S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాతాళస్వర్గం-32

‘మన ప్రభుని చేసుకోవడానికి ఓకే అందా’ అన్నాడు.
‘ప్రభు అంటే ఆమె కిష్టమే! కానీ అది ఆమెనడక్కూడదు. వాళ్లింటికెళ్లి శంకరయ్య గారి ద్వారా అడిగించాలి. ఇవాళ మంచి రోజు. మనం వెళ్లి శంకరయ్య గారితో మాట్లాడి శుభవార్తతో తిరిగొద్దాం’ ఉత్సాహంగా అన్నాడు చంద్ర.
‘ఎస్సర్! మంచి ఆలోచన! ఇప్పుడే వెళ్దాం. ఫోన్ చెయ్యండి’ అన్నాడు నాయక్ మరింత ఉత్సాహంగా.
తర్వాత శంకరయ్యకి ఫోన్ చేశారు ఏదో మాట్లాడాలని. ఆయన కంగారుపడుతూ ఆహ్వానించాడు.
చంద్ర, నాయక్ సెక్యూరిటీతో సహా బయల్దేరి కొండకేసి వెళ్లారు.
‘నాకోసారి ఆ బ్లాక్ టైగర్ని చూడాలనుంది నాయక్. వాల్మీకిలా మారిన అతన్ని చూసే అదృష్టం మీ అందరికీ కలిగింది కానీ నాకు కలగలేదు’ అన్నాడు చంద్ర.
తుళ్లిపడ్డాడు విజయ నాయక్. మొహం నల్లబడింది. అయినా తేరుకుని-
‘అక్కడికి రామని అతనికి మాట ఇచ్చాం సార్’ అన్నాడు తడబడుతూ. చంద్ర నవ్వాడు.
‘అతనికి ఆపద కలిగించడానిక్కాదు నాయక్. జస్ట్ అతన్ని, అతనికి ఆత్మీయులైన వారిని చూసి థాంక్స్ చెప్పాలని ఉంది’ అన్నాడు అతనికేసి పరిశీలనగా చూస్తూ.
విజయ నాయక్ మొహం మరింత కళ తప్పింది.
‘ఏవిఁటి. ఇన్నాళ్లు వాళ్లతో గడిపారు. మళ్లీ వాళ్లని చూడాలని మీకనిపించలేదా నాయక్?’ మళ్లీ చంద్రే అన్నాడు.
అతనికి తండ్రి గురించి తెలిసిపోయిందని గ్రహించాడు నాయక్.
‘చూడాలనిపిస్తే మాత్రం కుదరని వాళ్లని ఎలా చూస్తాం సార్? నాకు చంద్రుడి మీద పరుగు తీయాలని, నక్షత్రాలు దండగా గుచ్చాలనీ ఉంది. అవి సాధ్యమవుతాయా?’ అంటూ బలవంతంగా నవ్వాడు.
‘అబ్బో! ఆ బ్లాక్‌టైగర్ని చూడడం అంత కష్టమా? పర్లేదు. నేను ఏర్పాటు చేస్తాను’
‘వద్దు సార్! ప్లీజ్. ఆ పని మాత్రం చెయ్యకండి’ రెండు చేతులూ జోడించి దీనంగా అన్నాడు నాయక్. అతని కళ్లు శ్రావణ మేఘాలయ్యాయి.
‘ఓకే ఓకే. ఇంక అడవిని గురించి, ఆ బ్లాక్‌టైగర్ని గురించి ఎత్తను సరేనా. కూల్‌డౌన్’ అన్నాడు చంద్ర నవ్వుతూ. తర్వాత టాపిక్ మార్చి అతని మూడ్ మార్చాడు.
హఠాత్తుగా సి.ఎం.గారొచ్చేసరికి అక్కడి సెక్యూరిటీ వాళ్లు పని వాళ్లు కంగారు పడిపోతూ విష్ చేసి పక్కగా నిల్చున్నారు. శంకరయ్య కంగారుపడుతూ వాళ్లని ఆహ్వానించి కూర్చోబెట్టాడు. గౌతమి చిరునవ్వుతో అతిథి మర్యాదలు చేసింది.
‘సరే... ఇంక డొంక తిరుగుడు లేకుండా విషయం చెప్పేస్తున్నాను. మా ఎవిడెన్స్‌కి, మీ క్లూని చేసుకుందామనుకుంటున్నాం. మీ అభిప్రాయం, మీ క్లూ అభిప్రాయం చెప్తే లగ్నాలు పెట్టించేద్దాం’ అన్నాడు చంద్ర.
