ఎప్పటికీ నీకై...
Published Saturday, 9 November 2019నిన్ను చూసిన క్షణాలు ఉవ్వెత్తున ఎగసిన
ఉద్వేగ సంద్రం
ఎద చుట్టూ చెలియలి కట్టలా చుట్టుకున్న
చేతులను దాటలేక కన్నుల ఆకసాన్ని చేరి
కంటిపాపకు ముందు.. కన్నీటి యవనికగా
మారిన దృశ్యం - నీ దృష్టిని దాటిపోయిందా?
మెడకు చుట్టుకున్న ఉరిత్రాడు
కాళ్లకు తగులుకున్న ముళ్లకంపలు
తొలగించమని ప్రాధేయపడ్డ భావాల నిట్టూర్పులు
నీ వీనుల చుట్టూ వీవనలు కాలేదా?
నిదురించిన హృదయవీణ శ్రుతిచేసి
నినదించే నిశ్శబ్ద ప్రణయ రాగం
నీ వీనులకు వినిపించినా వక్రభాష్యాల
దుమారం నీ కన్నుల లోగిలిలో విషం చిమ్మిందా?
ఇపుడైనా తరచి చూడు
గతం జ్ఞాపకాల పిల్లగాలికి వరి చేలలో
ఊగే పచ్చని పైరుల సోయగాలను
అవి చెప్పే గుసగుసల సంగీతాన్ని
చెవులకు మనసు పెట్టుకుని
మనసుకు కళ్లు పెట్టుకుని
మెదడుకు ప్రేమ పులుముకొని
ఆలోచించు - నీ ముందు నేను..
ఎప్పటికీ నీకై వేచి చూస్తూ..