S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారతీయ సమైక్యతా దీప్తి

అపరిమితమైన కాలంలో పరిమితమైనది - మానవ జీవితం. అసలు, మనిషి మనిషిగా పుట్టటమే ఒక వరం. పూర్వజన్మ పుణ్యఫలం. విచిత్రమైన అనుభవాలతో నిండి, అవధుల్లేని ఆలోచనలతో నిండిన మనిషి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు, అగాధాలు, మలుపులు చోటు చేసుకుంటాయి. సృష్టిలోని యిన్ని ప్రాణుల్లోను ప్రకృతి నుంచి అనుభవాన్ని పొంది తన మార్గాన్ని మార్చుకోగలిగినవాడు, మార్చుకోవలసిన వాడు - మనిషి. మార్పు రాకపోతే చదివినవి, చూస్తున్నవి వింటున్నవి అనుభవిస్తున్నవి ఏవీ ఉపకరించవు. జీవితంలో మహోన్నత స్థానానికి ఎదగవలసిన మనిషి దిగజారిపోతాడు. చైతన్య రహితుడై స్థాణువులా అయిపోతారు. బాల్యంలోనూ వయస్సులోనూ వయస్సు మీరినా ఎంత వయస్సు వచ్చినా, చేసిన తప్పులే మళ్లీమళ్లీ చేసుకుంటూ పోతున్నాడు. వయస్సుతోపాటు వ్యక్తిత్వాన్ని పెంచుకోలేక పోతున్నాడు.
యాంత్రిక యుగంలో వున్న మానవుడు, జీవితంలో ఎదురయ్యే సమస్యలతో నిరాశ నిస్పృహ చెందక ఓర్పుతో ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ‘శక్తి’ని కూడగట్టుకుని తనలో ఉండే కామక్రోధాదులనే ఆరు విధములైన అజ్ఞాన తిమిర శత్రువులను సాత్విక సామరస్యమనే విజ్ఞాన జ్ఞానజ్యోతిచే పారద్రోలి, జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసికోవాలనే ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించి, ఆనందమయ జీవన సరళినీ మార్గాన్ని దర్శింపచేసే వెలుగుల పండుగ ‘దీపావళి’.
మనిషిలోని ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం అధర్మం అవినీతి అనేవి చీకటికి సంకేతం. ప్రేమ మంచితనం సత్ప్రవర్తన ధర్మం అనేవి ‘వెలుగు’కు సంకేతం. చీకటిని పారద్రోలి జ్ఞాన వెలుగును అనుగ్రహించి జీవితానికి చైతన్య దీప్తినిచ్చే పండుగ - దీపావళి.
‘్భ’ అంటే, కాంతి వెలుగు అగ్ని దీపము అనే అర్థాలున్నాయి. కనుక దీపమును అనగా అగ్నిని ఆరాధించేవారు భారతీయులు. అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకోవటానికి జ్ఞాన వెలుగును అర్చించి సత్యానే్వషణ చేసేవారు భారతీయులు. భారతదేశంలో దీపారాధన చేయకుండా, ఏ కార్యక్రమము ప్రారంభము కాదు. దీపారాధన ఒక యజ్ఞం. ‘యజ్ఞోవై విష్ణుః’ అన్నారు. ‘ఆవళి’ అనగా పంక్తి, వరుస అనే అర్థాలున్నాయి. కనుక, దీప పంక్తి, దీపముల వరుసయే - దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు వచ్చేది దీపావళి. దీపోత్సవముగా పండుగ జరుపుకుంటారు.
దీపావళి నాటి సాయంకాలం దీపములతో ఇళ్లను అలంకరిస్తారు. దీపమున్న ఇళ్లలో మహాలక్ష్మి ఉంటుంది. లక్ష్మీ కటాక్షాన్ని పొందవలెననే కాంక్షతో దీపారాధన, అగ్ని ఆరాధన చేస్తారు. దీపారాధన చేస్తూ ‘ఉద్దీప్యస్య జాతవేదో పఘ్నన్ నిర్ ఋతిం మమ’ అని ఓ అగ్నిదేవా, నా పాపములను పోగొట్టి నాకు వెలుగు, వివేకమును ప్రసాదింపమని ప్రార్థిస్తున్నాం.
