S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణాతీరానికి ‘ఆంధ్రపత్రిక’!

అయ్యవారు ఉగాధి సంచిక కోసం ఎంతో ముందుగా పథకాలు వేసేవారు. మూడు నెలల ముందు చెప్పారు - సినిమాల మీద సంవత్సరాది సంచికకి వ్యాసం తయారుచెయ్యమని. ఇది ఒక ‘కితాబు’ నాకు. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు 1910లో మొదలయిన నాటి నుంచీ, శంభుప్రసాద్ గారు 1972లో యిహ లోక యాత్ర చాలించేదాకా ఒక ‘అద్భుతం’ లాగా రాణించాయి. అవి దాచుకునే సంచికలే గానీ తూకానికి వేసే పాత పేపర్లతో వెళ్లిపోయేవి కావు.
ఆదికాలంలో ఆంధ్రపత్రిక చందా రెండు రూపాయలున్నప్పుడే - పది రూపాయల ఉగాది సంచికని ఉచితంగా పంపేవారుట. కానీ ఈ సంచికల వైభవం అయ్యవారితోనే వెళ్లిపోయింది.
నేను క్రింద హాల్లోకి ఏదో ఘనకార్యం సాధించిన వాడిలాగా ‘అయ్యవారి’ గదిలోంచి ఎడిటోరియల్ హాలులోకి రాంగానే మా వి.వి.ఎన్. గారు పట్టుకునేవాడు.
‘ఏమిటో వారకాంత ఇటు రావడం’ అన్నాడు. అవును ‘వారపత్రిక’ నాకు అత్మీయమైన ప్రియురాలు. దినపత్రిక మాత్రం మా ‘అమ్మ’ - మాతృమూర్తి సందర్శనార్థం వచ్చా. నాకు అయ్యవారో పని చెప్పారు. ‘ఒహోయ్!’మని గిర్రున తిరిగి ఆయన బల్ల మీద యిలా ఓ గ్రుద్దు గుద్దాను. అదేమిటో చెప్పను.
‘అదే.. అదే.. మళ్లీ పుట్టింటికి రావడం ఖాయం - పంతులూ’ అన్నాడు నరసింహారావుగారు.
ప్రకాశరావుగారి మాటల్లో వి.వి.ఎన్. ఒక ఫెదర్‌కాక్. అయ్యవారి కారులో - ఆయన తిరుగు ప్రయాణంలో సాయంకాలం రోజూ తన యింటి దాకా పోయే ఛాన్సు సంపాదించినవాడు. ‘అతని మాటలకి అర్థాలు వేరులే’ అనేవాడు శ్రీరాములుగారు.
అంతలో ‘లంచ్ అవర్’ వచ్చింది. ‘సాపాటుకి పోయి వరేం’ అంటూ నేను దిగుతూ వుండగా - సాక్షాత్తూ జి.ఎం.గారే మెట్లు దిగుతున్నాడు. తనతోపాటు ‘రమ్మ’ని ఇలా సంకేతించి ఆయన - మా రోడ్డు క్రాస్ చేసి అవతల ప్రక్క అయ్యర్ రెస్టారెంట్‌లోకి దారి తీశాడు.
నా లంచ్ ‘నటరాజార్పణం’ ‘ఎన్నా ఆర్ముగం సాంబారులో ‘కాయి ఎన్నా?’ ‘అని అడగక్కరలేదు.
విజయా లాడ్జ్‌లో కుంచితపాదం గారు అయ్యర్ హోటల్‌లో ‘లంజ్’ (మధ్యాహ్నం ఆహారం) తీసుకుంటారు. ‘ఒరు వడా రెండిడ్లీ సాంబారు రెడీ.’ ‘మీ అమ్మగారు నీకు పెళ్లి చేసి పంపిస్తాను బెజవాడకు పంపమని అడుగుతున్నారుట?’ అంటూ ఆయన మాట కలిపారు. ‘తెలియదు సార్!’ అన్నాను. మీ ‘అప్పా’ చెప్పారన్నాడు. అర్థం అయింది. ఆ మధ్య నాన్నగారికి ఒంట్లో బాగోలేదని, నేను లంచ్ అవర్‌లో జి.ఎం. సారుతో చెప్పాను. నేను చెప్పే తెలుగు పాఠంలో భాగంగా - తదుపరి ఆయన - మా బిల్డింగ్ లిఫ్ట్‌లో వెళ్లడం - చాలామంది చూశారు. నాకు తెలియదు కాని కుంచిత పాదంగారు దొడ్డ మనిషి. నాన్నగారిని పరామర్శించాడన్న మాట. ఒక రాధాకృష్ణ తప్ప అందరూ ఏదో ఒక వేళ మా నాన్నగారిని చూసినవాళ్లే...
