S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జంతుజాలాన్ని ప్రేమిద్దాం..

* నవంబర్ 25 జంతువుల హక్కుల దినోత్సవం
మనిషి తన కోసం తాను జీవిస్తాడు. కానీ సృష్టిలోని ఎనె్నన్నో జంతువులు పక్షులు తమ కోసం కాక మనుషుల కోసం జీవిస్తున్నాయి. మనుషుల కోసం మరణిస్తున్నాయి. మనుషుల కోసం ఆత్మార్పణ చెయ్యమని ఆ జీవులను ఏ దేవుడూ శాసించలేదు. శపించలేదు. అయినా, మనిషి తన ఉనికి కోసం, తన రక్షణ కోసం, తన ఆహారం కోసం, వినోదం కోసం, ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ, జంతుజాలాన్ని బంధించాడు. బానిసలుగా మార్చి తన అధీనంలో ఉంచుకున్నాడు. వాటి స్వేచ్ఛను, ప్రాణాలను హరించి, తన స్వార్థానికి వాడుకుంటున్నాడు.
మనుగడ కోసం జరిగే పోరాటంలో, తన భావ భాషా పటిమలతో, జంతువుల పట్ల తన చర్యలను మనిషి సమర్థించుకుంటే సమర్థించుకోవచ్చు గాక కానీ తాను పొందుతున్న ప్రతిఫలానికి కనీస కృతజ్ఞత లేకుండా, ఆ జీవజాలం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, జాలి కరుణ లేని వైనం, హద్దులు లేని హింస.. వీటిని ఏ చరిత్రా క్షమించదు. ఈ విషయంలో మనిషి తన మనస్సాక్షి ముందు దోషిగా నిలబడక తప్పదు. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా, నష్టం జరిగినా వెంటనే గగ్గోలు పెడతాం. ఆందోళనలు, ధర్నాలు, న్యాయ పోరాటాలు చేసేస్తాం. హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు చేస్తాం. పత్రికలకెక్కుతాం. పతాక శీర్షికలవుతాం.
* * *
తమకూ కొన్ని హక్కులున్నాయని తమకే తెలియని ఆ మూగజీవులను చూస్తే గుండె చెరువై పోతుంది. అవి పడుతున్న బాధలు, చేస్తున్న కష్టం, అనుభవిస్తున్న హింస చూస్తే మనసు వికలమై పోతుంది. అలా గుండెను చెరువు చేసుకుంటున్న వాళ్లు, మనసు వికలం చేసుకుంటున్న వాళ్లు చాలా అరుదు. వేలి మీద లెక్కపెట్టవచ్చు. ఆ కొద్దిమందే జంతు బాంధవులు. మనసున్న మనుషులు.
సృష్టిలోని ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. ఒక జీవి ప్రాణాలను హరించటానికి కానీ హింసించటానికి కానీ మరో జీవికి హక్కు లేదు. అడవులలో చిన్న జంతువులను పెద్ద జంతువులు బాధించటం, చంపడం జరిగితే జరగొచ్చు. దానిని ఆపటం ఎలాగూ మన చేతిలో లేదు. కానీ అన్ని జీవులలో ఉత్తముడనీ, మహా మేధావిననీ విర్రవీగే మనిషి నోరు లేని ఈవాల పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ వాటిని హింసించటం చంపటం అన్యాయం అనాగరికం. ఒక జీవి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. మనకు రక్షణను, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, జీవనాధారాన్ని ఇచ్చే మూగ జీవాల పట్ల, కృతజ్ఞతా భావంతో, పూజనీయ భావంతో మెలగటం మన అందరి విధి, కనీస ధర్మం, మానవత్వం, కృతజ్ఞతను ప్రదర్శించకపోగా, కొందరు క్రూరంగా హింసించటం దారుణం. మహా పాపం.
* * *
జంతువుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జంతువుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన నాథు టి.ఎల్.వాస్వామి జయంతి అయిన నవంబర్ 25వ తేదీని జంతు ప్రేమికులు, జంతు సంరక్షణా సంస్థలు ‘జంతువుల హక్కుల దినం’గా జరుపుకుంటున్నారు. మనుషుల వలన జంతువులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలిగినా అది వాటి స్వేచ్ఛను హరించినట్టే అని, వాటి హక్కులను కాలరాసినట్టే అని జంతు సంక్షేమ సంస్థలు భావిస్తున్నాయి. జంతువుల హక్కుల దినమైన నవంబర్ 25న మాంసాన్ని తినకుండా ‘నో మీట్ డే’ను పాటించాలని సంస్థలు, జంతు ప్రేమికులు కోరుతున్నారు. జంతువుల హక్కుల దినాన్ని పురస్కరించుకొని, వాటి హక్కుల గురించి, వాటిపట్ల మన బాధ్యతల గురించి సింహావలోకనం చేసుకుందాం.
