100% సాక్షరత సాధ్యమేనా?
Published Sunday, 8 September 2019చంద్రయాన్ -2 అత్యంత కీలక దశకు చేరుకుని ఆర్బిటార్ నుండి విడిపోయిన ల్యాండర్ జాబిల్లిపై దూసుకుపోతున్న దశలో భారత్ అంతరిక్ష విజయాలు చూసి ఆశ్చర్యపోతున్న వారే! భారత్‌లో అక్షరాస్యతను చూసి నివ్వెరపోతున్నారు. భారత్‌లో ఏడేళ్లు వయస్సు పైబడిన వారిలో అక్షరాస్యులు 74.04 శాతమే అంటే విస్మయం కలుగకమానదు. అంతే కాదు ఆసియా దేశాల్లో పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ మినహా మిగిలిన అన్ని దేశాల సాక్షరత కంటే మన దేశ అక్షరాస్యత తక్కువే. చైనా, శ్రీలంక, బర్మా, ఇరాన్‌లతో పోలిస్తే ఇంకా తక్కువే. ప్రపంచ సగటు అక్షరాస్యతకు కూడా భారతదేశం ఇంత వరకూ అందుకోలేదంటే నమ్మబుద్ధికాదు, కానీ అది ముమ్మాటికీ నిజం.
సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో మారు ప్రపంచం అక్షరాస్యతపై చర్చిస్తోంది. 1966 అక్టోబర్ 26న జరిగిన 14వ యునెస్కో జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 8న నిర్వహించుకోవాలని తీర్మానం చేశారు. ఈ సూచన మేరకు తొలి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని 1967లో నిర్వహించారు. ప్రతి ఏటా ఒక లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచీకరణ, డిజిటలైజేషన్ యుగంలో అక్షరాస్యత- బహుభాషావాదం పేరిట సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా ఉత్సవాలను నిర్వహించబోతున్నారు. యునెస్కో కృషితో ఎంతో మార్పు జరిగినా అక్షరాస్యత సవాళ్లు వివిధ దేశాల్లో భిన్నమైన రూపంలో కొనసాగుతున్నాయి. భాషావైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని విద్య, అక్షరాస్యతాభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగించాల్సి ఉంది. అపుడే యునెస్కో, ఐక్యరాజ్యసమితి ప్రవచించే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలుగుతాం. బహుభాషల స్థితిలో ఎక్కువ మందిని అక్షరాస్యులను చేసేందుకు అమలుచేసే విధానాలు, పద్ధతుల్లో ఎదురయ్యే సమస్యలను సైతం ఈ సందర్భంగా చర్చించడం జరుగుతుంది. నిజానికి అంతర్జాతీయ అక్షరాస్యతా ఉద్యమానికి పెద్ద కథే ఉంది. ఈ కథకు మూలం సైతం మన దేశంలోనే ఉంది.
అక్షరాస్యతా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వినూత్న కార్యక్రమాలను రూపొందించాయి. 94 శాతంతో కేరళ అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉండగా, తొలి ఐదు స్థానాల్లో కేరళ తర్వాత లక్షద్వీప్, విజోరాం, గోవా, త్రిపుర, డమన్, అండమాన్ ఉన్నాయి. వీటి తర్వాత ఢిల్లీ, ఛండీఘర్, పాండిచ్చేరి ఉన్నాయి. తాజా అధికారిక లెక్కలు కాకపోయినా, ఆంధ్రప్రదేశ్ 32వ స్థానంలో, తెలంగాణ 35వ స్థానంలో ఉన్నాయి. పారిశ్రామికంగా , ఐటీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాయి.
జాతీయ స్థాయిలోనూ అన్ని రంగాల్లో విజయాలను నమోదు చేస్తున్న భారతదేశం చదువుల్లో మాత్రం ఎందుకు ప్రపంచానికి మార్గదర్శకంగా లేకపోయిందనే బాధ అందరిలో వ్యక్తమవుతోంది. దేశంలో సాక్షరత పెంచేందుకు, నిరక్షరాస్యత తగ్గించేందుకు గత 72 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలుచేశాయి. లక్షల కోట్ల రూపాయిలు వెచ్చించాయి. అయినా అనుకున్న లక్ష్యాలకు మాత్రం చేరువ కాలేకపోయాయి.
అక్షర యజ్ఞం ప్రభుత్వం మాత్రమే చేసేది కాదు, సమాజం ముందుకు వచ్చి మరో స్వాతంత్య్రసమరంలా అక్షరసమరం చేయాలి, ప్రతి సాక్షరాస్యుడు పది మంది నిరక్షరాస్యులకు విద్యను నేర్పించాలి. వారు పిల్లలే కావచ్చు, వయోజనులే కావచ్చు, మహిళలు, మైనార్టీలు, వికలాంగులు ఎవరైనా కావచ్చు. ఇది ఎంతోకాలం కొనసాగించకపోయినా సమాజం బాధ్యత తీసుకుంటే దేశంలో నూరు శాతం అక్షరాస్యతను సాధించడం పెద్ద విచిత్రమేమీ కాదు. కానీ ఆ సంకల్పం కార్యరూపం దాల్చడం లేదు. సమన్వయం సాధిస్తే ఇదేమీ చంద్రయాన్ అంత కఠినతరం కాదు. తేలికైన వ్యవహారమే.
