S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్నతనం

‘ఆవిడని మాత్రం పిలవటానికి వీల్లేదు’ అని నొక్కి చెప్పాడు టింకు. ‘అదేవిట్రా, మన చుట్టుపక్కల వాళ్లందర్నీ పిలుస్తూ ఆవిడ్ని మాత్రం పిలవకపోతే ఏం బావుంటుందిరా?’ అని దీర్ఘం తీసింది టింకు వాళ్ల నాయనమ్మ శాంతమ్మగారు. వాడి 11వ పుట్టినరోజు నాడు వాళ్లింటి చుట్టుపక్కల పరిచయం ఉన్న వాళ్లందర్నీ చిన్న పార్టీకి పిలవాలని టింకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహ్వానితుల జాబితా తయారుచేస్తున్నప్పుడు వాళ్ల పక్కింటి ఆవిడ పేరు రాస్తూండగా టింకు అన్న మాటలవి.
‘అయినా ఆవిడ్ని ఎందుకు వద్దంటున్నావు?’ ఆరా తీసింది ముసలావిడ.
‘నీకు తెలియదు నాయనమ్మా! ఆవిడ మమ్మల్ని అసలు ఆడుకోనీదు. మన సందులో ఆడుకుంటే ఆవిడకి ఏమిటి కష్టం? మేం ఫుట్‌బాల్ ఆడుకుంటుంటే బాల్ వాళ్ల గేట్‌కి తగలరాదుట. ఫుట్‌బాల్ తగిలితే గేట్‌కి ఏమైపోతుంది?’
‘వాళ్లింట్లో పిల్లలు లేరా?’ అని ఆశ్చర్యపోతూ కోడల్ని అడిగింది శాంతమ్మగారు, టింకు విననప్పుడు.
‘లేరత్తయ్యా. ఒక్కత్తె ఉంటుంది. కొడుకులు వేరే ఊళ్లో ఉంటారు. ఈవిడ ఒక్కతే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. వాళ్లదే ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్ అద్దెకి ఇచ్చింది.’
‘ఈవిడ ఒక్కతే ఇక్కడ ఎందుకుంటుంది? కొడుకుల దగ్గర ఎందుకు ఉండదు?’
‘మాకు తెలిసి - కోడళ్లతో ఈవిడకి పడదు. ఈవిడకి అసలు ఎవళ్లతోనూ పడదు. ముఖ్యంగా పిల్లలంటే పడదు. టింకు పుట్టక ముందు కూడా మేము గమనించే వాళ్లం. ఆవిడ వేరే ఏ పిల్లల్నీ కూడా ఆడుకోనిచ్చేది కాదు’
ఆ మాట విన్న శాంతమ్మకి ఇంతకు ముందు ఉన్న ఊళ్లో తమ ఎదురింట్లో ఉన్నాయన గుర్తొచ్చాడు. ఆయన కూడా ఇలాగే తమ వీధిలో ఏ పిల్లల్నీ ఆడుకోనిచ్చేవాడు కాదు. ఆ పిల్లల తల్లిదండ్రులకి అది నచ్చకపోయినా ఆయనతో గొడవ పెట్టుకునేవారు కాదు. ఎందుకులే వయసులో పెద్దవాడని. అసలు పిల్లలు నచ్చని వాళ్లు ఉంటారా అనుకునే వాళ్లకి ఇటువంటి వారు కనపడ్డప్పుడు అనేకమైన ప్రశ్నలు మనస్సులో కదులుతాయి. వాళ్లతో మాట్లాడి వాళ్ల మనసులో ఉద్దేశం తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ ఎవరూ చొరవ తీసుకోరు.
ఆ రాత్రి మనవడిని పక్కన పడుకోబెట్టుకుని నిద్దర పోగొడుతున్నప్పుడు వాడి తలని చేత్తో దువ్వుతూ వాడికి నచ్చజెప్పటానికి ప్రయత్నించింది. ‘చూడు నాన్నా! మన పక్కింటావిడ నాలాగే ఒక నాయనమ్మ కదా. ఆవిడ్ని నీ పుట్టిన రోజుకి పిలిస్తే తప్పేమిటి? అలా కోపం పెట్టుకోకూడదురా!’ అన్నది.
‘లేదు నాయనమ్మా. ఆవిడ నీలాగా కాదు. నువ్వు చాలా మంచిదానివి. ఆవిడేమో ఒక రాక్షసి. మేం ఆడుకుంటే ఆవిడకి ఏం కష్టమో అర్థం కాదు. మేం ఆడుకునే టైముకి వాళ్ల గేటు ముందు నీళ్లు పోస్తుంది. మేము అక్కడికి వెడితే జారి పడాలని.. ఆవిడ్ని మాత్రం పిలవటానికి వీల్లేదు’ అమ్మమ్మ అడగక ముందే సమాధానం చెప్పేశాడు. ఇక వాడిని ఒప్పించటం కష్టం అని శాంతమ్మగారికి అర్థమై ఆవిడ ఊరుకుంది.
