S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రప్రథమ రోదసీ మహిళ ‘వాల్యా’

ఉధ్యోగరీత్యా ఎంతోమందిని కలిసి సంభాషిస్తాం. ప్రతిసారి అది ‘థ్రిల్’ ఇవ్వదు. కానీ 1963, నవంబర్ 14న వాలెంతినా తెరెష్కోవాతో కరచాలనం చేసి కేవలం అయిదు నిమిషాలే సంభాషించిన నేను ఇప్పటికీ ఆ మధుర క్షణాల స్ఫురణతో మురిసిపోతుంటాను. ఎక్కడ ప్రప్రథమ రోదసీ మహిళ? ఎక్కడ నేను? ఆమె నాడు పతీసమేతంగా మద్రాస్ వచ్చింది. వారిద్దరితోపాటు 119 గంటలు అంతరిక్షయాన రికార్డును స్థాపించిన వారి నేస్తం - గ్రద్దముక్కు బైకోవిస్కీని కూడా వెంటబెట్టుకొని వచ్చింది.
రెండు రోజుల ఇరవై రెండు గంటల నలభై నిమిషాల పాటు, పనె్నండు లక్షల యాభై వేల మైళ్ల దూరం గంటకు పద్దెనిమిది వేల మైళ్ల వేగంతో రోదసీలో 48 సార్లు తిరిగి, తిరిగి భూమిని చుట్టి వచ్చిన మన అద్భుత రష్యన్ వనిత ఇరవై ఆరేండ్ల వాలెంతినా తెరెష్కోవా జూన్ 16, 1963 నాడు చరిత్ర సృష్టించింది - మరో చిత్రం - ఆమె అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన వ్యోమనౌక వోస్తాక్ - నెంబర్ ఆరు. సరే, కానీ నవంబర్ మూడో తేదీన, వాస్తాక్ నౌక, నెంబర్ మూడులో అంతరిక్షయానం చేసి వచ్చిన మేజర్ నికొలోమేన్‌ని పరిణయమాడింది.
ఆ విధంగా ఆ ముగ్గురు వ్యోమగాములు ఇండియాలో బాలల దినోత్సవంనాడు మద్రాస్‌కు చేరుకున్నారు. ఘన సన్మాన సత్కారాల కోసం - స్నేహం కోసం.
విదేశస్థులకు అనుకూలంగా వుండే నాటి స్టార్ హోటల్. హోటల్ ‘కాన్నిమరా’లో రిసెప్షన్ - చాలా కొద్దిమందికే ఆహ్వానం. ప్రవేశం మరీ స్ట్రిక్టు!
ఈ ఆహ్వానం అయ్యవారికి (శంభూప్రసాద్ గారు) వచ్చింది. ఆయన మా రాధాకృష్ణ గారికి ఇచ్చాడు. ఈయన నాకు ఇచ్చి ‘యూ లైకిట్ - బెటర్ గో’ ఎందుకంటే మీరు దాన్నుంచి ఓ ఫీచర్ లాగుతారు అన్నాడు. అట్లా వెళ్లాను నేను. ఆ దిక్కుమాలిన హోటల్‌లోకి ‘ఆటో’లో పోతే రానివ్వరు. టాక్సీలో వెళ్లాను.
అక్కడ వాల్యా యే స్టార్ అట్రాక్షన్. మిగతా ఇద్దరు రోదసీ వీరులు. ‘తయనాతు’ గాళ్లులాగా అయిపోయారు. ‘వాల్యా’ అన్నది తెరెష్కోవా ముద్దు పేరు. ఆమె గురించి ఇంగ్లీషు ప్రెస్‌లో ఎన్నో విశేషాలు. చదివిన వారికి మరీ కుతూహలం కలిగింది. ఆమె క్రిస్టీన్ కలరా? ఎలిజబెత్ టేలరా? పోనీ ఇంగ్రిడ్ బెర్గ్‌మన్? ఇందిరాగాంధీ లాంటి గ్లామర్ కల స్టారా? కానీ అంతకన్నా గ్లామర్ ఆమెది. అయితే ‘టైమ్’ ‘డైలీ మిర్రర్’ ‘న్యూస్ వీక్’ లాంటి పత్రికలలో రాసిన ఆమె యొక్క అల్ట్రా మోడరన్ ఫ్యాషన్ లాంటిదేమీ కనపడలేదు. ‘రోదసీ యానం స్ర్తి పురుషులు ఇద్దరికీ సమానమేనని వాదించే’ ఈ యువతి నాటి సాయంకాలం కంచి పట్టుచీర నిండుగా ధరించింది. అరవ వాళ్లూ అంతే. మద్రాసు రాంగానే ‘మెస్మరైజ్’ చేసి - కంచిచీర చుట్టేసి ముగ్ధుల్ని చేస్తారు. పైగా ‘వాల్యా’ మా అందరికీ ‘వణక్కమ్’ అంటూ గ్రీటింగ్సు చెప్పింది. అయితే ఎవ్వరం ‘వొణకలేదు’ అనుకోండి- కాకపోతే ఆమె మన విజయలక్ష్మీ పండిట్ మాదిరి ‘స్లీవ్‌లెస్ జాకెట్’ ధరించింది. ‘నారింజకు నీరువోయు ‘శశిరేఖవె’ నీవు అన్నట్లుంది.
