S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రంగుల ‘తుమ్మిస్క’లతో స్నేహం!

తాను నివసించే ప్రాంతంలో తిరిగే... ఎగిరే తుమ్మిస్క(తూనీగ)లతో తనకు జన్మజన్మల బంధముందని చిత్రకారుడు ‘నవీన్’ ఓ నవీన భావనను చిత్రకళారంగం ముందుకు తీసుకొచ్చారు. కొందరికిది ఆశ్చర్యంగా... వింతగా...విచిత్రంగా అనిపించవచ్చు, కాని నవీన్‌కిది వాస్తవం... నిజం... సత్యంగా ద్యోతకమవుతోంది. మనిషిని ‘విశ్వాసం’ నడిపిస్తుందన్న ప్రాథమిక సత్యాన్ని గుర్తిస్తే చిత్రకారుడు నవీన్ ‘నమ్మిక’లో, విశ్వాసంలో, తలంపులో తిరకాసు ఏమీ కనిపించదు. తుమ్మిస్క (తూనీగ) రెక్కలంత పారదర్శకత విశ్వాసంలో దర్శనమిస్తుంది. పారదర్శకతనే సృజనకు- సత్యానికి వెనె్నముకలా నిలుస్తుంది. నవీన్ రంగుల వెనె్నముక అతని విశ్వాసంలో కనిపిస్తోంది.
అంతిమంగా ఇది తాను ఎంచుకున్న రంగుల రంగం పట్ల నిమగ్నత- నిబద్ధత- తాదాత్మ్యతను తెలియజేస్తోంది... ఈ లక్షణాలు...గుణాలు ఎవరిలోనైనా ప్రస్ఫుటమైతే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. సృజన సరికొత్త ఎత్తుకు చేరుకుంటుంది. కళాత్మకత, రసాత్మకత నూతన అంచులను తాకుతుంది. నవీన్ విషయంలో అదే జరిగిందని ఆయన చిత్రాలను...‘తుమ్మిస్క’బొమ్మలను చూస్తే తేటతెల్లమవుతుంది. ఆ తుమ్మిస్కల కోసమే తాను జన్మించానేమోనన్నంత గొప్ప ఇష్టం... ప్రేమ...గౌరవం అంతకుమించి ఆరాధనాభావం అతనిలో ఉండటంవల్లనే, జన్మజన్మల తెలియని బంధమేదో వాటితో ఉందని భావించడం. అతి సున్నితమైన- నాజూకైన- ఆకర్షణీయమైన ఆ అల్పజీవిని ఆరవ ప్రాణంగా భావిస్తూ... కలవరిస్తూ, కలలో స్మరిస్తూ కాగితం-కాన్వాస్‌పై నవీన్ ఆవిష్కరిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చినవారికి బాల్యంలో తూనీగలతో ఆట ఓ మధుర జ్ఞాపకం. నవీన్‌కు సైతం అలాంటి మధుర జ్ఞాపకాలు పిసరంత ఎక్కువే ఉన్నాయి. పాఠశాలలో చదివేప్పుడు తూనీగలను ఒడుపుగా పట్టి, వాటి తోకకు దారంకట్టి గాల్లోకి వదిలితే... అవి ఎంత ‘ఎత్తు’కు ఎగిరితే అంత ఆనందం, విజయం... గెలుపు. అంతేగాక కాస్త బలిష్టమైన వాటినిపట్టి తోటి స్నేహితుల తూనీగలతో ‘‘పోట్లాట’’(కోడిపుంజుల మాదిరి) నిర్వహించి, అందులో ఎవరు గెలిస్తే వారు బలవంతులుగా, గొప్ప క్రీడలో గొప్ప బహుమతి గెలిచినంత సంబురపడటం ఎరిగినదే... అలాగే ఏదో కారణంగా పూర్తిగా ఎగరలేని తూనీగను చూసి బాధతో... కారుణ్యంతో వాటిని చీమలకు ఆహారంగావేయడం అవి తింటుంటే... సంతృప్తితో సంతోషపడటం, గొప్ప సేవాభావానికి పాల్పడినట్టు ఉప్పొంగి పోవడం... ఇలా ఒకటారెండా అనేకానేక కార్యక్రమాలు తూనీగలతో చేసిన బాల నవీన్ పెరిగి పెద్దయ్యాక, చిత్రకళను శాస్ర్తియంగా అధ్యయనం చేశాక వాటిని తాను కాన్వాసుపై, కాగితంపై ఇతర మాధ్యమాల్లో చిత్రిస్తానని ఊహించలేదు. కాని ఎంఎఫ్‌ఏ చేస్తున్న సమయంలో సృజనాత్మకతకు పెద్దపీట వేసి, కొత్తదనం కోరుకోవడం, మిగతా చిత్రకారులకు భిన్నమైన రీతిలో బొమ్మలు గీయాలన్న భావన కలిగినప్పుడు బాల్యంలోని తూనీగలు వచ్చి కళ్ళముందు వాలాయి. అవి తన చుట్టూ తిరుగుతున్న భావన కలిగింది. దాంతో వాటిని చిత్రించడం ప్రారంభిస్తే తన మనసు ప్రశాంతంగా సేదదీరింది. ఇదే వాటితో తనకుగల జమ్మజన్మల బంధమని నవీన్ భావన... అభిప్రాయం.
