S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాకతీయుల శిల్ప కళ

రామప్ప అనగానే మహాశిల్పి రామప్ప సృజించిన రామప్ప దేవాలయ నర్తకీమణులు మన మనసును దోచుకుంటూ మన ముందు తమ ఒంపు సొంపు వయ్యారాలు ఒలకబోస్తూ మయూరాల్లా నాట్యం చేస్తాయి. ఏ శిలను తాకినా రాగాలే పలుకుతాయి. రామప్ప పేరు వినగానే సముద్రాలను తలదన్నిన రామప్ప సరస్సు తరంగాలు ఆకాశానికి ఉద్వేగంగా ఉప్పొంగి తమ హోరుతో సరిగమల సంగీతాన్ని హృదయాన్ని ఆహ్లాదపరుస్తూ వినిపిస్తాయి. రామప్ప పేరు వినగానే రుద్రేశ్వరస్వామి గుడి గంటలు ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర నాదాలతో మారుమోగిస్తూ భక్తిపారవశ్యాన్ని కలిగిస్తాయి. రామప్ప సరస్సు పేరు మదిలోకి రాగానే పచ్చని పంట పొలాలూ, వనాలూ, పర్వత శ్రేణులూ, ప్రకృతి సోయగాల రమణీయ దృశ్యాలు రంజింపజేస్తాయి.
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సర్వసైన్యాధ్యక్షుడు రేచెర్ల రుద్రారెడ్డి శాలివాహన శక సంవత్సర 1135 శ్రీముఖ నామ సంవత్సర మధుమాస వసంత శుక్లపక్ష అష్టమి భానువారం నాడు పుష్యమీ నక్షత్రం సరియగు క్రీ.శ. 1213 మార్చి 31వ తేదీ నాటికి కాకతీయ శిల్ప కళావైభవానికి పరాకాష్టగా, కాకతీయ సామ్రాజ్యానికి మణిమకుటంగా రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. మహారాష్ట్ర దేవగిరి రాజ్య ప్రభువు జైత్రపాలుని (జైతుగి) చెరశాలలో ఉన్న గణపతి దేవుడిని విముక్తి చేసి ఆ ప్రభువు కూతురు సోమలా దేవిని తనకు వివాహమొనర్చడం, ఆ క్రమంలో ప్రభుభక్తితో సర్వ సైన్యాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ నెల్లూరు, కళింగ, కాంచీ తదితర రాజ్యాలెన్నింటినో జయించి తనకు స్వాధీనపరచి సువిశాల కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఎంతగానో దోహదపడినందుకు గణపతి దేవచక్రవర్తి రేచెర్ల రుద్రారెడ్డి సేనానికి అపూర్వ రామప్ప దేవాలయ నిర్మాణాన్ని కానుకగా ఇచ్చాడు.
ఆలయాలకు స్థానిక ఎరుపురాయిని ఎక్కువగా వాడారు. ముఖ్యమైన విభాగాలకు ప్రశస్తమైన నల్లసేనపు జిలుగువెలుగుల శిలలను వినియోగించారు. రాబోయే కాలంలో భూకంపాలూ, ప్రకృతి వైపరీత్యాలకు ఏమాత్రం చెక్కు చెదరకుండా అద్భుత సౌండ్‌బాక్స్ పరిజ్ఞానంతో పునాదుల్ని నిర్మించారు. వీటిపైన క్షేత్రాకారంలో ఆధార శిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, పట్టిక, అదోపద్మం అనే ఉపపీఠాల వరుసలపై అధిష్టానం నిర్మించారు. అధిష్టానం దేవాలయానికి పాదం లాంటిది. అలాగే ఆలయం పై కప్పు పూర్తికాగా, గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. గోపురాన్ని నీళ్లులో తేలియాడే తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఈ గోపురాన్ని కేంద్ర పురావస్తుశాఖ పునర్నిర్మించింది. ఈ నేపథ్యంలో మహా శిల్పి రామప్పాచార్యులు నేతృత్వంలో 300కు పైగా శిల్పులతో భారతీయ శిల్ప సంప్రదాయంలో విశిష్టమైనవేసర శిల్పరీతిన నిర్మాణమైంది. అమరావతి, నాగార్జునకొండల్లో బౌద్ధశిల్పం, మహాబలిపురం, పల్లవశిల్పం, అజంతా, ఎల్లోరాల రాష్ట్ర కూట శిల్పం, ఖజోరహోలోని చందేల శిల్పం, బేలూరు, హాలీబీడుల హోయసల శిల్పరీతులను మించి హోయసల శిల్పంలోని అతిఅలంకరణ, పల్లవశిల్పంలోని అలంకార శూన్యతల వంటి లోపాలు లేకుండా తమదైన గొప్ప కాకతీయ శిల్ప కళాకాంతుల శైలిలో అతి భారీ ఏకకూటాలయంగా రామప్ప దేవాలయాన్ని నిర్మించి శిల్పాచార్యులు కాకతీయ శిల్పానికి విశ్వవిఖ్యాతి గావించారు. రామప్పాచార్యు గెలురుద్రేశ్వర ప్రాణలింగం, మహానందీశ్వరుడు వాత్స్యాయనకామసూత్రాల ప్రాతిపదికన మైథునే శిల్పాలు, సెక్స్ శిల్పాలు, ద్వార, పార్శ్వ శిల్పాలు, మహిషాసురమర్ధినీ, గాలి, వెలుతురు గర్భగుడిలోని రుద్రేశ్వరస్వామిని తాకడానికి వాయుకోష్టములు, రతీమన్మథులూ, గణపతి, గర్భాలయ శిల్పాలు, మహారాజపద్మము, 12 ఆధార అలాసాకన్యల నర్తన శిల్పాలను మహాశిల్పి రామప్పాచార్యులు చెక్కాడు. మిగతా శిల్పులు ఆలయ ఇతర విభాగాలను చెక్కారు. ఈ క్రమంలో ఆలయంలో 4 భాగాలుగా దేవతా రూపాలూ, నర్తకుల బృందం, నర్తకీమణుల బృందం, సాధారణ రూపాలు అలాగే అలంకార శిల్పంలోని 6 రకాలు. అవి మకర తోరణాలూ, హంసలూ, పద్మాలూ, లతలూ, ఏనుగులూ, సింహాలూ, నాగసర్పాలూ శిల్పీకరణ క్రమంలో ప్రదక్షిణాపథంకు 526 ఏనుగుల వరుసలూ, రంగమంటప స్తంభానికి 13 సూక్ష్మరంధ్రాలు, 28 గజకేసరి శిల్పాలు (రుద్రమదేవి విజయ చిహ్నాలు) చెక్కారు. ఆలయ ఆధార శిల్పాలైన 12 అలాసాకన్యల శిల్పాలు శిల్పాచార్యుని కళా ప్రతిభను చాటుతాయి. ధనుర్ధారులైన వేలుకత్తెలు, మిగతావి ఛామరధారిణిలూ, మద్దెల మోగించు పడతులు, అర్ధనగ్న స్ర్తి నగ్ననాగినీ శిల్పాలు రామప్ప దేవాలయానికి శిఖరాగ్ర కీర్తిని తెచ్చిపెట్టాయి.