చదువు ఎందుకు?
అంతా చదువుకోవాలని చెబుతుంటారు.. చదువెందుకు?
ఎవరికోసం... సుఖ జీవనానికేనా?
ఒక ముని వెళ్తూ వెళ్తూ సముద్రపు ఇసుకలో ఆడుకుంటున్న యువకుడ్ని చూసి , ఎందుకు ఆడుకుంటున్నావు చదువుకోవచ్చు కదా అని ప్రశ్నించాడు.
చదువుకుంటే ఏం అవుతుంది స్వామీ అని ఆ యువకుడు ప్రశ్నించాడు.
మంచి ఉద్యోగం వస్తుంది, గృహస్థుడవు అవుతావు, సుఖంగా జీవిస్తావు అని స్వామి బదులిచ్చాడు.
ఇన్ని చేశాక నేను సుఖంగా జీవిస్తానా? లేదు, ఇపుడు నేను సుఖంగా ఉన్నాను కదా అని ఆ యువకుడు బదులిస్తాడు.
విద్య అంతర్గతంగా ఉన్న శక్తులను బహిర్గతం చేస్తుంది. ఎడ్యుకేషన్ అనేది లాటిన్ పదం. ఎడ్యుకేటం నుండి వచ్చింది. ఎడ్యు అంటే ఏ డ్యూకో అని రెండు పదాల నుండి తీసుకున్నారు. ఏ అంటే ఔట్ ఆఫ్, డ్యూకో అంటే టు లీడ్ అని అర్ధం. ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుసరి, ఎడ్యుకేర్ అనే పదాల నుండి వచ్చిందని మరికొంత మంది చెబుతారు. ఎడ్యుసరి అంటే వికాసం, ఎడ్యుకేర్ అంటే వృద్ధి, ప్రగతి అని అర్థం. గాంధీజీ మాటల్లో చెప్పాలంటే బిడ్డలో ఉన్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్లో ఉన్నతమైన వాటిని బహిర్గతం చేయడమే విద్య. వివేకానందుడు సైతం విద్య అంటే సమాచారం కాదని, జీవనవికాసమని అన్నారు. విద్య అనేది ద్విధృవాల ప్రక్రియ అంటే ఒకరికొకరు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఒకరి అభివృద్ధికోసం మరొకరు కృషి చేసే ప్రక్రియగా పేర్కొన్నాడు. విద్య కేవలం ద్విధృవ ప్రక్రియ మాత్రమే కాదని, మూల పదార్ధం పాఠ్యప్రణాళిక ఉండాలని జాన్ డ్యూయి పేర్కొన్నాడు. బహిర్గతం కాని శక్తులను బహిర్గతపరిచే కృషిని విద్యగా రెడాన్ చెప్పాడు. వీరందరి ఆలోచనల ప్రకారం విద్య జ్ఞాన బోధకే పరిమితం కాదని, అంతకంటే విస్తృతమైనదని అర్థం చేసుకోవాలి.
చదువు మంచి జీవితం, సుఖం కోసమేనా , ఒకప్పటి ఆలోచనా ధోరణి అది. చదువు వల్ల మనిషిలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. మానవీయ దృక్పథాన్ని, సాంఘిక దృక్పథాన్ని అలవరచుకోవడంతో పాటు వారిలో సమయస్ఫూర్తి, ప్రజ్ఞ, ఉద్వేగ స్థిరత్వం, అనుతాపం, దయ, స్నేహశీలత, సానుభూతి, మంచిస్వభావం, సమానత్వం, యోచన, ఓర్పు, సభ్యత, ఆశావాదం, ఉత్సాహం, ఉల్లాసం, సంఘ్భావం, వాగ్దాటి, హాస్యభావం, ఆహ్లాదకరతత్త్వం, చురుకుదనం, ఉచ్ఛారణ, వ్యక్తీకరణ, నిష్కపటం, నిష్పక్షపాతం, విశాల దృక్పథం, శక్తి, పట్టుదల, పరిశ్రమతత్వం, సహనం, ప్రేరణ, జిజ్ఞాస, ఆత్మవిశ్వాసం, స్వావలంభన, ఆకర్షణీయంగా ఉండేలా తన దుస్తులు, దేహంపై ఆసక్తి, పరిశుభ్రత, ఉత్తమ అభిరుచులు, నమ్రత, నీతి, సంప్రదాయం, సంస్కృతి, సంస్కారం, పాండిత్యం, ఔదార్యం, కలుపుకోలుదనం, సర్దుబాటు, స్పందన శక్తి, సంపూర్ణ విశ్వాసం, స్పందన శక్తి, నిస్వార్ధం, దాతృత్వగుణం, కచ్చితత్వం, నిజాయితీ, బాధ్యత, కష్టపడే స్వభావం, నమ్మదగిన తత్వం, సద్భావం ఏర్పడుతాయి. ఇవన్నీ తెలియకుండానే ఒకదానితో ఒకటి పెనవేసుకుని మన మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
నేర్చుకోవడం ఎపుడు మొదలైంది?
