S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హిందూదేశం అనకూడదా?

ఇదెక్కడి విడ్డూరం?! కిందటి శతాబ్దం పూర్తి అయ్యేవరకూ హిందూజాతి, భారతజాతి సమానార్థకాలుగానే వ్యవహరించేవారు ఈ దేశ విద్యావంతులు. జాతిపరంగా మన దేశంలో నివసించే వారందరూ హిందువులే. మత విశ్వాసాలు, ఆరాధనలు, పారలౌకిక చింతనలు పరంగా ఆయా మతాల పరిగణనలుండేవి. మనకు స్వాతంత్య్రం సిద్ధించేదాకా పాఠశాలల, కళాశాలల వార్షికోత్సవాలలో, బహిరంగ సభా సమావేశాలలో ‘నమో హిందుమాత’ అని తాదాత్మ్యంతో దేశభక్తిగీతం, తక్కిన పాటలతో పాటుపడేవారు. నాకు పది, పదకొండేళ్ళ వయసున అంటే 1947 వరకు ఈ పాట స్వాతంత్రోద్యమ ప్రబోధగీతంగా పరిగణననీయమవుతూనే ఉండేది. ఇపుడు కొన్ని వర్గాల వారు తాము అగ్ర సెక్యులరిస్టులనుకొనేవారూ, మార్క్సిస్టులు ‘హిందూ’ అనగానే ఉలికిపడుతున్నారు.
ఖిలాఫత్ ఉద్యమంతో భారతీయులకేమీ సంబంధం లేకపోయినా మహాత్మాగాంధీ గారి పుణ్యమా అని! జాతి విద్వేష భావాలకీ దేశంలో అంకురారోపణ జరిగింది. అఖిల భారత కాంగ్రెసు వారి తొలి తొలి సమావేశాలదాకా ‘హిందూ’ పదానికి బహిష్కరణ లేకపోగా స్వాగత దీప్తులే ప్రకాశించేవి. నటేశన్ అండ్ కో వారు చెన్నపట్నం నుంచి దేశ నాయకుల చరిత్రలు చిన్న చిన్నవి ప్రకటించేవారు. ఒక పత్రిక కూడా ప్రచురించేవారు. ఆ పత్రిక పేరు ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’. దీనికి తుల్యస్థానీయంగా మన్నవ బుచ్చయ్య పంతులు నడిపిన పత్రిక ‘హిందూ జన సంస్కారిణి’. ఈ పత్రిక కొన్ని సంచికలు శ్రీ వేటూరి శంకర శాస్ర్తీగారు నాకిచ్చారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ఈ పత్రికలో ప్రసక్తమైంది. ఈ పత్రిక సుమారు 25 ఏళ్ళు వెలువడింది. బుచ్చయ్య పంతులు తర్వాత ఆయన కుమారుడు సింహాచలం పంతులు కొనే్నళ్ళు నడిపారు.
1857లో ప్రిన్సాఫ్ వేల్స్ (బ్రిటీష్ రాజకుమారుడు) భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషు బోధించే వావిలాల వాసుదేవ శాస్ర్తీ వేల్సు రాజకుమారుడి రాకను స్వాగతిస్తూ, సంస్తుతిస్తూ, బ్రిటీష్ ప్రభుత్వాన్ని పొగుడుతూ స్వాగత పద్యాలు రాసిన వీరేశలింగం పంతులు నడుపుతున్న వివేక వర్థిని పత్రికలో ప్రకటించాడు. ఆ పద్యాలలో ఇంగ్లీషువారు హిందూ దేశ ఉద్దారకులుగానే వాసుదేవశస్ర్తీ పేర్కొన్నారు.
