S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కీటకాలకు ‘రంగుల’ కిరీటం

ఆమె కుంచె, కలం గొల్లభామలను, మిడతలను, సీతాకోక చిలుకలను సింగారించింది, వాటికి సరికొత్త వనె్నలద్దింది. అలా సింగారించుకున్నవి శృంగారంలో పాల్గొన్న వైనాన్ని కాన్వాసుపై చిత్రీకరించింది. వాటిల్లోనూ ప్రేమ - ప్రణయం, ఆరాధనా భావం అద్భుతంగా ఉంటాయని కళ్లకు కట్టినట్టు ఆమె చూపారు. ఆమె ఎవరో కాదు చిత్రకారిణి గాయత్రి దంతూరి. వాస్తవానికిది సరికొత్త ఊహా ప్రపంచం.. మనుషుల మనోభావాలు, స్పందనలు - ప్రతిస్పందనలు, భావోద్వేగాలు ఇతర జీవుల్లో చూసినప్పుడు అదో రకమైన ఆనందం - ఆత్మసంతృప్తి.. అనిర్వచనీయమైన అనుభూతికి లోనవడం సహజం. దానే్న ‘కనెక్ట్’ కావడమని ఆమె అంటున్నారు. గాయత్రి దంతూరి ఎంతో ప్రతిభావంతంగా ఆ సున్నితత్వాన్ని మరింత నాజూకుగా, లేత రంగుల్లో వీక్షకుల హృదయ లోతుల్లో ‘ముద్ర’ పడేలా సుకుమారంగా కాన్వాసుపైకి తీసుకొచ్చారు. చిత్రకళా ప్రపంచానికి సరికొత్త లోకాన్ని పరిచయం చేశారు. రంగుల వెనుక దాగిన రసరమ్యతను, ఇంద్రియాలను ప్రేరేపించేందుకు ఆమె తీసుకున్న శ్రద్ధ, చేసిన తపస్సు అసాధారణం.. అద్వితీయం... అద్భుతం.. అమోఘం.. అనిర్వచనీయం.
ఆడ గొల్లభామకు మగ గొల్లభామ గులాబీ పువ్వు ఇస్తూ ‘ఐ లవ్ యూ..’ చెప్పడాన్ని ఎవరైనా ఊహించగలరా? తిరిగి ఆ ఆడగొల్లభామ ‘ఐ లవ్ యూ టూ’ అంటున్నట్టు చూసే చూపు, భావ వ్యక్తీకరణ ఎవరైనా దర్శించగలరా?.. గాయత్రి దంతూరి అలా ఊహించి, దర్శించి లేలేత రంగుల్లో ఆ గొల్లభామల గుండె లోతుల్లోని స్పందనలు, తమకాన్ని, తడికళ్లను, గుండె గొంతుకలో కొట్లాడుతున్న వైనాన్ని ఎంతో రసాత్మకంగా కాన్వాసుపై పొందుపరచడం, కాగితంపైకి తీసుకురావడం అందరినీ సంభ్రమాశ్చర్యానికి, సంతోషానికి గురిచేసే అంశమే కదా? దీనికి అవార్డును సైతం అందుకున్నారామె.
ఓ కీటకం సింగారించుకుని, ఒళ్లంతా పులకరింతతో పూలదండ ‘చేత’పట్టుకుని ‘స్వయంవరాని’కి బయలుదేరడం, ఆ దండలోని కొన్ని పూల రెక్కలు తన చుట్టూ చెల్లాచెదురుగా పడటం.. అదో అలంకారంలే.. అనుకుని మురిసిపోతూ ముందడుగు వేసే వైనాన్ని చిత్రకళా జగత్తులో గతంలో ఎవరూ ఊహించి ఉండరు. ఈ చిత్రాన్ని పెన్ను - ఇంకుతో కాగితంపై కలకాలం నిలిచేలా వేసి చిత్రకారిణి చిరంజీవత్వం పొందారు. దీనికీ ఆమె అనేక మన్ననలు అందుకున్నారు.
