కన్నీటి ముద్ర
Published Saturday, 9 November 2019ఎలా ఊరేదో నీరు?!
ఊట బావి తీరు
ఉదయిస్తున్న తొలి బింబాన్ని
బొట్టు దిద్దుకున్న
పాతకాలపు కథానాయికలా
నిండుగా నవ్వేది చెరువు.
పొలానికి ఆకలి వేసినపుడల్లా
ఆగని స్తన్యపు మధు ధారల్ని
మదుంలోకి ఒంపి
కొంగు కప్పి పిల్లకి పాలు తావిస్తున్న
తల్లిలా కనపడేది.
ఇప్పుడంటే కళ తప్పింది గాని,
కనె్నపిల్లలా ఎన్ని కలలు కనేది పల్లె!
‘ఏ.సీ’లు ఫ్యాన్లు లేని సాయంత్రపు వేళల్లో
చెరువు విసిరిన చల్లగాలిలో ఎంతలా సేదతీరేది.
సమయం తెలియని మాటల చల్లదనంలో
ఆకాశమే అరుగుల మీదికి దిగి వచ్చేది.
రాజకీయపు ఎత్తుగడల్లో
ఒత్తిగిల్లిన రక్తపు నీడలోకి చెరువు జారిపోయాక
పంటకు అమృతాన్ని పంచే అమ్మ...
చేపల పెంపక కేంద్రంగా మారిపోయింది
ద్వంద్వ ప్రమాణాల వైఖరిలో
చెరువు మగ్గిపోయింది
నీరు మారక ఉగ్గిపోయింది.
అమ్మ ఉండీ అనాథ అయ్యింది ఊరు
పాలుండీ పరాయిదయ్యింది చెరువు
పంతాల తెంపరితనానికి పల్లె తల్లడిల్లింది
కుళ్లిన నీటిలో కాలుష్యం తాండవమాడింది.
ఒడ్డున పడి చేపలు..
ఒడ్డున పడలేక మనుషులు..
ఒకటే విలవిల్లాడిపోయారు
కోటవాని చెరువిప్పుడు.. కలలు లేని నిద్రలో ఉంది
కన్నీటి ముద్రలా కనపడుతోంది.