S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏది గమ్యం?

తెల్లవారుజాము నాలుగున్నర సమయంలో ఆనందరావు విశాఖపట్నం వెళ్ళడానికి ముమ్మిడివరం బస్‌స్టాప్‌లో తానె్కవలసిన బస్‌కోసం ఎదురుచూస్తున్నాడు. ముందురోజు ఉదయం తొమ్మిది గంటలకే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుసుకున్నాడు. అప్పటికే ముందున్న విండో సీట్లన్నీ రిజర్వేషన్ అయిపోవడంతో పద్దెనిమిదో నెంబర్ గల విండో సీట్ ఎంచుకుని టికెట్ బుక్ చేసుకున్నాడు. అమలాపురంలో నాలుగు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరే ఆ ఎక్స్‌ప్రెస్ ముమ్మిడివరంలో తానెక్కే సమయం నాలుగున్నరని తనకు పంపిన టికెట్ మెసేజ్‌లో వుంది. పావు తక్కువ నాలుగు గంటలకు ఆర్టీసివారి నుంచి తన సెల్‌కు మరో సమాచారం వచ్చింది. తానెక్కే స్టాప్‌కు బస్ చేరే సమయంకన్నా పావుగంట ముందు తాను స్టాప్‌లో ఉండాలని తెలియజేస్తూ, అవసరమైతే మాట్లాడడానికి డ్రవర్ సెల్ నెంబర్‌ను పొందుపరిచిన సమాచారముంది. బస్ ఎక్కడుంది? తామున్న స్టాప్‌కు ఎప్పుడు వస్తుందని డ్రైవర్‌కు కాల్ చేసి విసిగిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో కాల్‌చేయడానికి ఉపయోగపడే డ్రైవర్ నెంబర్‌ను ఆర్టీసీవారు కొన్నాళ్ళ తర్వాత మెసేజ్ చేయడం మానేసేలా చేసుకున్నారు ప్రయాణీకులు. మనదేశంలో దేన్నైనా సద్వినియోగం చేసుకోవడంకన్నా దుర్వినియోగం చేసుకోవడమే ఎక్కువన్నది మరోసారి రుజువైంది. అప్పటికింకా డ్రైవర్ నెంబర్‌ను మెసేజ్ చేయడం అవలేదు కాబట్టి, ఆనందరావు దగ్గర డ్రైవర్ నెంబర్ ఉంది. నాలుగున్నరకు రావలసిన బస్ పావుతక్కువ ఐదు గంటలకు కూడా రాకపోవడంతో ఆనందరావుకు కూడా డ్రైవర్‌కు కాల్ చేయాలన్న ఆలోచన వచ్చింది. కాని, అతని వివేకం మేల్కొని, అయితే మరో పది నిమిషాలు ఆలస్యం అవుతుంది, డ్రైవింగ్‌లోనో, టికెట్లు ఇస్తూనో, టికెట్లను చెక్ చేసుకుంటూనో బిజీగా ఉండే డ్రైవర్‌కు అసౌకర్యం కలిగించడం భావ్యం కాదని, మరీ ఆలస్యం అయితే, అప్పుడు కాల్ చేద్దామనుకుని, అక్కడున్న ఓ సిమెంట్ దిమ్మ మీద కూర్చున్నాడు.
అలా కూర్చున్న ఐదు నిమిషాలకే బస్ వచ్చింది. అతన్ని చూసి డ్రైవర్ బస్ ఆపాడు. అతను మెట్లెక్కి, తనది పద్దెనిమిదో నెంబర్ సీటని చూపించాడు. డ్రైవర్ మెసేజ్ చెక్ చేసుకుని, సెల్ తిరిగిచ్చి, గేర్ మార్చాడు. ఆనందరావు తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. బస్ వేగం పుంజుకుంది. కొద్దిగా తెరిచున్న కిటికీలోంచి చలిగాలి వీస్తుంటే, దాన్ని పూర్తిగా మూసివేశాడు. రోడ్ బాగోకపోయినా పది నిమిషాల్లో బస్ ఎనిమిది కిలోమీటర్లు పయనించి, మురమళ్ళ మాణిక్యంబ అమ్మవారి గుడి దగ్గరకు చేరుకుంది. బస్ ఆగగానే అప్పటికింకా పాసింజరేదీ రాకపోవడంతో తెల్లవారు జామున ప్రయాణం పెట్టుకున్న ఐదుగురారుగురు డోర్ దగ్గరకు వచ్చారు. సీట్లు ఖాళీ లేవని చెప్పి రిజర్వేషన్ చేయించుకున్న వ్యక్తికి దారిమన్నాడు డ్రైవర్. ఓ పెద్దాయన బస్ ఎక్కాడు. డ్రైవర్‌కు మెసేజ్ చూపించిన తర్వాత తన సీటు వెదుక్కుంటూ ఆనందరావు సీటు దగ్గరకు వచ్చాడు. కదులుతున్న బస్‌లో ఆయన పడుతున్న ఇబ్బంది చూసి, ‘సీటు నెంబర్ ఎంతండి?’ అన్నాడు ఆనందరావు.