ఆ విధముగానే శ్రీసూక్తం ‘చంద్రాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మమావహః సూర్యాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మమావహః’ అని చెప్పింది. ఓ అగ్నిదేవా, సూర్య చంద్రుల యొక్క హిరణ్య రూపమైన లక్ష్మీదేవి కటాక్షమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ‘ఉత్తిష్ఠత మాస్వప్త అగ్ని మిచ్ఛ్ధ్వం భారతాః’ భారతీయులారా సావధానంగా ఉండండి, అగ్నిని ఆరాధించండి, అగ్ని ఆరాధనకు ప్రతీకయే దీపారాధన. దీపారాధన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. ‘అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ’ అసత్యం నుండి సత్యం, చీకటి నుండి వెలుగును, అజ్ఞానము నుండి జ్ఞానమును, మృత్యువు నుండి అమృతము నాకు కలిగించమని ప్రార్థిస్తాం. జ్ఞాన దీపమునే, ఈ విశ్వానికి మొదట ఇచ్చింది - వేద శబ్దములు. కనుక ఆ వేద శబ్దావళియే దీపావళి.
పరమాత్మయే ప్రథమ దీపం
సమస్త విశ్వము దేనిచేత ప్రకాశింపబడుతుందో, దానినే ‘దీపము’ అని అంటారని ‘దీప్యతే అనేన’ అనే వ్యుత్పత్యర్థాన్ని చెప్పారు. పరమాత్మ లేకపోతే జగత్తు లేదు కనుక పరమాత్మయే ప్రథమ దీప్ము. ‘నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకమ్ యస్యభాషా సర్వమిదం విభాతి’ ఆ పరమేశ్వర రూప దీపంతోనే ఈ విశ్వం, సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశిస్తున్నాయి. కనుక, సూర్య చంద్ర నక్షత్రములు కూడా దీపములే దీనినే వేదము ‘వేదాహమేతం పురుషం మహంతమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్’ చీకటిని తరిమేసి వెలుగునిస్తూ ఆదిత్య స్వరూపుడైన ‘పరమాత్మయే ప్రథమ దీపము అని చెప్తుంది, దీపావళి పండుగ ఆ వెలుగే, ఆ చైతన్యమే, మన శరీరంలో అగ్నిజ్వాలగా అణువుకన్న సూక్ష్మంగా ఉంటుందన్నది - మంత్రపుష్పం. లోవెలుగును బాహ్యంగా దర్శించటానికే ‘దీపారాధన’. దీపాలను వరుసగా పెట్టే రోజు. ఆశ్వయుజ అమావాస్య సాయంత్రం, సంధ్యా సమయం - అదే దీపావళి, దీప ఆవళి - దీపముల పంక్తి - దీపముల వరుస దీపావళి.
‘దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే’
సాయం సంధ్యా సమయంలో ప్రతిరోజూ పెట్టే దీపాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్య నాటి సంధ్యా సమయంలో వరుసగా దీపాల్ని పెట్టి ఇంటిని దీపములతో అలంకరించి, ఆ వెలుగులో మహాలక్ష్మీదేవిని దర్శించి ఆరాధించే దీపాల పండుగ దీపావళి.
శ్రీరాఘవం, దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘులాన్వయ రత్న దీపం- రఘుకులమునకే దీపముగా శ్లాఘింపబడుతున్నాడు, శ్రీరామచంద్రుడు. ‘దాసీభూతసమస్త దేవ వనితాం లోకైక ‘దీపాం’కురామ్’ అంటూ జగన్మాతను మొదటి దీపముగా పేర్కొన్నారు. ‘జయ జయ వైష్ణవి దుర్గే పార్వతి లోకైక దీపే’ అని కీర్తించాడు శ్రీ శివనారాయణ తీర్థులు, శ్రీకృష్ణ లీలా తరంగిణిలో.