ఏదిఏమైనా సజీవంగా తూనీగ కళ్ళముందు కనిపించినా దాన్ని రంగుల్లోకి తర్జుమా చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా పారదర్శకంగా కనిపించే వాటి రెక్కలను చిత్రించడం ఒక సవాల్... అలాగే కాళ్లు, తల-కనుగుడ్లు అవి తిరిగే విధానం అతి పెద్ద సవాల్ అనిపించింది. ఒక చిన్న ప్రాణి ఎంతో తెలిసినట్టు భావించే మనిషికి, ఎంతో అధ్యయనం చేశానని చెప్పుకునే చిత్రకారుడికి అంత త్వరగా లొంగకపోవడం, తుర్రుమని ఎగిరిపోవడం, తోక ఊపుతూ వెక్కిరించడం ఊహాతీతమైన అంశం. అయితే నవీన్‌కు బాల్యంనుంచి వాటిపట్ల గల వాత్సల్యం... ప్రేమ, స్నేహభావం తూనీగలు విసిరిన సవాళ్ళను స్వీకరించి, ముందుగా స్కెచ్‌లు వేసుకుని, వాటర్ కలర్స్‌లోకి ఒంపి...అనంతరం ఆయిల్... ఆక్రలిక్ రంగుల్లోకి సజీవంగా తీసుకొచ్చి ఫ్రేమ్‌కట్టి ప్రదర్శనకు పెడితే వాటిని చూసిన ఆర్ట్ లవర్స్‌కు, వీక్షకులకు గుండె నిండా తెలియని తీయని అనుభూతి సుడులు తిరిగింది, కళ్ళల్లో కాంతులు విరబూశాయి. ఆ తూనీగల చేష్టలు... వాటి రంగులు, చిలిపితనం తమతమ బాల్య స్మృతుల్లోకి వెళ్ళేలా చేశాయి.
మనసును ఆహ్లాదపరిచే, అల్లరిగా తిరిగే తూనీగను ఇంతలా ప్రేమించి, రంగుల్లో బంధించి వీక్షకుల ముందుకు తీసుకొచ్చిన నవీన్ తెలుగు నేలపై తొలి చిత్రకారుడేమో!..
వివిధ రంగుల్లో దర్శనమిచ్చే తూనీగలు ఏదో గడ్డిపూలపైనో, మొక్కపైనో, కాడ పైనో ఎగురుతూ తన ఆహారంకోసం అనే్వషిస్తుంది. అంటే చిత్రకారుడు కేవలం తూనీగనే గాక ఆకుపచ్చని మొక్క... దాని కొమ్మ... పూవు... అక్కడున్న చీమ (ఆహారం) లేదా చిన్న కీటకం చిత్రించాలి. అంటే చిత్రకారుడికి తూనీగ ఎంత పెద్ద సవాల్ విసిరిందో తెలుస్తోంది. ఆ సవాల్‌ను నవీన్ సంతోషంగా స్వీకరించి ఆ రంగుల తూనీగలను, అవి తిరిగే చోటును, పూలను, ఆకులను, మొక్క కాడలను ‘‘కలర్‌ఫుల్’’గా చిత్రించారు. తదేకంగా చూస్తే అవి నిజమైన తూనీగలేమో... పిల్లలు ఎక్కడ పట్టుకుని వాటి తోకలకు దారం కడతారోననిపిస్తుంది. ఆకులు లేని, ఎండిన చిన్న కొమ్మలపై సైతం ఆశగా వాలిన తూనీగలుంటాయి. నవీన్ వాటిని కూడా వదలకుండా ఆ ప్రత్యేక రంగుల్లో చిత్రించారు. కొమ్మ రంగు, తూనీగ రంగు ఒకటి కావడంతో ఆ ఫ్రేమ్ మరింత ద్విగుణీకృత అందంతో మెరిసిపోతుంది
కొన్ని తూనీగలు చిన్నచిన్న బెండుముక్కలను, డొల్ల మట్టి ముద్దలను, ఇసుక రేణువులను కదిలించి ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. వాటికి అదో క్రీడ! ఆ క్రీడను పిల్లల గోళీలాటతో ముడిపెట్టి చిత్రకారుడు కొన్ని రంగురంగుల గోళీలను కదిలిస్తున్న తూనీగలను రసరమ్యంగా చిత్రించారు. తూనీగ కళ్ళలో కుతూహలం స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటోగాని ఆ అల్పజీవి తల, కనుగుడ్లు, వెంట్రుకలంత పలచటి కాళ్లు, పొట్ట భాగం, అంతా కుతూహలాన్ని కుప్ప పోసినట్టు... కుతూహలానే్న రంగరించి ప్రాణంపోసుకుని తిరుగుతున్నట్టు క్షణం నిలకడ లేకుండా తిరుగుతుంది. ఆ స్వభావాన్ని చిత్రకారుడు సహజంగా చిత్రికపట్టారు.