జి.ఎం. గారు - ‘డైలీ నీకు మొదట్నించీ ఇష్టం గదా?’ అన్నారు. ‘యూనో.. బెజవాడలో ఎడిషన్‌కి ‘శీఘ్రమా’ ఏర్పాట్లు చేస్తున్నాము’ అన్నారు.
అర్థం అయిపోయింది. నా వేలితో నా కన్ను పొడిచే ‘కుట్ర’ ఏదో జరుగుతోంది అన్నమాట. నా అంతట నేను బెజవాడ పోతానంటూ వేడికోలు పెట్టుకుంటే - ‘సంబలం’ ‘సదుపాయాలు’ రెండూ బేరం ఆడే ఛాన్సు లేదు. రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ కనుక టి.ఏ., డి.ఏ.లు కూడా ఎగ్గొట్టొచ్చునుట. ఈ సంగతి ‘ఎమ్మెస్స్’ శర్మగారొక్కడే చెప్పగలడు. నాకు అతనో ‘స్పీడు బ్రేకర్’
నాన్నగారిని వదిలి వెళ్లటం అంటే గుండెల్లో రాయి పడ్డది అప్పుడే.. ‘నో.. గో’ అన్నది మనస్సు.
అంత దోస్తీ అయిపోయింది మా డాడీతో నాకు. అమ్మ ‘నానా యాగీ’ చేస్తోందని నాన్నగారికి తెలుసు.
ఓ ఆడపిల్ల నాతో మాట్లాడితే చాలు, వెంటనే అమ్మ ఓ ‘లవ్‌స్టోరీ’ అల్లేసుకునేది.
నవ్వుకునేవాణ్ణి. ‘అమ్మా! ఉంగరాల జుట్టు నీది. నాకా పోలికే వచ్చింది. ఉంగరాలు నెత్తి మీదనే గానీ, నెలాఖరున - ఏడుగురు సంతానంలో పెద్దవాణ్ణి అయిన నేను - కనీసం ఒక్కరి తరఫున ఐనా పదేసి రూపాయలు అయినా సేవింగ్స్‌లో వేయలేక పోతున్నాను’ అనేవాణ్ణి నేను.. నవ్వుతూ (అది ఏడుపు)
అయితే నాన్నగారికి నేను బెజవాడ వెళ్లడం ఇష్టమే. రాధాకృష్ణగారు చాలా అమాయకంగా కనబడతాడు గానీ - ‘హానిగానీ, ఉపకారంగానీ చెయ్యాలీ అంటే - రెండో ఆలోచన చెయ్యను’ అంటూ వుండేవాడు.
అప్పుడప్పుడు నండూరి రామమోహనరావుగారిని గురించి ప్రస్తావించేవాడు. ‘ఆయన కూడా మీలాగే ‘స్ట్రిక్టు’ సినిమా స్టూడియోకి పోయి వచ్చి - బస్సు మీద వెళితే తిరిగి వచ్చి - బస్ టిక్కెట్ ‘రేటు’ వేసేవాడు’ అంటే అర్థం అయిందిగా. ఈ మాటలకి అర్థం.