విజయనాయకే కాదు గౌతమి కూడా ఆశ్చర్యపోయింది అతని మాటలకి. అంత సరదాగా, జోవియల్‌గా అతను మాట్లాడ్డం ఎయిత్ వండర్‌లా అనిపించింది అందరికీ. అతన్ని చూసిన వాళ్లు ముఖ్యంగా కొత్త వాళ్లు, అతను కోపిష్టి, మితభాషి అనే అనుకుంటారు. నిజంగా అతను నవ్వుతూ మాట్లాడ్డం చాలా అరుదు. అలాంటి మనిషి ఇంత జోవియల్‌గా పిల్ల నడగడం నాయక్ వాళ్లని విస్మయపరచింది. అయితే శంకరయ్యకేం అర్థం కాలేదు. కంగారుగా కూతురికేసి చూశాడు. ఆమె సిగ్గుపడుతూ సన్నగా నవ్వింది.
అతని బాధ అర్థం చేసుకున్న చంద్ర పెద్దగా నవ్వేస్తూ విషయం చెప్పాడు. ఆటవికులు దండలు మార్పించిన సంగతి కూడా చెప్పాడు.
నిజంగానే అనిల్‌ని ప్రేమించి భంగపడిందని, కూతుర్ని తల్చుకుని బాధపడుతున్న శంకరయ్యకి ఆ మాట పన్నీటి చినుకులా తోచింది. కూతురి మొహంలోని ఆనందం చూసి-
‘అంతా మీ ఇష్టం. తమరెప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అక్షింతలు వేస్తాను’ అతని చేతులు పట్టుకుని కృతజ్ఞతగా చూస్తూ అన్నాడు. ‘తథాస్తు’ అన్నారు చంద్ర, విజయ నాయక్.
* * *
గౌతమి, ప్రభుల పెళ్లికి లగ్నాలు నిర్ణయించేశారు. చంద్ర పెళ్లి బాధ్యతలన్నీ తన మీద వేసుకుని పెళ్లి పెద్దయి హడావిడి పడిపోతున్నాడు. పెళ్లంటేనే చిరాకు పడే ప్రాణ స్నేహితుడు ప్రేమించి పెళ్లికి సిద్ధపడటమే కాక ఆ పెళ్లి బాధ్యతలన్నీ తన మీదే పెట్టడం వెర్రి ఆనందంగా ఉందతనికి. విజయనాయక్, ప్రయాగలు సలహాదారులై పోయారు.
‘క్లూ’ పేరిట సి.ఎం.ని సైతం హడలగొట్టిన గౌతమి, తండ్రి కోసం భయంకరారణ్యంలో ప్రవేశించి ఎన్నో సాహసాలు చేసిన గౌతమి, మరెన్నో పథకాలు వేసి కర్కోటకుల్లాంటి హంతకులకు సైతం ముచ్చెమటలు పట్టించిన గౌతమి ఇప్పుడు అచ్చం సంప్రదాయపు కనె్నలా, తండ్రి చాటుబిడ్డలా, లోకం తెలియనంత అమాయకురాల్లా సిగ్గుల మొగ్గయి పోయింది.
క్లూ, క్లూ ఎవిడెన్స్ అంటూ తన వాక్చాతుర్యంతో చంద్రనే తికమకపెట్టిన గౌతమి, ఇప్పుడతన్ని చూడగానే సిగ్గుతోనూ, గౌరవంతోనూ పక్కకి తొలగిపోతోంది.
ఇదంతా చాలా థ్రిల్లింగ్‌గానూ, సరదాగానూ ఉంది చంద్ర, ప్రభులకి. శంకరయ్య కుర్రాడిలా తిరుగుతున్నాడు. చందన గౌతమి పక్కన చేరి తెగ ఆట పట్టిస్తోంది ఏ మాత్రం వీలు చిక్కినా. చంద్ర, భార్యతో కలిసి పెళ్లికి కావలసిన పట్టుబట్టలన్నీ కొని తెచ్చారు. శుభలేఖలు వచ్చేశాయి. శంకరయ్యని ప్రభుని అడిగి అడ్రస్‌లు రాసి పోస్ట్ చేస్తోంది చందన.
