శిక్షణే అవసరం!
Published Saturday, 23 November 2019భయం..
బాధ..
నొప్పి..
ప్రేమ..
ఆనందం..
ఆశ్చర్యం..
ఇలా ఏది కలిగినా పిల్లలు అమ్మ ఒడికో, నాన్న గుండెలపైకో చేరతారు. కబుర్లు చెప్పాలన్నా.. బడిలో వారు నేర్చుకున్న కొత్త సంగతి వివరించాలన్నా.. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే తల్లిదండ్రుల కోసం వెతుక్కుంటారు పిల్లలు. పుట్టుక నుంచి పెరిగి, ప్రయోజకులై సమాజం ముందుకు వచ్చేంతవరకూ వారికి తల్లిదండ్రుల తోడిదే లోకం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు తగిన శిక్షణను అందించాలి. ప్రపంచంలో అతి కష్టమైనది ఆత్మానుభవం.. తరువాత పిల్లల పెంపకం.. అంటారు పెద్దవారు. అంటే.. పిల్లలను పెంచడం అంటే ఆత్మానుభవాన్ని పొందడమంతటి కష్టం.. కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇప్పటి భాషలో చెప్పాలంటే ఇది ఇరవై సంవత్సరాల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో తల్లిదండ్రులు ఎంత ప్రేమగా, ఓపికగా రాణిస్తారో.. జీవితాంతం అంత హాయిగా గడిపేస్తారు.. ఒకవేళ పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఓపికగా లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
‘అమ్మానాన్నల ప్రేమకు పరిమితులు ఉండకపోవచ్చు కానీ, లక్ష్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలి..’ అంటారు ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ శాస్తవ్రేత్త ఫ్రాయిడ్. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రుల పెంపకం తీరు మారాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇద్దరు లేదా ముగ్గురు సంతాన సూత్రం ప్రస్తుతం ఆధునిక పరిస్థితుల కారణంగా ఒక్కరు చాలు అన్న విధంగా మారింది. ఉన్న ఒక్క బిడ్డను చదివించి, బంగారు భవిష్యత్తు అందిస్తే చాలు అన్న ఆలోచనలో ఉన్నారు నేటి తల్లిదండ్రులు. తమ ఆశలన్నీ పిల్లలపై పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచుతున్నారు. దీనివల్ల పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులు రేపటి భవిష్యత్తుకు అద్దం పడుతున్నాయి. తమ ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకుంటున్నారు నేటి తల్లిదండ్రులు. తాము పడిన కష్టాలు పిల్లలు పడకూడదంటూ చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ సమకూర్చి పెడుతున్నారు. సంపాదించేది పిల్లల కోసమే కదా అంటూ డబ్బు విలువ తెలియకుండా పెంచుతున్నారు. వారు అడిగిన వాటిని కాదనకుండా తమ శక్తికి మించిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. తమ పెంపకం ద్వారా సమాజానికి ఎలాంటి పౌరుడిని అందించామన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అమ్మానాన్న అతి ప్రేమ వల్ల పిల్లల్లో గారాబం, పెంకితనం, ఇగో పెరుగుతాయి అంటున్నారు మానసిక నిపుణులు. ఇలాంటి సమస్యలు పిల్లల ప్రవర్తనలో రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను సరిగ్గా పెంచాలంటే ప్రేమ, ఓపిక ఉంటే సరిపోదు. ఆ ప్రేమను క్రమమైన మార్గాల ద్వారా ఉపయోగించి పిల్లల క్షేమానికి ప్రయత్నించేదే జ్ఞానము. ఈ జ్ఞానానికి చోటు లేకుండా చేసి తరిమేస్తుంది సెంటిమెంట. కానీ వాస్తవమైన ప్రేమ ఉంటే జ్ఞానానికి స్థలముంటుంది. ప్రేమ లేకుండా ఉత్త జ్ఞానమున్నా చాలదు. అప్పుడు ఇల్లు ఒక హాస్టల్లా ఉంటుంది. ప్రేమ కన్నా జ్ఞానం ముఖ్యం.. అన్నిటికీ మించి ప్రేమ, జ్ఞానాలు కలిసి ఉండటం ముఖ్యం. పిల్లలకు
చిన్నప్పటి నుంచి తగిన శిక్షణను అందిస్తే వారు పెద్దవారయ్యాక మూఢత్వాన్ని, భయాన్ని కలిగి ఉండక.. సమాజాన్ని తీర్చిదిద్దే ఉన్నతులుగా ఎదుగుతారు. ఆ నైసర్గిక స్వభావోన్నత్యాన్ని పిల్లలకు ఇవ్వగలిగితే చట్టాల వల్లా, సంస్కారాల వల్లా, బోధనల వల్ల కలిగించడానికి ప్రయత్నించే మార్పులు ఏ శ్రమ లేకుండా ఏర్పడతాయి.