మదనికల శిల్పాలలో నాగినీ, ఎత్తుమడమల నర్తకీమణుల శిల్పాలలో శిల్పాచార్యుని అమోఘ కళానైపుణ్య ప్రతిభ ప్రస్ఫుటమవుతుంది. ఈ శిల్ప నర్తకుల అలంకరణలు కాకతీయుల నాటి స్ర్తిల సంస్కృతి, సంప్రదాయాలు తెలుపుతాయి. ఈ క్రమంలో ఆలయ ఉత్తర ద్వారంలో కోతి చీరను లాగుతూ నగ్నవతిని చేస్తుండగా ఆమె తన మానాన్ని కాపాడుకుంటూ కోతిని ప్రతిఘటించే స్వమాన సంరక్షిణీ, దక్షిణ ద్వారంలో ఎడమవైపు డోలు వాయిస్తున్న వనకన్య, కుడిదిక్కునే రాగినీ అనబడే వసంత కన్య తూర్పుద్వారమునకు నాగకన్య అనబడే నాగినీ. ఇది కాకతీయ శిల్పకళను దిగంతాలకు చాటి
ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. ఈమె పూర్తిగా దిగంబరురాలై చక్కగా నిలువబడి ఎత్తిన రెండు చేతుల్లో త్రాచుపామును పట్టుకున్నది. ఈ నాగిని అంగాంగమును చెక్కుటలో శిల్పాచార్యుడు తన కళాప్రతిభను చూపాడు. దీంతో కవులకూ, రచయితలకూ ఈమె శృంగర కవితాంగన అయింది. చిత్రకారుల కుంచెలో రూపుదిద్దుకుంటూ కలలసుందరి అవుతున్నది. ఈ నాగినీ పక్కనే కాగడా పట్టుకొని వెలుగులు నింపుతున్న వనదేవత విగ్రహం ఉన్నది. ఈమె ఎత్తు మడమల పాదరక్షలు (హైహీల్స్) ధరించి ఉన్నది. ఈనాటి మోడరన్ పాదరక్షలుగా మనం పిలిచే హైహీల్స్ కాకతీయుల కాలంలో ఉండటం అప్పటి నాగరికతను తెలుపుతుంది. దీనికి కుడి వైపున పేరిణీ శివతాండవం చేస్తున్న నర్తకి ఉంది. దీని పక్కనే ధనుస్సు, శరములు ధరించి వేటకు సిద్ధముగా ఉన్న వనమాలక (బోయ కన్య కిరాతిని) విగ్రహం ఉంది. ఆమె కుడికాలుకు ముళ్లు విరిగి వాచిపోగా, మంగళివాడు ముళ్లును సూదితో తీయటం, వాచిన కాలు సహజత్వముగా కనబడుతుంది. ఈ విధంగా హాస్య, రౌద్ర, భక్తి, శృంగార, వినోదం ఆ హావభావాలూ, అభినయ కౌశలం, ఉధాత్తత, నృత్య ప్రతిభా విధానం ప్రతీ మదనికలో స్పష్టంగా, సహజంగా కనిపిస్తుంది.
ఇక దేవగిరి ప్రభువు మహాదేవుడిని ఓడించినందుకు తన విజయ చిహ్నాలుగా రాణిరుద్రమదేవి గజకేసరి శిల్పాలను ఆలయ కప్పుకు అలరింపజేశారు. ఈ శిల్పాలకు రెండు అర్థాలు వస్తాయి. ఏనుగుల వంటి శత్రువులకు కాకతీయ రాజులు సింహాలలాంటివారని, దీనే్న శాతృ గజకంఠీరవ అని అంటారు. ఇక ఆలయం ప్రదక్షిణాపథం చుట్టూ అలాగే గర్భాలయ, అర్థమండపం, రంగమండపంలా... అధిష్టానానికి ఉపానం, కుముదం, కపోతము కాకతీయల కాలం నాటి ప్రజల జీవన విధానాలకు దర్పణం పడుతూ వారు అలంకార ప్రియులుగా, సంగీత, వాయిద్య కళల ప్రేమికులుగా, వాత్స్యాయనకామసూత్రాలను పాటిస్తూ శృంగార, రతిక్రియలు జరిపే విజ్ఞానానికి మైథున శిల్పాలనూ, ఏనుగులూ, సింహాలూ, హంసలూ, తాండవగణపతులూ, భైరవ, గజలక్ష్మీ, మల్లయోధులూ, సూర్యుడు, మొసళ్లు (మకరాలు), అలాగే కుడ్య శిల్పాలు, శృంగార శిల్పాలు, వివిధ వాయిద్యకారులు, వివిధ నర్తకులు, లతలు, పద్మపట్టిల వరుసలు, అలాగే జైనమహాధీరుడు, బుద్ధుడు, ఆంజనేయుడు, మహిషాసురమర్ధిని, వీర భక్తుడు, తదితర శిల్పాలు రామప్ప దేవాలయ శిల్పకళా వైభవాన్ని మహోజ్వలంగా ప్రకాశింపజేస్తున్నాయి.