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే హరియట హరుడట సురలత నరులట అఖిలాండ కోటులటు, అందరిలో, గగనానిల తేజోజల భూమయమగు, మృగ భగ నగ త్యాగరాజార్చితుడిలలో. పరమాత్మ వెలుగు అంతటా నిండి ఉన్నది. హరిహరాది దైవ భేదములు, దేవ మానవ భేదములు ప్రసిద్ధములై ఉన్నా, అన్నింటా పరమాత్మ చైతన్య ప్రకాశము సాక్షి మాత్రమై వెలుగుతూ ఉంటుంది. పంచభూతములందు, మృగ పక్షులలో తరులతాదుల యందు సైతము అంతర్లీనమై పరమాత్మ వెలుగు దర్శనమిస్తుందని, వాగధీవశ్వరీ రాగం, ఆది తాళంలో, నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి అందించిన ఈ కీర్తన, వెలుగుల పండుగ దీపావళికి సంపూర్ణ దీప్తి నిస్తుంది.
సప్త స్వరావళియే దీపావళి
సామవేద సారము - సంగీతము - సమ్యక్ గీతం - సంగీతం. పరమశివుని, సద్యోజాత అఘోర ఈశాన తత్పురుష నామ దేవములనెడి పంచముఖముల నుండి సరిగమపదని - సప్తస్వరములు ఆవిర్భవించాయి. పృథివ్యాది పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు - అనేవి అష్టమూర్తులు. నిర్గుణుడైన పరమాత్మకు, ఈ అష్టప్రకృతులే శరీరము.
(నాదతను మనిశం శంకరం నమామి, యే, మనసా శిరసా, మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం, సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వర సప్తస్వర.. చిత్తరంజని రాగం, ఆదితాళం, సద్గురు త్యాగరాజ స్వామి వారి కీర్తన) ఈ అష్ట ప్రకృతులలో జీవతత్త్వము సప్త స్వరములై, జీవతత్త్వము అనాహ శుద్ధ నాదాత్మకమయినదని శాస్తమ్రు.
నాదోపాసనచే, సర్వదేవతలను నాదమందే దర్శించే ‘వెలుగు’ దర్శనీయం. కనుక సంగీత సప్త స్వరావళియే దీపావళి.
దీపావళి పండుగను ఐదురోజులు జరుపుకొంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తిక శుద్ధ విదియ వరకు సమగ్రమైన దీపావళి పండుగగా జరుపుకుంటారు. వివరాలలోకి వెళదాం.
ధనత్రయోదశి
దీనినే ‘్ధన్‌తేరాస్’ అని కూడా అంటారు. గృహాలను శుభ్రం చేసి రంగు రంగుల ముగ్గులు పెడతారు. వీధిలో వారి గుమ్మాలకు ఎదురుగా కూడా శుభ్రం చేసి రంగవల్లులు దిద్దుతారు. ఈనాటి నుంచి దీపాలు పెట్టటం మొదలుపెడతారు. శుచి శుభ్రత ఉన్న గృహంలోకి దీపమున్న ఇంటికి, మహాలక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం. అపమృత్యు భయం నివారణార్థం, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి ఇంటి ముందు పెడతారు. దీనినే యమ దీపమంటారు. ధన్‌తేరాస్ అని త్రయోదశి నాడు కొంతైనా బంగారాన్ని కొని, దీపావళి పండుగ నాడు పూజలో ఉంచుతారు.
నరక చతుర్దశి
ప్రతి పండుగ నేపథ్యంలోనూ ఒక అంతరార్థం ఉంటుంది. నరక చతుర్దశి, తరువాతి రోజు - అమావాస్య - దీపావళి. మొదటి రోజున, నరకాసురుణ్ణి వధించినందుకు అభ్యంగన స్నానం చేసి ఆనందోత్సాహములతో టపాసులు కాలుస్తారు. రెండవ రోజు వరుసగా దీపాలు వెలిగిస్తాము. అసలు ఎవరీ నరకాసురుడు? ఎందుకు వధింపబడ్డాడు? ఎవడో కాదీ నరకాసురుడు - శ్రీమహావిష్ణువు వరాహావతార మెత్తినపుడు, ఆయనకూ భూదేవికే సాంగత్యమేర్పడింది. దాని ఫలితమే ఈ నరకాసురుడు - భూదేవి కుమారుడు. వాడికా విషయం తెలియదు.