‘పదిహేడు’ జవాబిచ్చాడు పెద్దాయన.
ఆనందరావుకు విషయం అర్థమైంది. అంతకుముందు తన సీట్లో కూర్చుని, తను అది తన సీటని చెప్పిన తర్వాత తన సీటు తనకిచ్చి ప్రక్క సీట్లో కూర్చున్న వ్యక్తిది పదిహేడో నెంబర్ సీటు కూడా కాదని గ్రహించి, ‘పదిహేడైతే ఇదేనండి!’ అని తన ప్రక్క సీటు చూపించాడు.
ప్రక్కతనులేచి నుంచుంటుంటే ‘మీరు రిజర్వేషన్ చేసుకోలేదా?’ అని ఆనందరావు అడిగాడు.
‘‘లేదండి. కాకినాడలో సీట్లు ఖాళీ అవుతాయని డ్రైవర్ చెప్పాడు. అందాకా ఈ సీటు ఖాళీగా ఉంటే కూర్చున్నాను’’ అన్నాడు.
అతను లేవగానే పెద్దాయన తన సీట్లో కూర్చున్నాడు. నిలబడి బస్‌కు రెండు వైపు వున్న లగేజీ బెడ్లను పట్టుకుని, బస్ కదలికలకు అటు ఇటూ, ముందుకు వెనుకకు ఊగుతున్న వ్యక్తిని చూసి కాస్త జాలిపడ్డాడు ఆనందరావు.
పెద్దాయన ఎవరికో ఫోన్ చేసి మాట్లడుతున్నాడు. ‘బస్ ఎక్కాను’.
‘‘ఆ.. ఆ.. ఎక్కావు కదా! మా నిద్ర పాడుచేయడానికి ఎందుకు మరలా ఫోన్ చేస్తావు?’’
పెద్దాయన సెల్ ఎక్కువ సౌండ్‌లో వుండడంవల్ల ఆనందరావుకు ఆ మాటలు వినిపించాయి. అతని వైపు చెవి దగ్గర పెట్టుకునే ఆయన మాట్లాడుతున్నాడు.
‘‘సారీ చిన్నా! నన్ను చలిలో వదిలి వెళ్ళావు కదా! కంగారుపడుతున్నావేమోనని చేశాను’’
‘‘శీతాకాలం తెల్లవారు జామున చలే వేస్తాది. ఈ టైంలో వెళతానన్నది నువ్వే కదా! ఉంటాను’’.
‘‘ఈ బస్‌కు వెళితేనే అక్క ఆదివారం ఇంటి దగ్గర ఉంటుంది. పదకొండు దాటితే ఆదివారమైనా ఇంటి దగ్గర ఉండదు కదా!’’ అన్నాడు. అప్పటికే అవతల్నుంచి కాల్ కట్ అయిపోయిన విషయం ఆయనకు తెలియక చెప్పాడు. అవతల్నుంచి శబ్దం లేకపోవడంతో కొడుకు కాల్ కట్ చేశాడని అర్థమైంది. ఎర్ర బటన్ నొక్కి, మరలా పచ్చ బటన్ నొక్కి, భర్తకు విడాకులిచ్చి ఇద్దరు పిల్లలతో వైజాగ్‌లో ఉంటున్న కూతురు నెంబర్ వెదికి కాల్ చేశాడు. ఆయన కూతురుకు కాల్ చేస్తున్నాడని ఆనందరావుకు అర్థమైంది. ఇంతలో మీ మొబైల్‌లో కాల్ చేయడానికి సరిపడా బ్యాలెన్స్ లేదు, అడ్వాన్స్ టాక్ టైం కోసం..’’ అంటూ ఓ తీయని గొంతు ఆయన సెల్‌లోంచి వినబడింది. తనకదేమీ తెలీదన్నట్లు ఆయన ఎర్ర బటన్ నొక్కేశాడు.
