S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ధర్మసూక్ష్మం

‘తాతయ్యా! అబద్ధం చెప్పకూడదు అంటావు కానీ నిజం చెప్పినందుకే శీనుకి పనిష్మెంట్ ఇచ్చారు. ఇదేమైనా బాగుందా?’
బడి నుండి పరుగెత్తుకుంటూ వచ్చిన పవన్ వొగరుస్తూ కోపంగా వాళ్ల తాతయ్యను నిలదీశాడు.
‘అదెలా? ఏం జరిగిందసలు? వాడేదో ఘనకార్యం చేసి ఉంటాడు. నీకు ఫ్రెండ్ కదా? అందుకే నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్?’ అంది వాణి.
‘ఏం కాదు. తెలీకుండా మాట్లాడకు’ అక్క మీద కోప్పడ్డాడు.
‘ముందు కాస్త స్థిమితపడు బాబూ! చేతులు కాళ్లు మొహం కడుక్కో. అప్పుడు చెప్పు. ఏమైందో?’ అన్న తాతయ్య మాటలు పూర్తయ్యే లోపలే కాళ్ల మీద నీళ్లు గుమ్మరించుకుని వచ్చేశాడు పవన్.
‘ఏమైందా? ఇవాళ పొద్దున్న వాన పడుతుందని ఎవరి క్లాసులో వాళ్లని ప్రేయర్ చేసుకోమన్నారు. ప్రార్థన చేసే గ్రౌండ్‌లో అన్ని క్లాసులు కలిసి చేస్తాం రోజూ. పైన కప్పు ఉండదు కదా! వానకి తడుస్తామని విడివిడిగా ఎవరి తరగతిలో వాళ్లు ప్రార్థన చేయమన్నారు. సరే! టీచర్ అందర్నీ కళ్లు మూసుకుని చెప్పమంది. ప్రార్థన పూర్తయ్యాక శీనుని, జాకబ్‌ని, రోజాని కళ్లు తెరిచి చూస్తున్నారని కోప్పడింది. శీనుగాడేమో ‘మరి మీరు కళ్లు తెరిచి చూడకపోతే మీకెలా తెలిసింది మేడమ్ మేము కళ్లు మూసుకోలేదని?’ అని అగాడు. దాంతో వాడు ఎదురు చెప్తున్నాడని, గోడ కుర్చీ వేయించింది ఒక పీరియడ్ అంతా. మరి వాడడిగింది నిజమే కదా? తను చెప్పిన రూలు టీచరే పాటించకపోతే పిల్లలిది తప్పంటే ఎలా? మీ పెద్దవాళ్లు చెప్పే కబుర్లన్నీ ఇలాగే ఉంటాయి. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మీరు చేస్తే రైటూ, అదే పని మేము చేస్తే తప్పూ అంటారేం?’ కోపంగా అడిగాడు పవన్.
‘వాడి పాయింట్ కరెక్టే కదా తాతయ్యా! దీనికేమంటావు?’ అంది వాణి. తాతయ్య నవ్వాడు.
‘మంచి మాటే అడిగారు. ఇలా కూర్చోండి. మనం చెప్పిన మాట మనం ఆచరించి చూపలేకపోతే ఎదుటి వాళ్లకు మార్గదర్శకులం కాలేం. మహాత్మాగాంధీ అయినా, రామకృష్ణ పరమహంస అయినా తాము చేయగలిగిందే ఇతరులకు బోధించేవారట. రైటే! కానీ ఇందులో ఒక ధర్మసూక్ష్మం ఉంది. ప్రార్థన చేసేటప్పుడు దృష్టి వేరే విషయాల మీదికి పోకుండా కళ్లు మూసుకుని మనసులో ఇష్టదైవాన్ని ధ్యానిస్తే ఏకాగ్రత కుదురుతుంది. కోతిలా గంతులువేసే మనసు స్థిరంగా, శాంతంగా అవుతుంది. రోజంతా మీకు ప్రశాంతంగా గడిచిపోతుంది. మరి టీచరు ఎందుకు కళ్లు తెరిచి చూసిందనేది నీ ప్రశ్న. ఎందుకంటే ఆమె బాధ్యత. పిల్లలందరూ చక్కగా కళ్లు మూసుకుని ప్రార్థన చేసేలా చూడటం. ఒకళ్లిద్దరు కళ్లు తెరిచి చూసినా పర్వాలేదులే అని ఊరుకుంటే ఇంకా కొందరు అదే పని చేస్తారు. క్రమశిక్షణ లోపిస్తుంది. ఆమె ధర్మం ఆమె నెరవేర్చాలి కదా! అందుకే అందరు పిల్లలూ సరిగ్గా కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తున్నారా లేదా అని గమనించటానికి ఆమె కళ్లు తెరిచే ఉండాలి కదా! దీనే్న ధర్మసూక్ష్మం అంటారు. మీరు చిన్నవాళ్లు కాబట్టి ఇప్పుడు అర్థం కాదు కానీ పెద్దయ్యాక మీకే తెలుస్తుంది.’
