S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రక్షన్తి పుణ్యాని పురాకృతాని

ఎంత డబ్బుంటే అంత భయం.
ఎంత వెలుగుంటే అంతే చీకటి.
తెలియకపోతే మానవ జీవితం ఒక గోల.
తెలిస్తే అదొక కల.
సృష్టి ధర్మానికి అనువుగా ఒక గృహస్థు తన కుటుంబ సభ్యులతోనూ, సమాజంలోని ఇతర వ్యక్తులతోనూ ఎలా ప్రవర్తిస్తాడో దాన్నిబట్టే మనిషి అకౌంట్‌లో పాపపుణ్యాలు చేరుతూంటాయి.
సమాజంలో వ్యక్తి ఎలా ప్రవర్తించాలో... ఎలా నడవకూడదో శ్రీ రామాయణంలో రామచంద్రుడి వల్ల, ప్రపంచానికి తెలిసింది. రామాయణ గాథ పాతబడి పోవటమంటూ ఉండదు. ఇంక భారతంలో శ్రీకృష్ణుడు గృహస్థుగానే నిలబడ్డాడు. సృష్టి ధర్మాన్ని భగవద్గీత రూపంలో అందించిన యోగీశ్వరుడు. ధర్మమార్గంలో నడిచే పాండవులు పడ్డ బాధలు కష్టనష్టాలు స్వయంగా చూశాడు. దుర్మార్గంగా పాపాచరణతో కౌరవులు చేసిన దుశ్చర్యలన్నీ గమనించాడు. ఆయన పని చేయని క్షణమంటూ లేదు. అలసిపోయిన క్షణమంటూ లేదు. నిరంతర క్రియాశీలి శ్రీకృష్ణుడు. నిజం చెప్పాలంటే కృష్ణావతారంలో పెద్దఎత్తున ధర్మ సంస్థాపన జరిగింది. కృష్ణుడి బాల్యంలోనే దుష్టులంతా నిష్క్రమించారు. తర్వాత శిష్టులూ వెళ్లిపోయారు. యుద్ధమైన తర్వాత అందరితోపాటు ఆయన కూడా నిష్క్రమించాడు. మరి భూమాతకు మిగిల్చినదేమిటి? మిగిలినదేమిటి? అంటే చాలా ఉంది. అటు పాండవుల పరాక్రమానికీ తన ధర్మతేజానికీ ప్రతినిధిగా అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తును తీర్చిదిద్దాడు. కలిలో తరించే మార్గాన్ని భాగవతం వల్ల అనుగ్రహించాడు. పరీక్షిత్తు సరిగ్గా తను నిష్క్రమించేలోగా ఈ భూమికి భాగవత పురాణం అందింది. భారతమందించినది శిక్షణ. భాగవతమందించినది రక్షణ. ‘కలికాలం’ పేరు చెబితే విభేదం. మనిషి నుండి మనిషి తొందరగా విభేదిస్తాడు. విడిపోవటమెలాగా అని ఆలోచిస్తాడు. ఎదుటి వాడి కంటే తాను ప్రత్యేకంగా కన్పడాలి. గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తూంటాడు. ఒకరి మాట మరొకరికి నచ్చదు. అహం బ్రహ్మాస్మి. స్థారుూ భేదాలు, కులాల కుమ్ములాటలు జాతి భేదాలు మనుషుల్లో పెరిగిపోతూంటాయి. పాపాల చిట్టా పెరిగిపోతూ మనిషిని పతనావస్థకు జార్చేస్తుంది. విత్తం ఉంటుంది. కానీ వితరణ బుద్ధి ఉండాలిగా. ఆ జీవితానికి ఏమిటి ప్రయోజనం. పరోపకారమనే మాటుండదు. ధర్మం చాటుమాటుగా బ్రతకాల్సి వస్తుంది. ఉన్న మాట ముఖం మీదంటే తట్టుకోలేరు. చిన్నవయస్సులో అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కన్నతల్లినే హతమార్చిన ఆడపిల్లలు, బుద్ధి చెప్పవలసిన తల్లిదండ్రులే గడ్డి కరుస్తూ సభ్య సమాజం సిగ్గుపడే ధోరణిలో బ్రతకటం కలికాల మహిమే మరి. కాదంటారా? ఇటువంటి పరిస్థితులలో మనిషికి రక్షణ ఏది?
