ఆమె అస్తిత్వం!
Published Saturday, 9 November 2019నవ మాసాల గండం నుంచి
గట్టెక్కెందో లేదో
నిమిషం నిమిషం
మృత్యుద్వారం ముందు
ఎదురుచూపులు
ఆడపిల్లగా పుట్టడమే
శాపమైన దేశంలో దినామూ
వొక సంఘర్షణే
ఎదిగే సీతాకోక చిలుకని
కబళించడానికి ఎన్ని చేతులో
లాఘవంగా తప్పించుకోని
ఎదిగిన క్రమం కష్టమే
యవ్వనాన్ని దాచలేని
శరీరంతో రాక్షస ప్రేమల నుంచి
రక్షించుకోవడం
కత్తిమీద సామే కదూ
చదువుల నుంచి క్రీడలు
వ్యవసాయం నుంచి అంతరిక్షం దాకా
బతుకు కోసం పోరాటం
తన బతుకుకి విలువ ఇవ్వని
నిర్దయ ప్రపంచంతో
అస్తిత్వం కోసం
తరతరాలుగా కోట్లాడుతూనే ఉంది
పితృస్వామ్య పంజరం
విడుదల కోసం
వొకటే యుద్ధం
తానుగా కోరుకొని
యుద్ధమిది
లింగభేదాలలో ఓడిపోతూ
తనని తాను గెలవడానికి
ప్రతీ క్షణం తపన
మూఢనమ్మకాల చీకటి దారులని
చీల్చుతూ తానొక వెలుగు కాగడా
ఆడవాళ్లు ఏమి చేయగలరన్న
అపవాదుకి కాలం చెల్లింది
ఇప్పుడు ఆమె
తన అస్తిత్వాన్ని సగర్వంగా లోకం
ముందు నిలబెట్టుకుంది
ఇక అంతా మహిళావరణమే!