S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముచ్చటైన స్వర్ణ వర్ణాలు

గర్భం నుంచి బయటకొచ్చిన శిశువును తల్లి ముద్దాడుతుంది. అది ఆత్మీయ స్పర్శ. అదొక భావోద్వేగం (ఎమోషన్). మనకు తెలియకుండానే ఈ బలమైన భావోద్వేగం వివిధ సందర్భాలలో, సమయాలలో మనుషుల్ని చుట్టేస్తుంది. యుక్త వయసులో ఆ భావోద్వేగం ‘రంగు’ - రుచిని సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని చిత్రకారిణి పసుల రజిత బలంగా పట్టుకున్నారు. ఆ సున్నిత భావాన్ని, భావోద్వేగాన్ని, అనుభూతిని, సహజసిద్ధమైన, మధురమైన ‘ముద్దు’ను సబ్జెక్ట్‌గా ఎంచుకుని ఆమె సాహసం చేశారు. విజయం సాధించారు. అశ్లీలం అనిపించకుండా కళాత్మకంగా, సృజనను జోడించి, అవసరమైన చోట నైరూప్యానికి తావిచ్చి, కొంత ‘మాటు’ కల్పించి కాన్వాసుపై చుంబనాన్ని చూపించారు. వాస్తవానికిది విప్లవాత్మకమైన వ్యక్తీకరణ. ఈ తరం చిత్రకారిణులు సంప్రదాయ వ్యక్తీకరణకు పూర్తి భిన్నంగా, తమ మనసు చెప్పే రంగుల భాషను, సబ్జెక్టును ఎంపిక చేసుకుని, కాగితాన్ని, కాన్వాసును సరికొత్త అందం దరిజేర్చుతున్నారు. వారిలో పసుల రజిత తొలి వరుసలో నిలుస్తారు.
యువతీ యువకులు ‘తొలి ముద్దు’కున్నంత తన్మయత్వం మరొక దానికుండదేమో.. ఈ అధరామృతాన్ని అక్షరాల్లో అనాదిగా అనేక మంది కవులు చెబుతూనే ఉన్నారు. కాని రంగుల్లో.. రూపంలో ఆ రుచిని చూపడం అంత తేలిక కాదు. కాని చిత్రకారిణి ఆ ‘సవాల్’ను స్వీకరించి ‘ముద్దు’ (కిస్) సిరీస్‌లో అసంఖ్యాక రంగుల బొమ్మలు గీశారు. యువతీ యువకుల్లో ముసిముసి నవ్వులు తెప్పించారు. గాఢంగా అత్తుకుని మరింత గాఢంగా ముద్దు పెట్టుకునే జంట పొందే పారవశ్యం అపూర్వం.. అపురూపం.. ఆ ‘చర్య’తో శరీరం స్పందించే తీరును సైతం ఆమె పట్టుకుని సంకేతంగా పుష్పాలను శరీరాలకు అద్దారు. ఆ తన్మయత్వం, గాఢత, వికసిస్తున్న పుష్పాలు వారి స్థితికి చిహ్నంగా నిలుస్తాయి. కొన్ని బొమ్మల్లో రెండు ఆకారాలు, ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ముద్దుల్లో మునిగిపోయినప్పుడు వారు ‘రంగుల ముద్దలు’గా మారిపోయారా? అనిపిస్తోంది. బాహ్య ప్రపంచం ఎరగకుండా, తెలియకుండా, పట్టించుకోకుండా, ఓ అద్భుత క్రీడలో లీనమైన వైనం రంగుల్లో, వెలుగు నీడల్లో దర్శనమవుతుంది.
తమకంతో ఓ యువతీ యువకుడు పెదవులపై ముద్దు పెట్టుకుని పరవశించి పోతుంటే ఈ ‘పాడు లోకం’ సహించదని భావించి చిత్రకారిణి ‘మాటు’గా ఓ పుష్పాన్ని చిత్రిక పట్టారు. అలాగే వారి స్థితికి అద్దం పట్టే విధంగా సింబాలిక్‌గా మరికొన్ని పుష్పాలను పక్కన చూపారు. అలా తాను విశృంఖలత్వాన్ని ప్రోత్సహించడం లేదని, కళాత్మకంగానే, సహజసిద్ధ మానవుని భావోద్వేగాన్ని రసాత్మకంగా రంగుల్లో దర్శింప చేస్తున్నానని చిత్రకారిణి అంటున్నారు.
మరో బొమ్మలో కాన్వాసు అంతా రంగులు చల్లినట్టు కనిపిస్తుంది. పరిశీలనగా చూస్తే అందులో ఓ ఆడ - ఓ మగ ఆకారం కనిపిస్తుంది. వారు ముద్దు పెట్టుకుంటున్న తీరు కనిపిస్తుంది. ఇంతటి సాంద్రత గల భావ వ్యక్తీకరణలో ఆమె నుదుట బొట్టు కూడా రంగు చల్లినట్టుగానే దర్శనమవుతుంది. అంటే నైరూప్య పద్ధతిలోనూ చిత్రకారిణి తన ‘సబ్జెక్ట్’కు న్యాయం చేశారు. వీటిలో అశ్లీలత ఇసుమంత కనిపించదు. కేవలం రంగుల రస స్ఫోటనం కనిపిస్తుంది. రంగులే ముద్దాడుతున్నాయా అన్నంత నైరూప్యంగా కొన్ని చిత్రాలను ఆమె గీశారు. కొన్ని గాఢమైన రంగుల్లో, మరి కొన్ని లేత రంగుల్లో ఎలా గీసినా వాటిల్లో గాఢత - గాంభీర్యత, తన్మయత్వం, తాదాత్మ్యం ఎక్కడా తగ్గలేదు.
