S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -2

వేదవ్యాస్ అంచనా నిజమయ్యింది. రెండు నిమిషాల అనంతరం పేలిపోకుండా మిగిలి వున్న బెలూన్స్ ఇరవై కిలోల అఖిల్ బరువుని గాలిలో నిశ్చలంగా నిలపలేక అతడిని నెమ్మదిగా కిందికి దింపసాగాయి. వలతో రక్షక దళం అఖిల్‌ని కవర్ చేశాక అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
అంతలోనే చకచకా జరిగిపోయిందా సంఘటన.
అప్పటివరకూ మామూలుగానే వున్న అఖిల్‌లో నెమ్మదిగా ఏదో మార్పు చోటు చేసుకోసాగింది.
నరాలు చిట్లిపోతున్న అనుభూతి. మెదడు కణాల మధ్య రాపిడి.. హృదయాంతరాల్లో ఏదో సంఘర్షణ. మనసు పొరలకి అస్పష్టంగా అందుతున్న సంకేతాల హోరు.
వాటి మధ్య నలిగిపోతూ కణతల్ని భారంగా నొక్కుకుంటూ.. తూలిపడుతూ..
అప్పుడరిచాడు ‘వొద్దొద్దంటూ’ హృదయవిదారకంగా.
ఉలిక్కిపడ్డారంతా.
ఆ వేపు మెరుపుల కదిలిన వేదవ్యాస్ స్పృహ తప్పి పడబోతున్న అఖిల్‌ని ఒడుపుగా తన చేతుల్లోకి తీసుకున్నాడు.
భయంతో వాడికలా జరిగిందేమోనని అనుకున్నారంతా.. వేద కూడా!
కానీ..
భవిష్యత్‌లో ఉత్కంఠభరితమై చోటు చేసుకోబోతున్న ఓ అత్యద్భుత ఘటనకి ఆ క్షణంలో నాందీ ప్రస్తావన జరిగిందని.. అందుకు అఖిల్ సూత్రధారుడై నిలవబోతున్నాడని తెలీదెవరికీ!
నివేదిత దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ కుప్పకూలిపోయింది. జరుగుతున్న తతంగాన్ని నిస్తేజంగా చూస్తూ ఆమె భర్త వసంత్ ఆమెని పొదవి పట్టుక్కూర్చున్నాడు.
మళ్లీ గుమిగూడిన జనం అఖిల్‌ని చుట్టుముట్టకుండా తన బలగాన్ని ఎలర్ట్ చేశాడు.
ఇక ఎక్కువసేపు అక్కడ ఉండటం మంచిది కాదని భావించి పేరెంట్స్‌తో సహా అఖిల్‌ని సురక్షితంగా వాళ్లింటికి తీసుకెళ్లాడు.
లోపలికి ఆహ్వానించాడు వసంత్. అంగీకరించాడు వేదవ్యాస్. టీ ఆఫర్ చేస్తే కాదనే్లక పోయాడు. తొందరల్లోనే అఖిల్ మామూలై పోయాడు.
అందరూ రిలాక్సయ్యాక అఖిల్‌ని చనువుగా దగ్గరకు తీసుకుని ఆ యస్సై అడిగాడు కావాలని.
‘నీ పేరేంటి బాబూ?’ అని.
‘రాజ్.. అఖిల్ విహారీ రాజ్’ ఠక్కున చెప్పాడు కుర్రాడు. సినిమా స్టైల్‌లో ఉత్సాహంగా.
‘ఐసీ! ఏం చదువుతున్నావ్ మరి?’ ప్రశ్నించాడు మళ్లీ.
‘్థర్డ్ స్టాండర్డ్’
ఎలాంటి బెరుకు లేకుండా ఆ కుర్రాడు సమాధానాలిస్తుండటంతో ముగ్ధుడవుతూ అప్పుడడిగాడు.
‘అసలిలాంటి పనే్చయాలన్న ఆలోచన నీకెందుక్కల్గిందీ?’
తడుముకోకుండా ఎగరడానికి ముందు జరిగింది చెప్పేశాడు.
‘జస్ట్ క్యూరియాసిటీ అన్నమాట’ మనసులో అనుకున్నాడు.
వసంత్‌ని ప్రక్కకి పిల్చి ‘మీ వాడినేమీ అనకండి. కోప్పడకండి. అసలేమీ జరగనట్లే వాడితో ప్రవర్తించండి..’ అని చెప్పాడు వెళ్తూ వెళ్తూ
సరేనన్నట్లు తలూపాడు వసంత్.