బ్రహ్మను గూర్చి కఠోర దీక్షతో తపస్సు చేశాడు, దారుణమైన వరాలు అడిగి, పొందాడు. వరగర్వంతో స్వర్గం మీద దండెత్తాడు, దేవతలను హింసించి స్వర్గ్ధాపతి అయినాడు. యజ్ఞ యాగాది ఫలములన్నీ వాడికే చెందాలని మహర్షులను నిర్బంధించాడు. వారంగీకరించకపోతే చిత్రహింసలు పెట్టాడు. వాళ్లంతా శ్రీకృష్ణుని ప్రార్థించారు. నరకాసురుణ్ణి వధించి, ధర్మాన్ని నిలబెడతానన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ. సత్యభామతో సహా బయలుదేరాడు యుద్ధానికి.
నరయతే ఇతి నరః
అజ్ఞానమనే అంధకారానికి సంకేతమే - నరకుడు ‘నరయతే ఇతి నరః’ ముక్తి లభించే వరకూ వదలని తత్త్వం. జీవ భావం. జీవుడు నరుడైతే, జీవుడికి ఉన్న అజ్ఞానం - నరకుడు. అదే ‘అసుర’, స్వరూపంతో రాజిల్లేది - సుర, అనగా జ్ఞానం. అది లేకపోతే అసుర. అజ్ఞానమున్న నరుడు. అసురుడు ప్రాగ్జోతిషమే నివాస స్థానం. ప్రాక్కంటే ఏమిటి? ప్రాచీనం. ఏమిటి దానర్థం? పురాతనం నుంచీ మనలో ఆత్మ చైతన్య జ్యోతి ఉంది. ఎప్పుడూ ఉంటుంది. దాన్ని గుర్తిస్తే మనలో అసుర భావనలు నశిస్తాయి, మానవతా విలువలు తెలుస్తాయి, దైవ తత్త్వం అంకురిస్తుంది. ఆ వెలుగు ద్యోతకమవుతుంది. అది లేకపోతే అసుర తత్త్వంతో నరకాసురులమే.
శ్రీకృష్ణుడు - ద్వారక
పరమాత్మ అసుర భావాన్ని శిక్షించదలిచాడు. ఆయన ఎక్కడున్నాడు? ద్వారకలో. ద్వారకంటే ఈ శరీరమే. నవ ద్వారమైన పురమిది. ఇందులో ఉన్న అంతరాత్మ కృష్ణుడు. కర్తతీతి కృష్ణః అసుర సంపదను తరిమేస్తాడు. దేనితో? సత్యభామా సహాయంతో. సత్యమైన ‘్భ’ - సత్యభామ. ‘్భ’ అంటే వెలుగు, దీప్తి, చైతన్యం, శాశ్వతమైన చైతన్య దీప్తి. ఆ యోగ మాయా ప్రభావంతో దండెత్తి వచ్చాడు, నరకుడి మీదికి. వాడిలో పాతుకుపోయిన అసుర గణాలకు మట్టుపెట్టాడు.
ప్రాగ్జోతిషపురం
ప్రాగ్‌ః జ్యోతిః షః పూర్వపు జ్యోతిని మరచిన వారి పురము - ప్రాగ్జోతిష పురము. ప్రకృతి వాంఛలకు ప్రభావితులై అధర్మ వర్తకులై దుష్కృత్యములు చేసే వారందరూ నరకులే అని, అందులో ఉన్నది ఒకే చైతన్యం ఉన్న తత్త్వాన్ని తెలిసికొన్నవాడు నరుడు, ఆపైన నరోత్తముడని చెప్తుంది నరక చతుర్దశి. ‘ప్రాగ్యోతిషపురం’ అనేది నరకుని రాజధాని. అంటే జ్యోతిర్మయమునకు ముందున్న అంధకార స్థితి. కనుక నరకుడు అంటే అజ్ఞానాంధకారంలో ఉండి, అధోగతి పాలైన నరుడు.
