S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సరికొత్త సృజన సమీరం!

సుందరం.. సుకుమారం.. వర్ణరంజితం సీతాకోక చిలుక రూపం.. చిత్రకారులకు ఇంతకు మించిన గొప్ప ‘వస్తువు’ ఏముంటుంది? చిత్రకారుడికి పరీక్ష పెట్టే, సవాలు విసిరే ప్రాణి మరొకటేముంటుంది?
ఆ అల్ప ప్రాణి సవాలును చిత్రకారుడు అక్కిరాజు రమణ హుందాగా స్వీకరించి తన కాన్వాసుల నిండా సీతాకోక చిలుకలకు ప్రాణం పోశాడు. పరిపరి విధాల చిత్రిక పట్టాడు. పరిసరాల నిండా సీతాకోక చిలుకల ‘జాడ’ను పరిచాడు.
సీతాకోక చిలుక రెక్కల్లో కేవలం రంగులనే గాక మనుష్య ఆకృతులను జత చేయడంలో రమణ సృజన కనిపిస్తోంది. ఆ రూపాంతరం సరికొత్త సంకేతంలా నిలుస్తోంది.
అలా మానవాకృతి, సీతాకోక చిలుకలు ఏకీకృతం అయిన చోట కాన్వాసు కోటి కాంతులతో వెలుగొందుతుంది. ఆ ‘టెక్చర్’ ఉల్కాపాతంలా దేదీప్యమానంగా విస్తుగొలుపుతుంది. ఆ టెక్చర్‌లోనూ తిరిగి రేఖా రూపంలో రెక్కలను టపటప లాడిస్తూ సీతాకోకలు కనిపిస్తాయి. ఇందుకు చిత్రకారుడు ఎంచుకున్న టెక్నిక్ అపురూపమైనది.
కాన్వాసుపై ‘వైట్ టెక్చర్’ పొరలు పొరలుగా వేయడం వల్ల ఈ అద్భుతం చోటు చేసుకుందని చిత్రకారు డంటున్నారు.
ఒకే ఫ్రేమ్‌లో ఎంతో విషయాన్ని నిక్షిప్తం చేసిన ఆయన విద్వత్‌కు ఓ తార్కాణం.
ఓ మార్మిక లోకపు అంచులను తాకేందుకు జరిగే ప్రయత్నం ఆ ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. సీతాకోక చిలుక రెండు రెక్కల స్థానంలో రెండు అర్థకైరూప్య తలలు... అందులో ఒకటి ఆడ.. మరొకటి మొగ. వారి తలల నిండా లతలు, ఆకులు అలములతో అనంత ఈ ప్రకృతిలో అంతర్భాగమై వెలుగొందుతున్న వైనం.. నేపథ్యంలో రంగుల కోలాహలం సంరంభం.. అందులో తచ్చాడుతున్న... రేఖామాత్రపు సీతాకోకలు.. అంతిమంగా ఈ పెయింటింగ్ రమణ రంగుల విద్వత్‌ను వెల్లడిస్తుంది.
ఈ ప్రపంచంలో అతి అసహ్యకరమైన రూపం (గొంగళిపురుగు) నుంచి ఓ అద్భుత అందమైన అపురూపమైన నాజూకైన, నయనానందకరమైన ప్రాణి (సీతాకోకచిలుక)గా రూపాంతరం చెందడం ఈ ప్రకృతిలో ఆ ఒక్క ప్రాణి విషయంలోనే చూస్తామని చెప్పే చిత్రకారుడు ఆ అల్పప్రాణిని అమితంగా ప్రేమించి అనేకానేక ఫ్రేముల్లో, వివిధ నేపథ్యాల నడుమ చిత్రిక పట్టి జేజేలు అందుకున్నారు. అవి విసిరిన సవాలుకు న్యాయం చేశారు.
ప్రకృతి అందానికి మారుపేరుగా నిలిచే సీతాకోకల గుంపును సైతం తనివితీరా చిత్రించి చిత్రకారుడు చరితార్థుడయ్యాడు.
అదంతా సహజసిద్ధంగా రంగుల పోహళింపుతో సృజనాత్మకతకు సరికొత్త హద్దులు నిర్ధారించి చేసిన విన్యాసం.
