S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వదలని ‘పోలరైజేషన్’

పోలరైజ్డ్ కళ్లద్దాలు పెట్టుకునే వారికి ఈ మాట అసంకల్పంగా అర్థం అవుతుంది. తీవ్రమైన ఎండలో చలవ కళ్లజోళ్లు పెట్టుకోవటం మనకి అనుభవం ఉన్న అలవాటే. ఈ చలవ కళ్లద్దాలనే పోలరైజ్డ్ కళ్లద్దాలు అని కూడా అంటారు. నిజానికి ఈ రకం కళ్లజోళ్లు ధరించటం కంటి ఆరోగ్యానికి రెండు విధాలుగా మంచిది. ముందస్తుగా మంచి రకం చలవ కళ్లజోళ్లు ‘గ్లేర్’ని తగ్గిస్తాయి. ఇంకా మంచి రకం చలవ కళ్లద్దాలు (ఇవి బాగా ఖరీదు ఉంటాయి) అతినీల లోహిత కిరణాలని కంటి దగ్గరికి రాకుండా ఆపు చేస్తాయి. ఈ అతినీలలోహిత కిరణాలే కంటిలో పువ్వు (కాటరాక్ట్) వెయ్యటానికి దోహదపడతాయనే నమ్మకం ప్రచారంలో ఉంది.
ఇప్పుడు ‘గ్లేర్’ గురించి మాట్లాడుకుందాం. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటమే కాకుండా బాగా చెదురుతుంది. బట్టబయట నిలబడి వీధి వైపు చూసినా, సముద్రపు టొడ్డున నిలబడి నీళ్ల వైపు చూసినా కళ్లు జిగేల్‌మంటాయి. చెదిరిన కాంతి వల్ల కళ్లు ఇలా జిగేల్ మనటానే్న ఇంగ్లీషులో గ్లేర్ అంటారు. దీనిని మనం ‘జిగులు’ అందాం. ఈ జిగులు కంటి ఆరోగ్యానికి భంగపాటు కాకపోవచ్చు. కానీ, చూడటానికి అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. చలవ కళ్లజోడు పెట్టుకుంటే ఈ జిగులు తగ్గుతుంది. దీనికి కారణం చలవ కళ్లద్దాలు కాంతిని గలనం (్ఫల్టర్) చేసి మన కంటికి చేరే కాంతి ఉధృతిని తగ్గిస్తాయి. ఈ గలన ప్రక్రియనే ఇంగ్లీషులో పోలరైజేషన్ అంటారు.
పోలరైజేషన్ అంటే ఏమిటో అర్థం కావాలంటే ఈ గలన ప్రక్రియ ఎలా జరుగుతోందో తెలియాలి. కాంతి తరంగాల రూపంలో ప్రసరిస్తుంది. నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేస్తే పుట్టే కెరటాలు మనం చూస్తూనే ఉంటాం. కాంతి కిరణాలకి, నీటి కిరణాలకి మధ్య వౌలికమైన తేడాలు ఉన్నాయి. చెరువులో కెరటాలు, సముద్రంలో కెరటాలు ఒకే ఒక దిశలో ఊగిసలాడతాయి. కానీ కాంతి కిరణాలు ఒకే సమయంలో రెండు దిశలలో ఒకేసారి ఊగిసలాడతాయి. ఒక తరంగం నిలువుగా పైకి, కిందకి లేచి పడుతూ ఉంటే, మరొక తరంగం అడ్డుగా ముందుకీ వెనక్కీ ఊగుతూ ఉంటుంది. ఇలా ఊగుతూ కెరటం ముందుకి ప్రయాణం చేస్తుంది. చలవ కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు ఈ రెండు తరంగాలలో అడ్డుగా కదలాడే కెరటాలని అద్దాలు ఆపేసి, నిలువుగా స్పందించే కాంతినే మన కంటికి చేరనిస్తాయి. అప్పుడు మన కంటికి చేరే మొత్తం కాంతి సగానికి సగం తగ్గిపోతుంది. కాంతితోపాటు జిగులు కూడా తగ్గిపోతుంది. అంటే ఏమిటన్న మాట? మన కంటికి చేరే కాంతి తరంగాలు ఇప్పుడు ఒకే దిశలో కంపిస్తూ ఉంటాయి. రెండో దిశలో కంపించే కిరణాలు గలన ప్రక్రియ వల్ల ఆగిపోతాయి. ఈ ప్రక్రియని ‘పోలరైజేషన్’ అంటారు.