నవ్వుతూ నేను అనేవాణ్ణి - నాకు బస్‌రూట్ల నెంబర్లు కూడా తెలియవు సార్’ అని. అసలు నండూరు రామమోహనరావు గారు ఆంధ్రపత్రికని వదల్లేక వదల్లేక వదిలేడుట. ‘డైలీ’లో ప్రకాశరావు గారికి మొదట అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రమోషన్ ఇచ్చారుట. వీక్లీకి సూరంపూడి సీతారాంగారి తర్వాత ఇన్‌చార్జి అయి - బాపూ రమణలతో కలిసి చాలా ‘ఇంప్రూవ్’ చేసిన ఎన్.ఆర్. ఈ దెబ్బకి బాగా ‘హర్ట్’ అయిపోయాడనీ అంటారు. పైగా రాధాకృష్ణగారు ఫుల్‌ఛార్జీ తీసుకున్నాక రామ్మోహనరావు గారిని సాధుబాధలు పెట్టేవాడనీ - విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఏది ఏమయితేనేం, నండూరు ఆంధ్రజ్యోతికి వెళ్లడం తంతే బూర్ల గంపలో పడ్డట్లే అయింది. అదంతా మరో కథ. బెజవాడ వెళ్లేక ఆ జ్ఞాపకాలు చెబుతాను. కానీ ఈలోగా బెజవాడలో దుర్గ్భావన్‌లో యంత్రాలు వగైరా బిగించడం లాంటి వార్తలు వచ్చాయి.
శ్రీరాములు గారన్నాడు వాళ్ల ఇంటికి భోజనానికి తీసుకుని పోయినప్పుడు నాతో ‘బెజవాడ ఇన్‌ఛార్జ్‌గా నేను వచ్చే అవకాశాల్లేవు వీరాజీ’ అని.
నాకూ అంతే సార్! అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రమోషన్ వస్తే గానీ, నేనూ ‘డైలీ’కి మారను. అక్కడ వారపత్రికలో ‘సబ్బు’నైనా, ‘దువ్వె’నయినా - నేనే నంబర్ వన్’ అని అన్నాను.
ప్రకాశరావు గారంటే అయ్యవారికి వల్లమాలిన అభిమానం వుందనీ అందరూ అంటూంటారు. అంచేత ప్రకాశరావు మరియూ మరికొన్ని కారణాల చేత వేమూరి వెంకట నరసింహారావు - ఈ ఇద్దరికీ కృష్ణాతీరం రాసి పెట్టి ఉందని అభిజ్ఞ వర్గాల భోగట్టా.
‘గుంపులో గోవిందా అయిపోతావు. డైలీకి పోతే’ అని రాంప్రసాద్ చెప్పాడు. ఏది ఏమయితేనేం - నా చేతనే ఓ రిక్వెస్ట్ లెటర్ రాయించుకున్నారు - బెజవాడ డైలీకి పోతాను మహాప్రభో’ అని.
మద్రాసులో మ్యూజియమ్ క్యురేటర్ - హరినారాయణ - మెడికల్ కాలేజీ సభాపతి - అమెరికన్ సమాచార సెంటర్ ఎడిటర్ - బి.ఎస్.ఆర్.కృష్ణ, మా మహేష్, శేషాచలం కంపెనీ - ఎమ్.ఎన్.రావుగారూ లాంటి ‘ఫ్రెండ్స్’ ఎందరో, నన్ను వొదిలిపెట్టం’ అన్నారు. హరినారాయణ నీలం గారు ‘ఇక్కడుంటే నా రచనలు ఇంగ్లీష్‌లోకి చేస్తూనే వుంటానన్నాడు.
మా ప్రభాకర్ (్ఫటోగ్రాఫర్) ఓ మలయాళీ నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాడు. కెమెరా టెస్ట్ కూడా అయింది. ‘చొక్కా లేకుండా నటించాలె’ అన్నారు.
‘నీకు గుండెల మీద కితకితలున్నాయా?’ అన్నాడా నిర్మాత.
‘నున్నగా ఉంటుంది నా ఛాతీ. కితకితలున్నట్లు లేదు’ అన్నాను. ‘అయితే వెరీగుడ్’ అన్నాడు ఆయన.
హీరోయిన్ చీటికీమాటికీ కితకితలు పెడుతుంది కాబోలు! ఏది ఏమయితేనేం - ‘ఎ’ సర్ట్ఫికెట్ సినిమా ఆఫర్ ఒగ్గేయదల్చుకున్నాను.
