అక్షరాలు చెదిరిపోతున్నై..
Published Saturday, 9 November 2019అక్షరాలు ఇప్పుడు చెదిరిపోతున్నై
ఏరుకుందామంటే ఏబీసీడీలు అడ్డం పడుతున్నై
ఒక్కొక్క అక్షరాన్ని పేర్చి అమ్మను చేస్తే
ఇంట్లో పిల్లాడు అమ్మను మమీ అంటున్నాడు
మాతృభాష నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదంటే
తెలుగు భాష కూడుపెడుతుందా అంటున్నాడు
ఆంగ్ల భాష కూడుపెడితే పెట్టొచ్చు
తెలుగు చందమామ చూపించలేదు
తేడా ఎక్కడొచ్చిందో తెలీదుగాని
తెలుగంటే యువతరానికి ఖాతర్లేదు
ఆంగ్లంలో చదువుతున్నారని అమ్మ భాష వదిలేయమంటామా
మార్కుల కోసం యువత తెలుగు భాషను కాదని
పరీక్షల్లో సంస్కృతం రాస్తున్నారు
అదీ అరకొర భాషే
మాతృభాషను అంత తేలిగ్గా తీసేయకండి
మాతృభాష అమ్మ పాలు లాంటిది
ఆంగ్లభాష పోతపాలు లాంటిది
తెలుగులోని కమ్మదనం చిక్కదనం ఆంగ్లంలో ఉండదు
ఈ మధ్య తల్లులు కూడా ఆంగ్లంలో మాట్లాడుతున్నారు
అదేమంటే తెలుగులో మాట్లాడితే పిల్లలు ఆంగ్లం మరిచిపోతారట
ఇంగ్లీసోడు పోతూపోతూ ఆంగ్లం మనకు వదిలేసిపోయాడు
ఇవాళ యువతకి అదే మాతృభాషయింది
ఎన్ని భాషలు మాట్లాడినా
నీకంటూ తల్లి భాష ఉండాలి
తల్లి భాషలో ఆలోచించలేనివాడు
పరాయి భాషతో తల బాదుకుంటాడు
అవసరానికి ఆంగ్లం నేర్చుకోండి
వ్యవహారంలో తెలుగే మన పెద్ద దిక్కు
చరవాణి వచ్చాక పుస్తకాలు కనుమరుగవుతున్నై
అంతర్జాలంలోనే ప్రపంచాన్ని చదివేస్తున్నారు
కొన్నాళ్లకు పత్రికలు మూతపడి ఎలక్ట్రానిక్ పత్రికలు మిగులుతై
తేనెలొలుకు తెలుగు తియ్యనైన తెలుగు
ఇప్పుడు మరణశయ్య మీదుంది
తలో అక్షరం నేర్చుకుంటే తప్ప కోలుకోలేనంటోంది
ఒకసారి అక్షర బీజం యువత మనసులో
పడిందంటే
తెలుగు అజరామర భాషగా మిగిలిపోతుంది
అడుగులు తడబడినప్పుడు అమ్మ చేయి అందుకున్నట్టే
మాటలు నేర్చినప్పుడు అమ్మ భాష అంది పుచ్చుకోవాలి
అక్షరాలు చెదిరిపోతున్నై
తెలుగు ప్రాభవం మళ్లీ రావాలంటే
పిల్లల నాలుకల మీదే కాదు
తల్లిదండ్రుల మనసుల మీద బీజాక్షరాలు రాయించాలి
పల్లకీలో కూర్చోవడమే కాదు
అవసరమైతే తెలుగు భాషా వికాసానికి
మనమంతా బోరుూలం కావాలి.