‘నాకు కొంచెంగా తెలుస్తుంది. ఆనీ ఇంకొంచెం చెప్పు తాతయ్యా! మరి మాకు పాండవ వనవాసం అన్న పాఠం ఉంది. శ్రీకృష్ణుడు దేవుడు కదా? పాండవుల్ని వనాలకు వెళ్లకుండా కాపాడవచ్చు కదా! చక్రం వేసి కౌరవుల్ని నాశనం చేయలేదేం? పాండవ పక్షపాతి అంటారు కానీ వాళ్లు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చినా ఏమీ కాపాడలేదేం? ద్రౌపదిని సభలో అవమానం చేసినా, చీరలు ఇచ్చి కాపాడాడు కానీ అసలు ఆ పరిస్థితే రాకుండా చేయవచ్చుగా? ఎందుకు అన్నీ జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడు? అని మా క్లాసులో కొంచెం పెద్దమ్మాయి సద్గుణ అని ఉంది. అది అడుగుతుంటే నాకేం చెప్పాలో తెలీలేదు తాతయ్యా!’
ఎనిమిదో క్లాసు చదివే వాణి అడిగింది.
‘దానే్న కర్మఫలం అంటారు. పాండవులు మహా వీరులైనా ధర్మరాజు అన్ని ధర్మాలు తెలిసిన శాంతమూర్తి అయినా, జూదం అనే ఒక్క వ్యసనంతో అన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు దేవుని అవతారమే అయినా గాంధారి శాపంతో యాదవ కుల నాశనం, తన ప్రాణ త్యాగం ఆపలేదు కదా! శ్రీరాముడంతటి వాడు పధ్నాలుగేళ్లు వనవాసం చేశాడు. భగవంతుడే అయినా మానవజన్మ ఎత్తాక పెద్దలను గౌరవించటం, వాళ్ల మాట నిలబెట్టటం కోసం తన స్వార్థం చూసుకోకుండా రాజభోగాల్ని త్యజించి, నార చీరలతో, పాదయాత్ర చేయటం, అడవుల్లో మునుల తపస్సులను, యజ్ఞాలను భంగపరిచే రాక్షసులను సంహరించటం, అంతా విధి విలాసం. ఏది ఎలా జరగాలో అంతా అలాగే జరుగుతుంది. భారతంలో చేయకూడని పనులు చేస్తే అంతా వినాశనమే జరుగుతుందని తెలియపరిచారు. రామాయణంలో ఏయే ధర్మాలు తప్పకుండా ఆచరిస్తే అంతా మంచే జరుగుతుందని బోధించారు మహర్షులు. ఏ గ్రంథం చదివినా అందులో మంచినే గ్రహించాలి మనం. ఆచరణలో పెట్టాలి. ధర్మోరక్షతి రక్షితః అన్నారు. అందరూ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే సకాలానికి వర్షాలు కురవటం, పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంటే రామరాజ్యం అంటారు. ఇప్పటిలా వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి బీభత్సాలు జరగవు. అన్యాయం, అధర్మం పెరిగితే ఇలాగే జరుగుతాయి. అందుకే మనం ఎప్పుడూ తప్పు పనులు చేయకుండా ఉంటే అంతా మంచే జరుగుతుంది అని నమ్మి అలాగే ఆచరించాలి. సరేనా మరి!’
తాతయ్య మాటలని అడ్డుకున్నాడు పవన్.
‘ఇంట్లో పెద్దవాళ్ల మాట వినాలి. స్కూల్లో టీచర్ మాట వినాలి. మరి నా మాట ఎవరు వింటారు? పిల్లల మాటలు కూడా వినాలి కదా పెద్దవాళ్లు?’
తాతయ్య నవ్వాడు.
‘నిజమేరా బాబూ! నువ్వు అన్నిటికీ అడ్డు ప్రశ్నలు వేయకుండా అమ్మానాన్నలకు సంతోషం కలిగేట్లు బాగా చదువుకుంటే, వాళ్లు కూడా నీ మాట వింటారు. టీచర్ కూడా నినే్న క్లాసుకు లీడర్‌గా చేస్తుంది. అవునా కాదా?’
‘ఎప్పుడూ చదువుకోమనే కానీ బాగా ఆడుకోమని చెప్పరేం ఈ పెద్దవాళ్లు?’ అంటూ బ్యాట్ తీసుకుని బయటకు పారిపోయాడు పవన్.

-ఉదయశ్రీ 8332902825