38 లక్షల సంవత్సరాల క్రితమే మనిషి కోతి రూపంలో ఉన్నప్పటి శిలాజాలు ఇటీవల కనుగొన్నా, మనిషి పరిణామ క్రమం మొదలై 13 లక్షల సంవత్సరాలు దాటిందని, నేర్చుకోవడం అనేది రెండు లక్షల సంవత్సరాల క్రితమే మొదలైందని శాస్తవ్రేత్తలు చెప్పే మాట. ప్రపంచంలో సకల జీవులకు భిన్నంగా భాషా సంపద కలిగిన ఏకైక జీవి మనిషి. అందుకే అన్ని జీవుల కంటే మనిషిని ప్రత్యేకంగా నిలుపుతోందనేది నిర్వివాదాంశం.
లిపి లేకుండానే నేర్చుకున్నారా?
అప్పట్లో భాష, లిపి, ముద్రణ ఇలాంటివి ఏవీ లేకున్నా సైగల ద్వారా సంజ్ఞల ద్వారా మొదలైన సమాచార మార్పిడే అభ్యాసంగా మారింది. వ్యవసాయం, పారిశ్రామికత మొదలైన తర్వాతనే లిపి, ముద్రణ మెరుగుపడ్డాయి. క్రీపూ 3500 సంవత్సరంలో ఈజిప్టులో అభ్యాసానికి సంబంధించిన గుర్తులున్నాయి. క్రీపూ 2000 సంవత్సరంలో లిపికి సంబంధించిన శాసనాలు, గుర్తులు లభించాయి. అదే చైనాలో క్రీస్తుపూర్వం 1400 సంవత్సరం నుండి, భారత్‌లో క్రీపూ 1500 సంవత్సరం నుండి అభ్యాసం మొదలైందనే చెప్పాలి.
నిజానికి ఇప్పటికీ అక్షరాలు గుర్తుపట్టగలిగేవారు, వేలి ముద్ర బదులు సంతకాలు చేయగలిగేవారే మన దేశంలో 40 శాతం మాత్రమే ఉన్నారు. చదవుకుంటున్న వారు 32 శాతం, అందులోనూ ఉన్నత విద్యకు వెళ్తున్న వారు ఎంహెచ్‌ఆర్‌డీ నివేదిక ప్రకారం 25.2 శాతం మాత్రమే. పీహెచ్‌డీ స్థాయికి వెళ్తున్న వారు భారత్‌లో 2 శాతం మాత్రమే. ఈ గణాంకాలు చూస్తుంటే ఎందుకీ దుస్థితి అని అనిపించకమానదు. దీనిని అర్థం చేసుకోవాలంటే మూలాలను దర్శించాలి. చారిత్రక పరిణామక్రమాన్ని అర్ధం చేసుకోవాలి.
భారత్‌లో అక్షరాస్యత ఎంత?
స్వాతంత్య్ర సమయానికి భారత్‌లో అక్షరాస్యత 12 శాతం మాత్రమే. అక్షరాస్యత సామాజిక ఆర్థిక పురోగతికి చాలా కీలకం. నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాలు అన్నీ 2008 జూన్ నాటి అధ్యయనం నాటివే. 2019 నాటి గణాంకాల ప్రకారం అక్షరాస్యత పెరిగి ఉండొచ్చు గాక, 2009లో పురుషుల్లో 76.9 శాతం కాగా, స్ర్తిలలో 54.5 శాతం మాత్రమే. 2011 గణాంకాల ప్రకారం పురుషుల అక్షరాస్యత 80.9 శాతం కాగా స్ర్తిల అక్షరాస్యత 64.60 శాతం. ఇంకా మరింత వివరంగా గణాంకాల్లోకి వెళ్తే బాధ మాత్రమే మిగులుతుంది.
భారతదేశం ప్రగతి సాధించిందా లేదా అంటే సమాధానం చెప్పడానికి ఎలాంటి సంశయం అక్కర్లేదు. విజ్ఞాన శాస్త్ర రంగంలోనూ, అంతరిక్ష సత్తా, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలోనూ, వ్యవసాయ ఉత్పత్తుల్లో , ఎగుమతుల్లో, వాణిజ్యంలోనూ, అణురంగంలోనూ, సైనిక సామర్థ్యంలో భారతీయుల ప్రగతి అనన్య సామాన్యం. ఇది ప్రపంచం వేనోళ్లా కొనియాడే విషయమే.
అయినా నూరు శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం నెరవేర్చుకోలేకపోయాం. ప్రపంచ పటంలో భారతీయ విశ్వవిద్యాలయాలు శాశ్వతంగా తమదైన ముద్ర వేయలేకపోయాయి. చదువులకు చిట్టచివరి గమ్యం భారతదేశమే అనే భావనను పాశ్చాత్యదేశాలకు కలిగించలేపోయాం. అత్యుత్తమ చదువులకు ఏ దేశం వెళ్లాలి అని ఆలోచించే దగ్గరే భారతీయులు ఉండిపోయారు. మన దేశంలోనే, మన పక్కనే మనం కోరుకునే విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఎందుకు లేవు? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికపుడు పుట్టిన దేశాలు లేదా చిటికెనువేలులా ఉండే అతి చిన్న దేశాలు విద్యారంగంలో అనూహ్య విజయాలు సాధిస్తున్నాయి. మనం ఎందుకు ఆపని చేయలేకపోతున్నాం? దీనికి స్పష్టమైన సమాధానం ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు, సామాజిక పరిణామక్రమం, అంతర్గత సంక్లిష్ట జాతి ఔన్నత్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కనుక.