ఇంగ్లీషులో పోలరైజేషన్ అనే మాట ఒక దుర్నామం లేదా అతకని పేరు. అంటే, పేరుకీ, తీరుకీ పోలిక లేని పేరు. కాంతి తత్త్వం పూర్తిగా అర్థం కాని రోజుల్లో పెట్టిన పేరు ఇది. పూర్వం, సైన్సు ఇంకా రాతియుగంలో ఉన్న రోజులలో, కాంతి చిన్నచిన్న రేణువులలా ఉంటుందనుకునేవారు. న్యూటన్ వంటి మహానుభావుడే ‘కాంతి రేణువులు’ అన్నాడు. ఆ రేణువులకి అయస్కాంతపు ధ్రువాలలా ఒక ఉత్తర ధ్రువం, ఒక దక్షిణ ధ్రువం ఉంటాయనుకునేవారు. ఈ ధ్రువాలన్నీ బారులు తీరి కవాతు చేస్తూన్న సైనికులలా ఉండకుండా అల్లరి మూకలా ఉన్నప్పుడు ఆ కాంతి నాలుగు పక్కలకీ వెదజల్లబడి మనకి జిగులుగా కనిపిస్తుందని అనుకునేవారు. చలవ కళ్లజోడు పెట్టుకోగానే బారులు తీరిన రేణువులే కంటికి చేరతాయని, అందుకనే ఆ జిగులు ఉండదనీ ఒక సిద్ధాంతం లేవదీశారు. ధ్రువాన్ని ఇంగ్లీషులో ‘పోల్’ అంటారు. కనుక ‘పోలరైజేషన్’ అంటే ధ్రువాలు అన్నీ బారులు తియ్యటం అని భాష్యం చెప్పేరు. ఈ సిద్ధాంతం అంతా సముద్రపుటొడ్డున కట్టిన ఇసుక మేడలాంటిదని ఇప్పుడు మనకి అవగాహన అయింది.
పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లు, సిద్ధాంతం వీగిపోయినా ‘పోలరైజేషన్’ అన్న మాట బంకనక్కిరికాయలా అలా మనని పట్టుకు వేలాడుతోంది. ఇంగ్లీషు వాడికి తప్ప లేదు. వాడి దగ్గర మనం సైన్సు నేర్చుకుని, వాడు చేసిన తప్పులని, అక్షరాలా అనువదించేసి తెలుగులోకి దింపేసుకుంటున్నాం. ఈ మనస్తత్వంతో మన వాళ్లు ‘పోలరైజేషన్’ని ఏమని తెలిగించేరు? ధ్రువీకరణ! నిజంగా, భౌతికంగా, జరిగే ప్రక్రియలో ఎక్కడా ధ్రువాలు (పోల్స్) లేవు. తెలుగు పండితులు సైన్సుని అనువాదం చేస్తే ఇలానే ఉంటుంది.
నేను ఈ మధ్య (అంటే 21వ శతాబ్దంలో) ‘పోలరైజేషన్’ అన్న మాటకి సరి అయిన తెలుగు మాట చెప్పమని అంతర్జాలం మీద ఒక ప్రశ్న సంధించేను. దానికి సమాధానంగా ఒకరు ఇచ్చిన సమాధానం ఇక్కడ వారి మాటలలోనే చూపిస్తున్నాను. ‘పోలరైజేషన్’ని ‘కేంద్రాభిముఖ్యత’ అనాలి. ఎందుకంటే, ‘రికగ్నైజింగ్ ద పోల్స్ ఈజ్ పోలరైజేషన్. హెన్స్’ - ‘కేంద్ర అభిముఖ్యత’ ‘ఆర్’ కేంద్రాభిముఖ్యత సౌండ్స్ ఏప్ట్ టు మి -అంటూ ఇంగ్లీషులో సమర్థించుకున్నారు.
ఈ ప్రక్రియ అర్థంకాని రోజులలో ఇంగ్లీషు వాడు పప్పులో వేసిన కాలు ఇది. ఈ కాలినే మనం పట్టుకు వేలాడటం ఎందుకు? పోలరైజేషన్ అనే ప్రక్రియ ఒక జల్లింపు లాంటిది. అన్ని దిశలలోనూ భ్రమణం పొందే కాంతి తరంగాలని ‘జల్లించి’ లేదా వడపోసి, ఒకే తలంలో ఊగే వాటిని సేకరించే ప్రక్రియ కనుక దీనిని ‘తలీకరణ’ అని తెలిగించమని నా సలహా.
చూశారా ఇక్కడ ‘పోలరైజేషన్’కి ‘తలీకరణ’ అనే పేరు పెడుతూ, అదే సందర్భంలో, అనుకోకుండా ‘గ్లేర్’కి జిగులు అని పేరు పెట్టేశాం.
ఈ ‘పోలరైజ్డ్’ అనే మాట భౌతిక శాస్తప్రు పరిధి దాటి వాడుక భాషలోకి జొరబడిపోయింది. ‘వాడివన్నీ ‘పోలరైజ్డ్ ఒపీనియన్స్’ అన్నప్పుడు ‘వాడి అభిప్రాయాలన్నీ ధ్రువీకరించబడ్డ అభిప్రాయాలు’ అంటే సరి అయిన అర్థం రాదు. ‘వాడి అభిప్రాయాలు ఎప్పుడూ ఒక పక్కకే మొగ్గుతాయి’ అనో, ‘వాడివన్నీ పక్షపాతపు బుద్ధులు’ అనో అంటే కొంచెం మెరుగు. ఇంగ్లీషు వాసన కావాలనుకుంటే ‘వాడివన్నీ తలీకరించిన అభిప్రాయాలు’ అని అనొచ్చు.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా