S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘బతుకు చిత్రాలు’.. భళా!

రంగులంటే ఇష్టం.. బొమ్మలు నా ప్రాణం.. చిత్రకళను పవిత్రంగా భావిస్తానని పాతికేళ్లు కూడా నిండని చిత్రకారిణి తాడేపల్లి పావని అంటున్నారు. ఈ రంగంపై సంపూర్ణ తాదాత్మ్యం, అంకిత భావం, ఆరాధన ఉంటే తప్ప ఆ మాటలు రావు.
రంగులను చూస్తే సంతోషం కలుగుతుంది. బొమ్మలు చిత్రించడంలో ఉత్సా హం ఉప్పొంగుతుంది. తెలియకుండానే నన్ను నేను మరచిపోతాను.. అని కూడా ఆమె అంటున్నారు. బతుకుతెరువు కోసం బొమ్మలు వేయడం గాక బతుకును చిత్రించడానికి ఆమె కొంగు నడుముకు కట్టారు. రంగుల పాలెట్‌ను చేతపట్టారు. కాన్వాసును, కాగితాన్ని పునీతం చేస్తున్నారు.
తాను మహిళల పక్షపాతినని, ప్రకృతిని పరిరక్షించే సైనికురాలినని అంటున్నారు. ఆ జ్వలన స్వభావంతోనే జ్వాజ్వల్యమానంగా బొమ్మలు చిత్రిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఆమె వేసిన ఓ జానపద కళాకారిణి బొమ్మ. తాను నివసించే ప్రాంతానికి దగ్గరలో ఉండే కళాకారిణి ‘శారద’ను భుజాన వేసుకుని, చేత ‘అందెలు’ పట్టుకుని రసాత్మకంగా గానం చేస్తూ, అద్భుత సాహిత్యాన్ని, అలవోకగా వొలికించే ఆ శారద కాళ్ల జానపద కళాకారిణి ‘పొట్రేట్’ను గీశారు. అందులో జీవం తొణికిసలాడుతోంది. జానపద కళాకారిణి ‘ఆత్మ’ ఆవిష్కృతమైంది. ఆమె ముఖంలో వర్ఛస్సు ‘సరస్వతీ’ నది ప్రవాహం కనిపిస్తోంది. సంగీత.. సాహిత్య రసగంగను తలపిస్తుంది. ఆమె ఆహార్యం.. నెరసిన జుట్టు, చేతులకున్న ఆభరణాలు, అంచుగల రవికె, ఆకుపచ్చ చీర, అదనంగా భుజం మీద వేసుకున్న గళ్ళగళ్ల ‘రుమాలు’, దానిపై ఆన్చిన శారద.. ముమ్మూర్తులా దివి నుంచి భువికి దిగొచ్చిన ఓ కళాకారిణిలా కాన్వాసుపై అక్రలిక్, ఆయిల్.. మిక్స్‌డ్ మీడియా పద్ధతిలో ఆవిష్కరించి చిత్రకళపై తనకున్న ప్రేమ ఏమిటో, ఆసక్తి ఏమిటో, ఆరాధన ఏమిటో పావని చాటుకున్నారు. పవిత్ర భావనను చెప్పకనే చెప్పారు. ఆ బొమ్మను పొట్రేట్ అనుకున్నా, మోడల్ అనుకున్నా తనకేమీ అభ్యంతరం లేదంటున్నారామె. ఆ చిత్రంలో.. చిత్రరాజంలో ఎనె్నన్నో రంగుల సంగీతాన్ని ఆమె పలికించి తనలోకి ‘ఆర్తి’ని, అద్వితీయ రంగుల శక్తిని, చిత్రకళ పట్ల గల అనురక్తిని రంగుల ప్రపంచం ముందు నిలిపారు. తనలోని సృజనాత్మక సరిహద్దులను ప్రదర్శించారు.