జీవకళ లొలుకుతున్న నంది: ఇక మహారాష్ట్ర దేవాలయానికి మహోజ్వల ప్రకాశంతో శిఖరాగ్రమాన కళాఖండంగా కాకతీయ శిల్పానికి అగ్రమణిమకుటంగా రామప్ప మహా నంది ఉంది. ఇది ఆలయానికి తూర్పున ప్రత్యేక మంటపంలో కాకతీయ నందులలో అగ్రగామిగా భాసిల్లుతూ ఉంది. జిలుగువెలుగుల రామప్ప నందీశ్వరుడు భారతీయ ప్రఖ్యాత మైసూరు, లేపాక్షి, తంజావూరు, యాగంటి నందులను మించిన మహోజ్వల ప్రకాశిత శిల్ప కళా సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. బలిష్టమైన శరీర సౌష్టవం, తోక, వృషణాలు మూపురం, కాలిగిట్టలతో పాటు ప్రతీ అవయవం సహజంగా జీవకళ లొలుకుతూ ఉన్నాడు. ముఖ్యంగా మూపురం శివలింగం వలే గోచరిస్తూ భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. ముఖంపై ఉబ్బిన నరాలు, విప్పారిన కన్నుల్లో నీటిపొరలు చూపించడంలో రామప్ప శిల్పి తన కళా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. మెడపట్టీలు, చిరుగంటలు, అలంకారాలు రకరకాల ఆభరణాల అలంకరణలతో నందీశ్వరుడు రామప్ప దేవాలయానికి శిల్ప కళాకీర్తికి ప్రతీకగా ఉన్నాడు. పూర్వం నుంచి ఆలయంలో ఉన్న మహానందిని 1990లో ఆలయం తూర్పు వైపున ఉన్న నంది మంటపాన్ని పునరుద్ధరించి అందులోకి తెచ్చారు. అయితే మంటపానికి పై కప్పు నిర్మించకపోవడం వల్ల సుమారు 26 ఏళ్లుగా నందీశ్వరుడు తన సహజమైన జిలుగువెలుగులను కోల్పోయి ఉనికికే పెద్ద ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర పురావస్తు శాఖ వెంటనే నంది మంటపం పై కప్పును నిర్మించి నందిని శాశ్వతంగా కాపాడాలి.
రంగ మంటపం: ఆలయంలో వైభవోపేతంగా అపూర్వశిల్ప కళతో నిర్మించిన 4 స్తంభాల మంటపాన్ని రంగమంటపం, నాట్యమంటపం అంటారు. ఇది ఒక అద్భుత లోకం, వైకుంఠాన్నీ, బ్రహ్మ లోకాన్నీ, కైలాసాన్ని మరెన్నో లోకాలను, సర్వదేవుళ్లనూ ఒక చోటుకు తెచ్చి వేదిక చేశారు. రామాయణ, మహాభారత, మహాభాగవత, శివలీలల ఘట్టాలకు శిల్పులు శిల్పాభిషేకం చేశారు. దీంతో ఆలయం మరువరాని మధురానుభూతిని కలిగించే మనోజ్ఞ శిల్ప కళా వైభవశాల అయింది. ఈ ఆలయానికి గోడలు తక్కువ, స్తంభాలు ఎక్కువ. కాగా రంగ మంటప స్తంభాల మధ్యలో చతురస్రాకార ఫలకాల మీద దేవదానవుల క్షీరసాగర మధనం, ముగ్గురు నర్తకులకు నాలుగు కాళ్లు ఉండి ఆరుకాళ్లుగా కనిపించే చమత్కార శిల్పం, శ్రీకృష్ణ గోపికా వస్త్రాపహరణం, పేరిణీ నాట్యం, దండలాస్యం, కుండలాకార నృత్యం, శివుడి మన్మథ సంహారం తదితర ఘట్టాలున్నాయి. ఇక రంగమంటపం పై కప్పుకు దశ భుజ నాట్యా రుద్రుడు, చుట్టూ భార్యా సమేతులై వాహనారూఢులై అష్టదిక్పాలకులూ, పశ్చిమ, దక్షిణ దూలములకు పశ్చిమ దిశన మేరు పర్వతం కవ్వముగా వాసుకీ సర్పం తాడుగా దేవ, దానవుల పాల సముద్ర మధనం, శ్రీమహావిష్ణవు, మోహినీ అవతారం, దీని కింద శివుని త్రిపురాసుర సంహారం, తారకాసుర సంహారం, ఉత్తర దిశన గజాసుర సంహారం, నాట్య గణపతి, వరాహ మూర్తులు, ఆలయ శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయి. అలాగే ఈశాన్య, వాయువ్య దూలాలకు దక్షసంహారం, శ్రీరాముని అశ్వమేథయాగము, సీతా బంగారు లేడిని గాంచు ఘట్టము, తూర్పున నరకాసుర ఘట్టమున్నది. ఇంకా పార్వతీ కళ్యాణం, త్రిముఖ బ్రహ్మ, మరెన్నో ఘట్టాలున్నాయి. ఇక మంటపం తూర్పున ఎడమ వైపున దిష్టి దోష స్తంభం ఉంది. ఇక స్తంభాలకు చెరుకుగడలూ, అరటి బోదెల మధ్య బాణాలు ధరించి రకరకాల భంగిమల్లో నిలబడిన స్ర్తిలు, సింహాల వరుసలు, లతలూ, వివిధ వాయిద్యకారుల శిల్పాలు జీవకళలతో ఆకట్టుకుంటాయి. ఇక స్తంభాలకు మద్య శిల్ప ఘట్టంలో సన్నని సందులుంటాయి. అందులో సన్నని దారం లేదా గడ్డిపోచలు దూరుతాయి. ఈ సున్నిత, సూక్ష్మ పనితనానికి శిల్పులు ఎంత సూక్ష్మమైన పనిముట్లు వాడారో తెలుస్తుంది. ఇక గర్భగుడి ముఖద్వారంపైన దక్షయజ్ఞము, శివ, పార్వతుల కల్యాణ, ఘట్టాలున్నాయి. ఈ ద్వారబంధానికి ఒకవైపు 9 విభాగాలుగా, మరో వైపు 9 విభాగాల అలంకరణలతో చెక్కారు. కాకతీయ ప్రభువులకు విజయాలు చేకూర్చిన విజయలక్ష్మికి ప్రతీకగా వారికి ప్రీతికరమైన ఇష్టమైన సిరిదేవత గజలక్ష్మీ ఉంది. ద్వారబంధాలకు కుడివైపు దర్పణ సుందరి, ఎడమవైపున పొన్న చెట్టు, సుందరి శిల్పాలున్నాయి. సుందరి పట్టుకున్న పొన్నచెట్టును మీటినా లోహ శబ్దం వస్తుంది. దీన్ని సప్తస్వర శబ్దంగా భావిస్తారు. అలాగే ప్రవేశ ద్వారమునకు ఎడమవైపున ఖడ్గం మొనను భూమికి ఆనించి పిడిని పట్టుకొని సతీసమేతంగా భక్తివినమ్రులై ఆలయాన్ని నిర్మించిన రేచెర్ల రుద్రారెడ్డి దంపతులున్నారు. గర్భగుడి ద్వారంపైన కాకతీయ చక్రవర్తులకు విజయాలను, సిరిసంపదలను ఇచ్చిన గజలక్ష్మీ దేవత ఉంది. భక్తులకు స్వాగతం పలికే ద్వారపాలికలున్నాయి. అలాగే రుద్రేశ్వరస్వామిని సందర్శించి బయటకు వస్తున్న భక్తులకు అరటిపండును ఒలిచి పెట్టే ద్వార పాలిక ఉంది. ఇక గర్భాలయంలోని రుద్రేశ్వరుడు (శివలింగం) వేయి సూర్యుల కాంతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తన దివ్య సందర్శన భాగ్యాన్ని భక్తులకు కలిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రంగమంటప స్తంభాలపై పడే సూర్య కిరణాలు పరావర్తనం చెంది రుద్రేశ్వరుడిపై పడి ప్రాకృతిక వెలుగుల్ని ప్రసరింపజేస్తాయి.