* * *
‘మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్’ దోపిడీ జరిగి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యింది.
దుండగుల ఆచూకీ మాత్రం దొరకలేదు. ఎలాంటి ఆధారాలు నేరస్థులకు సంబంధించి లభ్యమవలేదు. ఆ బ్యాంక్ తాలూకు టర్నోవర్ బాగా తగ్గిపోయింది.
కస్టమర్లని ఆకర్షించడానికి, టర్నోవర్‌ని పెంచుకోవడానికి ఆ బ్యాంక్ విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది.
బ్యాంక్ దోపిడీ కేసుని సిబిసిఐడికి అప్పగించింది ప్రభుత్వం. ఫలితం శూన్యం. నేరాన్ని వెలికితీయలేక పోయారు.
ఒక రకంగా సిబిసిఐడి దర్యాప్తు నిలిచిపోయిందనే చెప్పొచ్చు.
* * *
‘డాడీ.. డాడీ! నంది దేవుడా?’ కుతూహలంగా అడిగాడు అఖిల్.
‘కాదు నాన్నా!’ సమాధానమిచ్చాడు తండ్రి వసంత్.
‘మరే నిన్న మనం వెళ్లిన శివాలయంలో నంది ఉన్నాడు కదా! ఆయనక్కూడా దణ్ణం పెట్టమందిగా మమీ!’ ఆ చిన్నారి బుర్రలో సరికొత్త సంశయం సుడులు తిరిగింది.
‘శివుడు దేవుడు. శివుడి వాహనం నంది. కనుక దేవుడి వాహనమైన నందీశ్వరుడికి కూడా దండం పెట్టాల్సిందే మరి’ చెప్పాడు వసంత్.
‘అలాగా’ అంటూ అర్థమైనట్లు తలూపాడు వాడు.
మళ్లీ వెంటనే ‘డాడీ! మరే వినాయకుడు కూడా దేవుడే కదూ?’ అనడిగాడు చక్రాల్లాంటి కళ్లని తిప్పుతూ.
‘అవునమ్మా. చాలా పవర్‌ఫుల్ గాడ్. అందుకే మనమంతా ముందుగా ఆయనకే దండం పెట్టాలి’ అన్నాడు.
సరేనన్నట్లు తలూపాడు అఖిల్.
‘ఏదీ ఒకసారిలా అను చూద్దాం - గణేశ్ మహరాజ్‌కీ జై’ తాను బిగ్గరగా అరుస్తూ కొడుక్కి చెప్పాడు.
‘గణేశ్ మహారాజ్‌కీ జై!’ చెయ్యెత్తి మరీ ఇల్లదిరిపోయేలా ఉత్సాహంగా అరిచాడు తండ్రి చెప్పినట్లుగానే.
‘చాలా డాడీ! మరోసారి అనాలా?’ తండ్రినడిగాడు.
‘చాల్చాల్లేరా బాబూ! ఎన్నడూ లేంది హఠాత్తుగా ఉదయం పూట ఈ అరుపులేంటంటూ మీ మమీ మనకు క్లాసు పీకుతుంది’ అన్నాడు వాణ్ణి వారిస్తూ.
వౌనం వహించాడు. అదీ అరక్షణం.
‘డాడీ..! విఘ్నేశ్వరుడి వాహనమేంటి?’ అంటూ మరో ప్రశ్న సంధించాడు.
‘ఆర్.ఎ.టి. ర్యాట్! ఎలుక’ చెప్పాడు వసంత్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ స్టయిల్‌లో.
‘మరలాగయితే శివుడి వాహనమైన నందికి దణ్ణం పెట్టినప్పుడు, విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకకి కూడా దణ్ణం పెట్టాలిగా’ అనడిగాడు అమాయకంగా ఫేసు పెట్టి.
గతుక్కుమన్నాడు వసంత్.
‘ఇప్పుడు సమాధానం చెప్పండి చూద్దాం’ అన్నట్లున్నాయి వాడి వాడిచూపులు.
కూర్చున్న చోటే ఇబ్బందిగా కదిలాడు వసంత్.
వెధవ ప్రశ్నలూ వీడూనూ. ఎటాక్ స్టార్టయ్యిందన్న మాట. అందుకే ఆదివారాలు కూడా స్కూల్ రన్ చేస్తే బావుండేది. వీడిలా వేపుకు తినడం వుండకపోయుండేదిగా!’ అనుకున్నాడు మనసులో.