పొట్రేట్.. మోడల్ పెయింటింగ్‌లోనేగాక తన కుంచె ‘స్టిల్ లైఫ్’లోనూ పదునైనదని చాటారు. అక్రిలిక్ రంగుల్లో, కొలాజ్ పద్ధతిలో ఈ బొమ్మలు మనసును హత్తుకుంటాయి. ఈ బొమ్మల్లో ముఖ్యంగా పూలు.. పళ్లు, టేబుల్, దానిపై వస్త్రం, నేపథ్యంలో పరదాలు.. వాటిలో మెరుపులు, వెలుతురు - నీడలు, ఫ్రేమ్.. ఒద్దిక అంతా కలిసి సోయగం సంపెంగ పరిమళం వెదజల్లుతుంది. రంగుల విద్వత్‌ను తెలియజేస్తుంది. నిత్యం అందరూ చూసే ఫ్లవర్‌వేజ్‌ను చిత్రకారిణి కుంచె ఎంత అపురూపంగా, అం దంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా చూపిస్తుందో వాటిని చూస్తే తెలుస్తుంది.
బూడిదలోంచి ఫీనిక్స్ పక్షి లేస్తుందని ఓ మాట వాడుకలో ఉంది. చిత్రకారిణి పావని మాత్రం పెంటకుప్ప నుంచి ఓ కోడిపుంజు లేచి వచ్చిన వైనం, దాని చూపులో ధీరత్వం.. వీరత్వం ‘తెలుగు పౌరుషం’ అన్నింటిని చిత్రిక పట్టి రంగుల వసంతమాడారు. లక్ష అక్షరాలు చెప్పలేని భావాన్ని ఓ చిత్రం పొందుపరుస్తుందని అంటారు. అదో అచ్చం అలాంటిదే ఆ కోడిపుంజు బొమ్మ. అలాగే మరో చిత్రంలో ఓ గద్ద సరస్సులోని ఓ చేపపిల్లను తన్నుకుపోతున్న బీభత్స ‘దృశ్యం’ కనిపిస్తుంది. చేపపిల్లల దీనత్వం.. గద్ద క్రూరత్వం.. నీటి అలల అరుపులు, మెల్లిగా తప్పుకుంటున్న వెలుతురు, ఆకాశంలో ఉదయించడానికి సిద్ధమైన చంద్రుడు.. ఇదంతా వాల్మీకి శోకంలోని ఓ శ్లోకంలా ఓ ఫ్రేమ్‌లో పావని పట్టిచూపారు.
చిత్ర రచనలో ఎంతో ప్రతిభగల పావని మాసాబ్ ట్యాంక్‌లోని జెఎన్‌టియులో ఎంఎఫ్‌ఏ ఫైనల్ చదువుతోంది. తన కళాశాల తరఫున ఇటీవల తన సహచరులతో అజంతా ఎల్లోరాను సందర్శించి వచ్చారు. శతాబ్దాల క్రితం నాటి చిత్రకళను అధ్యయనం చేసేందుకు - అవగాహన చేసుకునేందుకు, ఆ అపురూప చిత్రకళ ఆనుపానులను అర్థం చేసుకునేందుకు, వాటి నుంచి స్ఫూర్తిని పొందేందుకు, చారిత్రక ప్రాధాన్యతను జీర్ణించుకునేందుకు, ఆ చిత్రకళ లోతుల్లోని మార్మికతను మనసులో నింపుకునేందుకు వెళ్లి వచ్చారు. పాఠ్యాంశాల్లో.. బొమ్మల్లో చూడటం కన్నా వాటిని ప్రత్యక్షంగా చూసి పరవశించిపోవడానికి, ఆ కంపోజిషన్‌ను అర్థం చేసుకునేందుకు, ఫిగరేటివ్‌ను ‘పర్‌ఫెక్ట్’గా ఆ రోజుల్లోనే ఎలా గీశారో తెలుసుకోవడానికి ఈ పర్యటన దోహద పడిందని ఆమె అంటున్నారు. సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లో, అంత అద్భుతాల్ని సృష్టిస్తే అన్ని సౌకర్యాలున్న ‘ఈ తరం’ ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చునన్న భావన అజంతాను సందర్శించినప్పుడు కలుగుతుందని కూడా ఆమె అంటున్నారు.
