S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తన కోపమే తనకు శత్రువు

శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో బ్రహ్మయ్య డ్రైవరు, బాలాజీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మయ్య చాలా కోపిష్టి. బాలాజీ ఓపిక, పట్టుదల కల వ్యక్తి.
ఓ రోజు ఇద్దరికీ ఒకే బస్సులో డ్యూటీలు వేశారు. బస్సు డిపో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి బ్రహ్మయ్య ఖాళీగా తిప్పుతూ డిపోలో పెట్టేవాడు. అది ఆర్డినరీ బస్సు. ప్రతీ స్టాపింగ్ వద్దా బస్సు ఆపి ప్రయాణీకులను ఎక్కిస్తూ దించుతూ వెళ్లాల్సి ఉంది. చుట్టూ గ్రామాలు ఉండటం వల్ల సామాన్యులు, ఉదయం డ్యూటీలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే బ్రహ్మయ్య బస్సును నిర్ణీత సమయం కంటే ముందే వేగంగా తిప్పి డిపోలో పెట్టి డ్యూటీ దిగి వెళ్లేవాడు. కలెక్షన్ తక్కువని, సంస్థకు నష్టాలు వస్తున్నాయని యాజమాన్యం సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరించినా బ్రహ్మయ్య ఖాతరు చేసే వాడు కాదు.
ఓ రోజు బ్రహ్మయ్య, బాలాజీకి ఒకేసారి గ్రామీణ బస్సులో డ్యూటీ వేశారు. ఈసారి బ్రహ్మయ్య బస్టాపుల వద్ద బస్సును ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేసినా బాలాజీ అడ్డుకున్నాడు. ప్రతి బస్టాప్ వద్ద బస్సును నిలిపి ప్రయాణీకులను ఎక్కించి దింపాడు. సాయంత్రం బస్ డిపోకు చేరింది. బాలాజీపై బ్రహ్మయ్య నిప్పులు చెరిగాడు. ‘‘పెద్ద రక్షకుడు...సంస్థను రక్షిస్తాడట...’’ వెటకారం చేశాడు. బాలాజీ అదేమీ పట్టించుకోలేదు. కలెక్షన్ చూసుకున్నాడు. రోజూ కన్నా ఆ రోజు వెయ్యి రూపాయలు అధికంగా వచ్చింది. డిపోలో కట్టాడు. నెమ్మదిగా ఆ రూటులో ఆదాయం పెంచాడు. డిపో అధికారులు సైతం ఆ రూటులో వారిద్దరికే డ్యూటీలు వేయసాగారు.
బాలాజీ ఆ రూటులో కాస్త ఆలస్యమైనా ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా బస్‌ను కంట్రోలు చేస్తూ ఆదాయం బాగా పెంచాడు. సాయంత్రం కాగానే బ్రహ్మయ్య, కండక్టర్ బాలాజీపై కోపం ప్రదర్శించేవాడు. ఇలా ఒక సంవత్సరం గడిచింది. బాలాజీకి నెలనెలా ఇనె్సంటివ్ బాగా పెరిగింది. ఆ ఏడాది ఉత్తమ కండక్టర్ అవార్డు కూడా పొందాడు. బాలాజీ ఆ స్ఫూర్తితో తన పట్టుదల, కృషిని కొనసాగించి మరిన్ని ఉత్తమ సేవ అవార్డులు పొందాడు. చూస్తుండగానే బాలాజీ ఉత్తమ సేవలందిస్తూ కంట్రోలర్‌గా పదోన్నతి పొందాడు. బ్రహ్మయ్యకు డ్యూటీలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వసాగాడు. బ్రహ్మయ్య ఇదేమీ ఖాతరు చేయలేదు. డ్యూటీలో అలసత్వం ప్రదర్శిస్తూ ఉద్యోగులతో ఘర్షణ పడుతూ సంస్థ ప్రగతి నిరోధకుడిగా మారాడు. దీంతో అధికారులు అతని డ్యూటీలపై నిఘా వేశారు.
బాలాజీ అప్పటికే డిపో మేనేజర్‌గా పదోన్నతి పొందాడు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో నష్టాల్లో ఉన్న డిపోను అభివృద్ధి బాట పట్టించాడు. మరో డిపోకు బదిలీ అయి ఆ డిపోను కూడా అభివృద్ధి చేసి అనతి కాలంలోనే ఆర్టీసీ జిల్లా ఆర్.ఎం.గా పదోన్నతి పొందాడు.