వశిష్ఠుని నివాసం
నరకుడు కామరూప దేశాన్ని చాలాకాలం పరిపాలించాడు. ద్వాపర యుగంలో, నరకుడికి మరో రాక్షసునితో సఖ్యత ఏర్పడింది. ఆ ప్రభావంతో నరకుడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ట మహర్షి ప్రాగ్జోతిష పురంలోని కామాక్యాదేవిని, పూజించటానికి వెడుతుంటే, ఆలయం తలుపులు మూయించాడు నరకుడు. దానికి కోపించిన వశిష్ఠుడు ‘నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’ అని శపించాడు.
సత్యాకృష్ణులు
మాయను జయించి, మనస్సును స్వాధీనంలో ఉంచుకొన్న యోగేశ్వరేశ్వరుడు, పూర్ణ పుణ్యావతారుడు - శ్రీకృష్ణుడు. అందుకే ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నారు. అన్నమయ్య ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు’ అన్న కురంజిరాగ, ఆది తాళ నిబద్ధనలోని కీర్తనలో అద్భుతంగా చెప్పాడు.
వ్యక్తిలో స్వార్థం విజృంభిస్తే అధర్మం ప్రబలుతుంది. సమాజంలో సమన్వయ దృష్టి, సమరస భావం మృగ్యమవుతాయి. అవి లోపిస్తే సంఘర్షణ మొదలవుతుంది. సంఘర్షణలో వ్యక్తులు అదుపు తప్పి ఎవరికి తోచినట్లు వాళ్లు, ఎవరికి బలం ఉన్నంతవరకు వాళ్లు సమాజాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. దుర్మార్గులది బలవంతులది పైచెయ్యి అవుతుంది. బలహీనులు సాధు జనులు బాధలకు గురి అవుతారు. సమాజం అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలాన్ని అణచి, వ్యక్తి స్వార్థాన్ని అదుపులో పెట్టటానికి, దుష్టశిక్షణ శిష్ట రక్షణకు, ధర్మ పునరుద్ధానానికి అవతరించిన పరబ్రహ్మమే - శ్రీకృష్ణ పరమాత్మ.
అర్జునుని నిమిత్తంగా చేసి, గీతా సారాన్ని బోధించి జీవన గతిని నిర్దేశించి, హంసల ఆధ్యాత్మిక చిరుశబ్దాలు అందెల రవళులు కాగా, కనుల కొలనులలో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసంగా విశ్వమోహన మురళీగానంతో జీవన గీతాన్ని సుమనోహరంగా గానం చేయించి, జీవిత పరమార్థాన్ని బోధించిన కరుణామయుడు, ఆచార్యాగ్నిహోత్రుడు - శ్రీకృష్ణుడు. గరుత్మంత వాహనంపై వచ్చి శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై, నరకాసురునితో యుద్ధం చేశాడు.
వీర శృంగారమూర్తి అయిన సత్యభామ ముఖం, హరికి చంద్రబింబం, అరికి (నరకాసురునికి) ప్రచండ సూర్యబింబంగా గోచరించింది. ఆమె చేలాంచలం హరికి మన్మథకేతువు, నరకుడికి ధూమకేతువు. ఆమె రూపం హరికి అమృత ప్రవాహం, నరకునికి సందోహం. ఆమె బాణ వృష్టి హరికి హర్షదాయి, అరికి మహా రోషదాయి. ఆ మహా సమరాంగణంలో, సత్య కరాళ కాళికాకృతి దాల్చింది. ఆమె బాణాగ్నికి నరకుని సైన్యం మలమల మాడిపోసాగింది. రోషాయిత నేత్రములతో భీకరాకారుడై నరకుడు తనలోనున్న కామ క్రోధాది ఆరు స్థితులకు ప్రతీకగా ఆరు బాణాలను సత్య పాలిండ్లపై ప్రయోగించాడు నరకుడు.
శ్రీకృష్ణుని వైపు మేలు చూపులతోనూ, అసురపతి (నరకుడు) వైపు వాడి తూపులతోనూ, సత్యభామ విజృంభించింది. రణభూమిలో ఒకవైపు భర్తకు సంతోషాన్ని, మరొకవైపు నరకునికి సంతాపాన్ని కలిగించిందని నాచన సోముడు సందర్భోచితంగా మత్త్భేవృత్తంలో అద్భుతంగా వర్ణించాడు.
