S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిరిమానోత్సవానికి 252 ఏళ్లు!

రాష్ట్రంలో శక్తిమాత క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రాల్లో విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం ఒకటి. సంస్కృతీ సంప్రదాయాలకు, కళలకు కాణాచిగా పేరొందిన విజయనగరంలో శక్తిమాతగా వెలుగొందుతున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 14 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. 14న తోలేళ్ల ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15న సిరిమానోత్సవం, 22న తెప్పోత్సవం, 29న ఉయ్యాల కంభాల ఉత్సవం, 30న చండీహోమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సిరులిచ్చే కల్పవల్లిగా .. సకల జగాలకు తల్లిగా.. కనకదుర్గ అంశగా, గజపతుల ఆడపడుచుగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రతి ఒక్కరూ కనులారా తిలకించాల్సిందే. 108 దేవాలయాలను ప్రతిష్ఠించిన విజయనగరం గజపతులకు చిహ్నంగా విరాజిల్లుతున్న శ్రీ పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా, కొంగుబంగారంగా నిత్య నీరాజనాలు అందుకుంటోంది. దేశంలోనే సిరిమాను ఉత్సవం జరిగే ఏకైక క్షేత్రంగా శ్రీపైడితల్లి అమ్మవారి ఆలయం నగర ప్రాశస్త్యాన్ని పెంచడమేగాకుండా ఈ నగర ఖ్యాతిని దేశవ్యాప్తం చేసింది. భక్తుల కోర్కెలను తీర్చే చల్లని తల్లిగా పూజలందుకుంటున్న శ్రీ పైడిమాంబ వెలసి 252 ఏళ్లు కావస్తోంది.
విజయనగరం పట్టణంలో పైడితల్లి అమ్మవారికి రెండు దేవాలయాలు ఉన్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పైడితల్లి ఆలయం అమ్మవారి పుట్టినిల్లుగా, మూడులాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి ఆలయం మెట్టినిల్లుగా విరాజిల్లుతోంది. వనంగుడిలో శ్రీపైడితల్లి అమ్మవారు శోభాయమానంగా కళలను చిందిస్తూ కాంతులు వర్షిస్తూ దేదీప్యమానంగా కొలువుదీరి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ముత్యాలమ్మ, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాలు దర్శనమిస్తాయి. ఇక అమ్మవారి మెట్టినిల్లుగా ఖ్యాతినొందిన చదురుగుడి ఆలయంలో పైడితల్లి అమ్మవారు చల్లని తల్లిగా, విశాలాక్షిగా దర్శనమిస్తోంది. ఆ అమ్మ దివ్య దర్శనం ఎంతో పుణ్యప్రదం. ప్రతీ ఏటా అమ్మవారి సిరిమానోత్సవాన్ని విజయదశమి (దసరా) తరువాత వచ్చే జయవారం (మంగళవారం) నాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సిరిమాను ఉత్సవానికి ఏ చింత చెట్టును సిరిమానుగా మలచాలో అమ్మవారే పూజారి కలలో కన్పించి చెబుతారన్నదీ ప్రతీతి. ఇలా ప్రతీ ఏటా సిరిమాను చెట్టును తీసుకువచ్చే తంతును ఓ పెద్ద ఉత్సవంగా జరుపుతారు. ఆలయ పూజారి సమక్షంలో ఈ వృక్షాన్ని నరికి పూజారి ఇంటికి తరలిస్తారు. అక్కడ సిరిమాను రథంగా మలుస్తారు. సిరిమాను ఉత్సవం రోజున సిరిమాను పీఠంపై ఆలయ పూజారి అమ్మవారి ప్రతిరూపంగా కూర్చొని భక్తుల నీరాజనాలు అందుకుంటారు. ఆ రోజున అంబరాన్ని తాకే ఈ సంబరాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచేగాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణా తదితర దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకిస్తారు. ఉత్సవ సమయంలో పైడితల్లి అమ్మవారికి జేజేలు పలుకుతూ ఆ చల్లని తల్లిని కీర్తిస్తారు. అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
పైడితల్లి ఆవిర్భావం వెనుక కథ
ఉత్తరాంధ్రులకు కొంగు బంగారంగా నీరాజనాలు అందుకుంటున్న పూసపాటి వంశీయుల ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారు జన్మవృత్తాంతంపై అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందరికీ ఆరాధ్య దైవంగా అలరారే శ్రీ పైడిమాంబ (పైడితల్లి) బొబ్బిలి యుద్ధం సమయంలో ఆమె భగవంతునిలో లీనమై దేవతగా ఆవిర్భవించిందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ విశ్వాసం. పైడిమాంబ 1757లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారం అవతరించిందని చరిత్ర చెబుతుంది. ఈమె అవతరణకు, బొబ్బిలి యుద్ధానికి సంబంధం ఉందని ఈ మట్టిపై పుట్టిన ప్రతీ ఒక్కరు విశ్వసిస్తారు. విజయనగర చరిత్రలో బొబ్బిలి యుద్ధానికి విశేష ప్రాధాన్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి ప్రత్యక్షంగా కోడిపందాలే కారణమైనప్పటికీ, లోలోన అంతర్లీనంగా తమ అంతరంగాల్లో రాజుకుంటున్న రాజకీయ ద్వేషాలే దావానలానికి దారితీశాయి. 17వ శతాబ్దంలో విజయనగర రాజులు నిజాం ప్రభువులకు సామంతులుగా ఉండేవారు. ఆ కాలంలో నిజాం రాజుల నిరంకుశ పాలనను అడ్డుకోవాలనే తలంపుతో విజయనగర రాజు బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలిపై యుద్ధానికి దిగారు. బుస్సీ కుతంత్రంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఆధ్యాత్మిక చింతనతో శాంతిని వాంఛించే పైడిమాంబ యుద్ధం వద్దని తన అన్న విజయరామరాజును ప్రాధేయపడింది. కాని విజయరామరాజు ఆమె మాటల్ని వినలేదు. పౌరుష ప్రతాపాలకు పదును పెట్టి 1757, జనవరి 23న బుస్సీ అండదండలతో బొబ్బిలిపై సమరశంఖాన్ని పూరించారు. 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. వెలమదొరలు ఎదలో రగిలే శౌర్య ధైర్యాలకు సానబట్టి, ప్రాణాలను తృణాలుగా భావించి విజయనగర వీరులతో పోరాడి వీరస్వర్గాన్ని అలంకరించారు.