పిల్లల ‘శిక్షణ’ వేరు. ‘శిక్ష’ వేరు. ‘బిడ్డల శిక్షణ’ అంటే అందులో ‘శిక్ష’ ఉంది కదా అనుకోవడం మారుతున్న కాలానికి చెల్లదు. అందునా ‘అణుకుటుంబాలు’ వచ్చి ఒకరో ఇద్దరో పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాలు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులు మునుపటి తరం పెద్దల్లా కోపతాపాలు పిల్లలపై చూపాల్సిన అగత్యాలు అంతరిస్తున్నాయి. మూర్ఖంగా పిల్లల్ని బాధపెట్టడం, గారాబాలు చేయడం, లెక్కలేకుండా వదిలెయ్యడం ఇకముందు వీల్లేదు. ఆరోగ్యదాయిక కుటుంబ వ్యవస్థ ఏర్పడాలంటే చలం రాసిన ‘బిడ్డల శిక్షణ’ చదవాల్సిందే..
బిడ్డల శిక్షణ
1925వ సంవత్సరంలో చలం ‘బిడ్డల శిక్షణ’ అనే పుస్తకాన్ని.. పిల్లల క్షేమాన్ని కాంక్షించి, వారిపై ప్రేమతో, బాధ్యతతో, దయతో రాశారు. బిడ్డ భూమిపై పడినప్పటినుండి, సమాజంలో ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎదిగేవరకు.. తల్లిదండ్రులు ఎలా చూడాలి? వారిని ఎలా పెంచాలి? వారికి ఎలాంటి శిక్షణనివ్వాలి? అన్న విషయాలను చాలా కూలంకషంగా చర్చించారు. దాదాపు తొంభై సంవత్సరాల క్రితం రాసిన పుస్తకమైనా ఈ పుస్తకం ఇప్పటికీ ఆచరణీయమే.. ఇందులో ఆయన పిల్లల పక్షం వహిస్తూ, తద్వారా ఉన్నతమైన సమాజానికి బాటలు వేసే ప్రయత్నం చేశారు.
‘ఈ పిల్లలు ఎప్పుడూ సమ్మె కట్టలేరు.. తెలివి తెచ్చుకోలేరు.. ధిక్కరించలేరు.. ప్రార్థించలేరు.. నోరు లేదు.. శక్తి లేదు.. తల్లిదండ్రులపై ఉన్న అపార విశ్వాసం తప్ప..’ అన్నారు తానూ ఓ పిల్లాడిలా..
వెంటనే తండ్రిలా మారిపోయి.. ‘పిల్లలకి వేరెవ్వరిపై కాదు.. మనపైనే వారి నమ్మకం.. వారి సంరక్షకులం అని.. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మనిషితనం కదా!’ అంటారు తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేస్తూ..