గత చరిత్రలోనే కాదు, పురాణ ఇతిహాసాల కాలం నుండి కూడా మనుషులకు, జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషి జంతువులపైన ఆధారపడి ఉన్నాడు. వాటి ద్వారానే ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని పొందుతున్నాడు.
పుట్టిన బిడ్డకు తల్లి పాలు పడకపోతే ఆవు పాలు పడతారు. నిద్ర లేవగానే బెడ్ కాఫీకి పాలు కావాలి. రాత్రి నిద్రపోయే ముందు చక్కటి నిద్ర కోసం గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగుతారు. చనిపోయిన తర్వాత కర్మకాండలకు కూడా పాలు వాడతారు. అంటే, మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు పాలపైన అంటే జంతువులపై ఆధారపడుతున్నాం. ఈ మధ్యలో పెరుగు, నెయ్యి, స్వీట్స్, కొన్ని ప్రత్యేక వంటకాలకు, పూజలకు, శుభకార్యాలకు, అశుభకార్యాలకు అన్నిటికి పాలు అవసరమే.
మనం తినే గుడ్లు, చికెన్, మటన్.. వీటన్నిటికి గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్లు, కోళ్లు, బాతులపైన ఆధారపడుతున్నాం. ఇంటి కాపలాకు కుక్కలను వినియోగిస్తారు. నేర పరిశోధనలో కుక్కల పాత్ర చాలా ఉంటుందనే విషయం తెలిసిందే. మత్తు పదార్థాల వంటి వాటిని వాసనతో గుర్తించటానికి పందులను కూడా వినియోగిస్తారు. వ్యవసాయానికి, బండ్లు లాగటానికి ఎడ్లు, గుర్రాలను ఉపయోగిస్తారు. మంచు కొండల్లో మనుషులను చేరవేయటానికి గుర్రాలు, ఇతర జంతువులను వినియోగిస్తారు. పరిశోధనలకు జంతువులు కావాలి. గంగిరెద్దుల ఆటతో జీవనం సాగిస్తున్నవారూ ఉన్నారు. సర్కస్ ప్రదర్శనల్లో ఎనె్నన్నో పక్షులు, జంతువులను వినియోగిస్తారు. విదేశాలలో వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయటానికి, జంతువులకు తగిన శిక్షణ ఇచ్చి, వాటిని అమ్ముతూ ఉంటారు. పూర్వకాలంలో యుద్ధాలలో గుర్రాలు, ఏనుగులను వాడేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. ఏ రకంగా చూసినా జంతువులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనలో అంతర్భాగం అయిపోయాయి. మన జీవితంలో మమేకం అయ్యాయి.
* * *
సూటిగా చెప్పాలంటే మనిషి జంతువుల మీద ఆధారపడి ఉన్నాడు తప్ప జంతువులు మనిషి మీద ఆధారపడి లేవు. వాటి బ్రతుకు అవి స్వేచ్ఛగా బ్రతికి వాటి ఆహారం అవి సమకూర్చుకోగలవు. కానీ మనుషులందరికీ ఆ వక్తి లేదు. అందుకే కీకారణ్యం నుండి జనారణ్యానికి జంతువులను తరలించాడు. పెరట్లో, ఇంటి ముగింట్లో వాటిని బంధించాడు. అయినా మనిషిని కొంతవరకు క్షమించవచ్చు. కానీ వాటి సహాయంతో బతుకుతూ కూడా వాటి పట్ల కనీస కరుణ, ప్రేమ చూపించకుండా, హింసించే వారు మాత్రం క్షమార్హులు కాదు. అలాంటి వారిని శిక్షించటానికి కొన్ని జంతు చట్టాలు కూడా ఉన్నాయి.
* * *
మనుషుల నుంచి తప్పించుకోవటానికి జంతువులకున్న ఒకే ఒక్క చోటు అడవులు. అయినా మనిషి అడవుల్లోకి చొరబడి వేటాడటం ప్రారంభించాడు. దాంతో కొన్ని జంతువులు అసలు పగలు తిరగటమే మానేసి, వాటి గుహలు, స్థావరాలకే పరిమితం అవుతున్నాయి. రాత్రిపూట మాత్రమే తిరగగలిగే దుస్థితికి చేరుకున్నాయి. అది కనిపెట్టిన మనిషి రాత్రిపూట కాపు వేయటం, వల పన్నటం, ఎర వేయటం మొదలుపెట్టాడు. మాంసం కోసం, చర్మాల కోసం వేటాడే వాళ్లు కొందరయితే, కేవలం వినోద క్రీడగా, కాలక్షేపానికి క్రూరంగా వేటాడేవాళ్లు మరి కొందరు. దాంతో ప్రభుత్వాలు రంగంలోకి దిగక తప్పలేదు. ఆ విధంగా 1972వ సం.లో వన్యప్రాణుల సంరక్షణా చట్టం ఆవిర్భవించింది. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణులను వేటాడటమే కాదు, వాటిని పట్టుకుని బంధించటం కూడా నేరమే. రకరకాల అవసరాల కోసం అరణ్యాలు క్రమక్రమంగా అంతరిస్తున్నాయి. అది జంతువులకు ముప్పుగా మారింది. బొగ్గు కోసం, కట్టెల కోసం అడవుల్లో కార్చిచ్చు పెట్టి, జంతువులను బాధపెట్టేవారు, చర్మాల కోసం, స్మగ్లింగ్ కోసం జంతువులను చంపేవారు ఎక్కువయ్యారు. వీళ్ల బారి నుండి కాపాడటానికి, చాలా రాష్ట్రాలు అభయారణ్యాలను ప్రకటించి, జంతువులను రక్షించే ప్రయత్నం చెయ్యటం హర్షించదగ్గ విషయం. అయినా కూడా జంతువులకు పూర్తి రక్షణ లభించక తిప్పలు తప్పటంలేదు.