ఏ భయం లేకుండా ఎలా ఉండగలడు? స్థితప్రజ్ఞులైన యోగులకు తప్ప మరణ భయం లేనిదెవరికి? మనిషైనా మహారాజైనా సహజంగా చావంటే ఖంగారు పడిపోతాడు. గిలగిలలాడిపోతూ, గత్యంతరం కోసం వెదుకుతాడు. ప్రారబ్ద కర్మ కాకపోతే ఎవరితోనూ సంబంధం లేక ముక్కు మూసుకుని తపోనిష్టలో కూర్చున్న మునీశ్వరుడి మెడలో చచ్చిన పామును వేయాలనే ఆలోచన పరీక్షిత్‌కు ఎందుకొచ్చింది? ఆ మునీశ్వరుని శాప కారణంగా పట్టుకున్న మరణ భయంతోనే కాస్సేపు వణికిపోయాడు. ముక్తి మార్గం వెదకనారంభించాడు. తక్షకుని వల్ల వారంలో చావు తప్పదనుకున్నాడు. భాగవత శ్రవణంతో తరించాడు. భయ నివారణము పరమాత్ముని నుతి, జయ కారణ మీశ్వర చింత- అని నమ్మాడు. ఆయన భయ కారణం మానవ జాతికి వరమైంది.
యోగ క్షేమం వహామ్యహమ్’ అన్న మాట మనస్సులో బాగా నాటింది. మార్గం కాస్తా సులభమైంది. మునీశ్వరుడి వాక్కుకు ఎంత శక్తి ఉంటుందో గ్రహించాడు. కానీ ఇప్పుడు కలియుగంలో ఈ శాపాలూ గీపాలూ ఉండవు. వ్యవహారం తేలినా తేలకపోయినా గుళ్లూ గోపురాలు తీర్థయాత్రలతోపాటు మిగిలేది కోర్టుల చుట్టూ ప్రదక్షిణలే. ఆధ్యాత్మిక చింతనే అన్ని చింతలకూ మందు. చేతనైతే సహాయం చేసి ఆదుకోవటం, ధర్మబద్ధంగా సంపాదించటం, నీతిగా బ్రతకటం ధర్మాధర్మ విచక్షణ తెలియటంతోనే పుణ్యరాశి పెరుగుతుంది. పాప పుణ్యాల తేడా తెలిస్తే చాలు. ఆర్థిక నేరం చేసినట్లు నిరూపించబడి చెఱసాల పాలై గత్యంతరం లేని స్థితిలో వున్న భద్రాచల రామదాసును భద్రంగా రక్షించి పుణ్యం కట్టుకున్నది ఈ నామ స్మరణే. ఈ కథ ఎప్పటిదో కాదు. ఇప్పటిదే. ఈ కలియుగంలో జరిగినదే. జైలుకెళ్లేవారు బెయిల్ కోసం ఏడుస్తారే గానీ, పారమార్థిక చింతన రాదు. రాకపోవటమే కలియుగ లక్షణం.
సృష్టిగతమైన దైవం నామ రూపాల్లోనే ఉంటాడు. మనం పేరు పెట్టి పిలిస్తే ఆ వ్యక్తి సమాధానమిస్తాడు కదా. అలాగే ఆ నామ రూపాల మీదుగానే ఆయన్ని దర్శించాలి. దానికి పరిపూర్ణమైన శరణాగతే దారి. వెనకటి రోజుల్లో పిల్లలు దాగుడుమూతలు ఆట ఆడేవారు. అందులో కావాలని ఒకడు దొంగగా మారి మిగతా జనాన్ని తిప్పలు పెట్టేస్తూంటాడు. తెలివైనవాడు మాత్రమే ఒడుపును చూసి ఆ దొంగను పట్టుకుంటాడు.
