S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అసమర్థుని ఆఖరి క్షణాలు

సంపదల్ని పెంచుకొనే క్రమంలో, కొంత మంది మనుషులు తమ జీవితంలో ఎన్నో తప్పులు చేస్తారు. ఒకవేళ జీవితపు చివరి దశలో వాటిని బేరీజు వేసుకోవాలని భావించినప్పుడు.... ఆ క్షణాన, ఆ వ్యక్తి ఒక రకమైన మానసిక ‘రాపిడి’కి లోనై నిస్తేజంగా బ్రతకవలసి వస్తుంది. ఆ టైంలో కూడా నువ్వు నీ తప్పుల్ని తెలుసుకోకుండా, స్వార్థానికి చిరునామాలా మారిపోతే, అంతకన్నా నీచమైన బ్రతుకు మరొకటి ఉండదు.

కోటేశ్వరరావు చుట్టూ చూసేసరికి, తను ఒక లైన్లో నిలబడి ఉన్నాడు. తన ముందు ఇంచుమించుగా ఒక పది మంది వరకు వ్యక్తులు లైన్‌లో నిలబడి ఉన్నారు. కొంచెం తల పైకెత్తి చూసేసరికి ఆ ప్రదేశం ఒక రాజదర్బార్‌లాగ కనిపించింది. ఎదురుగా సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. పక్కనే వేరొక ఆసనం మీద ఇంకొక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉంది. కళ్లు తిప్పి ఆ మొత్తం ప్రదేశాన్ని ఒకసారి చుట్టూ చూశాడు. అప్పుడు అర్థమైంది కోటేశ్వరరావుకి ఇది పాపుల్ని శిక్షించే నరకమని, తన ఎదురుగా ఉన్న వాళ్లు యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు అని. కోటేశ్వరరావు చేతికి 5 నక్షత్రాలున్న ఒక చిన్నతాడు కట్టి ఉంది. తాను ఎప్పుడు చనిపోయాడో, ఈ నరకానికి ఎప్పుడు వచ్చాడో గుర్తు లేదు. ఈ ఐదు నక్షత్రాల తాడు ఎవరు కట్టారో కూడా తెలియదు. లైన్లో నిలబడిన ప్రతి వ్యక్తి పక్కన ఒక భటుడు కూడా నిలబడి ఉన్నాడు. దూరం నుంచి ఏవో రకరకాల శబ్దాలు నెమ్మదిగా వినబడుతున్నాయి. లైన్లో నిలబడి ఉన్న పక్క వ్యక్తితో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ మాట్లాడలేకపోయాడు. అప్పుడు అర్థమైంది కోటేశ్వరరావుకి. తన కళ్లు, చెవులు మాత్రమే పనిచేస్తున్నాయని.
లైన్లో తన ముందు ఉన్న వ్యక్తి యొక్క చేతికి 3 నక్షత్రాలు ఉన్న తాడును చూసి చిన్నగా నవ్వుకుంటూ, తన చేతికి ఉన్న 5 నక్షత్రాల తాడు వంక గొప్పగా చూసుకోసాగాడు కోటేశ్వరరావు. సభ ప్రారంభం అవుతున్నట్లుగా, చిత్రగుప్తుడు తన పక్కన ఉన్న చిన్న గంటని మోగించాడు. లైన్లో ఉన్న మొదటి వ్యక్తిని, అతని పక్కనే ఉన్న భటుడు చిత్రగుప్తునికి కొంచెం దగ్గరగా తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న ఒక వృత్తంలో నిలబెట్టాడు. ఆ వ్యక్తి చేతికి ఉన్న తాడును విప్పి, చిత్రగుప్తునికి అందజేశాడు ఆ భటుడు. ఆ తాడుని చూస్తూ చిత్రగుప్తుడు పుస్తకం తీసి కొన్ని పేజీలు తిప్పిన తరువాత, ఒక పేజీ దగ్గర ఆగి, ఆ పేజీలో ఉన్న అతని పాపాల్ని యమధర్మరాజుకి చెప్ప సాగాడు.
మహారాజా... ఈ పాపి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగి. తాను పనిచేస్తున్న హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయల దొంగబిల్లులను సృష్టించి, ఎన్నో సంపదలను కూడబెట్టాడు. ఎత్తుకి పైఎత్తులు వేస్తూ, ఎప్పుడూ కీర్తి కోసం, డబ్బు కోసం బోలెడన్ని తప్పుడు పనులు చేశాడు. లేనిపోని నిందల్ని ఎదుటివారిపై వేసి, వాళ్లను తక్కువ చేసి మాట్లాడుతూ, ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఎల్లప్పుడూ తన మాటే నెగ్గాలని అనుకునేవాడు అంటూ చెప్పి, పుస్తకాన్ని మూసివేశాడు. కొద్ది క్షణాల తరువాత యమధర్మరాజు ఆ వ్యక్తితో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి కూడా యమధర్మరాజుతో ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటలు ఏమీ కోటేశ్వరరావుకు వినిపించలేదు. ఇక్కడ చిత్రగుప్తుడు చదివే పాపుల పాపాలు తప్ప వేరే ఏ మాటలు ఎవరికీ వినిపించవన్న మాట అని అనుకున్నాడు కోటేశ్వరరావు. కొంత సమయం తరువాత, చిత్రగుప్తుడు తన చేతిలో ఉన్న ఆ పాపి యొక్క తాడుని అక్కడ ఉన్న భటునికి ఇచ్చాడు. ఆ భటుడు ఆ తాడుని ఆ పాపి చేతికి కట్టి అక్కడ నుండి వేరే గదిలోకి తీసుకొని వెళ్లాడు.
ఇప్పుడు చిత్రగుప్తుడు లైన్లో ఉన్న తరువాత పాపి చేసిన పాపాలు చదవడం మొదలుపెట్టాడు. మహారాజా... ఈ పాపి, స్నేహితులకు మరియు రక్త సంబంధీకులకు ఎక్కువ వడ్డీకి డబ్బును ఇచ్చి, ఎన్నో సంపదల్ని కూడబెట్టాడు. మహా పిసినారి. ఎప్పుడూ తన గొప్పలు చెప్పుకొంటూ, మిగతా వాళ్లందర్నీ కించపరిచేలా మాట్లాడేవాడు. ఎవరైనా జీవితంలో పైకి ఎదుగుతుంటే తట్టుకోలేకపోయేవాడు. తన తల్లి అయితే ఇంట్లో పనులు చేయడానికి పనికొస్తుందని, తల్లితో ఇంట్లో అన్ని పనులు చేయిస్తూ, తండ్రిని మాత్రం అనాథాశ్రమంలో చేర్చాడు. యమధర్మరాజు ఆ పాపితో కొంతసేపు మాట్లాడి, శిక్షలను ఖరారు చేసిన తరువాత, అక్కడ ఉన్న భటుడు ఆ పాపిని వేరొక గదిలోకి తీసుకొనివెళ్లాడు.
ఇప్పుడు చిత్రగుప్తుడు లైన్లో
ఉన్న తరువాత పాపి చేసిన పాపాలు చదవడం మొదలుపెట్టాడు. మహారాజా... ఈ పాపి, వాట్సాప్ అను ఒక సామాజిక మాధ్యమం ద్వారా, తన మతాన్ని గొప్పగా పొగుడుకుంటూ, మిగతా మతాలను కించపరిచే విధంగా అనేక సందేశాలను పంపించాడు. పైకి మంచి వాడిలా నటిస్తూ, తెలిసిన వాళ్లను అందర్నీ తన స్వార్థం కోసం, కీర్తి కోసం వాడుకున్నాడు. మతపరమైన గొడవల్లో, ఒక బస్సును తగులబెట్టి ఇరవై మూడు మంది ప్రాణాలను బలిగొన్నాడు. యమధర్మరాజు ఆ పాపితో కొంతసేపు మాట్లాడి, శిక్షలను ఖరారు చేసిన తరువాత, అక్కడ ఉన్న భటుడు ఆ పాపిని వేరొక గదిలోకి తీసుకొనివెళ్లాడు.