టీనేజి (యుక్తవయసు)లో చీమలు, తూనీగలు, గొల్లభామలు, ఈగలు ఇట్లా సవాలక్ష కీటకాల చేష్టలు ఎలా ఉంటాయో ఎవరైనా ఊహించగలరా?.. అసలు వాటి ‘టీనేజి’ గూర్చిన అవగాహన - ఆలోచన ఎవరైనా చేసి ఉంటారా? గాయత్రి దంతూరి మాత్రం ఆ ‘స్థితి’ని దర్శించి ఆ వయసులో అవి జరిపే ‘రతిక్రీడ’ - వివిధ భంగిమలు దృశ్యమానంగా చూపితే వీక్షకుల మానసిక స్థితి ఎలా ఉంటుందో?.. చెప్పడం కష్టం. అదో అలాంటి స్వాభావిక, ప్రకృతిసిద్ధ, ప్రణయ కలాపాలను లేలేత రంగుల్లో దర్శించడం, వీక్షకులు దాన్ని ఆస్వాదించడం ఓ అపురూప అనుభవం. అక్షరాలకందని తన్మయత్వం. కొసమెరుపు ఏమిటంటే ‘ఉడ్’పై ఆక్రలిక్ రంగుల్లో వీటిని చిత్రించడం.
మంచం.. చుట్టూ పూల అలంకరణ, పరుపుపై కీటకాల ప్రణయమే కాదు, ప్రణయ కలహం లాంటి మానవ స్వభావాల్ని కీటకాలకు ఆపాదించి చూపిన చిత్రాలు చూస్తుంటే అదేదో మరో లోకంలో ఉన్నామా? అనిపిస్తుంది. రస హృదయులు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించడం తథ్యం. ఓ చిత్రానికి ఇంత తాదాత్మ్యత చెందడమంటే ఆ చిత్రం నిజంగానే మనసులను దోచేస్తున్నదనే రఅథం. ఆ విధంగా ఆ చిత్ర ప్రయోజనం నెరవేరినట్టే కదా?
ఈ ప్రజ్ఞను, ప్రతిభను, ప్రావీణ్యాన్ని, రంగుల పరిమళాన్ని పసిగట్టిన జాతీయ లలితకళా అకాడెమీ వారు కొత్త ఢిల్లీలో జాతీయ చిత్రకారిణుల ‘క్యాంప్’కు ఇటీవల (ఆగస్టు తొలివారం) ఆమెను ఆహ్వానించారు. అకాడెమీ 65వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ నుంచి ఇద్దరు చిత్రకారిణులు దీనికి హాజరు కావడం హర్షణీయం. వారిలో ఒకరు గాయత్రి. ఐదు రోజుల పాటు జరిగిన ఆ క్యాంప్‌లోనూ ఆమె కీటకాన్ని తనదైన ‘శైలి’లో చిత్రించారు. చిత్రరచనకు కొత్త అందాలు దిద్దారు.
ఒక చిత్రకారుడికి/ చిత్రకారిణికి తనదైన ‘శైలి..’ తనదైన సబ్జెక్ట్ ఉబికి రావడానికి ఎంతో సమయం పడుతుందని, ఎంతో అభ్యాసం దాని వెనక దాగి ఉంటుందని, ఎంతో మేథోమథనం అంతర్లీనంగా ఉంటుందని, తన విషయంలోనూ అదే జరిగిందని ఆమె అంటున్నారు.
హైదరాబాద్ నగరానికి శాటిలైట్ టౌన్‌గా భావించే భువనగిరిలో గాయత్రి దంతూరి 1986లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగింది. సమీపంలోని సందుపట్ల గ్రామంలో వారికి వ్యవసాయమూ ఉంది. ఆ రకంగా బాల్యం నుంచే అనేక రకాల కీటకాలను ఎక్కువగా చూసే అవకాశం లభించింది. హైస్కూల్ చదువుతున్నప్పుడు కొన్ని అనారోగ్య కారణాల వల్ల పాఠశాలకు వెళ్లలేక పోయినప్పుడు ఇంట్లోని వారు కొన్ని కాగితాలు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులు తెచ్చి పెట్టారు. అలాగే కొన్ని మేగజైన్లు ఇచ్చారు. ఆ రకంగా వాటిలోని బొమ్మలను నకలు చేసే పనిలో పడిపోయింది. ఊహించని విధంగా అదే, ఆ బొమ్మల లోకమే తనదై పోయింది. ఆరోగ్యం కుదుట పడింది. మనసు తేలిక పడింది. బి.ఏ. డిగ్రీ తొలి సంవత్సరం అక్కడే చదివాక తన ‘అభిరుచి’కి బి.ఏ. చదువులకు పొంతన లేదని భావించి ‘బొమ్మల చదువు’ గూర్చి ఆరా తీయగా హైదరాబాద్‌లోని జెఎన్‌టియు, తెలుగు విశ్వవిద్యాలయం గురించి తెలిసింది. దాంతో 2004 సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని బిఎఫ్‌ఏలో చేరారు. తొలుత పెయింటింగ్‌పై కృషి చేసినా అనంతరం ‘ప్రింట్ మేకింగ్’ క్యాంప్‌కు హాజరైనప్పుడు అక్కడ లక్ష్మాగౌడ్ లాంటి ప్రముఖులు అంకిత భావంతో ‘ఎచ్చింగ్’ చేస్తూ ప్రింట్ మేకింగ్ పనిలో నిమగ్నమవడం చూసి తానూ ఆ విభాగంలోకి మారిపోయానని, అప్పటి నుంచి పెయింటింగ్‌తోపాటు ప్రింట్ మేకింగ్‌పై మనసు పెట్టానని ఆమె అంటున్నారు.