‘దొరికాడు! దొరికాడ’ని కేకలేస్తాడు. అంతే మరొకడు దొంగ అవతారమెత్తుతాడు. మళ్లీ అదే ఆట. అభయమిచ్చేవాడుంటే భయమేల? ఈ సృష్టి కూడా అదిగో అలాటి దాగుడు మూతల్లాంటి ఆటే. ‘్భయానికి వ్యతిరేకం అభయం’ నామ రూపాల మాటున ఉన్న దైవాన్ని పట్టుకొనేందుకు పడే తిప్పలే ఇవి. ఏ భయం, చింతా లేకుండా బ్రతకాలంటే నన్ను బాగా గమనించి, నా సంగతి తెలిసి నన్ను పట్టుకుని సేవిస్తే నీ సంగతి నేను చూసుకుంటానన్న ఆ దైవం అభయ వచనమే మనకు దిక్కు.
వనేరణే, శతృజలాగ్ని మధ్యే
గుహార్ణవే పర్వత మస్తకేవా
సుప్తం, ప్రమత్తం, విషమ స్థితం వా
రక్షన్తి పుణ్యాని పురాకృతాని॥
స్నానం చేస్తూ ప్రవాహం వల్ల కౌపీనం కాస్తా జారిపోయిన మునీశ్వరుణ్ణి గమనించిన ద్రౌపది, తన చీర కొంగు, ఆ క్షణంలో చింపేసి ఆ మునీశ్వరుడికిచ్చిన పుణ్యం వల్లే నిండు సభలో ఆమెకు జరిగిన పరాభవాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తప్పించి కాపాడినట్లుగా ఓ కథ.
రోడ్లపై తిరిగే వాహనాలన్నీ శక్తి స్వరూపాలు. వాటి దృష్టిలో అమాయక జనం బలి కాకూడదు. భయభ్రాంతులై అకస్మాత్తుగా కాకులు దూరని కారడవిలో ఉన్నా, శతృ మధ్యలో ఉన్నా, మహా సముద్రంలో గత్యంతరం లేని స్థితిలో చిక్కుకు పోయినా పర్వత శిఖరాగ్రాలపై ఉన్నా, నిద్రలో ఉన్నా, ఒళ్లు తెలియని మత్తులో ఉన్నా, అపాయంలో ఉన్నా చేసుకున్న పుణ్యమే వారిని రక్షిస్తుంది.
ఆకటి వేళల నలపైన వేళల
తేకువ హరి నామమే దిక్కౌ మరి లేదు
కొఱమాలి యున్న వేళ కులము చెడిన వేళ
చెరపడి ఒరులచే జిక్కిన వేళ
లొరపైన హరినామ మొక్కటె గతిగాక
మరచి తప్పిన లేదు మరి లేదు తెరగు
ఆపద వచ్చిన వేళ యారడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా బొరలిన మరి లేదు తెరగు
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా అప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపింప గతిగాక
మంకు బుద్ధి పొఱలిన మరి లేదు తెరగు
నెత్తి మీదకు ప్రమాదాలు దూసుకొస్తే తన్నివారణగా అన్నమయ్య చేసిన సూచన ఈ కీర్తనలో కనిపిస్తుంది.
అసలు ఆపదలే రాకుండా ఉండాలంటే ఉండాల్సింది బ్యాంక్ అకౌంట్ కాదు. తా చేసిన పుణ్యాల చిట్టా. న్యాయంగా ధర్మంగా కష్టపడి సంపాదించటం.. మితంగా సరిపడా దాచుకోవటం (దోచుకోవటం కాదు) వీలైనంత వరకూ వితరణ బుద్ధి కలిగి ఉండటం. మనిషికి ఇవే రక్షక కవచాలు. అలాగే హరి నామాన్ని జపించటంలో ఉండవలసింది సమర్పణ బుద్ధి. అదే మనిషిని సర్వకాల సర్వావస్థలలోనూ కాపాడుతుంది. చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట.. అంటాడు తత్వార్థం తెలిసిన వేదాంతి. ఒక్క మాటలో చెబితే ధర్మో రక్షతి రక్షితః.
*

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656