విజయరామరాజు విజయలక్ష్మిని చేపట్టి తన గుడారంలో ఆదమరచి నిద్రపోతుంటే తాండ్ర పాపారాయుడు మాటువేసిన బెబ్బులిలా, కావలి వారి కళ్లుకప్పి వెనుకభాగం గుండా గుడారంలో ప్రవేశించి ప్రతీకార జ్వాలతో విజయరామరాజును పొడిచి చంపారని చరిత్ర చెబుతోంది. విజయరామరాజు మరణానికి ముందే పైడిమాంబ దేవీలో ఐక్యమైందని, ఆఖరి క్షణాల్లో ఆమె తన అన్నకు కలలో కన్పించి ముసురుకుంటున్న ముప్పును ముందే తెలియజేసిందని, విజయగర్వంతో విజయరామరాజు ఆ కలను నిర్లక్ష్యం చేసి బుస్సీ పడగనీడలో పరమపదించారనే కథ విశేష ప్రాచుర్యంలో ఉంది. విజయరామరాజు చెల్లెలి ప్రతిరూపమే పైడిమాంబగా అవతరించి అశేష ప్రజల ఆరాధనల్ని అందుకుంటుందని అందరూ అంటున్నారు.
* * *
పైడిమాంబ దేవీలో ఐక్యం కావడానికి వేరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అన్న విజయరామరాజు యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించినప్పటి నుంచి ఆమె అంతులేని ఆవేదనతో మంచం పట్టింది. ఈ ఆపద నుంచి తన అన్నను కాపాడమని పదే పదే దేవిని ప్రార్థించింది. దేవి ఉపాసన ఆమెకు వెన్నతోడి విద్య. కోటలో ఆమె మాట వేదవాక్కు. ఆధ్యాత్మిక చింతనే ఆమె అమూల్యాలంకారం. మనోనేత్రంతో బుస్సీ కుట్రను ముందుగానే ఊహించిందా అన్నట్టు ఆమె యుద్ధం వద్దని అన్నను వేడుకుంది. బుస్సీ కుటిల రాజకీయం ముందు ఆమె వ్యక్తీకరించిన నగ్న సత్యం నవ్వులపాలైంది. దేవీ ధ్యానముద్రలో తనకు లీలగా తెలిపిన బుస్సీ కుట్రను అన్న విజయరామరాజుకు తెలియజేయాలని, పతివాడ అప్పలనాయుడు సహాయంతో ఆమె బొబ్బిలి బయలుదేరింది. విజయనగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం చేరేసరికి అన్న పరమపదించారనే వార్త విని ఆమె స్పృహ కోల్పోయారు. అపస్మారక స్థితిలో ‘నేను బతకను. దేవీలో ఐక్యమైపోతున్నాను’ అని చెప్పి తన ప్రతిమ పెద్ద చెరువులో లభ్యమవుతుందని ఆ ప్రతిమను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వర్తించమని అప్పలనాయుడుతో చెప్పి ఆమె దేవీలో లీనమైందని అంటారు. అప్పలనాయుడు ఆమె ఆదేశాన్ని ఆనందగజపతికి అందజేసి ఆయన అనుమతితో పెద్ద చెరువు పశ్చిమ భాగాన, జాలారుల సహాయంతో ఆ విగ్రహాన్ని వెలికితీసి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టించారని చెబుతారు. ఆ తరువాత అక్కడే ఆలయాన్ని నిర్మించారని, ఆ ఆలయాన్ని వనంగుడి అని పిలుస్తున్నారు. ఆ తరువాత 1924లో మరో ఆలయాన్ని మూడులాంతర్ల వద్ద నిర్మించారు. అమ్మవారి అవతరణ రోజున ప్రతీ ఏటా సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. సిరిమానోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది.