పెళ్లి వారం రోజులుందనగానే కొండంతా ముస్తాబయ్యింది. పెళ్లిలో సి.ఎం.గారి పాత్ర ఎక్కువగా వుంది కాబట్టి అన్ని డిపార్ట్‌మెంట్స్ వారూ ఆ శుభకార్యం తమ ఇంటిదే అన్నంత ఉత్సాహంగా చేసుకుపోతున్నారు. ఫలితంగా కొండ, కొండ పరిసరాలూ సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. నగలన్నీ ధరించిన ఆలయంలోని దేవతామూర్తులు మరింత కళకళ లాడుతున్నాయి.
విజయ నాయక్, ప్రభు కలిసి కొన్ని ఇతర పనులు చేయిస్తుంటే, దొంగచూపులు చూసేది గౌతమి. ఆమెకి ప్రభుని చూసినా, అతని మాట విన్నా మనసంతా పురివిప్పిన నెమలిలా అయిపోతోంది.
అంత ఆనంద సమయంలోనూ ఆమెకి అడవి, అక్కడి వాళ్లూ గుర్తొచ్చి మనసు కలుక్కుమనేది.
‘ఈ సమయంలో బాబా వాళ్లు వుంటే ఎంత బావుండేది. అంకుల్ వాళ్లు రాకపోయినా కనీసం చిన్ని, జింబోలు, కొండమ్మక్క, ముద్ర, జీవా సిద్ధు లాంటి వాళ్లయినా వస్తే మరింత ఆనందంగా ఉండేది’ అనుకుంది పదేపదే.
చంద్ర సారథ్యంలో ప్రయాగ, విజయ నాయక్ లాంటి వాళ్లంతా తమ వయసుల్ని, హోదాలని పక్కనపెట్టి ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి, జోక్స్ వేసుకుంటూ హడావిడి చెయ్యడం శంకరయ్యకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. చందన చేసే హడావిడికి అంతే లేదు. ప్రభు కూడా పెళ్లి కొడుకన్న సంగతి మర్చిపోయినట్టు వాళ్లతో కలిసే తిరుగుతున్నాడు. గౌతమితో మాట్లాడుతూనే ఉన్నాడు.
ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ ఆలయ మండపంలో కూర్చుని పెళ్లిని గురించే చర్చించుకుంటున్నారు.
‘సర్! మన గౌతమి పెళ్లికి బ్లాక్‌టైగర్ వాళ్లని కూడా పిలిస్తే బావుంటుంది కదా’ అంది చంద్ర నుద్దేశించి.
‘పిల్చినా అతను రాడు చందనా!’ అన్నాడు బాధగా.
‘ఎందుకు రాడు? అతని మీదున్న కేసులన్నీ పోయాయిగా. బ్లాక్‌టైగర్ని చూడాలని చాలామందికి ఆశగా ఉంది. కనీసం ఆయనొక్కడూ వచ్చి వెళ్లినా చాలు’ అంది చందన.
‘ఆ ఆశలు పెట్టుకోకండి. ఇంక జన్మలో వాళ్లని చూడలేం. ఎందుకంటే మనం వెళ్లలేం. వాళ్లు రారు. ఒకవేళ బాబా వద్దామనుకున్నా అంకుల్ రానివ్వడు’ బాధగా అంది గౌతమి.
‘అంకులా? ఆయనెవరు?’ అన్నాడు శంకరయ్య.
గతుక్కుమన్నాడు ప్రభు. వెంటనే తేరుకుని-
‘అదే.. బ్లాక్‌టైగర్ బంధువు. ఆయనకి అడవి వదిలి రావడం ఇష్టంలేదు. నగర వాతావరణం అసలు పడదు’ అన్నాడు తడబడుతూ. అయితే చందన ఊరుకోలేదు.
‘ఆయన అడవి దాటిరారా? నగరంలోకి రారు. ఓకే! కానీ ఈ కొండ, కొండమీది ఆలయం దాదాపు సింగపడవికి చెందిందే అంటారు. మునుపట్లా బ్లాక్‌టైగర్ మీద ఎలాంటి కేసులూ లేవు. మరలాంటప్పుడు, తనెంతో అభిమానించిన, తన ప్రాణాల్ని కాపాడిన గౌతమి పెళ్లికి వెళ్దామంటే ఆ అంకులో ఎవరో కాదంటాడా? ఆలోచించండి సర్’ అంది.
‘ఇంక ఈ విషయాన్ని వదిలేస్తారా?’ సీరియస్‌గా అన్నాడు చంద్ర. హఠాత్తుగా అతనిలో వచ్చిన మార్పునకు కంగారు పడిపోయారంతా.