ఇవతల సొంత వూరికి నిత్య నూతన సంచలనం సంరంభం వుండే దినపత్రికలోకి అవకాశం వస్తున్నప్పుడు - ఇటు ఆలోచన మళ్లింది.
ఎస్. వెంకటేశ్వర్రావు గారు కూడా ‘ప్రయాణం’ జాబితాలో వున్నాడని వినికిడి. దినపత్రికలోకి అంటే దీనికన్నా పెద్ద ‘క్లాసు’ (కేటగిరీ అన్నమాట) అది. అటు తర్వాత రెండూ కలిసిపోయి ఒకే ‘క్లాసు’ కేటగిరీలోకి వచ్చేయనుకోండి.
మద్రాసు మీద ‘సెంటిమెంటు’ పాత గాయాలకు కొత్త ‘లేపనం’ లాగా పెరిగింది. హాయిగా నాన్నగారి హృదయ వైశాల్యంలో లభిస్తున్న స్వేచ్ఛ ఇవన్నీ పోతాయిగా.
ఈలోగా ఎమ్.ఎన్. రావుగారు - ఎమెస్కో - నా విడీవిడని చిక్కులు నవల మార్కెట్ విజయం తరువాత ముగ్ధులై - నా నవల వీక్లీలో ఇప్పుడే ముగిసిన ‘ప్రేమకు పగ్గాలు’ సీరియల్ నవలని - పబ్లిష్ చెయ్యడానికి తీసుకున్నారు. నిజానికి వాశిరాజు ప్రకాశం ఈ నవలకి సంబంధించి పది, పదిహేను సార్లయినా తిరిగాడు.
నాకు అదృష్టం ఏమిటీ? అంటే సహచరులు - మాధవరావు, ప్రకాశరావు అలాగే కుర్ర క్లార్క్ ప్రకాశరావులు కూడా ఇంట్లో మా తమ్ముళ్లు పెద్దన్నయ్య దగ్గర ఎలా వొదిగి వుంటారో అలా వుండటం చేత - నా వీక్లీ అడ్వెంచర్ బాగా రాణించింది. ఒక్కోసారి అల్లరి చేసినా సమయానికి మొత్తం స్ట్ఫా - అడ్వర్టయిజ్‌మెంట్ శాఖలో రామచంద్రయ్య (అటు తర్వాత బెజవాడలో యాడ్స్ చీఫ్ మేనేజర్ అయ్యాడు) నందకుమార్ సర్క్యులేషన్‌లో కొత్త మేనేజర్ వేదుల కామేశ్వరరావు నుంచీ కొత్తగా ‘ట్రయినీ’గా అప్పాయింట్ అయిన బెజవాడ వాడు శేషగిరిరావు దాకా అంతా సహకరించారు. వారపత్రికని కూడా బెజవాడ మారిస్తే - అక్కడ ‘ఆఫ్‌సెట్’ ప్రింటింగ్ రోటరీ సింగిల్ యూనిట్ పెడదాం అనుకుంటున్నాము కనుక - బాగుంటుంది అని నేను సూచించాను. రాధాకృష్ణగారు ‘వద్దు’ అన్నారు. అంతగా అయితే ఓ రెండు ఫారాలు సినిమా పేజీలు వగైరా అక్కడ వేసుకుందాం. ఇక్కడ పిన్నింగ్, బైండింగ్ వగైరా పెట్టుకుందాం’ అని మాత్రం రాధాకృష్ణగారు అన్నారు.
వార పత్రికలో మధ్య పేజీలలో మాత్రం ‘మల్టీ కలర్’కి అవకాశం వుండేది. బోంబేడయింగ్, విమల్ - లాంటి అడ్వర్టయిజ్‌మెంట్స్ - అక్కడ ఓ అట్రాక్షన్ గానీ, ఒక్కోసారి యివి వచ్చేవి కావు - వాటి మల్టీ కలర్ బ్లాకులు కంపెనీ వాళ్లే పంపితే తిరిగి వాళ్లకే ఇచ్చేసేవాళ్లం. నగలు చీరలు ప్రకటనలు ముఖ్యం.
