S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజన్

నేను పూర్వపు హైదరాబాద్‌లో ఉన్న హెడ్‌మాస్టర్లనూ చూశాను. ఈనాడు గ్రామాల్లో పనిచేస్తున్నటు వంటి హెడ్‌మాస్టర్లకు పనిచేసే అవకాశం దొరికింది. బహుశా ఈ నేలనే ఆ మనుషులకు ఈ అంకితభావ గుణాన్ని నేర్పుతుందేమో. నేను ఎనె్నన్నో స్కూళ్లను చూసే అవకాశం దొరికింది. ఒకవైపు పత్రికల్లో ప్రభుత్వ స్కూళ్లు పనికిరాని స్కూళ్లని అంటున్నా అవేమీ పట్టించుకోకుండా తమ విద్యుక్త ధర్మాన్ని చేసే హెడ్‌మాస్టర్లను కూడా చూశాను. ఈనాడు స్కూల్స్‌కు వచ్చే పిల్లలు దళిత, బీసీ, మైనార్టీ గిరిజన వర్గాలకు చెందిన ఫస్ట్ లెర్నర్స్. ఆ పిల్లలను మనస్ఫూర్తిగా ప్రేమించకపోతే హెడ్‌మాస్టర్‌గా, ఉపాధ్యాయులుగా అంత అంకిత భావంతో పనిచేయలేక పోయేవారేమో!
వరంగల్ జిల్లా మొగిలిచర్లకు ఆదివారంనాడు (2017, డిసెంబర్ నెల) పేరెంట్స్ మీటింగ్‌కు ఆహ్వానించారు. మీటింగ్ 10 గంటలకని చెప్పినా నేను 9 గంటలకే వెళ్లాను. అప్పటికే ప్రిన్సిపాల్ స్కూల్‌కు వచ్చి మీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నది. 10 గంటలకే మీటింగ్ హాల్ తల్లిదండ్రులతో నిండింది. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇంత సంఖ్యలో తల్లిదండ్రులు హాజరు కావటం చూడలేదు. ఒక పల్లెటూరిలో 300 మంది తల్లిదండ్రులు రావటం ఆశ్చర్యం. ఇంతమందిని ఎలా రప్పించగలిగారని ప్రిన్సిపాల్ సుధను అడిగాను. నేను వచ్చిన కొత్త రోజుల్లో తల్లిదండ్రులు ఎవ్వరూ రాలేదు. ఆ తల్లిదండ్రులు చదువుకోనివారు, బహుజన వర్గాల వారు. స్కూల్ మీటింగ్‌కి వచ్చి ఏం చేస్తామని అనేవారు.
ప్రిన్సిపాల్ సుధ ఆరేళ్లలో మొగిలిచర్ల స్కూలు ముఖచిత్రమే మార్చింది. ఒక విద్యార్థి క్లాస్‌కు రాకపోతే వారి ఇళ్లకు వెళ్లేది. పిల్లలు ఎందుకు రాలేదని ఆరా తీసేది. తల్లిదండ్రులను ఆ ప్రిన్సిపాల్ ప్రశ్నించేది. పత్తిచేలో పనులకు పిల్లలు వెళ్లారు. ఆ విషయాలు తెలుసుకుని ఆ హెడ్‌మిస్ట్రెస్ సుధ తల్లిదండ్రుల్లో అవగాహన పెంచింది. ఆడపిల్లలు, మగపిల్లలు చదువుకుంటే ఎలా ఎదుగుతారో వారికి చెప్పింది. ఈ హెడ్‌మిస్ట్రెస్ ఇళ్ల చుట్టూ తిరగటం ఏమిటని అందరూ అనుకునేవారు. సుధ ఆ పిల్లలను మనస్ఫూర్తిగా ప్రేమించేది కాబట్టే ఇల్లిల్లూ తిరిగేది. చదువు ప్రాధాన్యతను వారందరికీ చెప్పింది. గత ఆరేళ్లుగా ఆమె చేసిన కృషే తల్లిదండ్రుల్లో, పిల్లల్లో తీవ్ర మార్పులు తెచ్చింది.
