S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాద మాధురీ గురుద్వారం..

తాడేపల్లి వీర రాఘవ నారాయణశాస్ర్తీగారు చాలా గొప్ప దైవీ ఉపాసకుడని ప్రసిద్ధి. సాక్షాత్ బాలాంబిక (అమ్మవారు) ఆయనపూజా గృహంలోనే తిరుగుతూ కనిపించేదట. మాట్లాడేదట. అంతటి తపశ్శక్తి ఆయనది. సంగీతోపాసన కూడా అంతే. నాదోపాసకులంతా అలాగే జీవించారు. కాలక్షేపం కోసం ఊరికే కూర్చుని పాడే ఆటలకూ, ఉపాసనకూ చాలా తేడా ఉంది.
ఇంట్లో కొలువైన యిష్టదేవతలను నిష్టగా పూజిస్తూ నామ కుసుమాలతో అర్చిస్తూ గానం చేసేవారికి లభించేది మోక్షమే. బంధం లేకపోవటమే. అది తెలిస్తే మోక్షం.. తెలియకుంటే బంధమన్నాడు శ్రీ వేంకటేశ్వరుని పరమభక్తుడైన అన్నమయ్య. అందుకే జీవితాంతం గానం చేస్తూనే బ్రతికాడు.
* * *
భూమీదకు రావటమే బంధ కారణం
ఈ దిక్కుమాలిన బంధాలకర్థం లేదు. పరమార్థమంతకంటే లేదు. ఇదే సుఖమనుకుంటూ బ్రతికేవారికి ఈ చక్రబంధం నుంచి బయటపడే మార్గాలు అంత తేలికగా దొరకవు. అందులో సంగీతం దివ్యమైన రాజమార్గం. హాయిగా మనసు పెట్టి నమ్ముకున్న దైవాన్ని కీర్తించే గానం కంటే నిత్య పూజాదికాలు ఎక్కువ గాదు - కానేరవు. ఆలోచనలన్నీ బందై బుద్ధి కుదిరేది పాటలోనే. బుద్ధి నిలకడ లేకుండా బుట్టలకొద్దీ పూవులు కుమ్మరించి ఏం ప్రయోజనం? తానక్కడే తిరుగుతూంటానని సాక్షాత్ శ్రీహరి, నారదుడికి చెప్పిన అభయ వాక్యం ఉందిగా ‘యిందు కలడందు లేడని వెదకనేల’ యని తండ్రినే నిలబెట్టిన ప్రహ్లాదుడే సాక్ష్యం కదా! యిక్కడ పుట్టి పెరిగి విద్వాంసుడై దక్షిణ దేశంలోని సభలు, మహారాజులచే వేనోళ్ళ కొనియాడబడిన వయొలిన్ విద్వాంసులలో ద్వారం వెంకట స్వామి నాయుడిగారిదో ప్రత్యేక స్థానం. ఏ విద్వాంసుడైనా శ్రోతలను సుఖపెట్టేముందు తను అంతర్ముఖుడై సంగీతానంద సౌఖ్యమంటే ఏమో తెలియాలి.
అప్పుడే విద్వాంసుడికీ, వినేవాడికీ ఓ మైత్రీ బంధం ఏర్పడుతుంది. రసజ్ఞులైన శ్రోతలవల్ల లోతైన సంగీత రహస్యాలన్నీ ఆవిష్కరించబడతాయి. దీనికి సాక్ష్యం నాయుడిగారి సుస్వర వాద్యం. పలుకు పలుకులోనూ నాద రసాన్ని చిందిస్తూ, సమకాలీన వయొలిన్ వాదకులకంటే భిన్నంగానూ పూర్వ విద్వాంసులకంటే అతీతంగానూ కనిపించడానికి ఏమై ఉంటుంది కారణం? ఒక్కటే- ఆయన నాదలోలుడు కాబట్టి. ప్రతి గాయకుణ్ణీ, వాదకుణ్ణీ ‘నాదలోలుడ’ని పిలవలేము. మాటలకందని నాదానందం అందరికీ దొరకదు. ఆ రుచి మరిగిన నాయుడుగారికి లభించినదే అది. త్యాగయ్య అందుకే ‘ఇంత సౌఖ్యమని నే చెప్పజాల’నన్నారు. ‘ఎంతో ఏమో ఎవరికి తెలుసునని’ నాద సుధారస పానంతో తనను తాను మరచిపోయి పాడుకున్నాడు. ఆ స్థితిని తెచ్చుకున్న నాయుడిగారి వయొలిన్ వాద్య విశేష మర్మాలు, ఆయన సాధన ఈ తరంవారికి మార్గ దర్శకాలు. నాదసుఖం తెలిసినవారిని ‘ఎందరో మహానుభావులు‘ త్యాగయ్య కీర్తించిన కారణమిదే.