తండ్రి రెండు చేతుల్ని పట్టుకుని కుదుపుతూ గోముగా అడిగాడు ‘చెప్పండి డాడీ!’ అని.
ఏదో చెప్పబోయి, చప్పున ఆగిపోయాడు వసంత్.
‘దణ్ణం పెట్టకుండా బోనులో పడ్డ ఎలుకని నిన్న చంపేసింది. కాల్చింది కూడా! ఎందుకని?’ అంటూ నిలదీశాడు వాడు.
వదిలేలా లేడని, ‘ఎందుకంటే.. ఎందుకంటే ఎలుకల్ని చంపి, కాల్చకుంటే ప్లేగు వ్యాధి చుట్టేస్తుందని’ అంటూ పళ్ళు పటపట కొరికాడు.
‘ప్లే..’ అంటూ వాడు మళ్లీ ఏదో అడగబోతుంటే ‘డోంట్ ప్లే విత్ మీ’ అని మనసులో కసిగా అనుకుని తెరిచిన కొడుకు నోటిని చప్పున అరచేత్తో మూసేశాడు వసంత్.
ఇంతలో వంటింట్లో నుండి అటువైపు వచ్చింది నివేదిత. చూడగానే ఆమెకి అక్కడి సీన్ అర్థమైంది.
భార్యని చూడగానే నోటికడ్డం పెట్టిన చేతిని వదిలేశాడు వసంత్.
అఖిల్ బారి నుండి భర్తని రక్షిద్దామని ‘నిట్టూ! ఇలా రా నాన్నా. డాడీ నిన్న ఆఫీసు నుండి లేటుగా వచ్చారు. ఆయనకి హెడేక్‌గా వున్నట్టుంది. విసిగించకుండా నాతోరా స్నానం చేయిస్తాను’ అంటూ వాడి జబ్బ దొరకబుచ్చుకుని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లింది.
‘హమ్మయ్య’ అని నిట్టూర్చాడు వసంత్.
దొరికిన ఛాన్స్ అన్నట్లు బెడ్‌రూమ్ వదిలి హాల్లోకి వెళ్లాడు.
ఈజీ చెయిర్‌లో కూర్చుని పేపర్ తిరగేయసాగాడు.
ఫ్రంట్ పేజీలోని హెడ్‌లైన్స్ కళ్లతో చదివి, లోపలి మ్యాటర్ కొరకై మడత విప్పబోతుంటే రెండు పాంప్లెట్స్ రాలిపడ్డాయి.
నగరంలో ఎక్కడ ఏది ప్రారంభమైనా పాంప్లెట్స్‌గా అచ్చై పేపర్‌తో పాటే వచ్చేస్తుంటుంది. పాంప్లెట్ అనేది లో-కాస్ట్ సూపర్ ఫైన్ అడ్వర్టయిజ్‌మెంట్ అని వసంత్ అభిప్రాయం.
పాంప్లెట్ చూడ్డమంటే మహా సరదా. అందుకే వంగి కింద పడిన పాంప్లెట్స్‌ని చేతిలోకి తీసుకున్నాడు.
ఒక పాంప్లెట్ మ్యాటర్‌ని చూపుల్తోనే చకచకా చదివాడు.
‘చేరండి.. చేర్పించండి’ అనే శీర్షికతో పడిందొక చిట్‌ఫంట్ ప్రకటన.
ఇప్పటికీ నూట యాభైకి పైగా చిట్‌ఫండ్ కంపెనీలున్నాయి. మరింకెన్ని ప్రారంభవౌతాయోనని విసుక్కుంటూ దాన్ని ముద్దలా మడిచి ఓ మూలకి గిరాటేశాడు.
రెండవ పాంప్లెట్ చూవాడు. అది డబుల్ షీట్‌తో ఉంది.
‘గృహిణులకు శుభవార్త! సగం ధరలకే గృహోపకరణాల కొనుగోలు!’ అనే హెడ్డింగ్‌తో ఉందా పాంప్లెట్.
వాయిదాల మీద కట్టండి.
మొదటి బ్యాచ్ పూర్తయి పోయింది. రెండవ బ్యాచ్‌లో చేరడానికి ఈ నెలాఖరు మాత్రమే గడువుంది.
త్వరపడండి!
అదీ ఆ ప్రకటన సారాంశం.
అనాసక్తిగా దాన్ని కూడా మడిచి మూలకి విసిరాడు.