ఇక కాకతీయ ప్రభువులకు యుద్ధాల్లో చేకూర్చిన సప్తమాతృకల దేవతల నిలయాలున్నాయి. ఇవి ఆలయ రంగమంటపంలో ఉన్నాయి. ఈ సప్తమాతృకలను ద్రావిడ దేవతలని అంటారు. వారు బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మహేంద్రా, చాముండా అనే ఏడుగురు దేవతలను ఆ పేర్లతో పిలుస్తారు. ఈ దేవతలను తెలంగాణా వ్యవహారంలో రేణుకా ఎల్లమ్మ, ముత్యాలమ్మ, అంకమ్మ, బంగారమ్మ, మాతమ్మ, పోచమ్మ, మైసమ్మ వారి సోదరుడు పోతరాజు అని పిలుస్తారు. ఈ దేవతల విగ్రహాల్ని ఒక్కొక్క చిన్న దేవాలయంగా నిర్మించి ప్రతిష్ఠించారు. అలాగే వినాయకున్ని కూడా ప్రతిష్ఠించారు. అలాగే భక్తులు కూర్చోడానికి 20 కక్షాసన ఫలకాలున్నాయి. వీటిపైన గోడలకు వివిధ శిల్పాలు వరుసలున్నాయి. ఇక వర్షపు నీరు ఆలయం గోడలపై పడకుండా వెడల్పైన ప్రస్తరకపోతం ఉంది. ప్రస్తరం అనగా కప్పు కపోతం అనగా చూరు.
ఇక ఆలయానికి ఉత్తరం దిశన రేచెర్ల రుద్రసేనాని తండ్రి కామసేనాని పేరున నిర్మించిన కాటేశ్వరాలయం, దక్షిణాన తల్లి కామాంబ పేరున నిర్మించిన సభా మంటపం కామేశ్వరాలయం ఉన్నాయి. ఆతుకూరిపురం (పాలంపేట)లోని ఈ ఆలయాల నిర్వహణకు రేచెర్ల రుద్రసేనాని నెక్కొండ, ఉప్పరపల్లి, బోర్లపల్లి, నడికూడ గ్రామాల్ని దానం ఇచ్చారు. కాగా ఈ ఆలయంలో ఒక అన్నదాన కేంద్రం, ఒక ప్రసూతి కేంద్రం, ఒక వైద్యశాల, ఒక ఓషధీవనం, ఒక మల్ల యుద్ధ పాఠశాల, సైనిక పాఠశాల ఉండేది. ఆలయం ఇంకా ద్రవ్యనిధి కేంద్రంగా (బ్యాంకుగా), న్యాయపీఠంగా, వ్యవసాయ విజ్ఞాన కేంద్రంగా, ప్రభుత్వ అభివృద్ధి పనుల ప్రచార కేంద్రంగా (సమాచార పౌరసంబంధాల కార్యాలయంగా), ఇంకా వివిధ సేవల కేంద్రంగా వర్ధిల్లింది. 72 మంది వివిధ సేవలనందించేవారు. 10 మంది వాయిద్యకారులు, 10 మంది ఆటకత్తెలు (నర్తకీమణులు), 16గురు పాటకత్తెలు ఉండేవారు. ఆలయంలో అలనాటి ప్రసిద్ధి చెందిన నర్తకీమణులు మాచలదేవి, అంబాదేవిలు ప్రదర్శనలిచ్చారు. అందుకు గుర్తుగా రంగమంటపంలో కింది భాగంలో తమ విగ్రహాలను వారు ఏర్పరుచుకున్నారు. క్రీ.శ. 1323లో ఉలఘ్‌ఖాన్ ఓరుగల్లుకోట ధ్వంసం కార్యక్రమంలో రామప్ప దేవాలయంపై దాడి చేశాడు. అయితే ఈ ప్రాంతంలోని వేలాది మంది ప్రజలు తీవ్ర ప్రతిఘటనతో విఫలుడయ్యాడు. అయినా అనేకమంది శిల్పులను చంపి రామప్ప చెరువులో పడేశాడు. నాగినీశిల్పం పై కామదృష్టితో అసభ్యంగా ప్రవర్తించాడు క్రీ.