కుసుమకుమారి అయిన సత్యభామ భీకరాకారం దాల్చింది. బొమ్మ పెండ్లిండ్లకు పోలేని సత్య, రణ రంగంలో వీర విహారం చేసింది. మగవారిని చూస్తేనే మరుగుకు పోయే మగువ, శత్రువీరులను మట్టుపెట్టింది. బంగారు ఉయ్యాల ఎక్కటానికి భయపడే బాల, ఖగపతిని అనగా అతివేగంగా వెళ్లే గరుత్మంతుని అధిరోహించింది. చెలికత్తెల కోలాహలాన్ని భరించలేని సుకుమారి, పటహభాంకృతులను సహించింది. నెమళ్లకు నృత్యం నేర్పితేనే అలసిసొలసిపోయే అతివ, ప్రత్యాలీఢ పాందెంతో పగతురను చీల్చి చెండాడింది. ఆనాడు వీరమే, ఆడతనంపు రూపును ధరించింది. ‘వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని యయ్యెనో యనగ’ సత్యభామ రూపమున్నదని, ఏనాటికీ మరిచిపోలేని ‘సత్య’ రూపాన్ని హృద్యంగా వర్ణించాడు, సహజకవి, పరమ భాగవతోత్తముడు పోతన.
నరకాసుర వధ - ఆంతర్యం
సత్యమైన చైతన్యదీప్తి - భా. అదే పరమాత్మకు నిత్య సిద్ధమైన సంపద. దానితో నరకాసురునిలోని అసుర గణాలను పారద్రోలాడు. నరకుని కుమారుడు సహదేవుడు. అతణ్ణి ప్రాగ్జ్యోతిష పురానికి రాజుని చేసి ధర్మ సంస్థాపన చేశాడు - శ్రీకృష్ణుడు. దేవతల తల్లి అదితి. ఆమె ధరించిన కుండలాలను అపహరించి తెచ్చుకున్నాడు నరకుడు. అదితి అంటే పూర్ణమైన ఆకాశ తత్త్వం. దానికున్న కుండలాలు ఏవో కావు - సూర్యచంద్రులే, అనగా మనః ప్రాణాలు, జ్ఞాన క్రియా శక్తులు. వాటిని రాక్షస బలంతో కాజేసినా, అవి కాజేసిన వారికి ఉపయోగపడవు. ఆత్మచైతన్యంతో అవి దగ్గరవుతాయి, ఉపయోగపడతాయి. ఇది నరకాసుర వధలోని ఆంతర్యం.
‘అర్ధాంగి’ శబ్దానికి అర్థవంతంగా నిలిచి, సార్థకత్వం కలిగించిన వనితారత్నంగా, రణరంగంలో నాథునికి అండగా నిలిచి కాపాడిన వీరనారిగా సత్యభామ చిరస్థాయిగా నిలిచిపోయింది. భాత లలనా వనంలో ఒక సుగంధ పారిజాతం - సత్యభామ.
దీపావళి అమావాస్య
ఆత్మచైతన్యమే ‘దీపం’. అది అవిచ్ఛిన్నంగా ఎడతెగకుండా అనుసంధానమవుతూ పోతే, అది దీపావళి. అజ్ఞాన తమస్సును తరిమివేసే తారావళి - దీపావళి. అమావాస్యనాడు రావాలది. సత్వ, రజ తమో త్రిగుణాత్మకమైన సృష్టికంతా జవాబు చెప్పే త్రిలోకహారావళి - దీపావళి. ‘అమా’ అంటే ‘దానితోపాటు’ అని అర్థం. ‘వాస్య’ అంటే వసించటం. అనగా చంద్రుడు, సూర్యుడిలో చేరి వసించే రోజు - అమావాస్య అన్నారు. సూర్యుడు స్వయం ప్రకాశమైన పరమాత్మ చైతన్యం. చంద్రుడు జీవుడే, మనస్సు ఆయన ఉపాధి. మన మనస్సు పరమాత్మ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి, దైవభావం సిద్ధించటమే నిజమైన అమవాస్య. కనుకనే ఈ అమావాస్య అంధకారం కాదు. జ్ఞాన వెలుగులో మునిగి, దీపావళిగా మారింది. జాగ్రత్, స్వప్న సుషుప్త్యావస్థలైన మూడు అవస్థలను దాటి, తురీయమైన చతుర్దశి నందు కొంటినే, అమావాస్య చూడగలుగుతాం. దాన్ని చూస్తేనే దీపకాంతికి నోచుకుంటాం. కనుకనే చతుర్దశి నాడు మనలో ఉన్న నరకాసురుణ్ణి వధించి అమావాస్యనాడు జ్ఞానదీపాన్ని వెలిగించాలి. అందుకు సత్యమైన చైతన్య దీప్తిగా యోగేశ్వరేశ్వరుడైన పరమాత్మ తోడుగా ఉండాలి. ఇదే దీపావళి పండుగలోని ఆధ్యాత్మికత.
