S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ తత్త్వానికి ‘రంగుల’ చిత్రిక!

ఓ తరం క్రితం నాటి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ముఖ్యంగా మహిళల జీవన విధానాన్ని, వారి ఆహార్యాన్ని అలంకరణను, హావభావాల్ని చిత్రకారిణి కనె్నకంటి వెంకట నాగమణి చిత్రిక పట్టి వీక్షకులను అబ్బుర పరుస్తున్నారు.
ఒకనాటి దొరసాని - దాసిని ఒకే ఫ్రేమ్‌లో ఆమె చూపారు. ఇద్దరి అలంకరణ ఆహార్యం, హోదా తదితర అంశాల్లోని వ్యత్యాసాన్ని రంగుల్లో తేటతెల్లం చేశారు. దొరసాని బంగారు రంగుల్లో కాంతులీనుతే, దాసి అల్లనేరేడు పండు తీరుగా నేలపై కూర్చొని తన దొరసాని వైపు చూడ్డం ఆనాటి సామాజిక ఆర్థిక స్థితికి అద్దం పడుతుంది. ఆ ఫ్రేమ్‌లోని వివరాలు అబ్బుర పరుస్తాయి.
చిత్రకళా రంగంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల చిత్రకళ యవనికపై ఇంతటి సామాజిక అంశాన్ని, సామాజిక తారతమ్యాన్ని పట్టి చూపిన మహిళా చిత్రకారిణి మరొకరు కనిపించరు. అలాంటి సామాజిక జీవితాన్ని చాలా దగ్గరుండి చూస్తే తప్ప ఆ దొరసాని - దాసి బంధాన్ని ఇంత బలంగా రంగుల్లో వ్యక్తీకరించడం కష్టం! ఈ ఒక్క బొమ్మ చాలు చిత్రకారిణి కె.వి.నాగమణి చిత్రరచనా విశిష్టతను వేనోళ్ల కీర్తించడానికి.. ఆ పట్టెమంచం, పరదాలు, గోడకు అద్దం, కింద వివిధ ఫలాలు - పాలు.. వాటిని ఆరగించిన దొరసాని.. అందించిన దాసి.. ఈ దృశ్యం ఈ తరం వారికి తెలిసే అవకాశం లేదు. గతంలో ఇది సర్వసాధారణం. దాన్ని చిత్రకారిణి చిత్రిక పట్టి ముందు తరాలకు భద్రపరచి చూపుతున్నారు. దొరసాని ధరించిన ఆభరణాలకు, దాసి ధరించిన ఆభరణాలకు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ అలంకార ప్రియులే అయినప్పటికీ వారి హోదాను ఆభరణాలే చూపుతాయి. కూర్చునే తీరు - వైనం వారి సామాజిక స్థితిని తెలియజేస్తోంది. ధరించిన వస్త్రాల రంగుల్లో సైతం తేడా కనిపిస్తుంది. దొరసాని - దాసి ఇద్దరు దాదాపు ఒకే వయసు వారైనా వారి చైతన్యం.. వారి వ్యక్తీకరణ భిన్నం. ఆ సంగతి ఆ రంగుల్లో, చూపుల్లో స్పష్టాతి స్పష్టంగా చిత్రకారిణి పట్టి చూపారు.
