కశ్మీర్‌లో మాత్రమే మైనారిటీ కమిషన్ లేదు. అక్కడ సిక్కులు, జైనులు, బౌద్ధులు ఉన్నారు. మరి.. వీరందరి శ్రేయస్సు కోసం మైనారిటీ కమిషన్ ఎందుకు లేదు?
* దేశవ్యాప్తంగా పిల్లలకు విద్యాహక్కు చట్టం వర్తిస్తుంది. కశ్మీర్‌లో మాత్రం బాలలకు చదువుకునే హక్కు లేదు. ఈ పరిస్థితి కొనసాగాలా?
* పిల్లలకు పాఠ్య ప్రణాళికలను నిర్దేశించే విద్యా వ్యవస్థ కశ్మీర్‌లో ఎందుకు లేదు?
* భూసేకరణ చట్టం, దివ్యాంగుల రక్షణ చట్టం, వృద్ధుల సంరక్షణ చట్టం... వీటిని కశ్మీర్ శాసనసభ ఎందుకు అమలు చేయదు?
* దేశమంతా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుకోవచ్చు. కశ్మీర్‌లో మాత్రం డీలిమిటేషన్ యాక్ట్ అమలు కాదు.
* అన్ని రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ ఉంది. కానీ కశ్మీర్‌లో మాత్రం లేదు.
* గిరిజనులు, దళితులకు కశ్మీర్‌లో రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఆర్టికల్ 370 కొనసాగాలంటున్న వారు- అంబేద్కర్ ఆశించిన రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా?
* కశ్మీరీ యువతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన యువకుడిని పెళ్లాడితే.. వారి పిల్లలకు కశ్మీరీ పౌరసత్వం రాదు.

ఈ మార్పులు ఖాయం..

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ ప్రాంతంలో ఇకపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక్కడ ఆస్తులను ఇతర ప్రాంతాల వారైనా ఇక కొనుగోలు చేయవచ్చు. సమాచార హక్కు చట్టం ఇకముందు కశ్మీర్‌లోనూ వర్తిస్తుంది.
ఒకటే రాజ్యాంగం
ఇంతవరకూ జమ్మూ కశ్మీర్‌కు మాత్రమే ప్రత్యేకంగా రాజ్యాంగం ఉండేది. ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం నిష్ఫలం చేసింది. ఇప్పుడు ఇక్కడా దేశం లోని ఇతర ప్రాంతాలకు వర్తించినట్లే భారత రాజ్యాంగం వర్తిస్తుంది.
ఆస్తులు కొనే హక్కు
ఇతర రాష్ట్రాల వారు సైతం ఆస్తులు కొనుగోలు చేసి, స్థిరపడొచ్చు.
శాంతి భద్రతలు
ఇన్నాళ్లూ శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేవి. ఇపుడు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో శాంతి భద్రతల యంత్రాంగాన్ని పునర్నిర్మిస్తారు. దిల్లీ లేదా పుదుచ్చేరి తరహాలో అధికార పంపిణీ జరిగే అవకాశముంది. దిల్లీలో శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటే, పుదుచ్చేరిలో అవి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి.
కేంద్ర చట్టాలు
ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తాము చేసిన చట్టాలు అమలు చేయాలంటే రాష్ట్ర శాసనసభ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇపుడు కేంద్ర చట్టాలు విధిగా రాష్ట్రానికి అమలవుతాయి.
ప్రత్యేక జెండా
370 అధికరణం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి జాతీయ జెండాతోపాటు తమ సొంత జెండా కలిగి ఉండే హక్కు కల్పించింది. ఇపుడు రాష్ట్రానికి సొంత జెండా ఉండాలా? వద్దా? అన్న విషయాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. అలాగే రాష్ట్రానికి ఇంతకుముందు ఉన్న ప్రత్యేకాధికారాలు పోతాయి.
ద్వంద్వ పౌరసత్వం
అక్కడి పౌరులకు జమ్మూ-కశ్మీర్ పౌరసత్వం, భారత పౌరసత్వం ఉండేవి. ఇక మీదట వారంతా భారత పౌరులే.
360 అధికరణం
ఆర్థిక అత్యయిక పరిస్థితి విధించే 360 అధికరణం అమలవుతుంది. ఇది ఇంతకుముందు అమలయ్యేది కాదు.
మైనారిటీలకు రిజర్వేషన్లు
గతంలో జమ్మూ-కశ్మీర్‌లో మైనారిటీలకు రిజర్వేషన్లు అమలులో లేవు. ఇక మీదట అవి అమలవుతాయి.
సమాచార హక్కు చట్టం
ఇన్నాళ్లుగా దేశవాసుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడిన సమాచార హక్కు చట్టం జమ్మూ-కశ్మీర్‌లో అమలులో లేదు. 370 అధికరణం నిష్ఫలం కావడంతో ఆ చట్టం సైతం ఆ ప్రాంతవాసులకు అందుబాటులోకి వస్తుంది.
శాసనసభ్యుల పదవీ కాలం
దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో శాసనసభ్యుల పదవీకాలం అయిదేళ్లు. మండలి సభ్యులకు ఆరేళ్లు ఉండగా.. జమ్మూ-కశ్మీర్‌లో మాత్రం శాసనసభ్యుల పదవీ కాలం ఆరేళ్లుగా ఉండేది. ఇక మీదట వీరి పదవీ కాలం అయిదేళ్లే ఉండనుంది.

ఇది నవోదయం..
‘‘తమ స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా, లేనిపోని భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి దశాబ్దాల తరబడి పబ్బం గడుపుకొన్న వేర్పాటువాద ముఠాలు ఎన్నడూ కశ్మీర్ ప్రజల సాధికారత, సంరక్షణ గురించి ఆలోచించలేదు.. ఆ వేర్పాటువాదుల సంకెళ్ల నుంచి కశ్మీర్ ప్రజలకు ఇపుడు పూర్తి స్వేచ్ఛ లభించింది.. అక్కడి పౌరులకు ఇది నిజమైన ఉషోదయం.. వారికి మెరుగైన భవిష్యత్ అందించేందుకు ఇపుడు అవకాశాలెన్నో.. ‘370 అధికరణం రద్దు’ అన్నది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓ చారిత్రక ఘట్టం.. కశ్మీరీలతో మనం కలిసే ఉన్నాం, వారితో కలిసే మనం ఎదుగుదాం.. ఇక కశ్మీర్ యువత ప్రధాన స్రవంతిలోకి రావడం ఖాయం..’’
- ప్రధాని నరేంద్ర మోదీ

-పి.ఎస్.ఆర్.