కొన్నిచోట్ల పరిపక్వత కనిపించకపోయినా దానికో ప్రయోజకత్వం ఆశించి ఆమె చిత్రించినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మానవ అనాటమీని కొంత డిస్టార్ట్ చేసి చూపేందుకు సైతం ఆమె వెనుకంజ వేయలేదు. ఆ రకంగా ఆ కాన్వాసులన్నీ వర్ణరంజితాలే.. భావోద్వేగాల పుట్టలే.. రసజ్ఞత కురిపించేవే... కదిలించేవే.. కాసేపు చూడాలనిపించేవే!
ఈ విలక్షణ చిత్రకారిణి గోదావరిఖని నుంచి వచ్చారు. 1978లో జన్మించిన ఆమె అక్కడి 8వ ఇంక్లైన్ కాలనీ పాఠశాలలో చదువుకున్నారు. పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ వేసే బొమ్మలతో స్ఫూర్తి పొంది తానూ గీయాలని ప్రయత్నించింది. దేవుళ్ల బొమ్మలు, ప్రకృతి చిత్రాలు ఇట్లా తోచినవి వేస్తూ పోయారు. కరీంనగర్‌లో చదివేటప్పుడు వెంకటేశ్వర్లు టీచర్ ప్రోత్సాహంతో మరి కొంత అభ్యాసం చేశారు. డ్రాయింగ్‌లో లోయర్ హయ్యర్ శిక్షణ సైతం తీసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్, నాంపల్లిలోని టిటిసి కోర్సు సైతం పూర్తి చేశారు. అక్కడే తనకు ‘బొమ్మల చదువు’పై పై చదువులు చదివేందుకు కళాశాలలు ఉన్నాయని తెలిసిందని రజిత అంటున్నారు. ఆ సంగతి తెలిసాక తన మనసంతా పురివిప్పి నట్టయిందని, ఆ చదువుల కోసం మనసు ఆరాటపడిందని అందుకే 2004 సంవత్సరంలో మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఎంట్రన్స్ పరీక్ష రాసి సీటు సంపాదించానన్నారు.
అక్కడ తనకు రియలిస్టిక్ డ్రాయింగ్, పెయింటింగ్, పోట్రేట్, మోడల్ డ్రాయింగ్, క్రియేటివ్ కాంపోజిషన్ ఇట్లా పెయింటింగ్‌కు సంబంధించిన సకల అంశాల అవగాహన ఏర్పడిందంటున్నారు. అలాగే ప్రింట్ మేకింగ్, జింక్ ప్లేట్‌వర్క్ సైతం నేర్చుకున్నానని చెబుతున్నారు. 2009 సంవత్సరం వరకు అక్కడ చేసిన సాధన, అభ్యాసం, తనకో కొత్త పునాదిని ఏర్పరచిందంటున్నారామె.
ఆ పునాదిని మరింత పదిలపరచుకునేందుకు గాను మాస్టర్స్ చేసేందుకు కర్నాటకలోని అల్లమప్రభు కళాశాలలో 2013లో చేరాక అక్కడ మరికొంత అధ్యయనం, అభ్యాసం - ఆధునిక చిత్రకళ (మోడ్రన్ ఆర్ట్) ఆనుపానులు అవగతమవగా మనిషి భావోద్వేగాన్ని ఆధారం చేసుకుని బొమ్మను గీయమని తమ ఆచార్యులు చెప్పగా మదర్ అండ్ చైల్డ్ (తల్లీబిడ్డ) కపుల్స్ (జంట) ఇట్లా కొన్ని గీయగా అందులోంచి ఉబికి వచ్చిందే ‘చుంబనం’ సిరీస్. అది ఆచార్యులను, ఇతరులను ఆకట్టుకోవడంతో ఆ సబ్జెక్ట్‌ను - శైలిని, రంగుల పోహళింపును, రసజ్ఞతను, నాజూకుతనాన్ని, గాఢతను ఏ మాత్రం సడలించకుండా కొనసాగిస్తున్నారు.
ఎ.పి.తోపాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన అనేక ఆర్ట్ క్యాంపుల్లో ఆమె పాల్గొని ప్రశంసలు, బహుమతులు అందుకున్నారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో సభ్యురాలిగా ఉంటూ హైదరాబాద్, బెంగుళూరు, కోయంబత్తూర్, తిరువనంతపురం, గోవా తదితర చోట్ల గ్రూపు షోలలో తన అపురూప చుంబనపు బొమ్మలను ప్రదర్శించారు.
గతంలో తాను గీసిన లాండ్‌స్కేప్స్, రైతు బొమ్మలు, ఆక్రలిక్, ఆయిల్‌లో చేసినప్పటికీ ముద్దు (కిస్) సిరీస్ మాత్రం సంచలనం సృష్టించి చిత్రకళా రంగంలో తనకంటూ ఓ స్థానం కల్పించిందని పసుల రజిత పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కోరుట్ల గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తూ ముద్దులొలికే పిల్లలకు రంగుల హరివిల్లును దర్శింపజేస్తున్నారు.
పసుల రజిత 81065 00022

-వుప్పల నరసింహం 9985781799