* * *
అడవి జంతువుల కష్టాలు అలా వుంటే, పెంపుడు జంతువుల పరిస్థితి మరోలా ఉంది. ఆవులు, గేదెలను పెంచే వారు రకరకాల కారణాల వల్ల వాటికి సరిపడా మేత ఇవ్వకుండా ఆకలితో మాడుస్తున్నారు. అనారోగ్యానికి గురి అయితే, సరియైన వైద్యం కానీ, కనీసం విశ్రాంతి కానీ ఇచ్చే వారు చాలా తక్కువ. గొర్రెలు, మేకల పరిస్థితీ అంతే. ఉత్పత్తి తగ్గిపోగానే కోతకి అమ్మేస్తూ ఉంటారు. పశువులను రవాణా చేసేప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు వున్నా, చాలామంది పాటించటం లేదు.
కోళ్లను తలకిందులుగా వేలాడదీసి తీసుకువెళ్లటమూ తప్పే. ఎడ్లబండి, గుర్రపు బండ్లపైన అధిక బరువులు వెయ్యకూడదు. ఇంటి కుక్కలను స్వేచ్ఛగా తిరగకుండా, ఎక్కువ సమయం గొలుసులతో కట్టి ఉంచటమూ నియమాలకు విరుద్ధమే.
* * *
జంతువులను చూసి నోరులేని జీవాలని చాలామంది అంటూ వుంటారు. అది నిజం కదా. ప్రతి జీవికి దానిదంటూ ఒక ప్రత్యేక భాష, భావ వ్యక్తీకరణా విధానం ఉంటాయి. ఆ భాష, ఆ విధానం తెలియని కొందరు, జంతువులను మూగ జీవాలంటూ మాటల్లో జాలి వొలకబోస్తారు. నిజానికి మనుషుల సానుభూతితో బ్రతకాల్సిన దౌర్భాగ్యం జంతువులకు లేదు. మనుషుల దృష్టిలో జంతువులు మూగ జీవాలు అయితే, జంతువుల దృష్టిలో మనుషులు కూడా మూగ జీవులు అవ్వాల్సి ఉంటుంది. కాస్త కటువుగా చెప్పాలంటే, శాస్ర్తియంగా మనిషి కూడా జంతువుల వర్గీకరణలోనే ఉన్నాడు. కాబట్టి అందరూ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, సృష్టిలోని జీవులు (జంతువులు) అన్నీ సమానమే. వాటి వాటి ప్రత్యేకతలు, జీవన విధానం వాటికున్నాయి. వాటి స్వేచ్ఛ, గౌరవం వాటికున్నాయి. ఆ స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. కానీ..?
సకల జీవజాలాలలో అధికుడినని తనకు తాను కితాబు ఇచ్చుకుంటున్న మనిషి, జంతువుల స్వేచ్ఛకు గౌరవానికి భంగం కలిగిస్తున్నాడు. తన పరిధి దాటి బల ప్రయోగానికి పాల్పడుతున్నాడు. ‘బలవంతులు దుర్భల జాతిని, బానిసలను కావిస్తుంటే’ అనే శ్రీశ్రీ మాటలకు నిలువెత్తు నిదర్శనమవుతున్నాడు.
వ్యక్తులపైనో, పార్టీలపైనో, నాయకులపైనో కోపాన్ని, నిరసనను ప్రదర్శించటానికి ఆ వ్యక్తి, నాయకుడు లేదా పార్టీ పేరు రాసిన చిన్న బోర్డును, గేదె మెడలోనో, గాడిద మెడలోనో, కుక్క మెడలోనో వేలాడగట్టడం లేదా వాటికి వినతిపత్రాలు సమర్పించటం ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యింది. అంటే ఒక నీచమైన వ్యక్తికో, పార్టీకో ప్రతీకగా ఆ జంతువులను వాడుతున్నట్టే కదా. ఈ చర్య ఎంతవరకు సమర్థనీయమో, సమాజంలోని ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఆలోచించాలి.

-డా. ఎం.కోటేశ్వరరావు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, కరీంనగర్ 70755 89571