స్వదేశీ సంస్థానాధిపతులు, పెద్ద నగరాలలో విద్వన్మండలి ‘వేల్సు యువరాజు’ రాకను హర్షాతిరేకంతో ఆమోదించారు. సన్మానాలు చేశారు. పెద్దనగరాలలో ఆయన సన్మానం కోసం పెద్ద పెద్ద విరాళాలు సేకరించారు. ఈయన కాబోయే బ్రటీష్ చక్రవర్తి అన్నమాట. అందుకే ఈ హంగామా అంతాను. ఈ సందర్భంగా లండన్‌లో రాజ వంశానికి సుగంధ లేపన సామగ్రి అందించే ‘క్రౌన్ ఫెర్మ్యూరీ కంపెనీ’వారు, ప్రిన్సాఫ్ వేల్స్ భారతదేశ సందర్శనం గురించి దేశభాషలలో ఉత్తమ గ్రంథ రచన చేసినవారికి నగదు బహుమానం ప్రకటించారు. ఈ పోటీకి ఎన్ని గ్రంథాలు వచ్చాయో, గ్రంథ ప్రాశస్త్య నిర్ణాయకులెవరో తెలియదు కాని కొక్కొండ వెంకటరత్న శర్మగారి ‘ప్రిన్సాఫ్ వేల్స్ హిందూ దేశ సందర్శన యాత్రకు’ ప్రధమ బహుమానం వచ్చింది. భారతి పత్రికలో నిడుదవోలు వెంకటరావు గారు కొక్కొండ వారి గూర్చి మూడు సంచికలలో రాసిన విపుల రచనలో ఈ వివరాలన్నీ ఉన్నాయి (1933).
సత్తిరాజు సీతారామయ్యగారు నడిపిన పత్రిక పేరు ‘హిందూ సుందరి’. ఇది ఏలూరు నుంచి వచ్చేది.
ఇవన్నీ ఇలా ఉంచుదాం. ఇప్పటికిప్పుడు ‘హిందూస్థాన్ షిప్‌యార్డ్ హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, కొమర్రాజువారి ‘హిందూ మహాయుగం’ పేర్లు మార్చేస్తారా? ఏమని మారస్తారు? అన్నిటికన్నా పాపం కమ్యూనిస్టు మహామేధావుల మెడుకు చుట్టుకునే హిందూ మహాసముద్రం పేరు ఏమని మారుస్తారు? ప్రాచీన కాలంలో ‘మహాదధి’ అని దానికి పేరట. సంస్కృతం అంటే వెర్రి చింతులు తొక్కే అభ్యుదయ దిషణాగ్రేసరులు హిందూ సముద్రం పేరు ఏమని మారుస్తారు? వింతలలో వింత ఎన్.రామ్‌గారు తమ పత్రిక పేరు ‘ది నేషన్’ అనో, ‘ది భారత్’ అనో మార్చుకోవచ్చుకదా! ఘంటాకర్ణుడు నారాయణ శబ్దం విననొల్లక చెవులకు గంటలు కట్టుకున్నట్లు ఏచూరి సీతారామ్, బృందాకారత్, ఎన్.రామ్ వర్గీయులు నెత్తి మొత్తుకుంటారేమో!
చిలకమర్తివారి పద్యం ‘హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ’ పద్యాన్ని నిషేధిస్తారా? ఇది వందేమాతరోద్యమకాలం నాటి పద్యం. ఆ తరువాత సంవత్సరం లాలా లజపతిరాయ్ మహాశయుడిని బర్మా మాండలే జైలుకు పంపే ప్రవాస శిక్ష విధించినపుడు చిలకమర్తి కరుణోద్వేగపూరితమైన పద్యాలలో హిందూదేశమనే ప్రసక్తి ఉంది. ఇట్లా 1850 నుంచి దాదాపు 1950 దాకా హిందూ సంస్కృతి, హిందూ దేశం హిందూ ధర్మమని నూరుసార్లైనా చూపగల ఆకరాలు (సోర్సెస్)న్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ వారైనా, బిజెపి వారిపైనా పడి గగ్గోలు పెడుతూ విలపించటం దేనికి?
నిజంగా బిజెపి వారికి తాదాత్మ్య దేశభక్తే ఉన్నట్లయితే ‘నమో హిందూ మాతా, సుజాత, నమో జగన్మాత అమోఘ దివ్య జ్ఞాన సమేత అఖండ వర భరతఖండ మాతా, నమో హిందూమాత’ అనే చైతన్యోద్భోక దేశభక్తి గీతాన్ని పాడుతూ దేశీయ శత్రువులను కవ్వించాలి. ఈ దివ్యగీతం రాసిందెవరో మరుగున పడిపోయింది. ఈ పాట చాలా బాగుంటుంది.
వేదుల సత్యనారాయణ శాస్ర్తీగారి రచన ఏమో అనుకోవటానికి చిరు ఆధారాలున్నాయి. ఆయన సమకాలిక తరం కవి పండితులు, దేశభక్తులు ఇపుడు లేదు కదా?!!

-అక్కిరాజు రమాపతిరావు