నిట్టూరుస్తూ పేపర్లోకి తలదూర్చాడు.
* * *
అదే సమయంలో...
అదే పాంప్లెట్ యస్సై వేదవ్యాస్ చేతిలో రెపరెపలాడ్తోంది. పెద్దగా పట్టించుకోలేదతను.
అదే అతను అనాలోచితంగా చేసిన పొరపాటు.
ఎందుకో ఆ క్షణంలో వేద ఆ పాంప్లెక్‌ని సీరియస్‌గా తీసుకోలేక పోయాడు.
త్వరలో తను చేపట్టబోయే ఓ కేసు ఇనె్వస్టిగేషన్ అదో తిరుగులేని ఆయుధం కాబోతోందని ఆ సమయంలో తెలియదతనికి.
స్టేషన్ నుండి ఏదో రొటీన్ కాల్ రావడంతో.. వెళ్లడానికి ఉద్యుక్తుడవుతూ ఆ హడావిడిలో అప్పటికి ఆ విషయాన్ని తాత్కాలికంగా వదిలివేశాడు.
అలా అని మరచిపోలేదు.. మరచిపోడు!
మెదడు పొరల్లో ఏ మూలో నిక్షిప్తమై ఉంటుంది. తిరిగెపుడో అతని ఆలోచనల మధింపులో ఉద్భవిస్తుందా మ్యాటర్.
అదే అతడి కాన్ఫిడెన్స్.
2
అదే తరుణంలో
వసంత్ పేపర్ చదవడం పూర్తి చేసి మార్కెట్‌కి బయల్దేరాడు. భర్త బయటకు వెళ్లిన అనంతరం నివేదిత హాల్లోకి ప్రవేశించింది అఖిల్ ఒళ్లు తుడుస్తూ.
ఆమె కంట పడిందా పాంప్లెట్.
వంగి దాన్ని తీసుకుని తీరిగ్గా చదివింది.
విధి ఆడించబోయే రసమయ నాటకానికి నాందీ ప్రస్తావనగా.. ఆ క్షణంలో అంకురార్పణ జరిగింది. అందుకే ఆసక్తిగా ఆ పాంప్లెట్‌ని భద్రపరిచిందామె.
* * *
సాయంత్రం ఆరు గంటలు.
ఆఫీసు నుండి వచ్చిన వసంత్ ఫ్రెషప్ కాగానే, భర్తకి కాఫీ కప్పు అందించి పక్కన కూర్చుంది నివేదిత.
అక్కడే హోమ్‌వర్క్ చేస్తూ కూర్చున్న అఖిల్ తండ్రితో అన్నాడు.
‘డాడీ! డాడీ! స్కూల్లో మేడమ్ చెప్పింది పిక్నిక్‌కి తీస్కెళ్తార్ట మమ్మల్ని’ అని.
‘ఎక్కడికి?’ అడిగాడు వసంత్.
వౌనంగా ఉండిపోయింది నివేదిత. స్కూల్ నుండి రాగానే తల్లికి విషయం చెప్పి పర్మిషన్ అడిగాడు అఖిల్. కానీ డాడీ వచ్చాక ఆయనకి చెప్పమందామె.
అందుకే కొడుకు భర్తకి చెబుతుంటే కలుగజేసుకోలేదు నివేదిత.
‘ఊరి బయట మామిడి తోటల్లోకట’ అన్నాడు వాడు.
‘ఎప్పుడు వెళ్తున్నారు?’
‘కమింగ్ ఫ్రైడే డాడీ’
‘నీకు వెళ్లాలనుందా?’
అవునన్నట్లు తలూపాడు వాడు.
‘సో! పర్మిషన్ గ్రాంటెడ్’
తండ్రి మాటకి వాడి ముఖం వికసించింది.
సంతోషంతో తిరిగి హోమ్ వర్క్ చేయటంలో నిమగ్నమై పోయాడు.
అయితే ఆ పిక్నిక్ ప్రోగ్రామ్ అఖిల్ జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పబోతోంది!
* * *
సమయం సరిగ్గా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు. దాదాపు నగరమంతా నిద్రాదేవి ఒడిలోకి జారుకుని ఉండి ఉంటుంది.
కానీ ఓ అపార్ట్‌మెంట్‌లోని ఆ గదిలో మాత్రం
ఉత్కంఠత ఆవరించి ఉంది. వినాశనానికి దారి తీసే ఏ క్రూరపు ఆలోచనలకి ఇక్కడ అంకురార్పణ జరగబోతోందనే భయం పట్టుకుందా గదికి.
