S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవతల మీద కోపంతో జగత్సంహారం చేస్తానన్న రాముడు( అరణ్యకాండ)

రాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ‘ఇక్కడ జరిగిన విషయం ఆలోచించి చూస్తుంటే ఎవడో రాక్షసుడు అడవిలో నా భార్యను అపహరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటిదాకా, సీత తనంతట తానుగా, ఎక్కడికైనా పోయిందేమోననీ, లేదా, మృగాలే భక్షించాయేమోననీ, లేదా, మాంసార్థి అయిన ఏ బక్క రాక్షసుడో హరించాడేమోనని ఎవరి మీదా నింద మోపకుండా, ఎక్కడికో పోయి వుంటుందేమో అని ఉపేక్ష చేస్తున్నాను. కానీ ఇక్కడి పరిస్థితి చూస్తుంటే, బలిష్టుడైన రాక్షసుడే విరోధ బుద్ధితో నాకు అపకారం చేయాలనుకుని సీతను అపహరించాడని అర్థమవుతున్నది. కాబట్టి మనకు రాక్షసులతో ప్రాణాంతకమైన విరోధం కలిగింది అనడం నిశ్చయం. రాక్షసులు సీతను అపహరించి ఎక్కడైనా దాచిపెట్టయినా వుండాలి, లేదా, ఆమె చచ్చిపోయైనా వుండాలి, లేదా, రాక్షసులు ఆమెను తినైనా వుండాలి. వీటిల్లో ఏదో ఒకటి నిజం. ఇలా రాక్షసులు బాధ పెట్టుతుంటే ధర్మం రక్షించబడదు కదా? ధర్మం తనను రక్షించే వారిని రక్షిస్తుంది అనడం సరైంది కాదు కదా? తన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన వారిని రక్షిస్తుందే కానీ సర్వత్రా సర్వజనులను సర్వ విధాలా ప్రతి సమయంలో రక్షిస్తుంది అనడం సత్యం కాదు కదా?’
‘రాక్షసులీ విధంగా సీతను భక్షిస్తుంటే, లక్ష్మణా! ధర్మఫలదాతలైన దేవతలైనా అక్కరకు వచ్చినప్పుడు ఆడుకుందాం అనుకోలేదు కదా! కాబట్టి వీళ్లూ నాకపకారం చేసినవారే! వీరిలా నా శత్రువులకు అనుకూలంగా ఉంది. నాకు అపకారం చేసి సుఖపడగలరా? దేవతలు ధర్మపక్షం వాళ్లు కదా? వారెందుకు నాకపకారం చేస్తారంటావా? లక్ష్మణా! బ్రహ్మాండకోటులను పుట్టించడానికి, గిట్టించడానికి, శక్తి వుండి కూడా దాన్ని చూపకుండా దయతో సాధువైన వాడిని జ్ఞానం లేని కారణాన ధర్మ, అధర్మ పక్షం వారు అందరూ అవమానపరిచేవారే. శిష్టులు శిష్టుల వల్లే పూజించబడుతారు. దుష్టులు సర్వత్రా పూజించబడతారు. కేవలం శుద్ధసాత్వికులైన వారిని మిశ్ర సాత్వికులు కూడా అధిక్షేపిస్తారు. అసూయ పడతారు. అపకారం కూడా చేస్తారు. జగత్సృష్టి సంహారక శక్తి నాలో వున్నప్పటికీ, దయను పురస్కరించుకుని సాధు వృత్తిలో వుండడం వల్ల కేవలం తామసులు, రాక్షసులే కాకుండా, మిశ్ర సాత్వికులు, దేవతలు కూడా చులకన చేస్తున్నారు.’
‘లోకంలో మేలుచేయగోరి, ఆ కారణాన, ఎవరికీ అపకాఱం చేయక - కోరక - మెత్తనివాడై మిక్కిలి దయ స్వభావగుణంగా వుండి, ఆ కారణాన శాంతికాముకుడై వున్న వాడిని లోకం బలహీనుడిగా తలచి, వాడలా నటిస్తున్నాడని అపవాదు వేస్తుందే కానీ, వాడికి సామర్థ్యం వున్నా వూరకున్నాడని భావించదు, ఆదరించదు. ఇది సత్యం. నా చరిత్ర ఇప్పుడు ఇలాగే అయింది. సంహార శక్తి, దండించే అధికారం వున్నప్పటికీ, దానిని బయటపెట్టలేక మేలే చేయాలని నిర్ణయించుకున్న కారణాన సురాసురులు ఇరువురూ నన్ను దుర్బలుడు అయినందున సాధువులాగా నటిస్తున్నాడని భావిస్తున్నారు. లోకవిధం ఎలాంటిదంటే కుట్టితే తేలు తేలు అని భయపడి దూరంగా పోతారు జనులు. కుట్టకపోతే ఇది కుమ్మర పురుగని దాన్ని లక్ష్యం చేయరు. పుల్లలతో పొడిచి బాధపెట్తారు. ఇది బుద్ధిహీనులైన లోకుల లక్షణం. నాలోని కళ్యాణ గుణాలు ఈ సమయంలో వీరిచే తప్పులుగా భావించబడ్డాయి కదా! కానిమ్ము.. రాక్షసులు, భూత సమూహాలు, ఇక నా పౌరుష గుణాన్ని చవి చూసి ఎలాంటి పాట్లు పడనున్నారో చూస్తుండు.’