వాస్తవానికి కొన్ని శతాబ్దాల క్రితమే విద్యారంగంలో ప్రపంచానికి మార్గం చూపిన నాయకత్వం మన దేశానిదే. ఇపుడు అందరి బాధా అదే, అలాంటి దేశానికి ఇపుడు ఏమైంది?
భారతదేశానికి ఎలా చూసుకున్నా ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతీయ విద్యావిధానానికి కూడా అంతే చరిత్ర ఉంది. దేశ చరిత్రను స్థూలంగా ప్రాచీన, మధ్య, ఆధునిక యుగంగా చూసుకుంటే క్రీశ 11వ శతాబ్దం వరకూ ప్రాచీన యుగంగా చెప్పవచ్చు. ఆ యుగంలో హిందూ విద్యా విధానం ప్రముఖ స్థానం పొందింది.
చదువుల చరిత్రేమిటి?
క్రీ.శ. ఆరో శతాబ్దంలోనే హిందూ మతానికి ప్రత్యర్థులుగా బౌద్ధ, జైన్ మతాలు ప్రచారం పొందాయి. బౌద్ధమతాధారంగా బౌద్ధ సంప్రదాయ విద్యావిధానం రూపొందింది. 11 వ శతాబ్దంలో మహ్మదీయ దండయాత్రలు ప్రారంభం అయ్యాయి. ఫలితంగా ఇస్లాం మతం కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రచారం పొందింది. ముస్లిం సంప్రదాయ విద్యా విధానం కూడా దేశంలో ప్రారంభం అయింది. కొంత హెచ్చుతగ్గులుగా వివిధ కాలాల్లో తొలుత హిందూ, బౌద్ధ, జైన్ విద్యా విధానాలు, 11వ శతాబ్దం తర్వాత హిందూ, మహ్మదీయ సంప్రదాయ విద్యా విధానాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి.
ఇక మధ్య యుగ చరిత్ర చూస్తే 17వ శతాబ్దంలో పాశ్చాత్యులు వర్తకం కోసం దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా వీరు దేశ రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యాధికారాన్ని సంపాదించారు. వీరిలో బ్రిటిష్ వారిది పైచేయి అయింది. చివరికి బ్రిటిష్‌వారి ఆధీనంలోకి భారత్ వెళ్లిపోయింది. బ్రిటిష్‌వారి ఏలుబడిలో స్వదేశీ సంప్రదాయ హిందూ, బౌద్ధ విద్యల తర్వాత మధ్యయుగంలో వచ్చిన మహ్మదీయ విద్యావిధానం కూడా క్రమేపీ అంతరించి క్రైస్తవ మిషనరీలు రంగంలోకి వచ్చాయి. 17వ శతాబ్దంలో భారత్‌లో దిగుమతి అయిన పాశ్చాత్య విద్యావిధానం దినదినాభివృద్ధి పొందుతూ వచ్చింది.
వేదాలు, వేదాంగాల నుండి ఉపనిషత్తులు, ఇతిహాసాల నుండి ఎంతో జ్ఞానాన్ని గ్రహించిన మనమే, తిరిగి పాశ్చాత్య విద్యపై ఆధారపడి ఆ దిశగా పయనించాల్సి వచ్చింది. చారిత్రక సత్యాల ప్రకారం రుగ్వేదకాలంలోనే స్థూలంగా పని విభజన జరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలతో కూడిన చాతుర్వర్ణ సమాజం ఏర్పడింది. కానీ తర్వాతి కాలంలో ఈ కుల విభజన స్థిరత్వం ఏర్పరచుకుంది. కులాన్ని జన్మతో ముడిపెట్టడం ప్రారంభమైంది. చాతుర్వర్ణాల ధర్మాలు కూడా నిర్ణయించారు. ఆయా ధర్మాలను నిర్వర్తించడానికి కావల్సిన జ్ఞానాన్ని వైదిక సమాజంలో వ్యక్తి అభ్యసించాలనే సామాజిక కట్టుబాట్లు మొదలయ్యాయి.
సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించినట్టే జీవితాన్ని కూడా నాలుగు దశలుగా విభజించారు. శిశువు ఐదేళ్లు గడచిన తర్వాత ఏడేళ్లలోపు ఉపనయనం, అనంతరం బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభించి 18వ సంవత్సరం వరకూ గురువు సన్నిధిలో విద్యాభ్యాసం కొనసాగించేవారు. ఈ దశలో లౌకిక జీవనం సుఖమయం చేసుకుని సమాజంలో వ్యక్తి తన విధులను సక్రమంగా నేర్చుకోవడానికి తగిన విద్యాబోధన, ముక్తిమార్గానే్వషణకి పునాది వేసేవారు. చివరకి సమవర్తనోత్సవం (స్నాతకోత్సవం)లో పాల్గొని గురుదక్షిణ ఇచ్చి గురువు దగ్గర ప్రతిజ్ఞ తీసుకుని బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి గృహస్తాశ్రమంలోకి విద్యార్థి ప్రవేశించేవాడు. తాను నేర్చిన విద్యను ఆచరణలో పెట్టి అందులోని లోటుపాట్లను గ్రహించేవాడు. ఈ కాలంలోనే వ్యక్తి ఆచార్యత్వాన్ని స్వీకరించేవాడు. తనకు లభ్యమైన విశ్రాంతిని విజ్ఞానాభివృద్ధికి, నూతన విద్యానే్వషణకు, విజ్ఞాన వినియోగానికి, శిష్యుల ద్వారా నిత్యం సంఘంలో పరిస్థితులను తెలుసుకోవడానికి సమాజ కళ్యాణానికి పాటుపడేవారు. ఆధ్యాత్మిక దృక్పథం సన్నగిల్లి సమాజంలో కర్మకాండకు, ఆచార వ్యవహారాలకు అధిక ప్రాధాన్యం రాగానే మఠాధిపతులు, రాజ్యాధిపతులు విద్యావ్యవస్థను దారిమళ్లించారు. ఈ క్రమంలోనే లౌకిక విద్యావిధానం అనేది అమలులోకి వచ్చింది. హిందూ విద్యావిధానానికి రెండు ఆశయాలు ఉండేవి. 1. ఐహికం, 2. ఆముష్మికం. ఐహిక జీవనానికి, సమాజంలో సంఘజీవనానికి అపరావిద్య, పరలోక సంబంధమైన అంశాలకు పరా విద్య ఉండేవి. ప్రాచీన ఆర్య సంప్రదాయ విధానంలో విద్యా బోధన ప్రధానంగా వౌఖికంనూ, శ్రవణం ద్వారా సాగేది. అపుడే వల్లెవేసే పద్ధతి మొదలైంది.
సాముదాయక బోధన
ప్రాచీన విద్యా విధానంలో సాముదాయక బోధన లేదు. వైయక్తిక విద్యి బోధనలో వ్యక్తి అభివృద్ధికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యం ఉంటుంది. సుశిక్షితుడైన వ్యక్తి మాత్రమే సమాజంలో తన హక్కులను సమాజం పట్ల తన బాధ్యతలను అవగాహన చేసుకోగలుగుతాడు. అందుకే ప్రతి వ్యక్తికీ అన్ని అవకాశాలూ అందుబాటులోకి తీసుకురాగలిగితే పరసరంలోని ,సంఘంలోని ఎటువంటి ఆటంకం లేక భౌతిక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక సంభావ్యతలను అలవరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనినే జీవశాస్తవ్రాదులు, ప్రకృతి వాదులు, మరో విజ్ఞాన శాస్తవ్రాదులు, ఆధ్యాత్మిక వాదులు, ప్రగతిశీల వాదులు తమదైన శైలిలో చెప్పారు. ప్రాచీన విద్యలో ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ప్రతిభ ఉన్న కొందరు విద్యార్థులు బోధన కార్యక్రమంలో పాల్గొనే వారు. ఈ పద్ధతిలో తరగతులను నిర్వహించడాన్ని పాశ్చాత్యదేశాల్లో మానిటోరియల్ సిస్టం అని పిలిచేవారు. 18వ శతాబ్దంలో మద్రాసులో పనిచేసిన బెల్ అనే ఆయన ఈ పద్ధతిని మనదేశంలో
చూసి, ఇంగ్లాండ్‌లో దీనిని ప్రవేశపెడితే తక్కువ ఖర్చుతో సార్వజనీన విద్యను అందించగలమని ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఈ పద్ధతినే ఇంగ్లాండ్‌లో బెల్ సిస్టం అనే పేరుతో ప్రచారం పొందింది. తర్వాతర్వాత అనేక పరిణామాల అనంతరం ఆంగ్లేయుల పాలనలో పాశ్చాత్య విద్యావిధానం అమలులోకి వచ్చింది.
