S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యునెస్కో గుర్తింపుతో ప్రపంచ సంపదగా రామప్ప దేవాలయం

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా (ఉమ్మడి వరంగల్ జిల్లా) వెంకటాపురం మండలంలోని పాలంపేటలోని కాకతీయుల శిల్పకళకు కలికితురాయి అపురూప శిల్ప కళావైభవశాల రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తిస్తే దానికి మహర్దశ పట్టనున్నట్లు తెలుస్తోంది.
యునెస్కో అంటే ఏమిటి?
యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (అంతర్జాతీయ విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ). ఇది ఐక్యరాజ్యసమితికీ అనుబంధంగా ఉంది. 1945 నవంబర్ 16న ఇది ఏర్పాటైంది. ఇందులో 195 సభ్యదేశాలున్నాయి. ప్రధాన కార్యాలయం పారిస్‌లో ఉంది.
దీని పనేమిటి?
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ఇది పాటుపడుతుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత కట్టడాలనూ, సహజ ప్రకృతి వింతలను పరిరక్షించడానికి కంకణం కట్టుకుంది.
ఇప్పటివరకు ఎన్నింటిని గుర్తించింది?
తొలిసారిగా 1978లో ఈక్వడార్‌లోని ‘గాలపాగస్ దీవుల’ను గుర్తించి ‘ప్రపంచ వారసత్వ సంపద హోదా’ ఇచ్చింది. ‘వారసత్వ సంపద హోదా’ అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదగా గుర్తింపు పొందినదని అర్థం. ఈ విధంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1052 ప్రాంతాలను గుర్తించింది. మన దేశంలో ఇప్పటివరకు 36 ప్రదేశాలను గుర్తించింది. అవి 1.తాజ్‌మహల్ 2.ఆగ్రాకోట 3.్ఫతేపూర్ సిక్రీ 4.అజంతా గుహలు 5.్ఛత్రపతి శివాజీ టెర్మినస్ 6.ఎలిఫెంటా గుహలు 7.ఎల్లోరా గుహలు 8.్భంబేట్కా రాతి కప్పులు 9.ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు 10.సాంచి బౌద్ధస్తూపాలు 11.మహాబోధి ఆలయం 12.నలందా విశ్వవిద్యాలయం 13.చంపానేర్ పావగఢ్ పురావస్తు వనం 14.గోవా చర్చీలు 15.చోళుల ఆలయాలు 16.మహాబలిపురం వద్ద నిర్మాణ సమూహాలు 17.కుతుబ్ మినార్ 18.హుమాయూన్ సమాధి 19.ఎర్రకోట 20.కజిరంగా జాతీయ వనం 21.మానస జాతీయ అభయారణ్యం 22.కిమోలోడియో జాతీయ వనం 23.నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ 24.గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ 25.సుందర బన్స్ నేషనల్ పార్క్ 26.వెస్ట్రన్ ఘాట్స్ 27.జంతర్‌మంతర్, జైపూర్ 28.రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ 29.వౌంటేన్ రైల్వేస్ 30.హంపి 31.రాణి కీ వప్ ది క్వీన్స్ స్టెప్ వెల్, పఠన్ 32.సూర్యదేవాలయం 33.పట్టా డక్కల్ వద్ద నిర్మాణ సమూహాలు 34.కంచనగంగ నేషనల్ పార్క్ 35.కర్బుజీర్ వాస్తు నిర్మాణం, చండీగఢ్ 36.అహ్మదాబాద్
గుర్తింపు ఎలా?
మనిషి రూపొందించిన అద్భుత ఘనత చాటాలి. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విలువైన సందేశాన్నివ్వాలి. నాగరికతను చూపే ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రత్యేక శిల్పశైలితో నిర్మితమవ్వాలి. జీవరాశులు నిర్మించిన అద్భుతమై నిలవాలి. ఏదైనా అంతరించిపోయే అరుదైన జాతి ఆవాసమై ఉండాలి. ఎలాంటి ఆక్రమణకు గురి కావద్దు. 100 మీటర్ల లోపు ఎలాంటి కట్టడాలు ఉండరాదు. 200 మీటర్లలోపు కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖల అనుమతులతో కూడిన కట్టడాలు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి.
రామప్ప దేవాలయానికి అన్ని అర్హతలు
ఈ విధంగా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపునకు అన్ని అర్హతలున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇంటాక్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) (్భరత జాతీయ కళలు, సాంస్కృతిక, వారసత్వ సంపద కట్టడాల పరిరక్షణ సంస్థ) సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అది రామప్ప దేవాలయ ప్రత్యేకతలతో కూడిన ‘డోజియర్’ను యునెస్కో గుర్తింపునకు పంపింది. 300 ఏళ్ల కాలంగా అంటే చాళుక్యులూ, కాకతీయులూ, విజయనగర సామ్రాజ్యం వరకు ఉన్న సంస్కృతీ సంప్రదాయాల్నీ, ఆ కాలం భాష, ఇలా అన్నింటినీ స్పృశిస్తూ రామప్ప గుడి నిర్మాణం కావడం, రామప్ప చుట్టూ 300 మీటర్ల మేర ఎలాంటి అక్రమ కట్టడాలు లేకపోవడం, అబ్బురపరిచే కమనీయ రమణీయ శిల్పకళా సౌందర్యం ఉండటం యునెస్కో గుర్తింపునకు అన్ని అర్హతలు కలిగి ఉంది.