‘సారీ సర్! ఆ అంకుల్ ఎవరై ఉంటారా అన్న కుతూహలంతో అడిగానంతే. పొరపాటుగా మాట్లాడితే క్షమించండి’ అంది చందన నొచ్చుకున్నట్టు.
విజయనాయక్ మొహం తెల్లగా పాలిపోయింది. క్షణం ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చినట్లు
‘ఆ అంకుల్ ఎవరో కాదు.. ఆయన.. మా నాన్న...’
‘ఆఁ ఆఁ; ఆయన మన ఐ.జి.గారి నాన్నగారి స్నేహితుడు శకుని. ఆయన చాలాకాలంగా ఆ ఆడవిలోనే వుంటున్నారు. ఆయన సరే అనకపోతే ఆ అడవిలోని వాళ్లెవరూ ఒక్క అడుగు వెయ్యరు. ఆయన గురించిన వివరాలు చాలా?’ అతని మాటల కడ్డొస్తూ అన్నాడు చంద్ర.
మరి మాట్లాడలేదెవరూ. నాయక్ చంద్రకేసి కృతజ్ఞతగా చూసి చేతులు జోడించి, జలపాతాలైన తన కళ్లని ఎవరూ చూడకూడదన్నట్టు తలదించుకుని అవతలి కెళ్లిపోయాడు.
అక్కడున్న వాళ్లందరి మనసులూ ఎందుకో భారంగా అయిపోయాయి.
‘ఇంక అడవిని గురించి గానీ, ఆ బ్లాక్‌టైగర్ వాళ్ల గురించీ మాట్లాడకూడదు’ అనుకున్నారు.
తర్వాత పెళ్లికి వచ్చే వాళ్లని గురించి, ఎలాంటి అయిటమ్స్ చెయ్యాలన్న దాని గురించి, ఎవరెవరికే బట్టలు పెట్టాలో లాంటివన్నీ చర్చించుకున్నారు. మళ్లీ ఆహ్లాదకరంగా మారిపోయింది. మరో గంట తర్వాత అందరూ బైటికొచ్చేశారు. అయితే అక్కడ నాయక్ కారు లేదు. ఏదో అర్జంట్ పని మీద వెళ్తున్నట్టు మెసేజ్ పెట్టి వెళ్లిపోయాడు. భారంగా నిట్టూర్చాడు చంద్ర.
* * *
పెళ్లి పందిరి అత్యంత మనోహరంగా తయారయింది. రంగురంగుల లైట్లతో, కిటకిటలాడే అతిథులతోనూ కళకళ లాడిపోతోంది. చంద్ర దంపతులు కన్యాదాతల్లా అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. వధూవరులు మండపంలో కూర్చోగానే సందడి పెరిగింది. బ్రాహ్మల మంత్రాల హోరూ పెరిగింది. సిగ్గుల మొగ్గలా కూర్చున్న గౌతమి, ఓసారి మెల్లగా తల ఎత్తి అతిథుల కేసి కలియచూసి తుళ్లిపడింది. ఆమె విశాల నేత్రాలు మరింత విశాలమయ్యాయి. ఆశ్చర్యం, ఆనందం పోటీపడి మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి.
కారణం కుర్చీల మొదటి వరసలో కూర్చుని చిరునవ్వుతో తనకేసే చూస్తున్నారు శకుని, దొర. అంతే కాదు! చిన్ని, జింబో, సిద్దు, జోగీ.. ఒకరేంటీ ఆడవాళ్లతో సహా అడవంతా తరలి వచ్చిందా అన్నట్టు అందరూ చక్కగా అతిథుల్లో కలిసిపోయి కూర్చుని వేదిక కేసి చూస్తున్నారు. ఆనందం ఆపుకోలేని గౌతమి తనని తాను మర్చిపోయి వాళ్ల దగ్గరికి పరుగెత్తి శకుని, బాబాల కాళ్లకి చుట్టుకుపోయింది. వాళ్లు లేచి ఆప్యాయంగా పట్టుకుని ఆశీర్వదించారు. చిన్ని, జింబోని చేతులు పట్టుకుని కుదిపేసింది. సిద్దూ వాళ్ల దగ్గరికెళ్తుంటే
కొండమ్మ ఆపేసి-
‘ముందు పెళ్లి కానీ తల్లీ. మేమెక్కడికీ పోము’ అంటూ ఆమెని మండపం దగ్గరికి పంపేసింది ముసిముసిగా నవ్వుతూ. ప్రభు మొహంలో కూడా ఆనందం చోటు చేసుకుంది.