దీన్ని తలదనే్న రీతిలో డిజిటల్ మిక్స్ పేర, డిజిటల్ మీడియాలో ఆయన గ్రహాంతర వాసుల ఊహారూపాలతో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. కుంచెతో తీసుకురాలేని మార్మికత, రంగుల తీక్షణత, ఓ ఒంపులు వయ్యారాలు, నేపథ్యంలోని కలల ప్రపంచం అంతా ఓ వినూత్న అనుభవం. సృజనకారుడి అనంత సృష్టికిదొక తొలి మెట్టుగా కనిపించే, కళ్లు మిరుమిట్లు గొలిపే గొప్ప అనుభూతిని పంచుతాయి. ఒక్కసారి పంచేంద్రియాలు ఉలిక్కిపడేలా, తాదాత్మ్యం చెందేలా చేస్తాయి. ఈ వైభోగం కేవలం డిజిటల్ మీడియాలోనే సాధ్యమని, భారతదేశం వెలుపల ఎందరో చిత్రకారులు.. సృజనకారులు తమ ప్రతిభను డిజిటల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారని అక్కడి ప్రజల ఆదరణ పొందుతున్నారని రమణ అంటున్నారు.
రంగుల రసగంగలో మునుగుతూ, సీతాకోక చిలుకల్ని అమితంగా ప్రేమిస్తూ, చెట్టులో, పుట్టలో, స్ర్తి ముఖంలో ఇలా అంతటా తిలకించడమేగాక చిత్రించి అబ్బురపరుస్తున్న రమణ అక్కిరాజు హైదరాబాద్‌లో 1967లో జన్మించారు. ఆయన తాత, తండ్రి ఖమ్మం జిల్లా నుంచి చాలా కాలం క్రితం రాజధానికి చేరుకున్నారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. ఇక్కడే ప్రముఖ చిత్రకారుడు నరేంద్ర రాయ్ డ్రాయింగ్ టీచర్‌గా తమకు చిత్రలేఖనంపై అనురక్తిని పెంచారన్నారు. అది హాబీగా ప్రారంభమైనా చివరికి ఆరవ ప్రాణంగా మారిందంటున్నారు రమణ.
కాచిగూడ జూనియర్ కాలేజీలో చదువుతూ సాయంత్రం కోఠిలోని వి.వి. కాలేజీలో చెప్పే చిత్రలేఖనం తరగతులను హాజరై తన తృష్ణను చాటుకున్నారు. ఆ రంగంలో రాణించేందుకు అడుగులు వేశారు. ఆ రకంగా కొంత చేయి తిరిగాక 1987 సంవత్సరంలో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బిఎఫ్‌ఏలో చేరారు.
అక్కడ ‘అప్లైడ్ ఆర్ట్స్’ విభాగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ రోజుల్లో రకరకాలైన కమర్షియల్ ఆర్ట్ పనులు చేయాలంటే అప్లైడ్ ఆర్ట్స్ పరిచయం తప్పనిసరి. గ్రాఫిక్స్, డిజైన్స్, లే అవుట్, పోస్టర్ రూపకల్పన, బొమ్మలు వేయడం ఇత్యాది పనులకు భూమిక ఈ విభాగం కావడంతో దానిపై మనసు పెట్టి దూసుకుపోయారు. వౌలికంగా తాను చిత్రకారుడినన్న మాట మాత్రం విస్మరించలేదు. తన అంతరంగంలో సమాంతరంగా ఆ సంభాషణ - చర్చ - సృజన, రంగుల పోహళింపు కొనసాగుతూనే ఉంది. అందుకే 2013, 2014 సంవత్సరంలో వరుసగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి బహుమతులు అందుకున్నారు. అంతకుముందే సిద్దిపేటలోని లలిత కళాసమితి నుంచి కూడా ఉత్తమ చిత్రకారుడి బహుమతి పొందారు.
ఇక స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో, దాయిరా ఆర్ట్ గ్యాలరీలో, మాక్స్‌ముల్లర్ భవన్‌లో.. ఇలా పలుచోట్ల ఆయన గ్రూప్ షోలలో పాల్గొని ప్రశంసలందుకున్నారు. వివిధ ఆర్ట్ క్యాంపుల్లో తోటి చిత్రకారులతో పోటీ పడి ప్రతిభను చూపారు. త్వరలో సోలో షో నిర్వహించనున్నట్టు చెప్పారు.

*చిత్రాలు.. రమణ అక్కిరాజు.. 9347203234

- వుప్పల నరసింహం 9985781799