‘నిజమైన ప్రేమ ఎప్పుడూ ఇతరుల సౌఖ్యాలకై ప్రయత్నిస్తుంది. ఆ సౌఖ్యం కోసం ఏ త్యాగాన్నైనా చెయ్యడానికి వెనుకాడదు. నిజమైన ప్రేమ ఉంటే.. ఇన్ని వందల సంవత్సరాల నుంచి బిడ్డల్ని కొడుతూనే ఉంటారా? బిడ్డల్ని కొట్టడం వల్ల తల్లిదండ్రులకి బాధ కలుగుతోందా? కొట్టడం తప్పనిసరి అయింది కదా అని దుఃఖ పడుతున్నారా? కొట్టకుండా వీలులేదా? అని ఉపాయాలు వెతుకుతున్నారా? బిడ్డని కొట్టడం వల్ల పెద్దవారికి ఆనందం కలుగుతుంది. కొట్టాలనే వాంఛ వారి మనసుల్లో ఉంది. కోపం రాగానే ‘ఇతరులని’ కొడితే మళ్లీ కొడతారు. దిక్కుమాలిన బిడ్డ మళ్ళీ కొట్టలేదు. కొట్టాలనే దుర్వాంఛ వల్ల బిడ్డల్ని బాదే ఉపాధ్యాయులున్నారనే సంగతి విద్యాధికారులు ఒప్పుకుని కొట్టకూడదని శాసించారు. అట్లానే కొట్టే సంతోషం కోసం, తమ కోపాన్ని తీర్చుకునేందుకు, కసి తీర్చుకునేందుకు సమస్తమైన విద్యాధికులు, జ్ఞాన సంపన్నులు, దయామయులు, పుణ్యాత్ములైన తల్లిదండ్రులందరూ బిడ్డల్ని బాదుతున్నారు. ఈ ఘోరకార్యంలో ఉండే నీచత్వమూ, పశుత్వం బయటపడుతుందేమోనని, ఈ దండనలకి ‘శిక్షణ’, ‘దయ’, ‘ప్రేమ’, ‘మాతృప్రేమ’ అని పవిత్రమైన పేర్లు పెట్టి సమర్థించుకుంటారు. దెబ్బలు లేకపోతే చెడిపోతారని తమ మనసుల్ని తామే మోసపుచ్చుకుని సుఖిస్తారు’ అని ఈ పుస్తకంలో నిర్ద్వందంగా పేర్కొన్నారు చలం.
అంతేకాదు చలం మరో మాట చెప్పారు.. ‘బిడ్డ కలగడం, తల్లికీ, తండ్రికీ ఆత్మాభివృద్ధి అవసరమని తోచినప్పుడే, బిడ్డని పోషించడానికి, బిడ్డకి తగిన శిక్షణ ఇవ్వడానికి సరైన పరిస్థితులు ఉన్నప్పుడే బిడ్డను కనాలి. గుడ్డిగా, అప్రయత్నంగా, తమ తమ ఉద్దేశ్యాలతో వొళ్లు తెలీక, బిడ్డల్ని కని, తమనీ, వాళ్లనీ, ఈశ్వరుణ్ణీ, కర్మనీ తిట్టుకునే స్థితిలో పడటం.. బిడ్డని చంపడం కన్నా ఘోరమైన కార్యం’ అంటారు చలం.
మరొక సందర్భంలో ‘చిన్నపిల్లలకు సరైన శిక్షణ ఇవ్వగలిన తల్లిదండ్రులు ఎప్పడూ సంతోషంగా, దయగా, ఓర్పుగా ఉండాలి. అనారోగ్యవంతులు ఈ గుణాల్ని కలిగి ఉండరు. కనుక చిరకాలం జబ్బుగా ఉండేవారు పిల్లల శిక్షణ బాధ్యతను తీసుకోకూడదు. పుట్టింది మొదలు బిడ్డని ఇంటికంతకూ ముఖ్యమైన దానివలె, అందరూ వారి సేవకు, పురోభివృద్ధికి జీవిస్తున్నట్టు భావించుకోవడం విధి. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రుల జీవితానికి సాఫల్యం కలుగుతుంది. వారి జీవితాలకు అర్థం ఏర్పడుతుంది’ అంటారు. ‘కొందరికి పిల్లలంటే అసహ్యం. వారు పుట్టినందుకు కోపం. ముఖ్యంగా ఆడపిల్లలు. అలాంటివారు పిల్లల్ని కనకూడదు. అక్కర్లేకపోతే పెంపకానికి ఎవరికన్నా ఇవ్వాలి. అక్కర్లేని పిల్ల్ని కనడం కన్నా భ్రూణహత్య నయం. పిల్లలు వారి వారి స్వభావాల ప్రకారం, వారి ఇష్టం వచ్చిన స్థానం ఆక్రమించుకోవలసిన స్వతంత్ర జీవులని, వాళ్ళని పెద్దవాళ్ళు తమ ఆశయాలకు అనుగుణంగా ఉపయోగించుకోకూడదని తల్లిదండ్రులు తెలుసుకోవాలి’ అని చెబుతారు చలం.