ఆనందరావు తన సెల్ తీసి ఆయనకు చూపిస్తూ, ‘‘నా సెల్ నుంచి చేసుకోండి!’’ అన్నాడు.
పెద్దాయన ముందు కాస్త మొహమాటపడ్డాడు. ‘‘్ఫర్లేదు, చేసుకోండి!’’ అని ఆనందరావు అన్న తర్వాత ‘టచ్ సెల్ నాకు టచ్ లేదు, మీరే డయల్ చేసి ఇస్తారా?’’ అభ్యర్థించాడు.
ఆయన తన సెల్‌లో చూసి నెంబర్ చెప్పగా ఆనందరావు తన సెల్‌లో డయల్ చేసి ఆయనకిచ్చాడు. రెండుసార్లు ప్రయత్నించినా ఆయన కూతురు ఆన్సర్ చేయలేదు. ఆనందరావు సెల్ తీసుకుని జేబులో వేసుకుని, సీటు బటన్ నొక్కి వెనక్కు పుష్ చేసి పడుకుని, నిద్రకుపక్రమించాడు. ఐదు నిమిషాల్లో నిద్రలోకి వెళ్లిపోయాడు. ప్రక్కన పెద్దాయన నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న విషయం అతనికి తెలీదు.
‘కాకినాడ దిగండి’ అన్నాడు డ్రైవర్ కాకినాడలో దిగవలసినవారు ఎవరైనా నిద్రపోతున్నారేమోనని. దిగేవాళ్ళు దిగారు. ఎక్కేవాళ్ళు ఎక్కారు. ఈ అలికిడికి ఆనందరావుకు నిద్రాభంగం అయింది. పెద్దాయన సీటు ప్రక్కన నుంచున్న వ్యక్తి ముందుకెళ్లి ఖాళీ అయిన సీట్లో కూర్చున్నాడు. అతనికి సీటు దొరికినందుకు ఆనందరావు ఆనందించాడు. తన సీట్లోంచి అతన్ని లేపేసినందుకు ఎందుకో గిల్టీగా అనిపించింది. ఇపుడు అతనికి సీటు దొరికింది కాబట్టి తనకు గిల్టీనెస్ పోయింది.
బంగాళాఖాతంలోంచి రవి లేవడానికి ప్రయత్నిస్తున్నట్లున్నాడు. ఆరు అవడానికి కొన్ని నిమిషాలే వున్నప్పటికీ శీతాకాలం కావడంతో చలికి బద్ధకంగా ఉండి లేవలేకపోతున్నాడు. నీటిలోంచి బయటకు వస్తే చలి వేస్తుంది మరి! ఆనందరావు మరలా నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ప్రక్కనున్న పెద్దాయన్ని చూశాడు. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నాడు. ఏంటన్నట్లు ఆయన కళ్ళలోకి చూశాడు. ఆయన తల అడ్డంగా ఊపాడు. కాని కుడి అరచేతిని గుండెలమీద ఎడమ ప్రక్కన వేసుకుని నిమురుకుంటున్నాడు. ఆనందరావుకు ఏదో అనుమానం వచ్చింది. ‘గుండెల్లో నొప్పిగా ఉందా?’ అన్నాడు ఆయన వైపు చూస్తూ.
‘‘కాస్త నొప్పిగానే ఉందండి. రాత్రి పాలకూర వేపి పెట్టింది మా కోడలు. గ్యాస్ నొప్పైవుంటుంది’’ అన్నాడాయన.
‘‘మంచినీళ్ళు ఇమ్మంటారా?’’ అంటూ తన కాళ్ళ దగ్గర పెట్టుకున్న చేతి సంచిలోంచి నీళ్ళ సీసా తీయబోయాడు.
‘‘నేనూ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను’’ అంటూ తన చేతి సంచిలోంచి నీళ్ళ సీసా తీసుకుని త్రాగాడాయన. నీళ్ళ చల్లదనానికి కాస్త నయమనిపించింది. వెంటనే మరింత ఎక్కువ పోటు వచ్చింది. ‘హమ్మా’ అంటూ మూలిగాడు. బాధలో అమ్మను హమ్మా అన్నాడు. ఏ వయసువారికైనా బాధ కలిగితే అమ్మనే తలుచుకుంటారు. అమ్మ పంచే ప్రేమ అటువంటిది.