దేని కోసమో బైటికెళ్లొచ్చిన విజయనాయక్‌తో -
‘ముహూర్తానికి టైమయింది. ఇంకా బైటే తిరుగుతున్నావా? ఓసారి వెళ్లి అతిథుల్ని పలకరించు’ అన్నాడు చంద్ర చనువుగా. అతను అటుకేసి వెళ్తుండగా, ‘చింటూ’ అన్న పిలుపు విని తుళ్లిపడి చూశాడు. అతిథుల్లో తండ్రి వుండడం చూసి, కలో, నిజమో అర్థం కానట్టు అలా నిల్చుండిపోయాడు. శకుని లేచి నిల్చుని చేతులు చాచి మరోసారి పిల్చాడు. అంతే! ఒక్క అంగలో వెళ్లి ఆప్యాయంగా చాచిన శకుని చేతుల్లో పసివాడిలా వొదిగిపోయాడు. అతని ఆనందానికి అంతేలేదు.
క్షణాల్లో అందరికీ విషయం తెలిసిపోయింది. బ్లాక్‌టైగర్ పెళ్లికొచ్చాడని, ఓ సూపర్‌స్టార్ వచ్చిందానికన్నా ఉత్సాహంగా అతని చుట్టూ చేరి అతనికి షేక్‌హాండ్స్ ఇచ్చి మరీ మురిసిపోయారు. ఆ సందడిలోనే పెళ్లి తతంగం ముగిసింది. వధూవరులు ఆటవికులతో సహా పెద్దలందరికీ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత విందు భోజనాలు చేసి తాంబూలాలు సేవిస్తూ, చంద్ర దంపతులకీ, నూతన దంపతులకీ చెప్పి చాలామంది వెళ్లిపోయారు.
అడవి వదిలి అటుకేసి రానని శపథం చేసిన శకుని, దొరలు వాళ్లు రావడమే కాక తమ వారందర్నీ వెంటపెట్టుకు రావడం ప్రభూ వాళ్లందరికీ ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. బ్లాక్‌టైగర్‌కి ఇన్విటేషన్ పంపమంటేనే ఒప్పుకోని చంద్రకి తెలియకుండా ఎవరు పంపినట్టు? అని మధనపడ్డారు.
ఆయనకి చెప్పకుండా ఎవరో ఇన్విటేషన్ పంపారని వాళ్ల ఉద్దేశం. వాళ్ల మనస్సులోని భావాలు కనిపెట్టిన చంద్ర పెద్దగా నవ్వుతూ
‘మీరేం కంగారు పడకండి. వాళ్లకి ఇన్విటేషన్ పంపలేదు. నేనే స్వయంగా వెళ్లి ఆహ్వానించాను. మీమీ బంధాల్ని గుర్తుచేసి అర్థించాను. ఇంక ముందు, మీ దగ్గరికొచ్చి, మిమ్మల్ని రమ్మని బాధించం. ఈసారికి వచ్చి మీకు ఆత్మీయులైన వాళ్లందర్నీ చూసి ఆశీర్వదించి వెళ్లండి’ అన్నాను. నిజంగానే మీ అందరి మీద ప్రేమాభిమానాలున్న బ్లాక్‌టైగర్.. మిస్టర్.. రా.. సారీ.. మిస్టర్ శకుని ఆనందంగా వచ్చారు. కళ్ళారా మిమ్మల్నందర్నీ చూశారు. హాయిగా మనతో కాస్సేపు గడిపి వెళ్లిపోతారు’ అన్నాడు కండిషన్ చెప్పకనే చెప్తూ. అయినా బాధపడలేదెవరూ. మళ్లీ ఓసారి శకునీ వాళ్లని చూశామన్న తృప్తి.. ముఖ్యంగా విజయ నాయక్‌కి కలిగింది.
హర్షధ్వానాలు చేశారంతా. తర్వాత అందరూ కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. తెలతెలవారుతుండగా చంద్ర ఇచ్చిన పట్టువస్త్రాలని, పసుపు కుంకుమల్ని తీసుకుని శకుని, దొర తన వాళ్లతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. శకుని కాళ్లంటి నమస్కరించాడు నాయక్.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్