S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాతీయత వాదం.. రానడె నినాదం

భారతదేశం దక్షిణ భాగంలోని మూడు సముద్రాల (అరేబియన్ సము ద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం) సంగమ స్థలిని ఆనుకుని ఉన్న కన్యాకుమారి పుణ్యతీర్థం దగ్గరగా ఉన్న చిన్న కొండ మీద, మహిమాన్వితుడైన ఏకనాథ్ రానడె (వివేకానంద సందేశాల వలన ప్రభావితుడై, వివేకానందుని సందేశాలను భావితరాలకు అందించాలని) ‘వివేకానంద శిలా స్మారకం’ అనే జాతీయ స్మారక చిహ్నం నిర్మాణానికి స్ఫూర్తినిచ్చి, నిర్మాణం చేయించి, 1970 సెప్టెంబర్ 2న అప్పటి భారత అధ్యక్షుడు వి.వి.గిరితో ప్రారంభోత్సవం చేయించారు. 2019-2020 సం. ‘వివేకానంద శిలా స్మారకం’ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా వివేకానందుని గురించిన ఉపన్యాసాలు, ప్రసంగాలు, వక్తృత్వ పోటీలు, చర్చా వేదికలు నిర్వహిస్తున్నారు.
మహనీయుడైన ఏకనాథ్ రానడె 19 నవంబర్ 1914లో టింటాల (మహారాష్ట్ర) గ్రామంలో జన్మించి ఆరేళ్ల వయసులో బావగారైన అన్నసోహినిచే రాష్ట్రీయ సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేర్పించబడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపకుడైన డా.కె.బి.హెగ్డేవర్‌కి (ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు డాక్టర్ జీ అని పిలుస్తారు) సోహిని చిరపరిచితులు, దగ్గరైనవారు. రానడె మానసికంగాను, శారీరకంగాను శక్తివంతుడు అయినందువలన డాక్టర్ జీ రానడెను దేశభక్తి వైపు తిప్పగా, రానడె జాతీయతను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు. డాక్టర్ జీ సలహాతో నాగపూర్‌లోని హిస్లోప్ కాలేజీలో (క్రిస్టియన్ మిషనరీ కాలేజీ) వేదాంతం డిగ్రీ చదవడానికి వెళ్లారు. అక్కడ క్రైస్తవ మతానికి ఎక్కువ గౌరవం, హిందూ మతాన్ని ఎక్కువగా విమర్శించడం గమనించి, రానడె వివేకానందుని సాహిత్యం, ఉపనిషత్తులు చదివి బాగా ప్రభావితమైనాడు. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు.
ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకుగా పాల్గొంటూ బైబిల్ నేర్చుకుంటూ, భగవద్గీతను,వివేకానందుని సందేశాలను, బోధనలను ప్రచారం చెయ్యసాగారు. మరోవైపు 1938లో బి.ఏ. (ఆనర్స్), 1945లో ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. మరియొకసారి ఆర్‌ఎస్‌ఎస్‌లో మధ్యభారతానికి ప్రచార ప్రముఖ్‌గా నియమించబడి, తిరిగి చురుకుగా కార్యకలాపాలలో పాల్గొనేవారు. మహాత్మాగాంధీ మరణం తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ని బహిష్కరించి తిరిగి 1950లో ప్రారంభించి రానడెను ప్రచార్ ప్రముఖ్‌గా పూర్వాంచల్ (తూర్పు, ఉత్తర తూర్పు రాష్ట్రాలు, బెంగాల్, ఒరిస్సా) ప్రాంతానికి నియమించారు. ఆయన మహారాష్ట్రుడు ఐనా హిందీ, బెంగాలీ భాషలు క్షుణ్ణంగా నేర్చుకొని, ఆ భాషలలో ప్రసంగం చేసేవారు. ఆయన గొప్ప వక్త అవడం వలన హిందీలో, బెంగాలీలో అనర్గళంగా ప్రసంగించేవారు. దేశ విభజన జరిగిన తరువాత శరణార్థులకు ‘వస్తుహార సహాయ సమితి’ అనే సంస్థ ద్వారా పునరావాసం కల్పించారు. ఆయన 1953-1956 వరకు ఆర్‌ఎస్‌ఎస్‌లో జాతీయ నిర్వాహక కార్యదర్శిగా ఉండి, సంస్థ కార్యకలాపాలను క్రమబద్దం చేసి, 1956-1962 వరకు సాధారణ కార్యదర్శిగా, 1962- 1963లో అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్‌గా వ్యవహరించి, ఆర్‌ఎస్‌ఎస్ ను గ్రామాల వరకు విస్తరింపచేశారు. రానడెకు వివేకానందుని చెప్పిన విషయాల (దేశాన్ని పునరుద్ధరించడం అన్ని భాషల గొప్ప నాయకుల, యోచన పరుల వలన సాధ్యవౌతుంది) పై నమ్మకం ఎక్కువ. ఆయన స్వామీజీ రచనలలో నుంచి కొన్ని భాగాలను ‘రౌసింగ్ కాల్ టు హిందూనేషన్’ అనే గ్రంథంగా రచించెను.
స్వామి వివేకానందుడు దేశ సంచారం (పరివ్రాజకం) చేస్తున్నప్పుడు, కన్యాకుమారి (పార్వతి శివుని కోసం ఈ కొండ మీద కన్యగా తపస్సు చేసిందని, అక్కడ అమ్మవారి పాద ముద్రల వలన తెలుస్తున్నది) దగ్గర ఉన్న చిన్న కొండపై మూడు రోజులు (డిసెంబర్ 25,26,27 -1892) నిద్రాహారాలు మరచి ధ్యానం చేయగా జ్ఞానోదయం కలిగింది. అందువలన ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకుంది. 1963 (12 జనవరి 1863 స్వామీజీ పుట్టిన రోజు, 2 జులై 1902 సమాధి రోజు) స్వామీజీ శతజయంతి సందర్భంగా కొండపై ఆయన విగ్రహం ప్రతిష్ఠించాలని, రానడె కోరిక. ఐతే హిందువులకు, క్రైస్తవులకు మధ్య గొడవల వలన, 1963 ఆగస్ట్‌లో వివేకానంద స్మారక సమితి రానడెను నిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఆయన ముఖ్యులైన భక్తవత్సలం (తమిళనాడు ముఖ్యమంత్రి), హుమాయున్ కబీర్ (కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి). వీరిరువురు స్మారక కేంద్రానికి అడ్డం పడ్డారు. వీరిని ఒప్పించడమే కాకుండా పార్లమెంట్‌లో 323 సంతకాలు సేకరించి, స్మారకం కట్టడానికి అనుమతి సంపాదించారు. రామకృష్ణ మఠం, కలకత్తా విభాగం స్మారకం నిర్మాణంలో ఏ విధంగానూ కల్పించుకోకపోయినా, మఠం అధ్యక్షులైన విశే్వశ్వర నందజీ ఆశీర్వచనములతో, కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు రూపకల్పన చేసిన, చిన్మయనంద ప్రథమ విరాళం అందించిన స్మారకం నిర్మాణం గావించి, 1970 ప్రారంభోత్సవం చేశారు. వారి ఆర్థిక ప్రణాళికలో మొదట ప్రతిపాదించిన ధనం సరిపోనప్పుడు, ఎక్కువ భాగం రూ.1, రూ.2, రూ.5 విరాళాల ద్వారా, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయలు సేకరించి నిర్మాణం పూర్తి చేశారు. రానడె 1972లో కన్యాకుమారి పట్టణంలో ‘వివేకానంద కేంద్రం’ స్థాపించి వివేకానందుని సందేశాలను దేశం మొత్తం ముఖ్యంగా - ఉత్తర తూర్పు భాగమైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మొదలగు ప్రాంతాలలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
శిల మీద రెండు మంటపములు నిర్మించారు. ఈ శిల మీద అమ్మవారి పాదముల ముద్రలు ఉన్నాయి. అక్కడ శ్రీపాద పరై (శి) మంటపం నిర్మించారు. ఇది రెండు మంటపములలో ఒకటి వివేకానందుని విగ్రహం శ్రీ పాద పరై మండప ద్వారం ఎదురుగా ఉండేటట్టు వివేకానంద మండపం నిర్మించారు.