వాల్యా ఒక ట్రక్కు డ్రైవర్ కూతురు. తల్లితోపాటు ఒక టైరుల కంపెనీలో పనిచేస్తూ - ఆనక ఒక నూలు మిల్లులో కార్మికురాలిగా చేరి - పని చేసుకుంటూనే రాత్రి పాఠశాలలో చదువుకుంది. తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేది. అంతరిక్ష యానం కక్ష్యలో ప్రవేశించగానే ఆమె పంపిన సందేశం ‘అమ్మను బెంగపెట్టుకోవద్దు అని చెప్పండి’ అన్నదే. నలభై ఎనిమిదిసార్లు భూగ్రహాన్ని రోదసిలు చుట్టి వచ్చి - తన వ్యోమనౌకతో మన వాతావరణంలో ప్రవేశించి ఓ పారాచ్యూట్ సాయంతో నేల మీదకి దూకేసింది. కజకిస్తాన్‌లోని వో పల్లెలోకి ‘అవతరించిందామె’ ఆమె అందమైన ముక్కు గీరుకు పోయిందంతే.
ఆ సాయంకాల సందడిలో ఈ రోదసీ మిథునం ‘దుబాసీ’ల సాయంతో ‘ప్రెస్’ వారితో ముచ్చటించారు. కానీ నేను ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. నిమిషం చాలు’ అంటూ నిర్వాహకులను వేధించి, వాలెంతినా దగ్గరికి చేరుకున్నాను. ఆమె ‘ఎర్ర మందారం’లాగా నవ్వుతూ కరచాలనం చేసింది. రష్యన్ పడతుల చేతులు బూరుగు దూది మెత్తల్లాగా మెత్తగా నాజూకుగా వుంటాయి.
మీకు మా దేశం ఇష్టమేనా? అంటే నాకు ఇండియన్ సాంగ్స్ కూడా ఎంతో ఇష్టం. శ్రవణపేయంగా ఉంటాయి అని జవాబు.
‘నేనే ఎందుకు తొలి రోదసీ మహిళ అయ్యానా? ఎవరో ఒకరు అవ్వాలి కదా? అని నవ్వు - అసలు పురుషులతోపాటు ఈ అంతరిక్ష సాహసాలకి - స్ర్తిలకి కూడా సమాన హోదా హక్కు వున్నాయి అన్నది ఆమె వివరణగా. ఒక్క చివరి ప్రశ్న. అప్పటికే నెట్టేస్తున్నారు - అంతరిక్ష మిథునం యొక్క సంతానం అంతరిక్ష లక్షణాలు వున్న సంతానం అవుతుందా? గగనయానం చేస్తుందా? ‘వెయిట్ అండ్ సీ’ అన్నది ఆమె ‘పార్టింగు కిక్కు’ (శభాష్!)
ఆనక, నేనేదో రోదసీ మందసంలో తిరిగి భువికి దిగినట్లు - తంబుచెట్టి స్ట్రీట్. మాడ్రన్ కఫే దగ్గర వాలాను ‘అదృష్టం’ అన్నారెవరో ‘కాదు’ అన్నాను నేను.. కాగితాలు సర్దుకుంటూ, కలం దులుపుకుంటూ.
‘అదృష్టం అంటే అది మాదే - నేటి సమాజంలో ఉక్కిరిబిక్కిరి అయిన జర్నలిస్టులది’ అన్నాను. వాళ్ల ‘అమ్మ’ ఎలెనా తెరెష్కోవాది కూడా అదృష్టం. ఇంత అందాల అంతరిక్ష బాలను కన్నందుకు ‘వాల్యా’ 1937 మార్చి 6న పుట్టింది. జాగ్రత్తగా వినండి. నేటి తరం మొబైల్ సుందరాంగనలూ - 1955లోనే ఫ్యాక్టరీ కూలీ అయింది. ఈ నీలి కనుల చిన్నదానికి జీవితం ‘ఎయిర్ కండిషన్డు’ కాదు శిక్షణ సమయంలో అక్షరాలా ‘కాలిపోయింది’ ‘గడ్డ’ కట్టుకుపోయింది. ఎత్తుకెగిరినా గురుత్వాకర్షణ లేకుండా నేలకు దూకినా - పురాణాలలో ప్రహ్లాదుడిలాగా నిబ్బరంగా నిలిచింది!