ఊరుకుందే గానీ ఆవిడకి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ ఉండిపోయింది. చిన్నపిల్లలు వీధిలో ఆడుకుంటూ వుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా - మరి ఈవిడకి ఏమిటో సమస్య. ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
టింకు వద్దన్నప్పటికీ వాడికి తెలియకుండా టింకు తల్లిదండ్రులు పక్కింటావిడని పిలవటానికి వెళ్లారు. అది ఎవరి అదృష్టమో కానీ ఆవిడ ఆ పార్టీ ఉన్న రోజున ఊళ్లో ఉండననీ, అందువల్ల రాలేనని చెప్పింది. మొత్తానికి సమస్య చాలా తేలికగా పరిష్కారమయ్యింది.
బర్త్ డే పార్టీ బాగా జరిగింది. టింకుకి పక్కింటావిడ గుర్తు కూడా రాలేదు. వాడి ఫ్రెండ్స్, ముఖ్యంగా వాడితో ఆడుకునే వాళ్లందరూ వచ్చారు. సరదగా గడిచిపోయింది.
* * *
పక్కింటావిడ గొడవ పడలేక టింకు బృందం వాళ్ల సందుకి దగ్గరగా ఉన్న గ్రౌండ్‌కి వెళ్లి ఆడుకోవటం మొదలుపెట్టారు. ఆ గ్రౌండ్‌కి ఎదురుగా ఒక గుడి ఉంటుంది. గ్రౌండ్‌కి పక్కనే ఒక కూరగాయల దుకాణం ఉంది. రోజూ సాయంత్రం ఆ గ్రౌండ్‌కి వెళ్లి ఆడుకోవటం అలవాటయి పోయింది.
ఒకరోజు యధాప్రకారం గ్రౌండ్‌లో ఆడుతున్నారు. బాల్ బౌండరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఫీల్డింగ్ చేస్తున్న టింకు బంతిని పట్టుకోటానికి బౌండరీ దగ్గరికి వెళ్లాడు. ఆ బౌండరీ దగ్గరే కూరగాయల దుకాణం ఉంది. దాని ఎదురుగా ఉంది గుడి. టింకు అక్కడికి వెళ్లేటప్పటికి అక్కడ ఏదో కలకలం గమనించాడు. జనం గుమిగూడి ఉన్నారు. ఏమిటా అని తేరిపార చూస్తే అక్కడ వీళ్ల పక్కింటావిడ రోడుడ మీద పడుంది. టింకు ఒక్కసారి షాక్ అయ్యాడు. అక్కడ జనం ఈవిడ ఎవరో, ఎక్కడి నించి వచ్చిందో అనుకుంటున్నారు. టింకుకి ఒక్కసారి తన కర్తవ్యం గుర్తొచ్చింది. అక్కడున్న వాళ్లతో తన తండ్రి ఫోన్ నెంబర్ చెప్పి ఫోన్ చెయ్యమని చెప్పాడు. ఆవిడ తమ పక్కింట్లోనే ఉంటుందని చెప్పాడు. అక్కడి జనంలో ఎవరో ఫోన్ చెయ్యగానే టింకు వాళ్ల నాన్న కారులో అక్కడికి వచ్చాడు. వెంటనే ఆవిడకి కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. టింకు నాన్న ఒక ఐటి కంపెనీకి పని చేస్తాడు. నెలలో చాలా రోజులు ఇంట్లో నించి పని చేస్తాడు. ఆ రోజు ఇంట్లోనే ఉండి పని చేసుకుంటున్నాడు. అందువల్ల వెంటనే రాగలిగాడు.
* * *
ఇది జరిగిన మర్నాటి రాత్రి టింకు పక్కన పడుకున్న శాంతమ్మగారు టింకుని అడిగింది. ‘నాన్నా! ఈ రోజు పక్కింటావిడని నీ పుట్టినరోజు ఫంక్షన్‌కి పిలవమంటే ఆవిడ చాలా చెడ్డది అన్నావు కదా. మరి నిన్న ఆవిడ రోడ్డు మీద పడి ఉన్నప్పుడు మీ నాన్నకి ఎందుకు ఫోన్ చేయించావు?’
‘అది వేరు నాయనమ్మా! మా మోరల్ సైన్స్ బుక్‌లో ఉంది. ఎవరైనా హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉంటే హెల్ప్ చెయ్యాలని, ఇంకా, ముసలి వాళ్లకి హెల్పింగ్ హేండ్ ఇవ్వాలనీ’ అని టింకు సమాధానం చెప్పాడు.
అది విని శాంతమ్మగారు చాలా సంతోషపడింది.

-రెండుచింతల 9866071588