ఎందుకంటే...
త్రాచుల్లాంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ సమావేశమవబోతున్నారు.
ఈజీచెయిర్‌లో అసహనంగా కదులుతోందో ఆకారం.
ముప్పావు గంట నుండి వెయిటింగ్‌లో ఉంది ఆ ఆకారం, ముఖ్యమైన రెండవ వ్యక్తి కోసం.
అందుకే విసుగ్గా ఫీలవుతోంది.
మాటిమాటికీ చూపులు వాచ్‌ని తడుముతున్నాయి. చెవులు డోర్ శబ్దం కోసం చూస్తున్నాయి.
అదిగో అప్పుడు మ్రోగింది బజర్!
శబ్దం వినబడటం ఆలస్యం వెంటనే తలుపులు తెరుచుకోలేదు.
అలర్ట్ అవుతూ చెవులు రిక్కించి, చూపుని డోర్‌కేసి సారించిందా ఆకారం.
కాలింగ్ బెల్ శబ్దం ఆగింది. డోర్‌లాక్ హోల్‌లోంచి పెన్ టార్చ్ ఫోకస్ గదిలోకి పడింది. అలా రెండుసార్లు. తిరిగి బెల్ మోగింది. తర్వాత మరోసారి ఫోకస్.
అదిగో అదే సంకేతం!
కన్‌ఫర్మ్ అయ్యాక మరిక ఆలస్యం చేయలేదు ఆకారం.
పరుగున వెళ్లి లాక్ తీసి డోర్ ఓపెన్ చేసింది. రెండవ ఆకారం లోనికి వచ్చాక తిరిగి లాక్ వేసింది.
‘హలో!’ అంటూ విష్ చేసింది ఆకారం.
బదులుగా ‘హలో!’ అంది రెండవ ఆకారం.
‘మనం అనుకున్న టైమ్ కంటే చాలా లేటయినట్టుంది ఇక్కడకు రావటం’ సంజాయిషీ అడిగింది.
‘నథింగ్’ అంటూ భుజాలెగరేసింది.
‘మరి నీ నైస్ పంక్చువాలిటీ?’ వ్యంగ్యం ధ్వనించింది.
ఇలా రహస్యంగా ఏదో ఒక చోట ఎవ్రీ వీకెండ్ ఇద్దరూ మీట్ అవుతుంటారు. బిజినెస్ రీత్యా ఎక్కడ వున్నా, ఎంత బిజీగా వున్నా.
‘ఈ రోజు మార్నింగ్ లేవడమే పదిహేను నిమిషాలు లేటయ్యింది. ఇక్కడికి వస్తుంటే మార్గమధ్యలో చిన్న ప్రోగ్రామ్ ఎటాచయ్యింది. అక్కడ కొంత టైమ్ స్పెండ్ చెయ్యాల్సి వచ్చింది. సో! ఈ రోజంతా నా టైమ్‌టేబుల్ అలా అలా క్యాజువల్‌గా ఆలస్యమవుతూ వచ్చింది. దట్సాల్’
చేసేది చీకటి వ్యాపారమే అయినా సమయాన్ని కచ్చితంగా పాటిస్తుందా ఆకారం. అందుకే తనని తాను సమర్థించుకుంటూ పై కారణాలు తెలిపింది.
‘బై ది బై! నీ న్యూ అసైన్‌మెంట్ ఎంత వరకొచ్చింది?’ అంటూ మొదటి ఆకారాన్ని ప్రశ్నించింది.
‘పికప్‌లో ఉంది’
‘క్యాష్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నావ్?’
‘సుమారు ఇరవై నుండి ముప్పై లక్షల వరకు’
‘నీ ప్లానింగ్ ప్రకారం గోల్ పూర్తయినట్లేనా?’
‘కేవలం ఫోర్టీన్ లాక్స్ కవరయ్యాయి.’
‘మిగతా ఎవౌంట్’
‘్ఫల్‌ఫిల్ కావాలి’
‘ఇంకా ఎంత టైమ్ పడుతుంది?’
‘జస్ట్.. పది పదిహేను రోజుల్లో పూర్తి చేసేద్దామనుకుంటున్నాను’
‘అప్పటికీ అవకపోతే?’
‘ఏముంది? అనుకున్నది అనుకున్నట్లు జరక్కపోతే మరో పదిహేను రోజుల ఎక్స్‌టెన్షన్‌కి ప్లానింగ్ సిద్ధం చేస్తున్నా.’