150 పేజీలున్న ప్రతిపాదనకు కాకతీయ ఆభరణం పేరు - సుమారు 150 పేజీలున్న ఈ ప్రతిపాదనకు ‘ది జువెల్ ఆఫ్ కాకతీయన్ ఆర్కియాలజీ’గా పేరు పెట్టారు రామప్ప దేవాలయానికి చేరువలో ఎలాంటి ప్రైవేటు, అక్రమ కట్టడాలు లేనందున యునెస్కో గుర్తింపు వచ్చే అవకాశం కచ్చితంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అర్హత కోల్పోయిన కట్టడాలు
గతంలో తెలంగాణలోని చార్మినార్ కుతుబ్ షాహి టూంబ్స్ గోల్కోండలకు యునెస్కో గుర్తింపునకు ప్రతిపాదనలు పంపారు. కానీ ఈ కళాఖండాలకు 100 మీటర్లలోపే అక్రమ కట్టడాలు ఉండడంతో అవి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు హోదా అర్హతను కోల్పోయాయి. ఈ క్రమంలో వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి కూడా అదే విధంగా అర్హత కోల్పోయి హోదాను దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నాయి.
806 ఏళ్ల ఆలయ చారిత్రక నేపథ్యం
కాకతీయ చక్రవర్తిం గణపతిదేవుని సర్వసైన్యాధ్యక్షుడు రేచెర్ల రుద్రారెడ్డి - అన్యమ్మ దంపతులు శాలివాహన శక సంవత్సర 1135 శ్రీముఖ నామ సంవత్సర మధుమాస వసంత శుక్ల పక్షమీ, అష్టమీ, భానువారం, పుష్యమీ నక్షత్రం సరియగు క్రీ.శ.1213 మార్చి 31వ తేదీన కాకతీయ శిల్పకళా వైభవానికి పరాకాష్ఠగా, మణిమకుటంగా, భూలోక కైలాసంగా, శివునికి నిత్య నివాసంగా, భక్తకోటికి నిరంతర ఆరాధనాలయంగా, రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. శివ కేశవ సమారాధనగా మహాశిల్పి రామప్పాచార్యుల నేతృత్వంలో 300కు పైగా శిల్పులతో భారతీయ శిల్ప సంప్రదాయంలోని విశిష్ఠమైన వేసర శిల్పరీతిన నిర్మించారు. అమరావతి, నాగార్జునకొండల బౌద్ధశిల్పం, మహాబలిపురం, పల్లవ శిల్పం, అజంతా, ఎల్లోరాల రాష్టక్రూట శిల్పం, ఖజురహోలోని చందేలి శిల్పం, బేలూరు, హాలీబీడుల హొయసల శిల్ప రీతులను మించి హొయసల శిల్పంలోని అతి అలంకరణ, పల్లవ శిల్పంలోని అలంకార శూన్యత వంటి లోపాలు లేకుండా తమదైన గొప్ప కాకతీయ శిల్పకళా కాంతుల వైభవంతో అతి భారీ ఏకకూటాలయంగా రామప్ప దేవాలయాన్ని సాటిలేని మేటి మహోన్నత కళాఖండంగా నిర్మించి కాకతీయ శిల్పానికి విశ్వవిఖ్యాతి గావించి - అహో! రామప్ప దేవాలయమంటూ అబ్బురపరిచారు.
ఆలయ ప్రత్యేకతలు: నీటిలో తేలియాడే ఇటుకలు
రామప్ప ఆలయ నిర్మాణంలో 0.8.09 డెన్సిటీ ఇటుకలు వాడారు. సాధారణ ఇటుకలు 2.2 డెన్సిటీతో పోలిస్తే గుడి నిర్మాణానికి వాడిన ఇటుకలు మూడు రెట్లు తక్కువ బరువు వుంటాయి. కనుక ఇవి నీటిలో మునగక పైకి బెండుల వలే తేలుతుంటాయి. ఇలాంటి ఇటుకల్ని కాకతీయ చక్రవర్తులు కొన్ని ప్రసిద్ధ ఆలయాల విమానాలకు (గాలిగోపురాలకు) వాడారు. (గణపురంలోని కోటగుళ్లకు, గణపేశ్వరాలయ సముదాయానికి) వాడారు.