శ. 1323వ సంవత్సరంలో కాకతీయ చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుల వారు దివంగతులైన అనంతరం రామప్ప దేవాలయం నిరాధరణకు గురై వైభవాన్ని కోల్పోయి కటిక చీకటిలో మగ్గింది. ఈ నేపథ్యంలో 610 ఏళ్లు అనంతరం చివరి నిజాం నవాబు దూర్‌ఉస్మాన్ అలీఖాన్ హయాంలో పురావస్తు శాఖ తొలి డైరెక్టర్, గులాం యాజ్దాని క్రీ.శ. 1930లో రామప్ప దేవాలయాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆలయం ఆగ్నేయ భాగం కూలిపోకుండా ఆధార స్తంభాలు కట్టి అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. కాగా ఇంకా పాలంపేట గ్రామ పరిసరాల్లో 16 ఉప ఆలయాలున్నాయి. ఇలా ఉండగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా త్వరలో గుర్తించనుంది. దీంతో ప్రపంచ స్థాయిలో సందర్శించే పర్యాటకులకు ఆ స్థాయిలో అభివృద్ధి జరిగి సౌకర్యాలు గొప్పగా ఏర్పడనున్నాయి.
రైతన్నలకు ఆధరువు రామప్ప చెరువు: సప్త సంతానాల్లోని ఏడు మహా పుణ్య కార్యాల్లో చెరువు నిర్మాణం ఎంతో పవిత్రమైనదిగా భావించి కాకతీయ ప్రభువులు వేలాది చెరువుల్ని నిర్మించిన క్రమంలో రామప్ప, మహా సరస్సును నిర్మించారు. కాకతీయుల మహోన్నత ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా రామప్ప సరస్సు నిర్మాణమైంది. 184 చదరపు కిలోమీటర్ల పరిసర ప్రాంతాల నుంచి చెరువులోకి వర్షపు నీరు చేరుతుంది. చెరువుకట్టను 2000 అడుగుల పొడవులో నిర్మించారు. 82 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ భారీ జలాశయంలోకి 56 అడుగులు నీరు ఉండాల్సి ఉండగా 36 అడుగుల లోతు నీరు ఉంటోంది. కాగా 2913 టి.ఎం.సీలు అనగా, మిలియన్‌ఘనపుటడుగుల నీటి నిలువ సామర్థ్యం ఉంది. అలాగే చెరువు లీగల్ ఆయకట్టు 4350 ఎకరాలు కాగా అదనంగా మరో 2000 ఎకరాలు మొత్తం 6500 ఎకరాలు సాగవుతుంది. చెరువును సోమికాలువ, ఒగరుకాలువ, బూరుగు కాలువ, పీర్లకాలువ, కొత్త కాలువలు ఉన్నాయి. ఇక 50 గ్రామాలకు చెరువు నుంచి డిప్లోరైడ్ నీరందుతోంది. చెరువును దేవాదుల జలాలతో నిండి శాశ్వత రిజర్వాయరుగా ప్రభుత్వం త్వరలో అభివృద్ధిపరచనుంది. కాగా పర్యాటకులు సరస్సులో బోటు షికారు చేస్తూ విహారానందాన్ని పొందుతున్నారు. అలాగే రామప్పలో పర్యాటకులకు విడిది సౌకర్యం ఉంది. ఇందుకు చెరువుకట్టపై 8 కాటేజీలు, సకల సౌకర్యాలతో ఉన్నాయి. అలాగే పర్యాటకులకు భోజన సదుపాయాలకు హరిత హోటల్ రామప్ప, సరస్సు కట్టపై ఉంది.
రామప్ప దేవాలయం వెంకటాపురం (ఎం) మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఉంది.
*