ఇప్పుడు ప్రఖ్యాత మానసిక నిపుణులు, శాస్తవ్రేత్తలు చెబుతున్న ఈ పాఠాలను అప్పుడెప్పుడూ చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకంలో రాశారు. ఏడాది కూడా నిండని పాపాయి టీవీలో వచ్చే ప్రకటనలు వింటూ ఏడుపు ఆపేయడం, రెండు సంవత్సరాలు కూడా నిండని చిన్నోడు సెల్‌ఫోన్ ఆపరేట్ చేయడం, మూడు
సంవత్సరాలు కూడా నిండని చిన్నారి తనకు నచ్చిన ప్రోగ్రాం కోసం మారాం చేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇందుకు కారణం నేటితరం పిల్లల్లో త్వరగా నేర్చుకునే స్వభావం ఉండటమే.. అందుకే వాళ్లు చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ చాలా ఫాస్టుగా ఉంటున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీల్లో ఒకరు, ఇద్దరు పిల్లలే ఉండటంతో వాళ్లపై తల్లిదండ్రుల ఫోకస్ పెరుగుతుంది. గారాబం ఎక్కువ కావడంతో ఇలాంటి పిల్లలతో వ్యవహరించడం తలకు మించిన పని అవుతుంది. పిల్లల పెంపకంలో మెళకువలు పాటించకపోతే విసుగు,
చిరాకు పెరిగిపోతాయి. మానసికంగా ఆందోళన పెరిగిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది. గతంలో ప్రతీ ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య వంటి పెద్దలు ఉండేవారు కాబట్టి ఓర్పుతో అన్ని విషయాలు తెలియజెప్పేవారు. కానీ న్యూక్లియర్ కుటుంబాల్లో పిల్లల పెంపకం కత్తిమీది సాములా మారుతోంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రేపటి తరాన్ని బాధ్యతగా పెంచే ఒక కళగా మిగులుతుంది.
మంచి-చెడు విడమరిచి..
చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇది చేయకు.. అది ముట్టకు.. అంటూ ఆంక్షలు విధిస్తుంటారు. ఇలా చెప్పడం వల్ల వారిలో తిరుగుబాటుతత్వం మొదలవుతుంది. వద్దన్న పనే చేస్తుంటారు. పిల్లలతో బాస్ మాదిరిగా మాట్లాడటానికి బదులు ఎందుకు వద్దు.. అనే విషయాన్ని విడమరిచి చెప్పడం మేలని నిపుణులు అంటున్నారు. నిదానంగా అందులోని మంచి-చెడులను విడమరిచి చెప్పడం వల్ల పిల్లలు అర్థం చేసుకుంటారు. ‘ద కేస్ ఫర్ ద ఓన్లీ చైల్డ్’ అనే పరిశోధక గ్రంథంలో పిల్లల్ని ఎంత అనునయంతో పలకరిస్తే వారంత బాగా చెప్పిన మాట వింటారని చెబుతారు రచయిత.
గౌరవం ఇవ్వడం
చిన్నతనం నుంచే పిల్లలకు పెద్దలను, మహిళలను గౌరవించడం నేర్పించాలి. తోటివారిని అభిమానంగా పలకరించడం, ఇతరులతో మాట్లాడే సమయంలో ప్రశాంతంగా జవాబులు ఇవ్వడం వంటి అంశాలను తల్లిదండ్రులే అలవాటు చేయాలి. ఇలాంటి విషయాలు పిల్లలు పెద్దవారిని చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పెద్దలను గౌరవిస్తే వారూ గౌరవిస్తారు. అంతే తప్ప కేకలు పెట్టడం, ఒక్కసారిగా విరుచుకు పడటం మంచిది కాదు. మంచి అలవాట్లను నెమ్మదిగా తెలియజేయాలి.
సహాయం
పిల్లల్ని నలుగురిలోనూ కలిసిపోనివ్వాలి. చుట్టుపక్కల వారితో, స్కూల్లో స్నేహితులతో కలిసి ఆడుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే పిల్లలు భవిష్యత్తులో డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. తోటివారికి సాయపడటం, ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం వంటివి నేర్పించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులతో, స్నేహితులతో చెప్పుకునే స్వభావం అలవాటు అవుతుంది. ఇతరులకు ఇబ్బందులు వచ్చినా స్పందించే గుణం అలవడుతుంది.
స్నేహితుల్లా..
బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చాక తోటి స్నేహితుల గురించి, బడిలో జరిగిన సంఘటనల గురించి పిల్లలు చెప్పేలా వారిని ప్రోత్సహించాలి. వారు చెప్పే విషయాలు ఆసక్తికరంగా వింటున్నామని వారికి తెలియాలి. అప్పుడే వారు అన్ని విషయాలూ మీతో పంచుకుంటారు. పిల్లల స్నేహితుల్ని ఇంటికి అప్పుడప్పుడూ పిలిపించి ఇంట్లోనే ఆడుకునే వెసులుబాటు కల్పించాలి. స్నేహితుల ఎదుట పిల్లలపై చిరాకు పడటం, కోప్పడటం, వారిని ఇతరులతో పోల్చి తిట్టడం మంచి పద్ధతి కాదు. స్నేహితుల సమక్షంలో పిల్లలతో అభిమానంగా వ్యవహరిస్తే మా తల్లిదండ్రులు చాలా మంచివాళ్లు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఎప్పుడు కూడా పిల్లలను పక్కన పిల్లలతో పోల్చకూడదు. ఇలా పోల్చడం వల్ల పిల్లల్లో న్యూనత పెరుగుతుంది. పిల్లల్ని కొట్టడం, అల్లరి పనులు చేస్తే మురిపెంగా చూస్తూ ఊరుకోవడం లాంటివి తల్లిదండ్రులు అస్సలు చేయకూడదు. ఈ వైఖరి పిల్లల్లో తప్పుడు సందేశాన్ని పంపుతుంది.
గారాబం వద్దు
పరిసరాల్ని గమనిస్తూ, తెలుసుకోవాలన్న తపన చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా అడిగితే మొదట ఇవ్వని తల్లిదండ్రులు, పిల్లలు కిందపడి ఏడుస్తుంటే మాత్రం సరేలే.. అని ఇచ్చేస్తుంటారు. ఈ వైఖరి భవిష్యత్తులో వారిని మొండిగా మారుస్తుంది. పిల్లలకు ఎందుకు ఇవ్వడం లేదో.. ముందే స్పష్టం చేస్తే వారు మొండికేసే అవకాశం ఉండదు. పిల్లలు అడిగినవన్నీ ఇవ్వడం చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నారు. షాపింగ్‌కు తీసుకొని వెళితే వారు కోరింది కొనిస్తారు. అయితే దీనికి పరిమితి ఉండాలి. ఏది కనిపించినా కావల్సిందే అని కొందరు పిల్లలు మొండికేస్తారు. ఇటువంటి అలవాటును ప్రోత్సహించడం మంచిది కాదు. ఆ వస్తువు ఎంతవరకు అవసరం అన్నది తెలియజెప్పాలి. పిల్లలకు అందించే ఆహారంలో జాగ్రత్త అవసరం. అలాగే పిల్లలకు ఇంట్లో వండిన ఆహారమే ఇవ్వాలి. వారు కోరారు కదా అని జంక్‌ఫుడ్‌ను, బయట తెప్పించే ఆహారాన్ని ఇవ్వకూడదు. ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
స్మార్ట్ ఫోన్లు వద్దు
స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత మనుషులతో మాట్లాడటం కన్నా ఫోన్‌లో మాట్లాడే సమయమే ఎక్కువగా ఉంటోంది. ఇంట్లో కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో కాకుండా టీవీ, కంప్యూటర్, లాప్‌టాప్, ఫోన్‌లతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మంచిది కాదు. ఇంట్లో ఉన్నంతసేపు.. వీలైనంత వరకూ పిల్లలతో గడపాలి. పిల్లలు పెద్దలు చేసే ప్రతి విషయాన్నీ గమనిస్తారు. వీరికి అన్ని విషయాలూ కొత్తవే.. పరిసరాలను గమనిస్తూ పెరుగుతారు, మంచీ చెడు తెలుసుకోలేని వయసు వారిది. వారు చూసిన, తెలుసుకున్న ప్రతి విషయాన్నీ అమ్మానాన్నలతో చెప్పాలని ఉబలాటపడతారు. చాలామంది పిల్లలు బడి నుంచి రాగానే ‘అమ్మా’ అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు, తాను కొత్తగా తెలుసుకున్న సంగతులను ఏకధాటిగా చెబుతుంటారు. వాళ్ళు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలి. వారికి అటెన్షన్ ఇవ్వాలి. వారి మాటలు ఓపికగా వినడం వల్ల వారి ఆలోచనావిధానం అర్థం అవుతుంది. పిల్లల అభిరుచులు ఆసక్తుల్ని గమనిస్తూ మంచి, చెడు వివరించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లు, టీవీ, కంప్యూటర్లు, ట్యాబ్‌లు పిల్లలను ఆకర్షిస్తాయి. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగస్తులుగా ఉన్న ఇంట్లో పిల్లలకు వీటితోనే కాలక్షేపం. అలాంటి సందర్భంలో పిల్లలు ఏం చూస్తున్నారో గమనించాలి. వారికి ఖాళీ సమయం ఎక్కువగా ఉండకుండా పుస్తకపఠనం అలవాటు చేయాలి. ముఖ్యంగా కథల పుస్తకాలను ఇచ్చి చదవమనాలి. అప్పుడు పుస్తకాలపై వారికి ఆసక్తి పెరుగుతుంది. వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. వారిలో సృజనాత్మకత పెంచేలా సంగీతం, నాట్యం, చిత్రకళ వంటి కళలు నేర్పించాలి.