సరే దొరసాని - దాసి సంగతి అలా ఉంచితే.. మిగతా బొమ్మల్లో మూర్త్భీవించిన తెలంగాణ ‘తత్వం’, తెలంగాణ మహిళల అమాయకత్వం, అతి సాధారణ జీవితం, పెద్దపెద్ద కలలు కనకుండా కాలం తీసుకెళ్లే ‘దారి’లో కదులుతూ తమ జీవనాన్ని గడిపిన తీరు చిత్రకారిణి కళ్లకు కట్టారు. మహిళలంటే.. ముచ్చట్లు, ముచ్చట్లు అంటే మహిళలు. ఈ విడదీయరాని అంశాన్ని నాగమణి ఎంతో చక్కగా చిత్రించారు. ఇంటి గడప వద్ద మెట్లపై కూర్చొని ‘ముచ్చట్లు’ పెట్టే మహిళల బొమ్మలను ఆమె అనేకం గీశారు. తిరిగి వీటన్నింటిలో వైవిధ్యం కనిపిస్తోంది. వారు కూర్చునే తీరు, వేసుకున్న నగలు, ముచ్చట్ల సందర్భంగా వారు కూరగాయలు ఏరడం లాంటి చిన్నచిన్న పనులను చిత్రకారిణి ఎంతో ప్రతిభావంతంగా వ్యక్తీకరించారు. ఇక మహిళల మరో కార్యక్రమం.. వెంట్రుకలను దువ్వుకోవడం, తలలో ‘పేలు’ చూయించుకోవడం. ఏ మాత్రం విశ్రాంతి సమయం దొరికినా చాలామంది మహిళలు ఈ పనిలో మునిగిపోతారు. చిత్రకారిణి తన బొమ్మల్లో ఈ ‘క్రియ’ను ఎంతో సహజంగా పట్టి చూపారు. ఇప్పుడు ఈ రకమైన ‘దృశ్యాలు’ తక్కువగా కనిపిస్తున్నప్పటికీ గత తరంలో ఇదే ‘దృశ్యం’ పదేపదే కనిపించేది.
అలాగే ఇళ్లల్లో కిరసనాయిల్ ‘కందిళ్లు’ ఆడవారు వెలిగించి, ఓ కొక్కానికి తగిలించి, గది నిండా వెలుగు ప్రసరించేలా పెట్టడం ఆనవాయితీ.. ఈ ‘చర్య’ను సైతం చిత్రకారిణి తన బొమ్మల్లో చూపారు. దీపం పట్ల భక్త్భివం.. గౌరవ భావం మహిళలు వ్యక్తపరిచేవారు, ఆ ‘తాదాత్మ్యం’ ఆ బొమ్మల్లో తొణికిసలాడుతోంది.
తెలంగాణ మహిళకు ‘బతుకమ్మ’ పట్ల గల అభినివేశం.. ఆరాధనా భావం.. పూలను పేర్చేందుకు గుమిగూడే వైనాన్ని, తీరొక్క పూలతో పేర్చే సన్నివేశాన్ని సైతం ఆమె కాన్వాసుపైకి బట్వాడా చేశారు. ఇవన్నీ చిత్రకారిణి తనదైన ప్రత్యేక శైలిలో, రంగుల్లో, వాటి ఛాయల్లో చూపడం విశేషం. ‘తెలంగాణ జాగృతి’ ఇటీవల (2019 సం.) బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ‘ఆర్ట్ క్యాంప్’లోనూ చిత్రకారిణి పాల్గొని తనదైన శైలిలో బతుకమ్మను - బతుకమ్మ లాంటి మహిళను చిత్రించి తనదైన ‘ముద్ర’ను కనబరిచారు.
పల్లెలంటే మహిళలే కాదు, మగవారూ ఉంటారు కదా?.. అదో ఆ మగవారిని సైతం ఆమె చిత్రికపట్టారు. ఇక్కడా ఆమె ప్రత్యేకత తేటతెల్లమవుతోంది. మేకలు.. పశువులు కాసే వారు ఓచోట చేరి ఓ బండరాయిపై గీతలు గీసి రకరకాలైన ‘ఆటలు’ ఆడే దృశ్యాన్ని ఆమె చిత్రించారు. ఆ మగవారి తలలకు రుమాళ్లు, భుజాలపై దుప్పటి లేదా గొంగడి, చేతిలో కర్ర, ‘చుట్ట’.. వెనకాల ఆవులు.. ఈ దృశ్యాన్ని రంగుల్లో ఒక ఫ్రేమ్‌లో బంధించడం మామూలు విషయం కాదు. సబ్జెక్ట్‌పై సంపూర్ణ అవగాహన - ఆర్తి కావాలి. చూసిన ఆ దృశ్యాన్ని మనసులో నిలుపుకునే ‘ప్రతిభ’తోపాటు ప్రావీణ్యం కావాలి. వెంకట నాగమణిలో ఆ ప్రతిభ - ప్రావీణ్యం అపారంగా కనిపిస్తాయి. ఆమె గీసిన ఏ బొమ్మను తాకినా.. చూసినా, రంగుల నైపుణ్యం, ఫ్రేమ్‌లోకి వచ్చే వస్తువుల పొందికను గమనించినా ఆమె చేయి తిరిగిన చిత్రకారిణి అని ప్రపంచానికి చాటింపు వేయొచ్చు.