‘‘కంగారుగా చూశాడు ఆనందరావు ఆయన వైపు. పరిస్థితి తీవ్రంగానే ఉందని గ్రహించాడు. ఆయన జేబులోంచి సెల్ తీసి, ‘చిన్నా’ అని వున్న కాంటాక్టు నెంబర్‌ను తన సెల్ నుంచి డైల్ చేశాడు. ఎవరూ ఆన్సర్ చేయలేదు. తన సెల్‌లో వున్న పెద్దాయన కూతురు నెంబర్‌కు చేశాడు. సమాధానం లేదు. ‘‘ఆది...వారం కదా బా..బూ! సైలెం..ట్‌లో పెట్టి పడుకుంటారు’’ అన్నాడు పెద్దాయన పళ్లమధ్య బాధను బిగపట్టి.
కిటికీలోంచి బయటకు చూశాడు ఆనందరావు. వెలుగు రేఖలు విస్తరిస్తున్నాయి. బస్ సర్పవరం జంక్షన్ దాటేసింది. లేచి డ్రైవర్ దగ్గరకు వెళ్లడానికి రెండు నిమిషాలు పట్టింది. తన ముందు సీట్లలోని వ్యక్తులు నిద్రపోతుండడంవల్ల సీట్లను ముందుకు జరపమని అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఎలాగో పెద్దాయన్ను దాటుకుని బయటకు వచ్చి డ్రైవర్ దగ్గరకు వెళ్ళేటప్పటికి అంత సమయం పట్టింది. బస్ మరో రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది.
‘‘నా పక్కసీట్లో ఆయనకు హార్టెటాక్ వచ్చినట్లుంది. బస్ వెనక్కు తిప్పండి, ఏదైనా హాస్పిటల్‌లో చేరుద్దాం’’ అన్నాడు ఆనందరావు డ్రైవర్‌కు మాత్రమే వినపడేలా.
‘‘అలా బస్‌ను వెనక్కు తిప్పే అధికారం నాకు లేదు. ముందెక్కడైనా హాస్పిటల్ ఉంటే అక్కడ చేరుద్దాం’’.
‘‘సిటీ దాటి చాలా దూరం వచ్చేసాం! హాస్పిటళ్ళు ముందెక్కడుంటాయండీ?’’
ఆనందరావు చెప్పిన దాంట్లో వున్న నిజానికి డ్రైవర్ తనకు తెలియకుండానే బస్ వేగాన్ని తగ్గించాడు. ప్రక్కకు తీసి ఆపాడు. బస్ ఆగినందుకు బస్‌లో కొందరికి చిరాగ్గా వుంది.
‘‘ఇపుడు ననే్నం చేయమంటారు చెప్పండి?’’ అన్నాడు డ్రైవర్.
‘‘తప్పదు బాబూ! జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి జాయిన్ చేయడం మన బాధ్యత. మీ పై ఆఫీసర్లు నినే్నమీ అనరు, అభినందిస్తారు. సందర్భాన్ని బట్టి రూల్స్ పాటించాలి. రూల్స్‌కన్నా ప్రాణానికి ప్రాధాన్యతనిచ్చినందుకు నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు’’. తనకన్నా చిన్న వయసు వాడు కాబట్టి, ఏకవచనంతో ప్రేమగా చెప్పాడు. డ్రైవర్ ‘సరే’ అన్నాడు.
బస్ వెనుకకు తిరిగేటప్పటికి బస్‌లో కొందరు విషయం ఏంటని ఆరాతీశారు. ‘జనరల్ హాస్పిటల్ దూరం కదా! సర్పవరం జంక్షన్‌లో మంచి ప్రైవేటు హాస్పిటల్ వుంది’ ఒకతను అన్నాడు.
‘‘ప్రైవేటు హాస్పిటల్‌లో అయితే డబ్బు కట్టాలి కదా!’’ అన్నాడు మరొకతను.