దీపోత్సవం
దీపావళి అంటే దీపోత్సవమే. ఈ రోజు దీపలక్ష్మి తన వెలుగులతో, అమావాస్య చీకట్లను పారద్రోలి, జగత్తును తేజోవంతం చేస్తుంది.
‘తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథా వసేత్
అలక్ష్మీ పరిహారార్థం తైలా భ్యంగో విధీయతే’
దీపావళినాడు, నూనెలో (నువ్వుల నూనె) లక్ష్మీదేవి, నదులు చెరువులు బావులు మొదలైన జలవనరులలో గంగాదేవి, సూక్ష్మరూపంలో నిండి వుంటారు. ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు, అరుణోదయంలో అభ్యంగన స్నానం చేయడం వలన దారిద్య్రం తొలగడమే కాక, గంగానదీ స్నాన ఫలం లభించి నరక భయం ఉండదని పురాణాలు చెప్తున్నాయి.
ఇళ్ల ముందు ముగ్గులు వేసి, గుమ్మాలకు పసుపు కుంకుమలు పెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి, రకరకాలైన పిండివంటలు చేస్తారు. సాయంత్రం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి, దూది ఏకులతో వత్తుల్ని చేసి, వాటిని ప్రమిదలలో వేసి, మొదటగా ఇంట్లో దేవుని గదిలో దీపారాధన చేసి, తరువాత ఇంటి బయట అమర్చిన ప్రమిదలలోని వత్తులను వెలిగించి ఒక పంక్తిగా, వరుసగా శోభాయమానంగా, కమనీయంగా, రమణీయంగా దీపాలు పెడతారు.
ప్రబోధమనే ప్రమిదలో వైరాగ్యమనే తైలాన్ని పోసి అందులో భక్తి అనే వత్తిని వెలిగించి జ్వలింపచేస్తే, అది విశ్వ ప్రేమను ప్రేరేపించి విశ్వకళ్యాణానికి దోహదం చేస్తుంది. ఇదే దీపాల పండుగ దీపావళికి స్ఫూర్తి, దీప్తి.
‘నేను అస్తమించిన తరువాత, నా పని నిర్వర్తించేది ఎవరు? అని ప్రశ్నించాడు సాయంకాల సూర్యుడు. ‘నేనా పని చేస్తాను’ అని బదులిచ్చింది, చిన్న సంధ్యాదీపం, అని అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ ‘సంధ్యా దీప నమోస్తుతే’.
విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో..
రాముడొక్కడే దిక్కని భావించి, సంపూర్ణ దాసోహ భావంతో, సాత్విక భక్తి విశ్వాసములతో త్రికరణ శుద్ధిగా రామచింతనతో కాలం గడుపుతున్న శబరితో, రాముడు ‘అవ్వ ఎంతో తపించి నీ ఆయువంత ఏర్చి యిట్లు ఏకైతివేమి?’ అనగా ‘ప్రభువ స్నేహంబుచేత ఆర్ద్రంబు చేసి, ఇంత ‘వత్తిగా’ నన్ను వెలిగించవే’ అంటే, పరవశించిన స్వామి పునరావృత్తి రహితమైన మోక్షాన్ని శబరికి ప్రసాదించాడని ‘రామాయణ కల్పవృక్షం’లో విశ్వనాథ వారు శబరి ఘట్టంలో వర్ణించిన విషయం, దీపావళి పండుగకు స్ఫూర్తినిస్తుంది.