ఇక పల్లెల్లో అలంకార ప్రియులైన మహిళలు, వివిధ పనుల్లో - ఆటల్లో నిమగ్నమైన మగవారే కాక ప్రకృతి సోయగం ఎంతో ఆకట్టుకుంటుంది. నాగమణి ఆ పార్శ్వాన్ని సైతం తన చిత్రరచనలోకి తీసుకొచ్చారు.
నాగమణి ప్రకృతికి సంబంధించిన కొన్ని బొమ్మల్ని పెన‘డాయింగ్స్’ మాధ్యమంలో చిత్రిక పట్టారు. గ్రామాల్లో కొన్ని దశాబ్దాల నాటి చెట్లు పెద్దవి కనిపిస్తాయి. వాటి పరిసరాలు పచ్చగాగాక పాడుబడినట్టు కనిపిస్తాయి. ఆ దృశ్యాలను చిత్రకారిణి నలుపు తెలుపు డ్రాయింగ్స్‌లో ఎంతో వాస్తవికంగా, ఆకర్షణీయంగా చిత్రించారు. తాను చూసిన ‘అడవి’ని సైతం ఆమె కాగితంపైకి, కాన్వాసుపైకి తీసుకొచ్చారు. ఆ డ్రాయింగ్స్ చూస్తే ఇంత ‘పనితనం’ (క్రాఫ్ట్) చిత్రకారిణిలో దాగుందా?.. అని ఆశ్చర్యం కలుగుతుంది. నీటి ప్రవాహం పక్కన రాళ్లు రప్పలు, చెట్లు చేమలు, ఆకులు అలములను ఆమె చిత్రిక పట్టిన తీరు ప్రశంసనీయం.
ఇట్లా ఒకటా రెండా.. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సమర్థవంతంగా కాన్వాసు పైకి తీసుకొచ్చిన నాగమణి ఖమ్మం జిల్లా సుబ్బేడు గ్రామంలో 1971లో జన్మించారు. పాల్వంచలో ప్రాథమిక విద్య, ఖమ్మంలో ఉన్నత పాఠశాల విద్య చదివారు. అక్కడే చిత్రకళ పట్ల అనురక్తి ఏర్పడింది. దాంతో వాటర్ కలర్స్ - ఆయిల్‌తో బొమ్మల ప్రస్థానం ప్రారంభమైంది. చిత్రకళలో లోయర్ హైయర్ పరీక్షలను అక్కడే రాశారు. అనంతరం 2008లో జెఎన్‌టియులో బిఎఫ్‌ఏ కోర్సులో చేరి 2012లో పూర్తి చేశారు. ప్రొఫెషనల్‌గా చిత్రరచన - సృజన అక్కడే ప్రారంభమైందని, దాని కొనసాగింపుగా 2014-2016 సంవత్సరంలో ఎంఎఫ్‌ఏ అక్కడే పూర్తి చేశానని ఆమె తెలిపారు.
ప్రతి సంవత్సరం వివిధ నగరాలలో ఏర్పాటయ్యే గ్రూపు షోలలో తన చిత్రాలు ప్రదర్శితమయ్యాయని, తాను గీసిన బతుకమ్మ పెయింటింగ్‌ను తెలంగాణ మాజీ ఉపసభాపతి పద్మ ఇష్టపడి తీసుకున్నారని ఆ తీపి గుర్తును పంచుకున్నారు. అలాగే అడవిబాపిరాజు, బాపు తదితర ప్రముఖుల స్మారక అవార్డులు తన చిత్రాలకొచ్చాయని చెబుతూ ప్రస్తుతం తాను చదివిన కళాశాలలోనే ‘విజిటింగ్ ఫ్యాకల్టీ’గా పని చేస్తూ, రంగుల పాఠాలు బోధిస్తున్నానని ఆమె చెప్పారు. ‘మణి’పూస లాంటి బొమ్మలు సృజించాలని విద్యార్థులకు ‘మణి’దీపమై ఆమె మార్గదర్శనం చేస్తున్నారు.
కె.వి. నాగమణి 99635 47362

-వుప్పల నరసింహం 99857 81799