కాబట్టి కొత్తగా తల్లిదండ్రులయ్యేవారు పిల్లల్ని పెంచడం ఎలాగో తెలుసుకోవాలి. అవసరమైతే సైకాలజిస్టులను కలవాలి. కౌనె్సలింగ్ తీసుకోవాలి. అలాగే తప్పనిసరిగా ప్రముఖ రచయిత చలం రాసిన ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం చదవాలి. పిల్లల్ని ఎంత ప్రేమగా, దయగా పెంచాలో చలం ఆర్ద్రమైన రీతిలో రాశారు.
కోపం వద్దు
కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలపై తరచూ కోపగించుకుంటూ ఉంటారు. చీటికిమాటికి అరుస్తుంటారు. అయితే కోపాన్ని అదుపు చేసుకోలేని వారు తమ పిల్లలకు మంచి పెంపకాన్ని, అలాగే మంచి భవిష్యత్తును కూడా అందించలేరని పిల్లల మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు నాణ్యమైన శిక్షణనిచ్చి వాళ్లకు అద్భుతమైన జీవితాన్ని కానుకగా ఇవ్వాలంటే ముందు తల్లిదండ్రులు భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకోలేని కుటుంబాల్లో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఉద్వేగాలను అదుపు చేసుకోలేని వారిగా తయారవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
* పిల్లల విషయంలో కోపం తాలూకు ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయి. కోపంతో పసిపిల్లల లేత మనస్సులు గాయపడటమే కాదు, కోపంతో తల్లిదండ్రులు చేసే శారీరక, మానసిక హింస వాళ్లను జీవితాంతం వెంటాడుతుంది. క్షణికావేశంతో పిల్లల విషయంలో చూపించే కోపం వాళ్ల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి.
* కోపాన్ని అదుపు చేసుకోవడం ఎలాగో ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. భావోద్వేగాల పరంగా తీవ్రమైన అలజడి ఉన్నప్పుడు అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. పరిస్థితి అంత తీవ్రంగా లేనట్టయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని కోపాన్ని అదుపు చేసుకోవచ్చు.
* కోపం తెప్పించే విషయాలకు దూరంగా ఉండటం, ఒకవేళ కోపం వస్తున్నట్టు అనిపిస్తే ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవడమో లేక నంబర్ కౌంటింగ్ టెక్నిక్‌ను అప్లరు చేయడమో చేయాలి. అలాగే గట్టిగా ఊపిరి పీల్చి వదిలినా మంచి ప్రయోజనమే ఉంటుంది.
* చాలా సందర్భాల్లో పిల్లలు కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ, మొండిగా వ్యవహరిస్తూ తల్లిదండ్రుల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడమే కాక పిల్లలు ఆ విధంగా ప్రవర్తించకుండా ప్రేమగా కట్టడి చేసే బాధ్యత తల్లిదండ్రులదే. సరిగ్గా ఇక్కడే తల్లిదండ్రులుగా మీ సామర్థ్యం బయటపడుతుంది.
* భావోద్వేగాలకు సంబంధించి పిల్లలతో తల్లిదండ్రుల సంబంధాలు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. మీ పిల్లలకు కోపం వస్తే దాన్ని వారు ప్రదర్శిస్తే వాళ్ల కోపం దేనికోసమో తెలుసుకోవాలి.
* కోపం వచ్చిన సందర్భంలో ఏ విధంగా నియంత్రించుకోవాలో, అలా చేయకపోతే జరిగే పర్యవసానాలను వాళ్లకి వివరించి చెప్పండి. పిల్లలకు కోపం దుష్పరిణామాలు చెబుతూనే అదే సమయంలో తాము కోపాన్ని జయించేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారు.
*