వివేకానందుని దివ్యత్వం గురించి..
స్వామీజీ మనకు స్ఫూర్తిని ఇచ్చింది ఆయన సహజమైన దివ్యత్వం వలన కాదు. మనలాగే మామూలు మనిషిగా జన్మించి, తపస్సు చేసి దివ్యత్వం సంపాదించుకున్నారు. ప్రతి మనిషిలోని సహజంగా కొంత మంచితనం ఉంటుంది. ఇలాంటి దివ్య పురుషుల సందర్శనంతో మనలో ఉన్న చెడుని వదిలేసి దివ్యత్వం పెంచుకోవచ్చు. కొంతమంది స్వామీజీని నాస్తికుడు అంటారు. కానీ ఆయన నాస్తికుడు కాదు. ఆయన తనని తాను నమ్ముతాడు. చేసే ప్రతి మంచి పనిలోనూ భగవంతుడు ఉన్నాడు. మంచి ఆలోచనను పెంచుకోండి. భయం వదలండి. ధైర్యంగా ఉండండి అని వివరించారు. రానడె వివేకానంద కేంద్రంలో ‘ఓం’ మంత్రం ఆరాధన ప్రవేశపెట్టారు. ఆయన గొప్ప నిర్వాహకుడు. ఆయన ఎప్పుడూ కార్యకర్తలకు ఇలా వివరించేవారు ‘ఒక మంచి ఆలోచన పెంచుకోండి. అదే నీ జీవితాశయంగా భావించండి. అదే ఆలోచించండి. కలలు కనండి. పూర్తి అయ్యేటట్టు చూండి’ అందుకే ఆయనను ‘కెప్టెన్’గా పరిగణిస్తారు.
రానడె ఒక కర్మయోగి. ఆధ్యాత్మిక దిగ్గజం. గొప్ప దేశభక్తుడు. రానడె శతజయంతి ఉత్సవాలు 2014 నవంబర్ 9న అప్పటి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభం చేశారు. మోదీజీ రానడె శిష్యుడు. రానడె వివేకానందుని సందేశాలు దేశంలోనే గాక ప్రపంచం మొత్తం వ్యాపింపచేయడానికి చాలా కృషి చేశారు. 22 ఆగస్టు 1982న చెన్నైలో పరమపదించారు. ఒక ప్రతిభావంతుడిని ప్రపంచం కోల్పోయింది.
రానడె కలలు- రెండు సందేశాలు
1.ప్రతి ఆత్మ యొక్క దివ్యత్వం సమర్థవంతమైనది.
2.పది మంది కోసం జీవించేవారు ఎల్లప్పుడు జీవించే ఉంటారు. మిగిలిన వారు బతికే ఉన్నా మరణించిన వారి కింద లెక్క. ఈ సలహాలను ప్రపంచంలో అందరూ ఆచరణలో పెట్టి, వాటిని భావితరాల వారికి అందించండి.
స్వామి వివేకానంద ధర్మ మార్గాన్ని శంఖం పూరించారు. ఏకనాథ్ రానడె మనని కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయించారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా నైతికత, శాంతి మార్గం వ్యాపింపజేశారు. అందరూ కూడా అదే మార్గంలో ప్రయాణించి రానడె సందేశాలను ‘వివేకానంద శిలా స్మారకం’ మరియు ‘వివేకానంద కేంద్ర’ ద్వారా భావితరాల వారికి అందించాలి.

- తీగవరపు వనజ 73827 62152