అలా కోటేశ్వరరావు ముందున్న అందర్నీ విచారించి, శిక్షలను ఖరారు చేశాడు యమధర్మరాజు. ఇప్పుడు కోటేశ్వరరావు వంతు వచ్చింది. ఏమి జరగబోతుందో అనే ఉత్సుకతతో ఉన్నాడు కోటేశ్వరరావు. వెంటనే యమధర్మరాజు సింహాసనం మీద నుండి లేచి నడుచుకుంటూ, దూరంగా కనిపిస్తున్న రాజభవనం వైపు వెళ్లసాగాడు. చిత్రగుప్తుడు కూడా పుస్తకం మూసి, దూరంగా కనిపిస్తున్న వేరొక భవనం వైపు వెళ్లసాగాడు. కోటేశ్వరరావుకి ఏమీ అర్థం కాలేదు. ఏమి చేయాలో తెలియలేదు. తన పక్కన ఉన్న భటుడు కూడా వేరొక గదిలోకి వెళ్లాడు. విశ్రాంతి సమయం అయి ఉంటుంది అని మనసులో అనుకొన్నాడు కోటేశ్వరరావు.
కోటేశ్వరరావుకి వెంటనే ఏమి చేయాలో తెలియలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఏమి చేయలేని పరిస్థితి. ఏ తప్పులు చేయని నన్ను ఎందుకు ఈ నరకానికి తీసుకువచ్చారు అని అనుకోసాగాడు. అలా అనుకొంటూనే, నడుచుకుంటూ పక్కనే ఉన్న ఒక గదిలోకి వెళ్లాడు. అక్కడ తన ముందు లైన్లో నిలబడి, బస్సుని తగులబెట్టి 23మంది వ్యక్తుల చావుకి కారణమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కొంతమంది భటులు ఒక బస్సులో కూర్చోబెట్టి, ఆ బస్సు మీద పెట్రోలు పోసి తగులబెట్టారు. అప్పుడు ఆ వ్యక్తి చాలా గట్టిగా అరిచినట్లుగా అనిపించింది గానీ, కోటేశ్వరరావుకి ఏమీ వినబడలేదు. కోటేశ్వరరావుని చూసిన ఒక భటుడు, కోటేశ్వరరావు దగ్గరకు వచ్చి, చెయ్యి పట్టుకొని, కొద్ది దూరంలో ఉన్న వృత్తంలో నిలబెట్టాడు. మరుక్షణం కర్ణకఠోరమైన ఒక శబ్దం కోటేశ్వరరావు చెవుల్ని తాకి, భయభ్రాంతుడ్ని చేసింది. ఆ శబ్దానికి కోటేశ్వరరావుకి కొద్దిసేపు కళ్లు బైర్లు కమ్మినట్లుగా అనిపించి, అక్కడే, అలాగే కూలబడిపోయాడు. కొద్దిసేపటికి నెమ్మదిగా తేరుకున్న తరువాత అక్కడ ఉన్న ఒక భటుడు వచ్చి కోటేశ్వరరావుని పక్కనే ఉన్న చిన్న ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ వ్యక్తి యొక్క అరుపులు ఇప్పుడు కోటేశ్వరరావుకి వినిపించడం లేదు. ఈ వృత్తంలో ఉన్నప్పుడు మాత్రమే పాపుల మాటలు, అరుపులు వినిపిస్తాయని అర్థమయ్యింది కోటేశ్వరరావుకి. కొద్ది సమయం తరువాత కోటేశ్వరరావు నెమ్మదిగా తేరుకొని, నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లాడు. అక్కడ కూడా అదే వ్యక్తిని బస్సులో కూర్చోబెట్టి, పెట్రోలు పోసి తగులబెడుతున్నారు. ఇంకొంచెం దూరం వెళ్లగా అక్కడ కూడా అదే పరిస్థితి. ఒకే వ్యక్తిని ఇన్నిసార్లు ఎందుకు తగులబెడుతున్నారో అర్థం కాలేదు కోటేశ్వరరావుకి. ఆవిధంగా, ఆ వ్యక్తిని ఆ భటులు 23 సార్లు తగులబెట్టారు. 23 సార్లు అదే బస్సులో, వేరువేరు సీట్లలో అదే వ్యక్తిని కూర్చోబెట్టి తగులబెట్టడం కోటేశ్వరరావు సరిగ్గా గమనించలేదు.