శాండ్ బాక్స్ టెక్నాలజీ
శాండ్‌బాక్స్ టెక్నాలజీతో ఆలయాన్ని నిర్మించారు. అనగా పునాదుల్లో 3 మీటర్ల మేర మట్టి తీసి ఇసుకతో నింపి కట్టారు. నిర్మాణం దృఢంగా ఉండేలా, కుంగినా నిర్మాణానికి నష్టం జరుగకుండా 10-12 అంగుళాల బీమ్‌లు వాడారు. నిర్మాణం బరువు ఎక్కువ పడేచోట గ్రానైట్, డోలరైట్, బ్లాక్‌గ్రానైట్ శిలలను వాడారు.
జిలుగు వెలుగుల శిల్పాలు
ప్రశస్తమైన నల్లసేనపు శిలలపై చెక్కిన శిల్పాలు 800 ఏళ్లు దాటినా చెక్కుచెదరకుండా జిలుగు వెలుగులతో ప్రకాశిస్తూ అలరారుతున్నాయి.
నంది, నాగినిలకు ప్రపంచ ఖ్యాతి.. ముఖ్యంగా రామప్ప నందికి, నాగినీ శిల్పాలకు ప్రపంచ ఖ్యాతి ఉంది. వీటి అద్భుత శిల్ప కళా సౌందర్యాన్ని గాంచి పర్యాటకులు మరపురాని మధురానుభూతులకు గురవుతారు.
శిల్పి పేర ఆలయం
చారిత్రకంగా దేవాలయం రుద్రేశ్వరాలయంగా నామకరణమైనా శిల్పాచార్యుడు రామప్ప హస్తాలతో అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్నందున ప్రజల రామప్ప దేవాలయంగా పిలుస్తున్నందున అదే ఆలయానికి రామప్ప దేవాలయంగా శాశ్వత నామకరణమైంది.
తాజాగా అన్ని అంశాలతో ప్రతిపాదనలు
రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి యునెస్కోకు ఫక్కాగా తాజా ప్రతిపాదనలు అందించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖా కార్యదర్శి బుర్రా వెంకటేశం, యునెస్కో కన్సల్టెంట్ చూడామణి నందగోపాల్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు పాండురంగారావులు ప్రకటించారు. దీంతో యునెస్కో బృందం ఈ నెలలో రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రపంచ వారసత్వ సంపదకు గుర్తింపునకు గల అర్హతలపై శిల్పాలను పరిశీలించనుందనీ, అలాగే చారిత్రక నేపథ్యం, విశిష్ఠత, నిర్మాణ పరిరక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కూలంకషంగా తెలుసుకోనుందనీ పేర్కొన్నారు.
యునెస్కో గుర్తిస్తే..?
రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తిస్తే దానికి మహర్దశ పడుతుందని శిల్పకళా ప్రేమికులు చెబుతున్నారు. గుర్తింపుతో ఆలయ రూపురేఖలు మారగలవని అంటున్నారు. ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానాన్ని పొంది దేశంలో యునెస్కో గుర్తించిన 36 ప్రపంచ వారసత్వ ప్రదేశాల సరసన నిలబడి 37వ వారసత్వ హోదాతో ఘనుతికెక్కి ప్రపంచ ప్రజల సందర్శనలతో నిత్యం సందడి చేస్తుందని అంటున్నారు.
యునెస్కోతో రామప్పకు అందే ప్రయోజనాలు
తద్వారా రామప్ప దేవాలయానికి శాశ్వత పరిరక్షణ చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాల ఏర్పాటు, గుడి (కట్టడం) పరిసర పట్టణాలు, నగరాల నుంచి సౌకర్యవంతమైన మార్గం, ఉచిత వైఫై ఏర్పాటు, అంతర్జాతీయ పర్యాటకులకు కావలసిన పలు సౌకర్యాలు, చారిత్రక కట్టడాల పరిరక్షణకు కఠినమైన చర్యలు, వివిధ సంస్థల నుంచి అందే ప్రత్యేక నిధులతో రామప్ప దేవాలయాన్ని నూతన శోభతో విరాజింపజేస్తూ కాకతీయ చక్రవర్తుల ఆత్మలనూ, జగదేక శిల్పకళా సౌందర్యాన్నీ ఆవిష్కరింపజేస్తారు. తద్వారా రామప్ప దేవాలయం దేశ, రాష్ట్ర కీర్తి పతాకాలను ప్రపంచ వినువీధుల్లో రెపరెపలాడిస్తూ దేశ విదేశ పర్యాటకులను అలరిస్తూ మరువరాని మధుర జ్ఞాపక చిహ్నంగా మదిలో నిలిచిపోతుంది. రామప్ప దేవాలయం ద్వారా ఇన్ని ఆనందాలను సొంతం చేసుకోవడానికి యునెస్కో బృందం ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా త్వరలో రామప్ప దేవాలయం గుర్తింపు పొంది, పూర్వ వైభవంతో మహోజ్వలంగా ప్రకాశిస్తుందని ఆశిద్దాం.

- తాళ్లపల్లి యాదగిరిగౌడ్ 9949789939