ఆనాటి సహజ రంగుల గొప్పదనం వందల సంవత్సరాల అనంతరం కళ్లకు కట్టడం చిత్రకారులందర్ని ఆకర్షించే అంశమని ఆమె అభిప్రాయం. తాను సైతం సహజ రంగులనే ఎక్కువగా ఇష్టపడతానని, సహజ రంగుల్లో కోడిగుడ్డు సొన కలిపి రంగుల మిశ్రమంతో.. ఎగ్ టెంపోరా పద్ధతి అంటే తనకెంతో ఇష్టమని, ఈ విధానాన్ని సీనియర్ చిత్రకారుల వద్ద నేర్చుకుని సాధన చేస్తున్నానని ఆమె చెప్పారు. ఎద్దు కొమ్ములను మరిగించి, వెలువడిన గుజ్జును ఖాదీ వస్త్రంపై పూసి అనంతరం బొమ్మలు వేసే ‘సరుష్’ పద్ధతిని సైతం తాను అనుసరిస్తున్నానని ఇట్లా అనేక ప్రయోగాలు చిత్రకళా రంగంలో చేస్తూ ఉన్నానని ఆమె వివరించారు.
ఎన్నో.. ఎనె్నన్నో ఆలోచనలు, ఆకాంక్షలు, అభిప్రాయాలు, అద్భుత నైపుణ్యం.. ప్రతిభ గల తాడేపల్లి పావని 1996 సంవత్సరంలో ఓ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. నగర శివారులోని బడంగ్‌పేటలో ప్రాథమిక విద్య కొనసాగింది. బాల్యం నుంచే చిత్రరచనపై ఆసక్తి ఉందని, పాఠశాలలో చిత్రరచన పోటీ జరిగితే అందరికన్నా ముందు తానే ఉండేదానినని, ముగ్గులు వేయడంలో కొత్తదనాన్ని ప్రదర్శించేదానినని, మెహిందీ (గోరింటాకు) పెట్టడంలో నైపుణ్యం కనబరచడంతో శుభ సందర్భాల్లో, ఉత్సవాలప్పుడు అందరూ తన చుట్టూ మూగేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. అలాగే తన బాబాయి అప్పటికే ఎంఎఫ్‌ఏ చేయడం, ఇంట్లో గోడలపై బొమ్మలేయడం ఆ వాతావరణం తననెంతో ఆకర్షించిందని కూడా ఆమె చెప్పారు.
ఇంటర్మీడియెట్ అయిపోయాక చదువుపై ఆసక్తి తగ్గింది.. ఆ లెక్కలు (గణితం) తలనొప్పిగా ఉండేవి.. రంగులను చూస్తే మాత్రం ప్రాణం లేచి వచ్చేది.. దాంతో 2014 సం.లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బిఎఫ్‌ఏ కోర్సులో చేరానని, అక్కడ లైన్ డ్రాయింగ్, పెన్సిల్ షేడ్స్ (టిన్స్ - షేడ్స్)తోపాటు కూల్.. వార్మ్ రంగుల మిశ్రమాన్ని తదితర బేసిక్ (ప్రాథమిక) అంశాలను నేర్చుకున్నాక.. కంపోజిషన్ ఎలా చేయాలి? అనాటమీని ఎలా అర్థం చేసుకోవాలి, పెయింటింగ్ ఎలా గీయాలి? ఇలా అక్కడ సరికొత్త ప్రపంచానికి స్వాగతం లభించిందని ఆమె తెలిపారు. 2018 సం. జెఎన్‌టియులో ఎంఎఫ్‌ఏలో చేరాక పూర్తి ‘స్వేచ్ఛ’గా చిత్రాలు గీయడంలో అభ్యాసం పెరిగిందని, సొంత సృజనకు అధ్యాపకులు ప్రోత్సహిస్తారని, ఆ విధంగా చిత్రకారిణి/ చిత్రకారుడు ఎదిగేందుకు సోపానాలు వాటంతట అవే ఆవిష్కృతమవుతాయని అనుభవపూర్వకంగా ఆమె అంటున్నారు. ఈ స్వేచ్ఛతో తాను ‘సేవ్ ఉమెన్.. సేవ్ నేచర్..’ అన్న నినాదంతో బొమ్మలు గీస్తున్నానని ఆమె తెలిపారు. ఎంఎఫ్‌ఏ అనంతరం పిహెచ్.డి చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నానని, తనకంటూ ప్రత్యేకంగా ఓ ‘స్టూడియో’ రూపొందించుకునే ప్రయత్నంలో ఉన్నానని.. ఆ విధంగా తన జీవితం చిత్రకళకే అంకితమని సగర్వంగా పవిత్ర రంగుల సాక్షిగా పావని పేర్కొన్నారు.

-వుప్పల నరసింహం 99857 81799