‘తూర్పు కొండ మీద కరకర అంటూ చురుకు కిరణాలతో ఖరకరుడైన సూర్యుడు ఉదయించి చంద్రుడి తేజస్సు హరించిన విధంగా నేను కూడా పరుష గుణాలతో మృదు గుణాలను హరించి ప్రకాశిస్తాను. అప్పుడు కానీ వీళ్లకు నా మీద భయభక్తులు కలగవు. రాక్షసులలో, పిశాచాల్లో, యక్షుల్లో, గంధర్వుల్లో, భూజనుల్లో ఒక్కడైనా సుఖపడుతాడేమో చూడు.. ఈ క్షణంలోనే నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తా చూడు. లక్ష్మణా! వాడైన నా బాణ పరంపరల తేజస్సుతో వాయు సూర్యాగ్నిహోత్రుల ప్రభ చెడి, కొండ శిఖరాలు విరిగిపడి, గ్రహాలు తోవతప్పి తికమకలాడి, చంద్రబింబం జారిపడి, సముద్రాలన్నీ ఎండిపోయి, చెట్ల తీగల పొదలు తెగిపడి, లోకాలన్నీ నాశనం చేస్తాను. అదిగో.. నా అస్త్రాల వల్ల వ్యాపించిన ఆకాశాన్ని తలెత్తి చూడు. విమానాల మీద తిరిగే దేవతలను నేలపడవేస్తాను. మూడు లోకాలు బాధపడేట్లు చేస్తాను. నా సీతకు ఏ బాధ లేకుండా దేవతలు నాకు సమర్పించారా.. సరి. లేదా, ప్రసిద్ధమై వ్యర్థం కానీ నా పరాక్రమాన్ని ఏడుస్తూ చూస్తారు.’
‘నేనిప్పుడు ఆకర్ణాంతం లాగి విడిచిన బాణ సమూహాలతో ప్రపంచం అతలాకుతలమై, అల్లకల్లోలమై, చెల్లాచెదరై, పచ్చంపాడై, పంచాబంగాళమై, పాండవబీడై, పగుళ్లుపారి, పటాపంచమై, మర్యాద తప్పినది అయిపోతుంది. ఈ దేవతలు, రాక్షసులు చొక్కి, సోలి, వాలి, కూలి, తూలి, వెలి, మాలి నా బాణాలతో ఖండించబడుతారు. నేనే ధ్వంసం చేయదలచుకుంటే వీరు సహించగలరా?
నాకు ప్రియమైన సీతను మంచితనంగా తెచ్చి దేవతలు - ఇతరులు ఇవ్వకపోతే, లక్ష్మణా! ముల్లోకాలు ఏ విధంగా రూపం లేకుండా నాశనం అవుతాయో చూస్తుండు.’ అని చెక్కిళ్లు అదురుతుంటే, భయంకరమైన కోపంతో, ఎర్రటి కళ్లతో రాముడు తన పెద్ద విల్లుని చేతిలోకి తీసుకుని, చక్కటి బాణాన్ని అల్లెతాటిలో సంధించి, ప్రళయకాలాగ్ని లాగా మండిపడుతూ, తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ‘ఎవరెన్ని విరుగుడులు చేసినా, ముసలితనం, మరణం, కాలం, అదృష్టం వాటి వాటి సమయంలో రాక తప్పనట్లు, నాకు కోపం వస్తే, నేను చేయదలచుకున్న పనిని నివారించగలవాడు లేడు. మనోజ్ఞమైన నడవడి కలిగినదైన, నవ్వు ముఖం కలదైన నా సీతను మృదుమార్గాన తెచ్చి ఇచ్చారా, సురాసురులు బాగుపడతారు. ఇవ్వకపోతే కుతకుత వుడికించి ఆపత్సముద్రంలో ముంచి తేలుస్తాను.’

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690
-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12