విగ్రహాలు
Published Saturday, 2 November 2019విగ్రహం విశ్వరూపుని ప్రతిరూపం
విత్తనంలో వృక్షంలా విగ్రహంలో విరాట్టు
కన్నులు చాలని భూగోళానికి
గ్లోబేగా సూక్ష్మ ప్రతిమానం
నీటిలో నిజం నీడలా కదలాడేను
మూర్తిలో పరమాత్మ జాడ తొలకాడేను
దరిజేర్చే దారిలా గుఱి కుదిర్చే గుఱుతు విగ్రహం
మనసుంటే మట్టిలోనూ మతం
నమ్మితే రాతిలోనూ దైవం
ప్రేమిస్తే బొమ్మలు ప్రాణం పోసుకుంటాయి
పూజిస్తే విగ్రహాలు అనుగ్రహిస్తాయి
విగ్రహాల విలువ తెలిసిన వాళ్లం కాబట్టే
వాటికి గుడి కడతాం గుండెల్లో పెట్టుకుంటాం
విగ్రహాలంటే అంతే!
ముక్కూ ముఖం లేనిదైనా శివలింగ దర్శనం
ఎంత చూసినా తనివి తీరని తన్మయత్వం
మేఘంలో మెరుపులా విగ్రహంలో వేలుపు
విగ్రహాలు ఆధ్యాత్మిక జీవన ప్రమాణాలు
తరతరాల మన ఆచారాలకు తార్కాణాలు
నమ్మి చెడిన వాడెవడు?
నమ్మక బాగుపడిన ఘనుడెవడు?
విగ్రహం దేవుని ఆనవాలు
అనుగ్రహం అతని చేవ్రాలు