S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పలక - బలపం

ఒక పుస్తకం ప్రింట్ చేయించడానికి లేదా మరేదో అచ్చు వేసుకోవడానికి ఫొటో కాపీషాప్‌కి వెళ్లవలసి వస్తుంది. యజమాని మిత్రుడు కనుక నేను వెళ్లిన అంగట్లో కొంతసేపు కూర్చుంటాను. అక్కడికి వచ్చే వాళ్లను గమనిస్తూ ఉంటాను. ఆశ్చర్యం ఎదురవుతుంది. వచ్చే వాళ్లంతా బడి పిల్లలు. ఇంటర్‌నెట్‌లో ఏవో బొమ్మలు వెతుకుతారు. వాటిని కొందరు రంగుల్లోనూ నలుపు తెలుపులోను అచ్చు వేయించుకుంటారు. అదంతా స్కూల్లో ఇచ్చే హోమ్‌వర్క్ కోసమని అడిగి తెలుసుకున్నారు. ఇటి దగ్గర అటువంటిదే మరో షాప్‌లోకి వెళ్లాను. అవి నిజానికి ప్రింట్లు తీసుకోవడానికి వీలున్న అంగడి కాదు. కానీ అక్కడికి కూడా ఓ తల్లి కూతురు వచ్చారు. వాళ్లకు పి.వి. సింధు అనే క్రీడాకారిణి బొమ్మ అచ్చువేసి ఇవ్వాలట. తల్లి అప్పటికే ఆ బొమ్మను తన ఫోన్‌లో చూచి నిర్ణయించింది. నేను ఇంకొక విషయం కూడా గమనించాను. ఎవరూ నోట్స్ రాసుకోరు అని తెలిసింది. వ్రాయవలసినదంత ఇప్పుడు వీళ్లు ఫొటో కాపీ తీసుకుంటున్నారు. చదువు ఈ రకంగా సాగితే గనుక మా కాలంలో బడి మాన్పించి పశువులను కాయడానికి పంపించే వాళ్లు అనుకుంటాను. మేమంతా చాలా తక్కువ ఖర్చుతో చాలా మొదటి పద్ధతిలో చదువుతున్నట్టు ఇప్పుడు అర్థం అవుతున్నది. అయినా పై చదువులలోకి ఎట్లా వెళ్లగలు అన్నది నా మనసులో ఇంకా ప్రశ్నగానే ఉండిపోతుంది.
ఇప్పటి వారికి పలక అంటే ఏమిటో తెలియదు. మాకంటే ముందు వారు చెక్క మీద అచ్చు పోసి దాని మీద రాసుకునేవారట. మా సమయానికి సిలేటు పలకలు వచ్చాయి. స్లేట్ అంటే ఇంగ్లీషులో పలక అని అప్పట్లో మాకు తెలియదు. ప్రకాశం జిల్లాలో ఆ పలకలు తయారవుతాయని కూడా అప్పట్లో మాకు తెలియదు. పలక కింద పడితే పగులుతుంది అన్న సంగతి మాత్రం తెలుసు. కనుక దాన్ని వీలైనంత జాగ్రత్తగా మోసుకుపోయి అంతకన్నా జాగ్రత్తగా తిరిగి తెచ్చేవాళ్లము. ఖర్మ కొద్దీ ఒకసారి పలక పగులుతుంది. నాన్న నిజానికి ఇటువంటి విషయాలను చాలా పెద్ద మనసుతో పట్టించుకునేవాడు. అయినా కొందరు ఈ విషయంగా పడుతున్న బాధ చూచి నేను కూడా భయంగానే ఉండేవాడిని. ఆ పలకలు శుభ్రం చేయడం ఒక పరిశ్రమ. చిన్న గుడ్డ ముక్క ఒకటి జేబులో పెట్టుకుని అవసరం అయినప్పుడు దాన్ని తడిపి పలక తుడుచుకునే వాడిని. కొంతకాలానికి రేకు పలకలు వచ్చాయి. కానీ వాటి రాయడం అంత సౌకర్యంగా ఉండేది కాదు. కనుక