హెడ్‌మాస్టర్ హెడ్‌మిస్ట్రెస్‌కు కావల్సింది ఏమిటంటే మొదట పిల్లలను ప్రేమించే గుణం ఉండాలి. తల్లిదండ్రులు ఆమె హోదా, డిగ్రీలు చూడరు. మొదట బడికి వచ్చిన తమ పిల్లలను ప్రేమిస్తుందా అని చూస్తారు. ఇదే యాజమాన్యానికి, హెడ్‌మాస్టర్‌కు ఉండవలసిన లక్షణం. ఇదే రహస్యం 50 సం.ల క్రితం నురుపుతుంగ హెచ్.ఎం. కృపాచారి రాత్రిపూట ఇట్లా తిరిగేది. సంగారెడ్డి స్కూల్‌లో శంకరప్ప దుప్పటి కప్పుకుని రాత్రిళ్లు తిరుగుతూ పిల్లలను గమనించేది. ఇది ప్రభుత్వ ఆదేశం కాదు. వారికి పిల్లలపై ఉండే ప్రేమే వారి కాళ్లకు ఆ శక్తినిచ్చింది. ప్రభుత్వ స్కూళ్లు పనిచేయటం లేదని ప్రచారం చేసిందానికన్నా తెలంగాణ గ్రామాల్లో హెడ్‌మాస్టర్లు ఎంత శ్రమపడితే చదువురాని తల్లిదండ్రుల్లో ఎంత పరివర్తన వచ్చిందో, పేరెంట్స్ మీటింగ్‌లకు తీసుకువచ్చిందో అవగతమవుతుంది. మొగిలిచర్ల లాంటి బడుల నిర్వహణ తెలంగాణలో అడుగడుగునా కనిపిస్తాయి. ఇలాంటి స్కూళ్లను ఆదర్శంగా తీసుకోవాలి. పత్రికలు వీటిని విస్తృత ప్రచారం చేయాలి.
* * *
తెలంగాణలో వున్న అనేక పాఠశాలలు చూసే అవకాశం దొరికింది. విద్యార్థుల్లో విద్య ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలన్న గాఢమైన సంబంధంలో మన స్కూళ్లకు ఉషస్సు కాలం వచ్చిందా అనిపిస్తుంది. విద్యాలయాల్లో వచ్చిన అంతరాలను తక్కువ చేయటానికై ఇది సరైన సమయమనే అనుకుంటున్నాను. బోధనలో సమత్వం ఉన్నది కానీ లెర్నింగ్‌లో అంతరాలున్నాయి. దానికి విద్యాపరమైన కొన్ని కారణాలు విద్యార్థుల వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చును. వ్యక్తిగత కారణాలపైన పరిశోధించిన దానికన్నా అవగాహన కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలున్నాయి కాబట్టి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నది. కానీ, మిగతా క్లాస్‌లపైన అంత శ్రద్ధ లేకపోవటం వలన పునాది లేని విద్యార్థి బైటకు వస్తున్నారు. 6 నుంచి 9 తరగతి వరకు సిలబస్ పూర్తి చేసుకోవాలి. అకడమిక్ ఆడిట్ పకడ్బందీగా ఉండాలి. విద్యార్థుల అచీవ్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు ప్రయత్నించాలి. అంటే విద్యార్థి సాధనను, అవగాహనను డాక్యుమెంటేషన్ చేయటం. కేవలం డాక్యుమెంటేషన్ కన్నా నిజనిర్థారణ చేసుకోవాలి. విద్యార్థికి అర్థం కాకపోతే అదే సంవత్సరం సెలవుల్లో ఆ విద్యార్థితో పూర్తి చేయించాలి. విద్యా ప్రమాణాలు పెంచటంతో ప్రతి తరగతికి ప్రాముఖ్యం ఉంటుంది. 10వ తరగతిపై ఎంత శ్రద్ధ వహిస్తున్నామో మిగతా తరగతులపై శ్రద్ధ వహించాలి. దానినే అకడమిక్ ఆడిట్ అంటాం. ప్రతి స్కూల్‌లో అకడమిక్ ఆడిట్ నిర్మించి పిల్లల అవగాహన శక్తిని పరిశీలించి అందరికీ, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన పిల్లలపై శ్రద్ధ వహిస్తే ఆ విద్యార్థులు 10వ తరగతి పాసైనప్పుడు ప్రొటెన్షివ్ విద్యార్థిగా తయారవుతారు.

-చుక్కా రామయ్య