‘వేసిన ప్లాన్ ప్లాన్డ్‌గానే ఉండాలి. అందుకే సరిగ్గా డీల్ చేస్తూ వుండు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకూడదు. ఎలాంటి లొసుగులు బయటకు పొక్కకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలి.’
‘వూ’ కొడుతోంది.
‘ఆర్ యూ ఫాలోయింగ్ మీ?’
‘యసెస్. ప్రొసీడ్’
‘జనాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు. అలాగే పోలీసు వ్యవస్థనీ, ఆదమరిచి ఉండకు. మనని వెన్నంటే పొంచి వుండే పోలీసుల నుండి ప్రమాదాన్ని పసికడుతూనే మరోవైపు జనాల్ని సరికొత్త టైపులో మోసగిస్తూ వుండాలి. అప్పుడే మన ఉనికి దెబ్బ తినదు.’
తలూపింది ఆకారం.
‘అలా జరగని క్షణాన మనం ఘోరంగా స్లిప్ అవుతాం’ మళ్లీ తనే కంటిన్యూ చేసిందా రెండవ ఆకారం.
‘ట్రెయినింగ్ తమరిది కదా! నా స్టెప్స్ మిస్ అవడం జరగదు’
‘ఆ హోప్ ఉందనుకో’
‘ఇక ఇంపార్టెంట్ టాపిక్ ఏమీ లేదు. ముగిద్దామా?’
‘ష్యూర్’
‘ఓకె! గుడ్‌నైట్’ అంది మొదటి ఆకారం.
‘గుడ్‌నైట్’ బదులుగా విష్ చేసింది రెండవ ఆకారం.
డోర్ లాక్ ఓపెన్ చేసి ఎప్పట్లా తిరిగి చీకట్లో కలిసిపోయిందా ఆకారం.. నిశ్శబ్దంగా!
వెనువెంటనే మొదటి ఆకారం అడుగులు కదిలాయి మరొక దిశగా... వడివడిగా!
సమాజం దృష్టిలో వాళ్లిద్దరూ పేరు మోసిన బిజినెస్ టైకూన్స్.
అదే విధంగా హైటెక్ క్రిమినల్స్ కూడా.. చట్టం పరిధిలో!
* * *
ఉదయం
ఎనిమిది గంటలు.
తనకూ బాల్యం వచ్చేసిందేమోనన్నట్లు తారురోడ్డు మీద ఉత్తేజంతో పరుగులు పెడుతోంది స్కూల్ బస్.
లోపల పిల్లలంతా ఉత్సాహంగా రైమ్స్‌ని లయబద్ధంగా కోరస్‌గా పాడుతుంటే.. తాళం వేస్తున్నట్లు బస్‌కి ముందర కట్టిన బ్యానర్ గాలికి రెపరెపలాడ్తోంది.
గంట ప్రయాణానంతరం సిటీ ఔట్‌స్కట్స్‌లో వున్న విశాలమైన మామిడి తోటలోకి వచ్చి ఓ ప్రక్కగా ఆగిందా స్కూల్ బస్.
మొదట స్ట్ఫా దిగి, ఎవరి బ్యాచ్‌లోని పిల్లల్ని వాళ్లు కిందికి దింపారు. అందరూ దిగాక మరోసారి అటెండెన్స్ ప్రక్రియ కొనసాగింది. తర్వాత వరుస క్రమంలో శాఖోపశాఖలుగా విస్తరించి వున్న ఓ పెద్ద మామిడి వృక్షం కిందికి పిల్లల్ని తరలించారు.
ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు పిల్లలు కేవలం పాతిక దాకా వున్నారు. లేడీ టీచర్స్ ఆరుగురు, హెడ్‌మిస్ట్రెస్.. ఇద్దరు అటెండర్స్‌తో కలుపుకొని మొత్తం ట్రూప్ సంఖ్య ముప్పై నాలుగు.
అందరూ హాపీగా ఉన్నారు.
కానీ వాళ్లకి తెలీదు.
త్వరలో ఒక సంచలనం తమ మధ్యలో జరగబోతోందనీ, ఆ సంచలనానికి సాక్షీభూతులుగా తామంతా నిలవబోతున్నామని!
అందరూ ఒకచోట సమావేశమయ్యాక హెడ్ పిల్లల్నుద్దేశించి మాట్లాడింది.
(ఇంకావుంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055