ఇది అదృష్టం గాదా? పట్టుదల, తపన, తపస్సు అంటూ చెప్పాలి. రెండు సంవత్సరాల కఠోర శిక్షణ అనంతరం ‘్ఫస్ట్ లేడీ ఆఫ్ ది స్పేస్’ అయింది. చాలా వివరంగా ఇంటర్వ్యూ ఫీచర్ చేశాను. హనీమూన్‌కి వచ్చావు. ‘మూన్’కు కూడా వెళ్లాలి నువ్వు అంటూ ఆ సమ్మేళనంలో అరిచి అభినందించాను.
ఆ వ్యాసం ‘అట్టమీద’ హైలైట్ చేశాం. మనలో మాటలో రాధాకృష్ణగారు నన్ను ప్రశంసించకుండా ఉండలేక పోయారు.
‘్ఫటోలు కూడా సంపాదించానండీ. నెహ్రూ గారిని వాల్యా కలిసిన సందర్భంలో ఫొటో కూడా వేశామండీ’ ‘మ.మా’లో (డిసెంబర్ 12, ’63 సంచిక) ‘బాస్’ ఇలా రాశాడు. ‘వాలెంతినా ప్రపంచ ప్రప్రథమ రోదసీ మహిళ’ అందుచేత ఆమెను గురించిన వ్యాసం వనితావాణిలో వెయ్యడం సమంజసం అనుకుంటున్నాము. ఈ అంతరిక్ష మిథునాన్ని చూడటం కోసం ఎందరో పత్రికల వాళ్లు రావడం వల్ల ప్రశ్నల వర్షమే కురిసి కావల్సినన్ని ప్రశ్నలు అడిగే అవకాశం లేకపోయింది అంటున్నారు శ్రీ వీరాజీ.
ఆ వారం ఉమెన్ కార్టూన్ రెగ్యులర్ వనితావాణి ఎత్తివేశాము. క్రిస్టేన్ కేలర్ మీద కొత్త శీర్షిక కూడా ప్రకటించాం. ఆల్ట్‌స్ పాక్సిలీ అస్తమయం వార్త విశేషాలు కూడా వేశాము - మరో రకంగా అది విషాదమయ వారమే.
‘పత్రిక’ విడుదల కాంగానే నాకు మొట్టమొదటి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆంధ్రప్రభ వారపత్రిక వౌంట్ రోడ్డు ఆఫీసు నుంచి - ఇబ్బడిముబ్బడిగా అభినందనలు అందిస్తున్న వాడు తిరుమల రామచంద్రగారు. ఆయన బెజవాడ ప్రభ డైలీ నుంచి మద్రాసు వారపత్రికకి మార్చబడ్డట్లు నేను ఎరుగుదును. రామచంద్రగారికి నా మీద అపార వాత్సల్యం వుంది. అడిగి మరీ నా ‘మునగచెట్టు’ నవలకి ముందు మాటలు రాశారు. మునగ పూలగత్తుల లాంటి ముసిముసి నవ్వులు వీరాజీవి అన్నారు - ఆయన. ఆయన ఇలా అన్నారు. ‘నేనూ వచ్చా ఆ మీటింగుకి కానీ మీరు చూసింది, రాసింది సాధించింది అద్భుతం’ అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
అటు తరువాత రామచంద్రగారు హైదరాబాద్ నోట్‌బుక్ రాసేవారు - మన వీక్లీకి. చాలా బ్యాలెన్స్‌డ్‌గా రాసేవారు. ఆ రోజుల్లో హేమాహేమీలయిన జర్నలిస్టులకు రెండే శిబిరాలు వుండేవి. ఇక్కడ కాకపోతే అక్కడ ప్రభలో తేలేవారు. జర్నలిస్టులలో పండిత పత్రికా రచయితలు తిరుమలవారు, పిలకావారు, గణపతి శాస్ర్తీగారు. నేను చేరినాక నేను బెజవాడ వెళ్లేదాకా కొనసాగారు శాస్ర్తీగారు. గండూరి కృష్ణ, టి.కృష్ణ ప్రభృతులు ఇక్కడ నుంచి వెళ్లినవారే. జి.కృష్ణ గారికి ‘వ్యంగ్యోక్తి’ లేకుండా మాట్లాడటం రాదు. కానీ ఆయన ఉభయ భాషాకోవిదుడు.. గర్వి.. కొంటె.. నేను అంటే ‘లైకింగే..’