నేనో సలహా చెప్పాను. అడ్వర్‌టైజ్ మేనేజర్‌కి మనమే ఓ వారం ‘రెండు ప్రకటనలకి’ ‘ఫ్రీ’ అంటూ వేద్దాం. దీంతో, మనకీ ఆకర్షణ - వాళ్లకీ రాయితీ - అని ఈ పథకం ‘గప్‌చిప్‌న’ అమలు చేశాం.
రాధాకృష్ణ గారిదో పద్ధతి ఉంది. వారపత్రికకి పక్కా ‘డమీ’ వుండాలి. కథలు, కార్టూన్లు, ప్రకటనలు అన్నీ సెంటీమీటర్ల దాకా కొలుచుకుని - ‘లేఅవుట్’ ప్రకారం చేయడం మా పద్ధతి. చివరి క్షణంలో ప్రకటనలొస్తే - ఏ ‘ఐటమ్’ ఎత్తివేయాలీ అని కూడా ముందే నిర్ణయించేవాళ్లం. సినిమా వాళ్లు కూడా డిస్ట్రిబ్యూటర్ లెవెల్‌లోనే కాదు. నిర్మాతల స్థాయిలో కూడా - ‘వారపత్రికే కావాలి’ అనిపించుకున్న దశలో - స్వతంత్ర నవలలు బాగా రాసాగాయి...
వారపత్రికని అప్పుడే - అప్పుడే ‘రీడర్’ నుంచి ప్రమోషన్ అందుకుని ‘సబ్’ అయిన మాధవరావుకీ, ప్రకాశానికీ అలవాటు అవడానికి చాలా వర్క్ వదిలేశాను. రాధాకృష్ణగారు ‘నిమ్మకి నీరెత్తినట్లు’ నా ట్రాన్స్‌ఫర్ తనకేమీ పట్టనట్లు వదిలేశాడు. జి.ఎం.గారే ‘దిక్కు’ ఆయన చెప్పకనే చెప్పాడు. ఎస్.ఆర్.గారు ఎండార్స్ చెయ్యాలి అని. నేను వీక్లీలో వుండే - ‘గ్రేడు ఒన్’ పని చేస్తున్నాను కనుక - అసిస్టెంట్ ఎడిటర్‌గా చేసి - నన్ను డైలీకి బదిలీ చెయ్యమన్నాను.
జి.ఎం.గారు ‘వి.వి.ఎన్‌కీ, ఎస్.వెంకటేశ్వరరావుకీ - అక్కడ బెజవాడలో రిపోర్టర్‌గా వున్న సి.వి.రాజగోపాల రావుకీ, అందరికీ ప్రమోషన్లు కావాలి అంటారు. బెజవాడకి వెళ్లు. నువ్వడిగిన డైలీలో నీకు ఉజ్జ్వల భవిష్యత్తు బాగుంటుంది’ అంటూ నమ్మబలికాడు. ‘ఎప్పుడూ త్యాగమేనా?’ అన్నాను. ‘ఈలోగా ఇక్కడి వారపత్రికని ‘స్ట్రీమ్‌లైన్’ చెయ్యి’ అంటూ చెప్పాడాయన. షేక్‌హాండ్ ఇచ్చి, ‘ఐ విల్ సీ’ అన్నాడు.
చివరి దాకా - ఆశ, నిరాశల మధ్య వూగిసలాడుతూనే ఉన్నాను. అయ్యవారిని ఇంటికి పోయి చూడాలని ఎంతో వుంది గానీ - భయం, సంకోచం - అయితే, ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది అనుకున్నాము. అలాగే, వర్క్‌లో తలముల్కలయి పోతూనే ఉన్నా ఒక్క ‘శెలవు’ కూడా పెట్టలేదు. ‘దిక్కుమాలిన సిన్సియారిటీ నీది’ అన్నారు ఫ్రెండ్స్. అవును నేనో ‘వర్క్ హాలికుణ్ణి’.
అయ్యవారి ఆశీర్వచనమే కాదు - అమ్మ కామాక్షమ్మ గారిని చూసి - మనసా నమస్కరించాలి అనుకున్నాను. కానీ బిడియం - అనే జాడ్యం నన్ను వెంటాడింది.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 92900 99512 veeraji.columnist@gmail.com