పగలడానికి వీలున్న పాత పద్ధతి పలకకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్లం. ఇక పలక మీద రాయడానికి వాడే బలపం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో రెండు రకాలు ఉండేవి. ఒకటి మెత్తగా ఉంటుంది. త్వరగా అరిగిపోతుంది. మరొకటి పలక తయారుచేసిన పదార్థంతోనే తయారుచేస్తారని తర్వాత అర్థమైంది. అది ఎక్కువ కాలం రాస్తుంది. కానీ నాణ్యత లేకపోతే పలక మీద గీతలు పడతాయి. కొనేటప్పుడు బలపం నాణ్యత చూచి కొనడం అవసరం. నాకు ఒక వింత అనుభవం ఉండేది. పాలమూరులో అబూ స్టోర్ అని పుస్తకాలు, నోటు బుక్కులు, మిగతా చదువు సామాగ్రి అమ్మే అంగడి ఒకటి ఉండేది. యజమాని నాన్నకు బాగా పరిచయం ఉన్న ఒక స్కూల్ మాస్టర్‌గారు. ఏదో ఒక అవసరం కొద్దీ ఆ అంగడికి వెళుతూనే ఉండేవాళ్లం. బలపాలు పెన్సిల్ లాగ పొడుగుగా ఉంటాయి. అది విరిగితే అమ్మడానికి కుదరదు అయినా కొన్ని విరగక తప్పదు. వౌల్వి సాహెబ్ అని పిలిచే అంగడి పంతులుగారు నేను వెళ్లినప్పుడల్లా విరిగిన బలపాల ముక్కలు నాకు ఉచితంగా జేబు నిండా ఇచ్చేవాడు. అవి నాకు చాలా కాలం వచ్చింది. కనుక బలపాలు కొనడం చాలా అరుదుగానే జరిగేది. ఒక సంబంధం లేని విషయం చెప్పాలి అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు ఈ బలపాలను కరకర నమిలి తినేవారు. నేను ఆ ప్రయత్నం చేయలేదు గనుక రుచి ఎలా ఉంటుందో చెప్పలేను.
మనం రాసుకోవడానికి పలక ఉంటే సరిపోతుంది. కానీ పంతులుగారు పడేలా నల్లబల్ల (బ్లాక్ బోర్డ్) మీద రాస్తారు. అందుకోసం చాక్‌పీస్ అనే సుద్దముక్కను వాడతారు. చాలాసార్లు రాసిన తరువాత ఆ సుద్ద పొడి వాళ్లకు బాగా అంటుకుంటుంది. రాయడం అంత సులభంగా కుదరదు. కనుక కనీసం వారానికి ఒకసారి బడిలోని బ్లాక్‌బోర్డ్‌లు అన్నింటిని మళ్లీ రాయడానికి అనువుగా తయారుచేసే పద్ధతి ఒకటి ఉండేది. అదంతా పిల్లలం మేమే చేసేవాళ్లం. నల్ల అల్లం అని ఒక మొక్క ఉంటుంది. గాయం తగిలితే ఈ మొక్క ఆకులను బాగా నలిపి లేదా దంచి కట్టు కట్టేవారు. గాయం చాలా బాగా మానేది. బెల్లడోనా అనే ఔషధం ఈ మొక్కలో నుంచే వస్తుందని తర్వాత ఎవరో చెప్పారు. బాటనీలో ఈ మొక్కను ట్రైడాక్స్ అంటారు అని తెలిసింది. ఆకులను సేకరించి బొగ్గుతో కలిపి బాగా దంచాలి. ఆ వచ్చిన ముద్దను నల్లబల్లకు పట్టించాలి. కొంతసేపు తర్వాత దాన్ని శుభ్రంగా తుడవాలి. బల్ల మళ్లీ తళతళలాడుతూ వస్తుంది. నల్లని రంగుతో మెరుస్తూ ఉంటుంది. అప్పుడు దాని మీద మళ్లీ సుద్దముక్కతో రాయవచ్చు. కొంచెం నాయకత్వ లక్షణాలు ఉండేవి కాబట్టి తరగతికి చాలాకాలం పాటు మానిటర్‌గా ఉండడం చదువుకున్నంత కాలం కొనసాగింది. చిన్నప్పటి నుంచి నల్లబల్లకు మెరగుపెట్టే పని మా నాయకత్వం కింద జరిగేది. ఏదో గొప్ప పని చేశాము అన్న సంతృప్తి మిగిలేది కానీ గుడ్డలు మాత్రం మకిలి అయ్యేవి. అమ్మ ఏనాడు ఆ మాట నాకు చెప్పలేదు. నా కొడుకు బడిలో ఏదో నిర్వాకం చేశాడు అనుకుని బట్టలు ఉతికేది తప్ప ఆ పని చేయవద్దు అని మాత్రం ఎన్నడూ అనలేదు. ఇప్పటి పిల్లలకు బడిలో ఇటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు.
నల్లబల్ల, సుద్దముక్క దగ్గర ఉన్నాము కాబట్టి లేని మరొక విషయం చెబుతాను. ఎంఎస్‌సి చదువుతున్నప్పుడు ఒక మహామహుడు మాకు వారానికి ఒక క్లాసు చెప్పేవాడు. ఆయన డిపార్ట్‌మెంట్‌లో ఉపాధ్యాయులలో సభ్యుడు కాదు. మరేదో కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఉండేవాడు. ఆయన నిజంగా పెద్దమనిషి. బోర్డు నిండా రాస్తాడు కానీ దాన్ని తుడవడానికి ఆయనకు కష్టమయ్యేది. నేను పంతులు అందరితోనూ చాలా మంచివాడిని. ఆయన బోర్డు నిండినప్పుడల్లా నా వైపు చూచి బోర్డు అని సైగ చేసేవాడు. ఆయనకు నా మీద ప్రేమ ఉండటం అందరికీ తెలుసు. నేను కొంచెం బాగా చదువుకుంటాను అన్నది మాత్రమే అందుకు కారణం. మొదటిసారి ఆయన నన్ను నల్లబల్ల తుడవమని అడిగాడు. క్లాస్ చెప్పినందుకు మీకు మా వాళ్లు డబ్బులు ఇస్తారు కదా, అందులోంచి కొంత శాతం నాకు ఇవ్వాలి మరి అని నేను ధైర్యంగా అడిగాను. ఆయన సరేనన్నాడు. కానీ ఎన్నడూ ఇవ్వలేదు. క్లాసులో మాత్రం అందరూ నవ్వారు. గురువులతో ఇంత మైత్రి, సరదా కుదిరింది అంటే మా చదువు గురించి ఎవరైనా ఊహించవచ్చు.
చదువు చారెడు, బలపాలు దోసెడు అని అప్పట్లో ఒక మాట ఉండేది. అంటే హంగులు ఎక్కువయ్యాయి అని అర్థం. ఇప్పటి చదువులను చూస్తే నాకు అచ్చం అదే సంగతి తెలుస్తుంది. కంప్యూటర్ లేనిదే చదువు నడవదు. ఆ కంప్యూటర్ అందరిలోనూ ఉండదు. ఉన్నా వీళ్లకు పనికివచ్చే వ్యవహారం అందరికీ తెలియదు. నా పిల్లలు చదువుకుంటున్న సమయంలో ఈ తేడా నాకు బాగా తెలిసింది. మా అమ్మాయి తయారుచేసిన ప్రాజెక్టులు ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. అవి మిగతా వాళ్లు తయారుచేసిన దాని కంటే చాలా బాగుంటాయని అమ్మాయే చెప్పేది. అందరూ మెచ్చుకున్నారు అని ఆమె చెప్పేది.