వాలెంతిన ఇంటర్వ్యూ రోజులలోనే అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీగారు మనకి నేస్తం. తుపాకీ కాల్పులతో దారుణ హత్య జరిగింది.
జవహర్‌లాల్ నెహ్రూ గారి అస్తమయం రోజున నేను బాగా అప్‌సెట్ అయ్యాను. ‘పసిపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తావేం’ ముందు హోమేజ్ ఎడిషన్ సంగతి చూడు అన్నాడు, ప్రకాశరావుగారు. నేను వీక్లీలో వున్నాను అప్పుడు.
సూర్యుడెక్కడ? సూర్యుడెక్కడ?
సూర్యుడాగిపోయాడా?
సూర్యుడారిపోయాడా?
అంటూ ‘ఎలిజీ’ రాశాను. మనోపశమనానికి. ఇక యే చందమామలు ప్రకాశిస్తాయిక్కడ? అని ప్రశ్నించాను. ‘గాడ్! అల్లా! పరమాత్మా! వేరార్యూ? వేరార్యూ’ అంటూ నిందాస్తుతి చేశాను. ఈ కవిత ‘కాపీ కింద’ డైలీ ఎడిటోరియల్ హాలులోకి పంపించాను. అయ్యవారికి వినిపించారు. ఫోనులో శ్రీరాములుగారు. వెంటనే డైలీ మెయిన్ ఐటమ్‌లో వెళ్లింది. అదంతా ఒక కథ. ఓ గాథ. మొత్తం ‘వీక్లీ’ని తిరగదోడి నెహ్రూకి అంకితం చేస్తూ చేశాను.
‘మిడ్‌డే సన్ సెట్’ అన్నాను.
మర్నాడు పడక వేశాను. హార్ట్ ఎటాక్ (లాంటిది) వచ్చింది. మన ఆస్థాన కవికి. డాక్టర్ దగ్గరికి పోవాలి అన్నారు అంతా. కొంత అక్కసుగా డైలీ హాలులోని పెద్దలు ఇలా అభినందించారు.
నాన్నగారు నా జ్వరం చూసి కంగారు పడ్డారు. మా సభాపతి వచ్చాడు. అతను మెడికల్ కాలేజీలో పాథాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిమాన్‌స్ట్రేటర్.
గవర్నమెంటు ఆసుపత్రి జనరల్ సూపరింటెండెంట్ డా.జెబ్బార్‌గారు సభాపతిని, నన్ను కూర్చోబెట్టి నాకు అన్ని పరీక్షలు చేశాడు. మాత్రలు, టానిక్ బాటిల్స్ ఇచ్చాడు- హార్టుబీటు తగ్గింది.
యంగ్‌మ్యాన్! వర్క్ విత్ బ్రెయిన్, నాట్ ‘విత్ హార్ట్’ టేక్కేర్ - ‘డాక్టర్స్ అండ్ జర్నలిస్ట్స్ షుడ్ నాట్ బి ఎమోషనల్లీ ఇన్‌వాల్వ్‌డ్’ అన్న ఆయన (మాట) సలహా ఇప్పటికీ గుర్తే నాకు. చాలా మంచి ఫిజిషియను.
బైదిబై కెనడీ హత్యానంతరం ‘వీక్లీ’లోకి శ్రీరాములుగారు కబురు పెట్టారు నాకు. ‘వీరాజీ పొయిట్రీ రాస్తాడేమో? అయ్యవారితో అన్నాను. ‘సరే’నన్నారు అని చెప్పారు.
‘క్షమించాలి సార్! నాకు దుఃఖంగానే ఉంది. గానీ పొయిట్రీ రాసేటంత ఇదిగా లేదు సార్!’
ఆరుదన్రి అడుగుదాం అనుకున్నారు. తను రాసి పంపాడు.
‘అయ్యయ్యో! ఆదర్శాన్ని
ఆ జ్ఞానం హత్య కావించిందా?’ అంటూ వేశాము. వీక్లీలో కూడా అదే ఎత్తివేశాను.
నవంబర్ 22 మన దేశానికి ఇంకా దుర్దినం. భారత సైనిక, వైమానిక బలాల అధిపతులు ఐదుగురు ఒకేసారి విమాన ప్రమాదంలో దుర్మరణం పొందారు. ఆ వివరాలు ఫొటోలు వేశాము. ఆ వీక్లీ ఒక స్పెషల్.
ఎందుకంటే వారపత్రిక కేవలం ‘ఎంటర్‌టైనింగ్ బోయ్’ కాదు. దాని యొక్క పాత్ర సంఘంలో మరింత ‘ఎమోషనల్’ అని నా నమ్మకం.

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com