బస్‌లో లైట్లు వెలుగుతున్నాయి. అందరూ పెద్దాయన వైపు చూస్తున్నారు. ఆనందరావు ముందు సీట్ల వాళ్ళు తమ సీట్లు పైకి లేపి ఆనందరావుకు దారిచ్చారు. అతను తన సీట్లో కూర్చుని, పెద్దాయన్ని పొదివి పట్టుకున్నాడు.
‘‘వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేయండి’’ అన్నాడు ఇంకో వ్యక్తి.
‘‘ఎవరూ ఫోన్ ఎత్తడంలేదు’’ అన్నాడు ఆనందరావు. ముసలాయన అతనివైపు బేలగా చూశాడు. ఆనందరావు మనసు కదిలిపోయింది.
‘‘డ్రైవర్‌బాబూ! సర్పవరం జంక్షన్‌లోని ప్రైవేటు హాస్పిటల్ దగ్గరాపు’’ అని అరిచాడు. అందరూ ఆనందరావు వైపు ఆశ్చర్యంగా చూశారు. పెద్దాయన ఆనందంగా చూశాడు.
డ్రైవర్ సహకారంతో పెద్దాయన్ను ఆసుపత్రిలో చేర్చాడు ఆనందరావు. బస్ బయలుదేరింది. ‘‘హమ్మయ్యా! బస్ జనరల్ హాస్పిటల్ వరకూ వెళ్ళకుండా తొందరగా ముసలాయన్ని దింపేసి, వైజాగ్ వెళ్లిపోతోంది’’ అనుకుని సంతోషించారు బస్‌లోని చాలామంది. వైజాగ్ గీతమ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న తన ఏకైక కూతురుకు ఫీజు కట్టడానికి వెళుతున్న ఆనందరావు పెద్దాయనతో హాస్పిటల్‌లో ఉండిపోయాడు.
తన కూతురు, భార్య తనమీద మండిపడతారని తెలిసినా ఆనందరావు పెద్దాయనతో ఉండిపోయాడు. కాలేజి ఫీజు కట్టడానికి తీసుకెళుతున్న లక్ష రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో పెద్దాయన్ని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాడు. ఆ లక్షా ఖర్చుపెట్టేస్తే, ఆయనవాళ్ళు ఆ డబ్బు తిరిగిస్తారో లేదో తెలీదు. డబ్బు కూడా లేకుండా ఇంటికెళితే, భార్య ‘‘నీకు బుద్ధుందా లేదా?’’ అని తిడుతుంది. పెళ్ళైన దగ్గర్నుంచీ ఆమెకు పరస్పర అవగాహనతో సంతోషంగా జీవిద్దామని చాలాసార్లు చెప్పాడు గాని, ఆమె వినలేదు. ఆత్మహత్య అస్త్రాన్ని అడ్డం పెట్టుకుని అతన్ని లొంగదీసుకుంది. ఆమె తనను బెదిరించడానికే ఆ ప్రయత్నం చేస్తున్నా, పొరపాటున ఉరి బిగుసుకునో, పురుగులమందు డోసు ఎక్కువయ్యో చనిపోతే, ఆ పశ్చాత్తాపం తనను జీవితాంతం వదలదని భయపడి, అతడు ఆమెకు లొంగిపోయాడు. ఒక్క కూతురు చాలనుకుని సరిపెట్టుకుని, కూతుర్ని గారాబంగా పెంచితే తల్లితో కలిసి తన తప్పులను ఎత్తిచూపి, తండ్రి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతుంది.
ఆనందరావు బస్‌లోంచి దిగేటప్పుడు తను చేస్తున్నది ఎంతవరకూ ఒప్పు అని ఆలోచించాడు. తన కోసం ఎదురుచూసే కూతురు సమయం దాటిపోయినా తను వెళ్ళకపోవడంవల్ల కంగారు పడుతుంది. ఫోన్ చేస్తుంది.