నా పరమ గురువు సంగీత కళానిధి డా పినాకపాణి గారు నాయుడుగారి సాధనా పర్వాన్ని కళ్ళారా చూసిన మహానుభావుడు. శృతి సుఖం చెవులారా విని అనుభవించిన అదృష్టవంతుడు. విజయనగరంలో ఓ సంగీత కళావాలకు పెద్దగా ఉంటూ ఆదర్శవంతమైన మార్గాన్ని చూపించిన నాయుడుగారి దినచర్య ఉదయం 7 గంటలకే మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని 8 గంటలకే సంగీత కళాశాలకు చేరి, సీనియర్ విద్యార్థులకు వరుసగా ఒకరి తర్వాత మరొకరికి కొత్తపాఠం తాను వాయిస్తూ, ఒక అరగంట సాధన చేసుకుని 10 గంటలకు వెదురుమూడి రామారావుగారి కుమార్తెకు ఇంటికి వెళ్లి పాఠం చెప్పేవారు.
ఆ అమ్మాయి చాలా తెలివైనదనీ, శ్రద్ధగా నేర్పితే వృద్ధిలోకి వస్తుందనీ, ఆ పాఠం తన శిష్యులెవరికీ అప్పచెప్పక తానే స్వయంగా చెప్పేవారు. ఉదయం 11 ప్రాంతానికి ఇంటికి చేరి పాశ్చాత్య వయొలిన్ విద్వాంసుల వాద్యం రికార్డులు వినేవారు. మరి కాసేపటికి ఒక అటతాలవర్ణాన్ని మంద్ర, మధ్యమ, తారస్థాయిలలో వాయించేవారు. విశ్రాంతి తర్వాత మళ్లీ కాలేజీలో 2, 3 గంటలసేపు పిల్లలకు పాఠం చెప్పి ఇంటికి చేరుకునేవారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గం వరకు కచేరీలో కూర్చుని వాయించే పద్ధతిలో పందిరిపట్టు మంచంపై కూర్చుని వాయించేవారు. గంగాచారి, ముళ్ళపూడి లక్ష్మణరావు, కోలంక వెంకట్రాజు గార్లతో ఎవరైనా మృదంగ సహకారం చేసేవారు. ద్వారం నరసింగరావు, మారెళ్ళ కేశవరావు మద్దెల సత్యం, గున్నయ్య గార్లతో ఎవరో ఒకరు కూడా వాయించేవారు.
ఖండవల్లి జనార్దనాచార్యులనే శిష్యుడు, వైణికుడు ఆయనతో సహకరించి వాయించేవారు నాయుడిగారికి. కల్యాణి రాగం తానం పల్లవి గ్రామఫోన్ రికార్డులో వినిపించే వీణావాద్యం ఈయనదే.
నాయుడిగారి బోధనా విధానాన్ని సంగీత గురువులు శిష్యులకు సంగీతం నేర్పే విధానాన్ని పినాకపాణిగారు స్వయంగా చూసి చెప్పిన విషయాలు, నేటి విద్వాంసులకూ, విద్యార్థులకూ అవసరం.
శిష్యుడు బుద్ధిశాలియై చెప్పినదంతా పాడినా లేక వాయించగలిగతే రావలసిన సంగీత విషయాలన్నీ ఓపికతో రాత్రీ పగలూ అనక వచ్చేవరకూ చెప్పటం ఒక మార్గం.
అంత సామర్థ్యం లేనివారికి వారి శక్తి సామర్థ్యాన్ని తగినట్లుగా ఆ స్థాయిలోనే సంగీతాన్ని అమర్చి ‘బాగుంది’ అనే రీతిలో వారిచేత పాడించటం లేదా వాయించటం.
ఒక్కసారి వినగానే అందుకోగల స్థాయిలోని శిష్యులకు, సందేహ నివృత్తి చేస్తూ ఎక్కువ సమయం కేటాయించి సంగీత బోధన చేయటం. దానికి తగ్గ సంగీత వాతావరణం కల్పించి ప్రోత్సహించటం. శృతిశుద్ధంగా వాయించటం వేరు శుద్ధమైన శృతి సౌఖ్యాన్ని తాను అనుభవిస్తూ శ్రోతలనుభవింపజేయడం వేరు. నాయుడుగారిది ఈ మార్గమే.
ఇక్కడ మీకో రహస్యం చెప్పాలి.