తోలేళ్ల ఉత్సవం
సిరిమాను ఉత్సవానికి ముందర రోజు పట్టణంలో జరిగే తోలేళ్ల ఉత్సవం నుంచి ఉయ్యాల కంబాల వరకు సంబరాలుగా వ్యవహరిస్తారు. వీటన్నింటిలో తోలేళ్ల ఉత్సవం, సిరిమాను సంబరం ప్రధానమైనవిగా చెప్పవచ్చు. తొలేళ్ల (తొలి ఏరు ఉత్సవం) ఉత్సవాన్ని రైతులు తమ పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతీ ఏటా భూమి తల్లికి పూజలు చేస్తారు. సాధారణంగా కొత్త అమావాస్య రోజున కొన్ని ప్రాంతాల్లో నాగళ్లతో తొలేళ్ల ఉత్సవం నిర్వహిస్తున్నప్పటికీ సర్వమంగళ శక్తి స్వరూపిణిగా భావించే పైడిమాంబ పండుగనే తోలేళ్ల ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. సిరిమాను ఉత్సవానికి ముందు రోజు ఈ పండుగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఘటాలను ఊరేగింపుగా కోటకు తీసుకెళ్తారు. అక్కడ రెండు గంటల పాటు కోట శక్తికి పూజలు జరిపిస్తారు. ఆ తరువాత ఆ ఘటాలను అమ్మవారి గుడికి తీసుకెళ్తారు. మొత్తం ఆరు ఘటాలు ఉంటాయి. వాటిలో రెండు ఘటాలు పంచలోహాలతో తయారుచేసినవి కాగా, మిగిలిన నాలుగు ఘటాలు కంచుఘటాలు. వీటిని అమ్మవారి గుడికి ఎదురుగా ఉన్న బడ్డిపై అమర్చుతారు. ఆ సమయంలో పూజారి ఆ బడ్డిపై నిలబడి అమ్మవారి కథను భక్తులకు వివరిస్తారు. అదే రోజున ఆలయ పూజారి రైతులకు విత్తనాలను పంచుతారు. నాగళ్లతో భూమిని దునే్నముందు ఆ విత్తనాలను వేసి దున్నితే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం.
సిరిమానోత్సవం
పైడితల్లి ఉత్సవాలలో ప్రధానమైనది సిరిమానోత్సవం. అక్టోబర్ 15న జరిగే ఈ ఉత్సవంలో సిరిమానుపై అమ్మవారు పూజారి రూపంలో ఊరేగి భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. విజయనగర రాజులు ‘గజపతి’ బిరుదాంకితులు కావడమే గాక ఏనుగుపై కూర్చొని ఉత్సవంలో పాల్గొనేవారు. పూర్వం సిరిమాను రథం ముందు పట్టపుటేనుగు నడిచేదట. అయితే 1956 నుంచి ఏనుగుకు బదులు ఏనుగు ఆకారంలో ఉన్న బండిని ఏర్పాటు చేశారు. ఏనుగుపై పురుషులు స్ర్తి వేషాలు ధరిస్తారు. ఈ స్ర్తిలంతా పైడితల్లమ్మ అక్కాచెల్లెలైన గ్రామ దేవతలు. మగవేషంలో ఉన్న వ్యక్తి అమ్మవారి సోదరుడు పోతరాజు. స్ర్తి వేషాలను ధరించిన ఐదుగురు పురుషులు సిరిమానుకు ముందు అంజలి రథంపై కూర్చొని అంజలి ఘటిస్తారు. అంజరి రథం వెంట సిరిమాను వస్తుంది. అమ్మవారి పరిచారికలకు వీరు ప్రతీకలు. తోలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం రోజు సిరిమాను పీఠాన్ని అధిరోహించే పూజారి కటిక ఉపవాస దీక్ష చేస్తారు. సిరిమానోత్సవం రోజున మధ్యాహ్నం హుకుంపేటలోగల ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటి నుంచి సిరిమాను రథం బయలుదేరుతుంది. పూజారి ఇంటి నుంచి సిరిమాను, అంజలి రథం, జాలరి వల, తెల్ల ఏనుగు, పాలధార వేలాది మంది భక్తుల సందడితో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి ఆలయం చేరుకుంటాయి. పూజారి ఇంటి నుంచి బయలుదేరినది మొదలు పట్టువస్త్రాలపై ఆయన నడుచుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్న మార్గం గుండా భక్తులు పూజారి పాదాలపై పసుపు నీళ్లు పోసి, పూజారి ఆశీస్సులను అందుకుంటారు. పూజారి కాళ్లను చంటి పిల్లలపైనుంచి దాటిస్తే ఆ పిల్లలకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిరిమాను ఉత్సవం ప్రారంభమవుతుంది. మూడు లాంతర్ల వద్ద చదురుగుడి ఆలయం నుంచి కోట వరకు సిరిమాను ముమ్మారు ప్రదక్షిణలు చేస్తుంది. కోట బురుజు వద్ద ఆలయ అనువంశ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబీకులకు ఆశీస్సులు అందజేస్తుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు.

- బొండా రామకృష్ణ 9440332244