S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కబంధుడి చేతులు నరికిన రామలక్ష్మణులు (అరణ్యకాండ)

లక్ష్మణుడితో అతడి మనసు గట్టిపడే విధంగా మాట్లాడుతున్న రాముడిని చూసి కబంధుడు తనను చూసి వారెందుకు భయపడుతున్నారని అడిగాడు. వాళ్లను తన నోట్లో పడేట్లు బ్రహ్మ చేశాడని కూడా అన్నాడు. ఈ రాక్షసుడు మహా బలవంతుడనీ, భయంకర దేహం కల దుష్టుడనీ, ప్రపంచమంతా గెలవగల పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడనీ, కాబట్టి తమను మింగుతాడు కానీ వదలడని లక్ష్మణుడు అంటాడు. కబంధుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మహాత్మా! రాజులైన వారు తమను తాము కాపాడుకోలేక, ఎదిరించి యుద్ధం చేయలేక వున్నవారిని, యజ్ఞమధ్యంలోకి తెచ్చిన పశువుల్లా హింసించడం నీచకార్యం, అది న్యాయం కాదు’ అంటాడు.
లక్ష్మణుడు చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడు, రామలక్ష్మణులను నోట్లో వేసుకుందామని ఆలోచించే లోపలే వాడి తత్త్వాన్ని అర్థం చేసుకున్న వారిద్దరిలో రామచంద్రమూర్తి వాడి కుడిచేయి నరికాడు. రాముడికి కుడిపక్కన వున్న లక్ష్మణుడు తన కత్తి దెబ్బతో ఎడమ చేయి నరికాడు. ఇలా నరకగా ఆ రాక్షసుడు భూమ్యాకాశాలు, దిక్కులు దద్దరిల్లేట్లు నేలకొరిగాడు.
దుఃఖంతో కూడిన ఆ రాక్షసుడు రెండు చేతులూ కోల్పోయి వీరిద్దరూ ఎవరనీ, ఈ అడవిలో వాళ్లకేమి పని వుందనీ ప్రశ్నించాడు. జవాబుగా లక్ష్మణుడు, వాళ్ల చరిత్ర చెప్పాడు ఇలా:
‘ఈ పుణ్యాత్ముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. పేరు శ్రీరాముడు. ఈయన మా అన్న. నా పేరు లక్ష్మణుడు. దేవతల మహిమ కల మా అన్న తన భార్యతో దండకారణ్యంలో వున్నప్పుడు దుండగులైన రాక్షసులు మాయచేసి చంద్రవదన అయిన ఆయన భార్య సీతమ్మను దొంగిలించగా ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వెవరివి? ఇలా మొండెం మాత్రమే ఆకారంగా ఎందుకున్నావు? రొమ్ములో నోరుంది కానీ పిక్కలు ఎందుకు లేవు? ఎందుకిలా పొర్లుతున్నావు?’ ఇది విన్న ఆ రాక్షసుడు దేవేంద్రుడి మాటలు స్మరించి, తనకు శాపమోక్షణ కాలం దగ్గరికి వచ్చింది కదా అని సంతోషించి ఇలా జవాబిచ్చాడు లక్ష్మణుడికి.
‘ఓ రాఘవులారా! మీకు స్వాగతం. నా భాగ్యం పండటం వల్ల ఈ సమయంలో మిమ్మల్ని ఇక్కడ చూడగలిగాను. చేతులు పోగొట్టుకున్నాను. చేతులు పోవడం నా అదృష్టం వల్లే. శ్రీరామచంద్రా! గర్వం, వినయం తప్పిన పనులు చేయడం వల్లే నాకిలాంటి వికార స్వరూపం కలిగింది. యథార్థం చెప్తా వినండి.’
‘రామచంద్రా! నేను మొట్టమొదట సూర్య చంద్రేంద్రులతో సమానమైన సుందరాకారం కలిగి, ప్రపంచంలోనే అందగాడినని పేరు తెచ్చుకున్నాను. అలాంటి ఆకారం గల నేను గర్వంతో మునులను అరణ్యవాసులను భయపడేట్లు అనేక రకాల దుఃఖపెట్తూ, తమోగుణం ప్రకోపించడం వల్ల దుర్బుద్ధితో స్థూలశిరుడు అనే మునిని నింద్య రూపంలో భయపెట్టాను. ఆ ఋషీశ్వరుడు ‘ఓరీ! పాపాత్ముడా! నింద్యమైన ఈ రూపంలో నన్ను బెదిరిస్తావా? నీకు ఈ రూపమే శాశ్వతం కలుగుగాక!’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్థించగా ఈ అడవిలో ఎప్పుడు రామచంద్రుడు నీ చేతులు తెగ నరికి దహిస్తాడో అప్పుడే నీకు శాపం తొలగిపోయి, నీ పూర్వ రూపం పొందుతావు అని శెలవిచ్చాడు ఆ మునీశ్వరుడు.’