విజయనగరం కళాశాల, దృష్టిలోపం గల ఒక వ్యక్తి కారణంగానే ఆవిర్భవించిందని చాలామందికి తెలుసు. కళారాధన, కళాభిరుచి, కళాపోషణ మొదలైన సంప్రదాయ విలువల్ని గుర్తెరిగిన విజయరామ గజపతి మహారాజావారి వ్యక్తిగత కార్యదర్శి జోగారావు పంతులుగారి కుమారుడు గంగబాబు పుట్టిన పది రోజులకు కంటికి ఏర్పడ్డ నలతకు చేయించిన పసరు వైద్యం వికటించి అంధుడయ్యాడు. మహారాజా వారి ఔదార్యమెంత గొప్పదో చూడండి. జ్యోతిష్కులు ఆ చిరంజీవి జాతకంలో సంగీత విద్వాంసుడు కాగలడని సూచించడంతో ఏకంగా ఆ కుర్రవాడికోసం 1919లో ఓ సంగీత కళాశాలనే ఏర్పాటు చేసేశారు. ఆ రోజుల్లో యిలా ఏ సంస్థానాధీశులూ సంగీత విద్యా సంస్థలు నెలకొల్పిన దాఖలాలు లేవు. ఈ గంగబాబు నాయుడిగారి ప్రథమ శిష్యుడు.
పినాకపాణిగారు నాయుడిగారితో వున్న రోజుల్లో పల్లవి గానంలోని మెళకువలన్నీ గంగబాబు దగ్గరే నేర్చుకున్నారంటే గంగబాబు ఎంతటి మేధావియో గ్రహించగలరు. ఏ కళాకారుడైనా సాధన నిర్లక్ష్యం చేస్తే తన శక్తి సామర్థ్యాలను, తనకు లభించిన విద్యను తానే నాశనం చేసుకోగలడని గ్రహించిన నాయుడుగారు, ఈ గంగబాబుతో చేసిన, చేయించిన సాధన అత్యున్నత స్థాయికి చేరింది. గంగబాబు నాయుడంతటి వాడయ్యాడు. నాలుగు తీగల వాద్యంతో నాద సముద్రానే్న సృష్టించగల సమర్థులైన నాయుడుగారు, గంగబాబు కలిసి వెయ్యిసార్లు శీతాకాలంలో రోజూ త్రిస్థాయిలలో సాధన చేసేవారు. త్రికాలాలూ చేసేవారు.
వెయ్యి లెఖ్ఖ కోసం ఒక డబ్బాలో వెయ్యి గులకరాళ్ళు పోసి, వేరొక డబ్బా పక్కనబెట్టి ఈ గంగబాబుకిచ్చేవారు. ఖాళీ డబ్బాలో ఒకసారి త్రిస్థాయి వాయిద్యం పూర్తవ్వగానే ఒక్కో రాయి వేసేవాడు. అది గంగబాబు డ్యూటీ. ప్రతి సంవత్సరం శీతాకాలం, మూడు మాసాలపాటు చేసే కఠోర సాధన త్రిస్థాయి సాధకం, ఒక పద్ధతిలో దీక్షగా చేసేవారు. అదేవారికి పెద్ద సాధన.
శీతాకాలంలో ఆయన చేసే సాధనకు ఒళ్ళంతా చెమటలు పట్టి తడిసిపోయేదట. ఏలూరు త్యాగరాజసభలో నాయుడిగారి వయొలిన్ వాద్యం వింటూ తంబూరా సహకారమందించిన బాల్యంతోనే ఆయన వెనుక కూర్చుని విన్న అదృష్టవంతుణ్ణి నేను. నా జీవితంలో అదొక తీపి గుర్తు. అప్పుడు నా వయస్సు 20 ఏళ్ళు. ‘‘నేను ఒక రోజు సాధన చేయకపోతే నా సంగీత సామర్థ్యం ఎంత తగ్గిందో నా ఒక్కడికే తెలుస్తుంది. రెండు రోజులు చేయకపోతే తోటి విద్వాంసులు తొందరగా గ్రహిస్తారు. మూడు రోజులు సాధన మానేస్తే సంగీత రసజ్ఞులు ఎదురుగా కూర్చుని వినే శ్రోతలు (సంగీత రసికులు) నా సామర్థ్యం తగ్గిందని భావిస్తారు.
‘‘కళ పట్టుబడటం ఒక ఎత్తు. దాన్ని నిలబెట్టుకోవడం, కాపాడుకుంటూ జాగ్రత్తగా జీవించటం మరొక ఎత్తు’’ అని నాయుడుగారు చెప్పిన మాటలు సంగీతజ్ఞులందరికీ గుణపాఠాలు.

- మల్లాది సూరిబాబు 90527 65490