మాకు మొదట్లో బాల్‌పాయింట్ పెన్నులు తెలియవు. అన్నీ ఇంకు పెన్నులే ఉండేవి. అంతకు ముందు సిరాలో ముంచి రాసే కలాలు కూడా ఉండేవి. రాయడం నాకు బాగా వచ్చేది కానీ మాకు అవసరం మాత్రం రాలేదు. ఊట కలము అన్న మాట ఎవరన్నా విన్నారేమో తెలియదు. ఫౌంటేన్ పెన్ అని ఇంగ్లీష్‌లో పేరు. అంటే అందులో నుంచి సిరా ఊరుతూ వస్తుందన్న మాట. మాకు అంత తెలిసింది ఒకే ఒక్క అశోక్ పెన్ను. బహుశా 12 అణాలు ధర ఉండేది. పెన్ను కొనడం ఒక బ్రహ్మ ప్రళయం. అందులోకి సిరా అనే ఇంక్ కావాలి. పసుపు పచ్చని డబ్బాలో గాజు బుడ్డీలో వీనస్ ఇంకా దొరికేది. ఇవి తప్ప వేరు బ్రాండ్ కానీ రకాలు కానీ లేవు. పెద్ద వాళ్లు మాత్రం పైలట్ అనే పేరుతో రాసేవాళ్లు. కొంతకాలానికి బజారులో మరొక పేరు వచ్చింది. దాని పేరు మిసాక్. ఒకతను బడికి వచ్చాడు. వెన్నుముక పెట్టి పైకప్పుకు తగిలేటట్టు విసిరాడు. అది కింద పడింది. కానీ దానికి ఏమీ కాలేదు. అంటే పెన్ను మామూలుగా పడవద్దు అని అర్థం చేసుకోవాలి. అయితే ఎంత బాగా రాస్తుంది అన్నది సమస్య. ఆ పెన్నులు బాగానే రాశాయి. ఈ పెన్ను విషయంగా ఒక విచిత్రం తెలిసంది. కమాల్ గారని ఒక పెద్ద మనిషి ఉండేవారు. ఆయనకు కళ్లజోడు షాపు ఉండేది. నాన్న ఆయనకు మిత్రులు. ఏదో అవసరం కొద్దీ ఆయనతో నేను కూడా వెళ్లాను. ఆ అంగడికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. పెన్నుల కంపెనీ యజమాని అని తెలిసింది. ఆయన గారి పేరు ఖాసిం. త పేరు వెనుక పెడితే ఎక్కువమంది కొనక పోవచ్చునని పేరులోని అక్షరాలను తలకిందులుగా రాశారు. మిసాక్ అనే పెన్ పుట్టింది.
ఇంచుమించు బడిలో నుంచి బయటకు వచ్చేదాకా పెన్నులతోనే రాసుకున్నట్టు గుర్తు. అప్పుడు గాని బాల్‌పాయింట్ పెన్నులు వచ్చాయి. సముద్రంలో మునిగి పరిశోధనలు చేసేవారు రాసుకోవడానికి వీలుగా ఈ పెన్నులను తయారుచేశారు అంటే నమ్మకం కలగకపోవచ్చు. కానీ అది నిజం. సిరాతో రాసిన రాతలు నీళ్లలో చెదిరిపోతాయి. కనుక బ్యాంకుల వారు కూడా బాల్ పాయింట్ పెన్ వాడకాన్ని ప్రోత్సహించినట్లు చెప్పగా విన్నాను.
పల్లెలో ఐదో తరగతి వరకు చదువుకున్నాను. తరువాత పాలమూరు వెళ్లవలసి వచ్చింది. అక్కడ బడిలో యూనిఫాం వేసుకుని రావాలని నిర్ణయం పెట్టారు. వెంటనే ఆ రంగుల గుడ్డలు కుట్టించడానికి ఇంట్లో వాళ్లకు పాపం వెసులుబాటు లేదు. వీళ్లకు బడిలో వాళ్లంతా పరిచయమే గనుక మేం చెబుతాంలే అనేవారు. కానీ మాకు మాత్రం అది కొంచెం అసౌకర్యంగా ఉండేది.