‘కబంధ రూపం రావడానికి మరో కారణం ఉంది. నేను శ్రీయుతుడైన తనువు వల్ల కలిగిన వాడిని. ఈ వికారాకారం రావడానికి ఇంద్రుడి కోపమే కారణం. ఆయనకు నా మీద కోపం ఎందుకొచ్చిందంటారా? నేను గొప్ప తపస్సు చేసి దీర్ఘాయువు కలిగేట్లు బ్రహ్మ వరం పొందాను. ఆ కారణాన నాకేం భయం లేదని భావించి పొగరుతో బుద్ధిహీనుడనై ఇంద్రుడిని యుద్ధానికి రమ్మని పిలిచాను. ఇంద్రుడు వజ్రాయుధం వేటుతో నా తల, రొమ్ము, కడుపు, తొడలు కుదించుకు పోయేట్లు అణచివేశాడు. నేనప్పుడు, నాకీ దురవస్థకన్నా మరణమే మేలని చంపమని ప్రార్థించాను. ఎంత వేడుకున్నా బ్రహ్మదేవుడి వాక్కు వృథా కాకూడదని నన్ను చంపలేదు. చావకుండా, బతకలేకుండా అయింది నా పరిస్థితి. రెంటికీ చెడ్డ వాడినయ్యాను. నేనెలా బతకాలయ్యా? అని అడిగితే, ఆమడ పొడుగున్న చేతులు, కడుపులో నోరు అనుగ్రహించాడు. వాటి సహాయంతో ఏనుగులను, పులులను, సింహాలను, ఇతర మృగ సమూహాలను చంపి తింటున్నాను. లక్ష్మణుడితో సహా ఎప్పుడు రాముడు నా చేతులను నరుకుతాడో అప్పుడు మళ్లీ నేను స్వర్గానికి వస్తానని చెప్పి ఇంద్రుడు పోయాడు’
‘ఇక అప్పటి నుండి ఈ వికార స్వరూపం పోవడానికి ప్రయత్నం చేస్తూ, ఎవరు కనపడ్డా పట్టుకుని, రాముడు చిక్కకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. మహాత్మా! నన్ను యుద్ధంలో ఎంత గొప్ప పరాక్రమవంతులైనా చంపలేరు. కాబట్టి ఆ మునీశ్వరుడు చెప్పిన రాముడివి నువ్వే. మీకు నేను సహాయం చేస్తాను. మీ కార్యం సాధించగల స్నేహితుడిని చూపిస్తాను. నన్ను అగ్నితో దహించు’ అని అంటాడు కబంధుడు. తాను జనస్థానంలో వుండగా రావణుడు అనే రాక్షసుడు తన భార్యను దొంగిలించాడనీ, వాడి పేరు తప్ప ఇతర వివరాలేవీ తమకు తెలియవనీ వాడితో చెప్పాడు రాముడు. ‘వాడెక్కడ ఉంటాడో తెలిస్తే చెప్పు. మనస్సు వికలం చెంది అడవుల్లో తిరుగుతున్నాను. మేము ఎవరికైనా ఉపకారం చేస్తాం కానీ, అపకారం చేయం. నువ్వు కోరినట్లు నీకు ఉపకారం చేస్తాం. మా మీద దయ తలచి అలక్ష్యం చేయకుండా, వాడి స్థితిగతులు చెప్పు. నిన్ను నీ మాట ప్రకారమే దహనం చేస్తాను. నీ ద్వారా మాకు తెలియాల్సింది జానకిని అపహరించిన వాడేవాడు?’
తన దేహాన్ని వేగంగా దహించి వేస్తే సీతను దాచి వుంచిన రహస్యమంతా దాచకుండా చెప్తానంటాడు కబంధుడు రాముడితో. ఆ పని సూర్యాస్తమయం లోపే చేయమంటాడు. వాడి విషయం తెలిసిన వాడు ఒకడున్నాడనీ, అతడితో ధర్మబద్ధంగా స్నేహం చేయమనీ, అతడు ప్రపంచంలో తిరగని చోటు లేదనీ, అతడు రాముడికి ఉపకారం చేస్తాడనీ చెప్పాడు కబంధుడు.
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690
-సశేషం

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12