బిఎఫ్‌ఏ పూర్తయ్యాక, ఎంఎఫ్‌ఏ కోసం బరోడాకు 2008లో బయలుదేరారు. అక్కడి మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్‌యూ)లో చిత్రరచన, సృజనకు అనువైన వాతావరణం చిక్కగా ఉంటుందని దేశమంతా చెప్పుకుంటారు. తన మనసు అలాంటి చోటును కోరుకోవడంతో అక్కడికెళ్లి ముందుగా ప్రముఖ ప్రింట్ మేకర్ ‘జ్యోతిభట్’ను కలిశారు. తరువాత ఎంఎఫ్‌యులో చేరారు. ఇదంతా దశాబ్దం క్రితం నాటి మాట. ఈ దశాబ్ద కాలంలో గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా రూపాంతరం చెందుతుందో అలాగే ఆమె జీవితం ‘రూపాంతరం’ చెందింది. నిజమైన చిత్రకారిణికి అవసరమైన క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావం, పోటీ తత్వం, ప్రయోగశీలత, పరిపక్వత అన్నీ అబ్బాయి. పురుగుల్లో తానో ‘పురుగు’గా రూపాంతరం చెందానంటున్నారామె నవ్వుతూ.. వాటిని ఆవాహన చేసుకుని, ఈ సృష్టిలో ఏ చిన్న జీవి (కీటకం) కూడా తక్కువ ప్రాధాన్యత గలది కాదని, కొన్ని క్షణాలపాటు జీవించే వర్షాకాలపు మిడత సైతం ప్రకృతికి అందాన్ని అందించి ఆత్మత్యాగం చేస్తుందన్న సత్యాన్ని గ్రహించి ఆ మానసిక స్థితిని ఆవాహన చేసుకుని కీటకాలపై అసంఖ్యాక బొమ్మలు వివిధ మాధ్యమాలలో ఆమె వేస్తున్నారు. ఉడ్‌పై, అక్రలిక్ షీట్లపై ప్రయోగాత్మకంగా ఆమె రూపొందించిన తీరు.. మిణుగురుల వెలుగులు కొత్త రంగుల లోకాన్ని కళ్ల ముందు పరుస్తాయి. వీక్షకుల్ని సమ్మోహనపరిచే ఇంద్రధనస్సుల్లా విరబూస్తాయి.
గాయత్రి బొమ్మలు ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో ప్రదర్శితమయ్యాయి. బరోడాలోని ఉత్తరాయణ ఆర్ట్ ఫౌండేషన్ వాళ్లు గాయత్రి చిత్రాలను కళ్లకద్దుకుని తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆర్ట్ క్రిటిక్‌గా, ఆర్ట్ కలెక్టర్‌గా అందరిచే గౌరవింపబడే పద్మశ్రీ జగదీశ్ మిత్తల్ గాయత్రి బొమ్మలను ఇష్టపడి సేకరించారంటే వాటి ప్రాశస్త్యం వేరే చెప్పాలా?
తన చిత్ర రచనతో, సరికొత్త సృజనతో సౌందర్యానికి, అందానికి, అంతఃలోకానికి తనదైన వినూత్న శైలిలో విభ్రమ కలిగించే భావోద్వేగాలను ఒక ఫిలసాఫికల్ (తాత్విక) స్థాయిలో ఉడ్, అక్రలిక్ కాన్వాసు, పేపర్‌పై (కీటకాలను) చూపడం సరికొత్త చిత్రకళా చరిత్ర అంటే అతిశయోక్తి అవదేమో!
కొసమెరుపు: కలంకారీ చిత్రకళా శైలిలోనూ ఆమె కీటక ‘ప్రేమికుల’ను చిత్రిస్తున్నారు. ‘ఆర్ట్ లవర్స్’ను అబ్బుర పరుస్తున్నారు.
గాయత్రి దంతూరి.. 9726074023

-వుప్పల నరసింహం 9985781799