తను కాకినాడలో ఆగిపోయిన విషయాన్ని చెబితే, ‘‘నువ్వు బస్సెక్కింది నా దగ్గరకు వచ్చి కాలేజీలో నా ఫీజు కట్టడానికి కదా! చేరవలసిన చోటుకు చేరకుండా, చేయవలసిన పని చేయకుండా ఎవరికోసమో మధ్యలో దిగిపోవడమేమిటి?’’అని చిరాకుపడుతుంది. నిజమే! తను ప్రయాణం చేస్తున్నది విశాఖపట్టణం అనే గమ్యం చేరడానికే! కాని, తాను అంతకన్నా ముందునుంచీ ఓ పెద్ద ప్రయాణం చేస్తున్నాడు. అది జీవనయానం. దానికీ ఓ గమ్యం ఉంది. మనిషిగా తాను చేస్తున్న పయనానికున్న గమ్యం మానవత్వం. యాభై ఏళ్ళు జీవితం గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాడో తెలీదు. అనే్నళ్ళు జీవించినా గమ్యం ఏమిటో తెలియకుండా జీవించేసేడు. ఉద్యోగం రాకముందు ఉద్యోగ వేట, అది వచ్చిన తర్వాత వివాహం చేసుకుని సంసార ఈత... వీటితో జీవితం గడిచిపోయింది. జీవన గమ్యం ఏమిటన్నదాని గురించి ఆలోచించనే లేదు. ఇప్పటికైనా ఆ గమ్యం తెలిసిన తర్వాత దాన్ని చేరుకునే ప్రయత్నం చేయకపోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి వుందని భావించాడు. అప్పుడతనికి విశాఖపట్టణం వెళ్లడం, కుమార్తె ఫీజు కట్టడం అన్నవి చాలా చిన్న విషయాలుగా తోచినవి. ఒకవేళ తన వద్ద వున్న డబ్బు పెద్దాయన వైద్యానికి ఖర్చైపోతే, అతని పిల్లలు ఇవవ్వకపోతే, మరలా డబ్బు ఏర్పాటుచేసుకుని ఫీజు కట్టడానికి మరికొంత ఆలస్యమవుతుంది. అది పెద్ద ఉపద్రవం ఏమీ కాదు. పెద్దాయన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోతే, అది తన జీవితంలో పెద్ద ఉపద్రవం అవుతుంది. జీవితాంతం అపరాధనాభావం తనను వేధిస్తుంది. అలా జరక్కూడదు. ఆ ఆలోచన కొండంత ధైర్యాన్ని, ఏనుగంత బలాన్ని ఇచ్చింది. పైనున్న తన బట్టల బ్యాగ్‌ను తీసుకుని ఆసుపత్రి దగ్గర దిగిపోయాడు.
పెద్దాయన్ని స్ట్రెచర్‌మీద తీసుకెళుతున్నపుడు ఆయన తన జేబులోంచి ఓ కార్డు తీసి ఆనందరావుకిచ్చి నాలుగు అంకెలు చెప్పాడు. అతని మనసు తేలికైపోయింది. కూతురు ఫీజు కట్టడానికి ఒక్క రోజుకు మించి ఆలస్యం అవదు.
ఉదయం పదిన్నరకు పెద్దాయన కొడుకు వచ్చాడు. మరో రెండున్నర గంటలకు కూతురూ వచ్చింది. వాళ్ళకు ఆయన్ని అప్పజెప్పి, బయలుదేరబోయాడు. ఆయన అతని చేయి పట్టుకున్నాడు.
‘‘కౌంటర్ దగ్గర ఓపి రాయిస్తున్నపుడు మీ పేరు రామ్మోహనరావని చెప్పారు. మా నాన్నగారి పేరూ అదే! ఆయనే మీ రూపంలో నా చేత సేవ చేయించుకుంటున్నారు అనుకున్నాను. మీరూ నన్ను కొడుకుగా భావిస్తే, నాతో మాట్లాడాలనిపిస్తే, ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి’’ అంటూ ఆయన సెల్ తీసుకుని, తన నెంబర్ అందులో టైప్ చేసి, ఏదో పేరు ఫీడ్ చేస్తున్నాడు.
‘‘ఏమని ఫీడ్ చేస్తున్నావు బాబూ?’’ అన్నారు రామ్మోహన్‌రావు.
‘‘బస్‌ఫ్రెండ్’’ అన్నాడతడు. ఆ సమయంలో ఆయన పిల్లలు ప్రేక్షకులుగా మిగిలిపోయారు. తండ్రి పేరుకే ఆనందరావు అంత విలువిస్తుంటే, తమకు జన్మనిచ్చి, ప్రయోజకులను చేసిన తండ్రికి ఎంత విలువిస్తున్నామని మనసులో తమని తాము ప్రశ్నించుకున్నారు. *
===================================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-తోట సుబ్రహ్మణ్యం