ఈ రియలిస్టిక్ చిత్రకళలో మాస్టరీ చేసిన నవీన్ తనలోని సృజనకారుడికి సైతం పని కల్పించి, కాల్పనిక పద్ధతిలో, తన సృజనను జోడించి ఆ తూనీగలకు రంగులద్ది, వాటికి సీతాకోక చిలుకల రెక్కలు పొదిగి ఓ ప్రయోగం చేశారు. అవి ఆయన తృష్ణను, కళాభివ్యక్తిని, ప్రయోగశీలతను తెలియజేస్తుంది. కాని సహజసిద్ధంగా కనిపించే తూనీగలు లేత నీలం, లేత పసుపు, లేత ఎరుపు రంగులో, ఊదారంగులో, బూడిద రంగులో చిత్రించిన వాటికి తిరుగులేదు!
ఆ సహజ రంగుల అద్భుత ప్రాణిని పట్టించుకోకుండా నవీన్ ఇతర పనుల్లో మునిగిపోయి వేరే వేరే చిత్రాలు వేస్తుంటే... ఆ తూనీగ వచ్చి తన భుజంపై వాలుతుందని, బట్టలు ఆరేస్తుండగా వచ్చి దండెంపై వచ్చి వాలుతుందని, కళ్ళముందు చక్కర్లుకొడుతుందని అలా తను ఉనికిని ఆ తూనీగలు తెలియజేస్తూ ఉంటాయని, అందుకే వాటికి తనకు జన్మజన్మల బంధమేదో ఉందని తాను నమ్ముతున్నట్టు నవీన్ అంటున్నారు.
తూనీగల ప్రేమలో పడిన నవీన్ 1978లో ఖమ్మంలో జన్మించారు. అక్కడే చదువుకున్నారు. పాఠశాలలో బొమ్మలు గీయడంలో మేటిగా గుర్తింపు పొందాడు. ఉపాధ్యాయుల మన్ననలు అందుకున్నాడు. స్థానిక చిత్రకారుడి దగ్గర కొన్ని ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నాడు. తన బంధువు స్టాన్లీ సురేష్ సూచనతో 1994లో జెఎన్‌టియులోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బి.ఎఫ్.ఏలో చేరారు. అప్పటివరకు వేసిన జాతీయ నాయకుల బొమ్మలు, నెమలి, జింక, ఏనుగు బొమ్మ, చెట్లు-చేమలు గాక ఇంకా ఎంతో ఉందనే విషయం కళాశాలలో చేరాక తెలిసిందని నవీన్ చెప్పారు. అలా ఐదు సంవత్సరాల అభ్యాసం, అధ్యయనం, సాధన అనంతరం 2002 సంవత్సరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ చేసేప్పుడు తనకున్న సృజనను సానబట్టేందుకు ప్రొఫెసర్లు పూనుకున్నప్పుడు, ప్రోత్సహించినప్పుడు వెలుగులోకి వచ్చిందే... ఈ తుమ్మిస్క... తూనీగ. ఆ తరువాతనే ఆ తుమ్మిస్కకు తనకు అవినాభావ సంబంధముందని తెలిసింది. తన కళకు బాసటగా నిలవడమేగాక, తన ప్రత్యేకతను ప్రదర్శించేందుకు ఆసరాగా నిలవడమేగాక, అనిర్వచనీయ జన్మజన్మల బంధముందని తెలిసొచ్చిందని కూడా నవీన్ అంటున్నారు.
డచ్ చిత్రకారుడు వినె్సంట్ విలియం వాన్‌గా... ప్రభావం తనపై ఉందని, ఆయనపై తీసిన చలనచిత్రం చూసి తాను చలించిపోయానని, ఆ అంకితభావం అపురూపమని, అలాగే భారత చిత్రకారుల్లో రవివర్మ తనకెంతో ఇష్టమని, విద్యార్థిగా ఆయన బొమ్మలను నకలు (కాపీ) చేశానని నవీన్ నిజాయితీగా వెల్లడించారు. ప్రస్తుతం నవీన్ ఖమ్మంలోని ఓ గురుకుల పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన చుట్టూ ఇప్పుడు తూనీగల్లా పిల్లలు కనిపిస్తున్నారు.
*
నవీన్: 9059672785

- వుప్పల నరసింహం 9985781799