కంపెనీ నిబంధనల చట్టం
నిర్దిష్ట కాలక్రమ పట్టిక, ప్రత్యేక పాఠ్య విషయాలు, ప్రత్యేక ఉపాధ్యాయుల నెల వారీ వేతనాలపై ఉపాధ్యాయుల నియామకం, విద్యార్జనకు ఫీజులు కట్టడం, సాలుసరి పరీక్షలు, ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతి వంతున విద్య నిచ్చెన మెట్లు ఎక్కడం, విద్యా విధానంపై ప్రభుత్వ పర్యవేక్షణ ప్రారంభం అయ్యింది. క్రీ శ 1600 నాటికే ఫ్రెంచి, డచ్చి, బ్రిటిష్ వర్తకులు భారతదేశంలో వ్యాపారాభివృద్ధికి పోటీపడ్డారు. మొగలాయి పాలకులను, హిందూ సంస్థానాదీశులను ఆశ్రయించి, కలకత్తా, ముంబై, చెన్నై మొదలైన కీలక ప్రాంతాల్లో గిడ్డంగులు స్థాపించారు. ఈ గిడ్డంగుల రక్షణకు ఉసైనికులు, వారి అధ్యాత్మిక జీవన క్రమానికి వారితో పాటు క్రైస్తవ మత ప్రచారకులు దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 18వ శతాబ్దంలో తూర్పు ఇండియా కంపెనీ దేశరాజకీయాల్లో ప్రవేశించి ఇతర పాశ్చాత్య వర్తక సంఘాలను అణిచివేయగలిగింది. దేశంలో కంపెనీ నిబంధనల చట్టం-1813 అమలులోకి రావడంతో విద్యా విధానం గాడితప్పి కొత్త రూపానికి సంతరించుకుంది. విద్యా సంఘాలకు కంపెనీ కొత్త చట్టం ప్రకారం ఏటా లక్ష రూపాయిలు గ్రాంట్ ఇవ్వడానికి నిశ్చయించింది. దీంతో కంపెనీ సూత్రం ప్రకారం భారతదేశంలో సంస్కృతీ సాహిత్యాల వికాసానికి, పండితుల పోషణకు శాస్త్ర విజ్ఞాన బోధనలకు ఏటా లక్ష రూపాయలు ఖర్చు చేయాలి, ఈ గ్రాంట్ భారతీయ సాహిత్య వికాసానికి ఖర్చుచేయాలా లేక ఆంగ్ల సాహిత్య వికాసానికి ఖర్చు చేయాలా కంపెనీ ప్రోత్సహించాల్సింది ప్రాగ్విజ్ఞానమా (ఓరియంటల్ నాలెడ్జి), లేక పాశ్చాత్య విజ్ఞానమా? విజ్ఞాన బోధన భారతీయ భాషల్లో కొనసాగాలా? లేక ఆంగ్లంలో కొనసాగాలా? అనే మీమాంస ఏర్పడింది. 1935లో మెకాలే ప్రతిపాదనలు వచ్చాయి. 1854లో ఉడ్ నివేదిక ప్రకారం విద్యను నిర్ణీత శ్రేణుల్లో విభజించాలని నిర్ణయించారు. 1882లో హంటర్ నివేదిక, 1902లో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ నివేదికలు విద్య రూపాన్ని పరిశుద్ధం చేశాయి. దేశంలో కొత్త విశ్వవిద్యాలయాలు నెలకొల్పాలని, వర్శిటీలకు సిండికేట్‌లు ఉండాలని, సెనేట్‌లు ఉండాలని, పరీక్ష విధానంలో మార్పులు అవసరమని, అనుబంధ కాలేజీలను అనుమతించేటపుడు వర్శిటీల పాత్ర కూడా నిర్దేశించారు.
ఆనాటి పరిస్థితి మరీ ఘోరం
1872 గణాంకాల ప్రకారం భారత్‌లో అక్షరాస్యత 3.2 శాతం, 1881నాటికి 4.32, 1891 నాటికి 4.62 ఉంది. 1901 గణాంకాల ప్రకారం అక్షరాస్యత పరిశీలిస్తే మద్రాస్‌లో సగటున 11 శాతం, ముంబైలో 11, బెంగాల్‌లో 10, అస్సాంలో 6 శాతం, పంజాబ్‌లో 6 శాతం, సెంట్రల్ ప్రోవిన్స్‌లో 5 శాతం మాత్రమే. 1911లో 5.9 శాతం, 1921లో 7.2 శాతానికి, 1931 నాటికి 9.5 శాతానికి 1941 నాటికి 16.1 శాతానికి పెరిగింది. 1951 నాటికి సగటు అక్షరాస్యత 18.33 శాతానికి పెరిగింది. 1961లో 28.3 , 1971లో 34.45, 1981లో 43.57, 1991లో 52.21, 2001లో 64.83, 2011లో 79.31 శాతానికి పెరిగింది.
లెక్కలేనన్ని కమిషన్లు
1904లో భారతీయ విశ్వవిద్యాలయ చట్టం అమలులోకి వచ్చింది. 1917లో సర్ మైఖేల్ శాడ్లర్ కమిషన్ నివేదిక ఆధారంగానే అన్ని వర్శిటీలో బోధన వనరులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పాఠశాల స్థాయి నుండి విద్యలో వౌలికమైన మార్పులు చేయాలని, రెండేళ్ల ఇంటర్మీడియట్‌ను డిగ్రీ కాలేజీల నుండి విడదీయాలని నిర్ణయించారు. 1929లో హర్టాగ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రాథమిక విద్యలో వృథా, స్తబ్దతపై దృష్టి పెట్టారు. 1937 ఎబట్, ఉడ్ నివేదికలలో సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్యనూ ప్రోత్సహించాలని సూచించారు. వివిధ శ్రేణుల్లో వివిధ రకాలైన వృత్తి శిక్షణాలయాలను ప్రారంభించాలని పేర్కొన్నారు. 1937 నాటికి జాతీయోద్యమం పతాకస్థాయికి చేరుకోవడం, రెండో ప్రపంచ యుద్ధం, దేశంలో రాజకీయ సాంస్కృతిక గందరగోళం మధ్య కేంద్ర విద్యా సలహా పరిషత్ సర్ జాన్ సార్జంట్‌ను ఆహ్వానించి యుద్ధానంతరం విద్యాభివృద్ధి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించమని కోరింది. ఈ ప్రణాళికను ఆయన 1944లో అందజేశారు.8 నుండి 14 ఏళ్ల బాలురకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని సార్జంట్ సూచించారు. వికలాంగుల విద్యపైనా దృష్టి పెట్టాలని, సాధారణ విద్య నుండి సాంకేతిక విద్యకు మారేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. సార్జంట్ నివేదిక ఆధారంగానే ఏఐసీటీఈ, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సార్జంట్ నివేదిక చాలాకాలం పాటు మార్గదర్శకంగా ఉంది.
ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఎఐసీటీఈ తరహాలో ఎన్‌సీటీఈ వంటి అపెక్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. నాణ్యతా పరిరక్షణకు ఎన్‌బీఏ, నేక్ సంస్థలు, పుస్తకాల పాఠ్యప్రణాళిక రూపకల్పనకు ఎన్‌సీఈఆర్టీ, పరీక్షల నిర్వహణకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు, గణాంకాల రూపకల్పనకు నీపా, వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇలా విద్యారంగంలో ప్రతి విభాగాన్ని పరిరక్షించేందుకు, పర్యవేక్షించేందుకు నియంత్రణ మండళ్లు, వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి.
యునెస్కో ప్రకటన
1948లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలో భాగంగా ఆర్టికల్ 26 ని రూపొందించి ప్రపంచ దేశాల ఒడంబడికల జాబితాలో చేర్చింది. దాని ప్రకారం మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దేందుకు ప్రాధమిక విద్య ఉచితంగా సాగాలి, నిర్బంధంగా అందరికీ అందించాలి. ఈ నిబంధన నేటికీ మన దేశంలో పరిపూర్ణంగా అమలుకునోచుకోలేదు.
స్వాతంత్య్రానంతరం విద్యావ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నాలు జరిగాయి. వాటిలో విశ్వవిద్యాలయాల కమిషన్ (రాధాకృష్ణన్ కమిషన్) -1947, మాధ్యమిక విద్యా కమిషన్ (డాక్టర్ ఏ లక్ష్మణ్‌స్వామి ముదిలియార్ కమిషన్)-1952, 1956-57లో అఖిల భారత స్థాయిలో మొట్టమొదటి విద్యా సర్వే, 1967లో రెండో విద్యా సర్వే, 1973లో మూడో విద్యా సర్వే, 1978లో నాలుగో విద్యా సర్వే, 86లో ఐదో విద్యా సర్వే, 1993లో ఆరో విద్యా సర్వే దేశంలో విద్యాస్థితిగతులను కళ్లకుకట్టినట్టు వివరించాయి. జాతీయ విద్యా కమిషన్ (కొఠారీ కమిషన్)-1964 ముఖ్యమైనవి. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక విద్యా సమస్యలపై కూడా ఇంకొన్ని సంఘాలను నియమించారు.
అంతర్జాతీయంగా సైతం యునెస్కో, ఐక్యరాజ్యసమితిలు విద్య సంవర్ధనపై ఎన్నో కమిటీలను నియమించాయి. అంతర్జాతీయ ఒప్పందాలను ఏర్పాటు చేశాయి. యునెస్కో ఎప్పటికపుడు ఖండాల వారీ, దేశాల వారీ విద్యావ్యాసంగం ఎలా ఉందో వివరించే నివేదికలను రూపొందించింది. వాటిని గమనంలో ఉంచుకునే జాతీయ స్థాయిలో అనేక కమిటీలు పనిచేశాయి. స్థానిక అవసరాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిఫార్సులు చేశాయి. 21వ శతాబ్దంలో విద్యావిధానం ఎలా ఉండాలనేదానిపై జాక్వస్ డెలార్ 1996లో ఇచ్చిన నివేదిక ప్రాతిపదికగా యునెస్కో అనేక సంస్కరణలకు నడుం బిగించింది.
అంతర్జాతీయంగా కొనసాగుతున్న కృషిలో భాగంగానే భారత్‌లో 1968లో జాతీయ విద్యావిధానం, నవీకరించిన జాతీయ విద్యా విధానం, 1985లో ప్రొఫెసర్ డీపీ ఛటోపాధ్యాయ నేతృత్వంలోని కాన్‌పోలిస్ కమిటీ, 1992లో జనార్ధనరెడ్డి కమిటీ నివేదిక, 2001లో సర్వశిక్షా అభియాన్, 2005లో నేషనల్ నాలెడ్జి కమిషన్ నివేదికలు, 2009లో నిర్బంధ ఉచిత విద్య హక్కు చట్టం, ప్రొఫెసర్ యుశ్‌పాల్ కమిటీ నివేదిక, బీజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన నూతన విద్యావిధాన పత్ర రూపకల్పన కమిటీలు చాలా ముఖ్యమైనవి.
ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలు ఆధారంగా అనేక మార్పులూ, చేర్పులూ జరిగాయి. విద్యావిధానంలో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ , పూర్వ విద్య, ప్రాధమిక విద్య, మాధ్యమిక విద్య, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు వచ్చాయి. వయోజన విద్య, బాలికా విద్య, నిమ్నవర్గాల విద్య, అల్పసంఖ్యాక వర్గాల విద్యకు కొత్త కొత్త పథకాలు అమలుచేశారు. నూతన విద్యా విధానం
నూతన విద్యావిధానానికి తుది రూపం ఇచ్చేముందు జాతి ఆలోచనలను కోరింది. గత ఐదేళ్లుగా దీనిపై కసరత్తు నడిచింది. నాటి కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ కమిటీ రిపోర్టు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మరింత సమగ్రత కోసం శాస్తవ్రేత్త డాక్టర్ కే కస్తూరిరంగన్ అధ్యక్షతన నూతన విద్యా విధాన రూపకల్పన కమిటీని నియమించింది. ఈ కమిటీ హేమాహేమీలతో భేటీ అయ్యింది. జయప్రకాశ్ నారాయణ, పీ రామారావు, జేఎస్.రాజ్‌పుత్, విజయ్ కేల్కర్, అనిరుధ్ దేశ్‌పాండే, దినేష్‌సింగ్, మోహన్‌దాస్‌పాయ్ వంటి వారితో సమాంతరంగా చర్చించింది. దేశవ్యాప్తంగా 70కి పైగా వర్కుషాప్‌లను నిర్వహించింది. పూర్వ విద్య, భాషలు, ఉపాధ్యాయ విద్య , ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పాఠశాల నిర్మాణం, విద్యాసాంకేతికత, నేషనల్ రీసెర్చి ఫౌండేషన్, రాష్ట్రీయ శిక్షా ఆయోగ్, విద్యాసంస్థలకు ఆర్ధిక సహకారం అందించడంపై కమిటీ నివేదిక ఇచ్చింది. 2019 జనవరి 3న నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టంలోని క్లాజు 16ను పార్లమెంటు సవరించింది. దీని ప్రకారం గతంలో సడలించిన నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. రాష్ట్రాలు డిటెన్షన్ పద్ధతిని కొనసాగించేందుకు ఇపుడు వీలు కలిగింది. పరీక్షలు లేకుండా ప్రతిభ ప్రామాణికం కాకుండా పదో తరగతి వరకూ పదోన్నతి కల్పించడం అనేక అనర్థాలకు దారితీస్తోందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యారంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయడం లేదా అనే అనుమానాలు అక్కర్లేదు. విద్యకు కేంద్రం ఏటా 92 వేల కోట్ల వరకూ వెచ్చిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం 12,200 కోట్లు, ఆంధ్రా ప్రభుత్వం 33 వేల కోట్లు కేటాయించింది. ఈ డబ్బులు ఏమైపోతున్నాయి...? ఇదే అందరి ప్రశ్న. విద్యా రంగం బహుముఖీనమైదని, అధ్యాపక విద్య, పరీక్షలు, సంస్కరణలు, ఆధునిక బోధన పద్ధతులు, డిజిటల్ అభ్యాసం, సమాన విద్యావకాశాల కల్పన, భాషా సమస్యలు, విద్యాప్రణాళికల అమలు, జనాభా అధ్యయనం, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న నూతన సవాళ్లు, ప్రయోగాత్మక ప్రాజెక్టులు, నూతన విధానాల అమలు ఇలా ఎన్నో అంశాలను స్పృశించాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రి ఫలితాలు సాధన అసాధ్యం కావచ్చు కానీ సంకల్పం ఉంటే నూరు శాతం అక్షరాస్యత ఎంతో దూరంలో లేని సుసాధ్యమైన అంశమే.
*
ఎన్ని భాషలున్నాయి?
ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో గణాంకాల ప్రకారం 6500 గుర్తించదగిన భాషలున్నాయి. లెక్కల్లో లేని భాషలు లక్షల్లో ఉన్నాయి. వీటిలో పురాతనమైనవి సంస్కృతం, బాబిలోనియా, ప్రాచీన ఈజిప్టు భాషల పేర్లు చెప్పవచ్చని న్యూకేజిల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ మ్యాగీ టెల్లర్‌మాన్ అంటున్నారు. ఇపుడు మనం ప్రాచీన భాషలు అని చెప్పుకుంటున్నవి ఏవీ వాస్తవానికి 6వేల ఏళ్ల క్రితం లేనేలేవు. కానీ అంతకంటే ముందే అంటే 50 వేల సంవత్సరాల క్రితమే భాష ఉందనేది నిర్ధారణ కాని అంశం. ఎఫ్‌ఓఎక్స్‌పీ2 అనే జన్యువు మాటలు రావడానికి ఉపయోగపడుతుంది. ఇది వానరాల్లో కూడా ఉంటుంది, అయితే కొంచెం మార్పులతో మనుష్యుల్లో ఉంటుంది. మాట ఉందంటే క్రమం లేకున్నా భాష ఉన్నట్టే. భాష ఉందంటే భావం ఉన్నట్టే, భావం ఉందంటే అర్థం చేసుకోవడం మొదలైందనే చెప్పాలి, అర్థం చేసుకోవడం అంటే అభ్యాసంగానే పరిగణించాలి.