మళ్లీ చారెడు చదువు, దోసెడు బలపాలు పద్ధతి ఎదురయ్యేది. సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఒకటి రెండు నోట్‌బుక్స్ తెచ్చుకోవాలి. క్లాసులో చెబుతున్న పాఠాలు విషయం రాసుకోవడానికి రఫ్ నోట్‌బుక్‌లు ఉండాలి. వీటన్నింటినీ కొనడానికి వెసులుబాటు తక్కువ అన్నది ఒక విషయం అయితే మరో మార్గం ఉంది అన్నది ఇంకొక విషయం. అన్నయ్య అప్పటికే సర్కారు ఉద్యోగంలో ఉన్నాడు. ఆ ఆఫీసు నుంచి ఏదో రకంగా తెల్ల కాగితాలు, కవర్‌గా పనికివచ్చే మొరటు కాగితాలు తెచ్చేవాడు. అక్షరంతో నైపుణ్యాలవీ వస్తాయి అని ఒక మాట ఉంది కదా. అదే పద్ధతిలో మేము, అంటే నేను, మా చిన్నాన్న కొడుకు కలిసి నోటు పుస్తకాలు కుట్టుకున్నాము. ఆ విద్య మాతోపాటు చదువుకున్న వారికి ఎంత మందికి వచ్చిందో తెలియదు. ఇప్పటికి వారికి అటువంటి ఆలోచన కూడా ఉంటుందని నేను అనుకోను. హోంవర్క్ రాసి నోట్‌బుక్‌లు అన్నీ సేకరించి పంతులుగారి బల్ల మీద పెడితే, అందులో నా నోట్‌బుక్ ప్రత్యేకంగా కనిపించేది. అందమైన అక్షరాలతో చక్కని జవాబులు రాస్తాను అని అందరికీ తెలుసు. కనుక ఆ విషయంగా కూడా నా నోట్‌బుక్ ప్రత్యేకంగానే ఉండేది. నాకు ఎన్నడూ ఆ విషయంగా తేడా తెలియలేదు.
మా చదువు పద్ధతి గురించి మేము ఇలా ఎంతసేపైనా చెప్పగలను. అలాగని ఇప్పటి పిల్లలను ఎట్లా ఉండాలి అని మాత్రం అనను. మా పెద్దవాళ్లు మంచివాళ్లు కనుక కష్టాలకు ఓర్చుకుంటూ మాకు చదువు చెప్పించారు. మేము కూడా అంత శ్రద్ధగా చదువుకున్నాము అన్నది ప్రత్యేకంగా చెప్పకూడని విషయం. దానికి మా పిల్లలకు మా వంటి పరిస్థితి రాకుండా అందరితోపాటు మంచి చదువులు చెప్పించగలిగాము. మా నాన్న మాకు చదువు చెప్పిందే లేదు. కనుక నా పిల్లలు కష్టపడుతున్నారు. వాళ్ల పిల్లలు కష్టపడకూడదు అని నాన్న అనడం నేను విన్నాను. ఆ మాట నేను వినాలి అని అనలేదు. మరెవరికో చెబుతుండగా నా చెవిన పడింది. మాతోపాటు చదువుకున్న వాళ్లలో చాలామంది మొదటి తరం జ్ఞానం కలవారు ఉండేవారు. అమ్మకు చదవడం వచ్చునేమో తెలియదు. ఆ తరం అమ్మలకు నాన్నలకు అందరికీ చెయ్యేత్తి నమస్కారం చేయడం తప్ప మరొక రకంగా రుణం తీర్చుకోలేక పోతున్నాము.

-కె.బి.గోపాలం