పరీక్ష కాలం
Published Saturday, 23 November 2019అందరిని గమనించే
ఈ కళ్లతో నిన్ను
నేను చూడలేదెప్పుడు!
కావాలంటే మల్లెపువ్వులాంటి
నా స్వచ్ఛమైన మనసును
అడిగి తెలుసుకో
నిజమేమిటో అది చెబుతుంది!
ఎవరికీ కనిపించని
నా మనోనేత్రంతో తదేకంగా
నీ రూపాన్ని వీక్షిస్తూనే ఉంటాను
ఎప్పటికీ!
అందుకే ఎవరికి నీవెలా కనపడినా
నా కంటికి మాత్రం
అపరంజి బొమ్మలా కనిపిస్తావు!
పచ్చబొట్టు లాంటి నీ
అందమైన పేరును
కాగితానికి పరిమితం చేయకుండా
నా గుండె గది గోడలపై
ఎన్నటికీ చెదరిపోకుండా ప్రేమతో రాసుకున్నాను!
అందుకే నీవెక్కడున్నా
మరవలేని నేను
నీ రాక కోసం
వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉంటాను!
అందుకే అనుకుంటా ఒక్కోసారి
ఎవరిన చూసినా నీ రూపమే
వారిలో కనిపించేసరికి
పిచ్చిదై పోతుంది నా మనసు!
మ మధ్య ప్రేమను
పరీక్షించడానికి కాలం
ఎన్ని పన్నాగాలు పన్నినా
చివరికి గెలిచేది మన ప్రేమే కదా?
అందుకే ప్రియతమా!
తప్పుదారి కూడా అందరి
లాంటి వాడినని నన్ను
అనుమానించకు!
నిస్సందేహంగా నమ్మి
ఆపై నన్ను కరుణించు!
ఎంతో కాలంగా నీ పిలుపు
కోసం ఎదురుచూస్తున్న నన్ను
కాదని ఆవేదనకు గురి చేయకు
నా అంతరంగంలోకి తొంగిచూసి
నిజం తెలుసుకొని
ఊ.. అన్నావనుకో
ఇక క్షణమైనా ఆలస్యం చేయక
నా హృదయమనే కోవెలలో అధిష్టించి
కంటిరెప్పలా కాపాడి
కలకాలం దేవతలా చూసుకుంటా
నీవు ఎంత వద్దన్నా పవిత్రమైన
మన ప్రేమను అందరి ముందు
రుజువు చేసి చూపిస్తా!
*