మహాలక్ష్మీ పూజ
‘హిరణ్య వర్ణాం హరిణీమ్ సువర్ణ రజత స్రజామ్ చంద్రాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మమావహ’ అన్నది శ్రీసూక్తం. హితము, రమ్యము అయినది బంగారం. బంగారంలో ‘అగ్ని’ ఉంటుందని వేదం చెప్పింది. బంగారపు కాంతి వంటి పచ్చని వర్ణం కలిగి, బంగారు వెండి ఆభరణములతో, పూలదండలతో అలంకరింపబడి, చంద్రుని వలె మనోరంజకమై, సువర్ణ రూపమైన శ్రీమహాలక్ష్మిని, మా కొరకు ఆహ్వానించవలసినదిగా దీపారాధన చేసి, అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు. త్రిమాతా స్వరూపిణి అయిన మహాలక్ష్మీదేవికి సంధ్యా సమయంలో స్వాగతం పలికి, ఎల్లప్పుడూ తమ ఇళ్లలో కొలువు తీరమని ముంగిళ్లలో దీపాలు పెట్టి దివ్య తేజస్సును పొందే హిరణ్మయ పండుగ దీపావళి.
పితృదేవతలకు తర్పణాలు
చంద్ర మండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలు, అమావాస్య తిథి - మిట్టమధ్యాహ్నం అవుతుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చే దీపావళి అమావాస్యనాడు పితృ తర్పణాలు ఇస్తే వారికి ఉత్తమ లోకప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయి. నరకంలో ఉన్న పితరులు ఈ రోజులలో బయటకు వస్తారని, వారికి కారువులు అనగా దివ్వెలు దారి చూపిస్తాయని, నరక నివారణార్థం బాణాసంచా కాలుస్తారు. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం విధాయకం. ఇది తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే వర్తిస్తుంది. తల్లిదండ్రులు జీవించి ఉండగా చేయకూడదు.
బలిపాడ్యమి
దీపావళి మరునాడు బలిపాడ్యమి. బలి చక్రవర్తి, దాన గుణానికి సంతోషించి, వామనుడు అతనికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించాడు. అజ్ఞాన చీకటిని పారద్రోలి జ్ఞాన దీపాల్ని వెలిగించటానికి, సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి పాతాళం నుంచి భూమి మీదకు వచ్చే వరాన్ని పొందాడు. ఆ కారణంగా ఈ పండుగ చేసికొంటారు.
యమ విదియ: భగినీ హస్త భోజనం
కార్తిక శుద్ధ విదియని, యమ విదియ ‘్భగినీ హస్త భోజనం’ అని పిలుస్తారు. యమ ధర్మరాజు చెల్లెలైన యమున ఇంటికి ఈ రోజున భోజనానికి వస్తాడు. చెల్లెల్ని ఏదైనా కోరుకోమంటాడు. ఈ రోజున సోదరి చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా కోరింది. ‘తథాస్తు’ అన్నాడు యముడు. అందుకే ఈ రోజు సోదరులు సోదరీ మణుల ఇంట్లో భోజనం చేస్తారు.
‘ఏహి అన్నపూర్ణే సన్ని దేహి సదాపూర్ణే మాంపాహి’ అని ముచ్చటగా కీర్తించాడు, ముత్తుస్వామి దీక్షితులు. ‘కాశీ’ అంటే ‘వెలుగు’. వెలుగు పండుగైన దీపావళినాడు, సువర్ణ అన్నపూర్ణాదేవి కాంతులీనుతూ, దివ్య తేజస్సుతో భువనావళికి చైతన్య దీప్తి నిస్తుంది. దీపావళి. భారతదేశంలో వివిధ జాతులవారు, కులములు, మతములు, వర్ణవర్గముల వారు ఎంతోమంది ఉన్నారు. అందరినీ సమైక్యపరచేది, దీప్తినిచ్చేది - దీపావళి.
సర్వమానవ సౌభ్రాతృతతో విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షించే వెలుగును పొందాలని మానవాళికి దివ్య సందేశాన్నిస్తోంది - దివ్య దీపావళి.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464