బ్రహ్మయ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగులందరూ డ్యూటీ సమయంలో తమకు సహకరించలేదని ఆయనతో కలిసి పనిచేయలేమని నిరాశక్తత వ్యక్తం చేశారు. అతనిపై అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆయన తీరును మార్చుకోవాలని లేదంటే ఉద్యోగంలో కొనసాగించడం కష్టమని హెచ్చరించినా మారలేదు. దీంతో పై అధికారులు విసిగిపోయి బ్రహ్మయ్యను సస్పెండ్ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఆందోళనగా మారింది.
పై అధికారుల వద్దకు వెళ్లి ‘‘సార్.. సార్..కుటుంబ పరిస్థితి బాగాలేదు. ఉద్యోగం ఇప్పించండి..’’ అని అడుక్కున్నాడు. వాళ్లెవ్వరూ కనికరించలేదు. అదే సమయానికి అక్కడ బాలాజీ, ఆర్.ఎం. అని బోర్డు ఉండడం చూసి ఆశతో వెళ్లాడు. తలుపు తోసుకుని లోనికెళ్లాడు.’’ ‘‘సార్...సార్.. కుటుంబ జీవనం గడవడం కష్టమైపోయింది. భార్యాబిడ్డలు పస్తులతో పడుకున్నారు. మళ్లీ నాకు ఉద్యోగం ఇప్పించండి...’’ చేతులెత్తి నమస్కరించాడు.
బ్రహ్మయ్యను చూశాడు బాలాజీ. ‘‘ఏమయ్యా.. బ్రహ్మయ్యా, నీకు మొదట నుంచి చెబుతున్నాను, నీ పని విధానం కాస్త మెరుగుపరుచుకో.. వృద్ధిలోకొస్తావు... అంటే నువ్వే వినలేదు... ఏం చెయ్యమంటావు? చెప్పు..’’ ప్రశ్నించాడు ఆర్.ఎం.
బ్రహ్మయ్య ముఖంలో అమాయకత్వం కొట్టొచ్చింది. మీరే ఏదో ఒకటి చెయ్యండి సార్... ఇంట్లో పరిస్థితి హీనంగా ఉంది. మీరే ఏదో ఒకటి చెయ్యండి సార్..’’ ముఖం దీనంగా అయోమయంగా పెట్టాడు బ్రహ్మయ్య.
‘‘నేనేం చెయ్యలేనయ్యా.. అక్కడ మీ డిపోలో వెళ్లి కలువు.. నేనేమీ చెయ్యలేను.’’ అని కటువుగా చెప్పాడు ఆర్.ఎం.
ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన వ్యక్తే ఇప్పుడు తన నైపుణ్యంతో అత్యున్నత స్థాయికి చేరాడు. తను మాత్రం ఉన్న స్థానంలో కొట్టుమిట్టాడుతూ ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చిందని ఆవేదన చెందసాగాడు బ్రహ్మయ్య.
మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికెళుతూ బ్రహ్మయ్య ముఖం చూశాడు ఆర్.ఎం. బాలాజీ. అతని ముఖంలో నిరాశ, నిస్పృహ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక లాభం లేదు.,.. ఒకప్పటి తన సహచరుడు ఇలా అయిపోవడం ఊహించలేకపోయాడు. వెంటనే డిపో అధికారికి ఫోన్ చేసి బ్రహ్మయ్యకు ఇంకోసారి అవకాశం ఇచ్చి చూడండయ్యా..’’ అని చెప్పాడు.
అది విన్న బ్రహ్మయ్యకు గతం గుర్తుకొచ్చింది. తను పని సమయంలో ఎంత తిట్టినా, అసహ్యించుకున్నా మిత్ర ధర్మం మరువలేదు. ఏ మాత్రం కోపం లేకుండా తన ఉన్నతికి కృషి చేశాడు బాలాజీ అని లోలోన కృతజ్ఞతలు తెలుపుకుని’’ మీ మేలు ఈ జన్మలో మరువలేను సార్..!’’ అని చెప్పి సెలవు తీసుకున్నాడు బ్రహ్మయ్య.
ఆ తర్వాత డిపోలో విధుల్లో చేరి తన కోపాన్ని తగ్గించుకుని అందరితో మిత్రుడిగా మెలుగుతూ ఆర్టీసీ సంస్థకు ఉత్తమ సేవలు అందించసాగాడు బ్రహ్మయ్య.

- బోగా పురుషోత్తం