కోటేశ్వరరావుకి ఈ నరకలోకపు వింతలు, శిక్షలు చాలా విచిత్రంగా అనిపించసాగాయి. అలా నడుచుకుంటూ కోటేశ్వరరావు వేరొక గదిలోకి వెళ్లాడు. ఆ గది చాలా పెద్దగా ఉంది. కోటేశ్వరరావు ఆ గదిని నిశితంగా గమనించాడు. అది ఒక అనాథాశ్రమంలాగ ఉంది. అక్కడ ఒక ముసలి వ్యక్తి మంచం మీద చాలా దిగాలుగా కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే అత్యుత్సాహంతో, కోటేశ్వరరావు వెంటనే అక్కడ ఉన్న వృత్తంలో నిలబడ్డాడు. కొద్దిసేపటికి ఆ ముసలి వ్యక్తికి దగ్గు మొదలయ్యింది. కొంతసేపటికి దగ్గు ఇంకా పెరగసాగింది. ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆ ముసలి వ్యక్తి మంచం మీద కూలబడ్డాడు. తన ముందు లైన్లో నిలబడిన మరొక వ్యక్తి ఇతడే అని, ముసలితనపు ఛాయలు ఎక్కువగా ఉండడం వలన వెంటనే గుర్తుపట్టలేకపోయాను అని అనుకొన్నాడు కోటేశ్వరరావు. చిత్రగుప్తుడు ఇతని పాపాలు చదువుతూ, తల్లిని పనిమనిషిలా ఇంట్లో ఉంచి, తండ్రిని అనాథాశ్రమంలో చేర్పించాడని చెప్పడం గుర్తుకు వచ్చింది కోటేశ్వరరావుకి. (పిల్లలకు చిన్న నొప్పి వస్తే తల్లడిల్లిపోయి, తెల్లవార్లు సపర్యలు చేసి తల్లిదండ్రులు ఉన్న ఈ పుణ్యభూమిలో, ముసలివయసులో తమ తల్లిదండ్రులకు వచ్చిన ఇబ్బందులను, బాధ్యతగా భావించక, అనాథాశ్రమంలో ఉంచి, చేతులు దులుపుకొంటున్న పిల్లలను ఏమనాలో తెలియని పరిస్థితి. పిల్లలు లేని వారు అనాథలు అవుతారు గానీ, పిల్లలు ఉండగా, ఏ తల్లిదండ్రులు అయినా, అనాథలు ఎందుకు అవుతారు. అనాథలు ఉండే ‘అనాథ’ ఆశ్రమంలో ఎందుకు ఉంటారు?)
కోటేశ్వరరావుకి ఈ శిక్షలు చాలా విచిత్రంగా అనిపించసాగాయి. ఎవరు ఏ తప్పులు చేస్తే, వాళ్లని అదే తరహాలో శిక్షించడం వలన పాపులకు ఆ బాధ, ఇబ్బంది స్పష్టంగా తెలుస్తుందనే యమధర్మరాజు అలాంటి శిక్షలు వేశాడనే విషయం మాత్రం గ్రహించలేకపోయాడు కోటేశ్వరరావు.
ఉన్నట్టుండి ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా పెద్దగా గంటలు మ్రోగసాగాయి. వెంటనే అక్కడ ఉన్న భటులు, గదులలో తిరుగుతున్న పాపుల్ని, యమధర్మరాజు యొక్క రాజ దర్బారుకు తీసుకువెళ్లి లైన్లో నిలబెట్టారు. ఇప్పుడు కోటేశ్వరరావు లైన్లో మొదటివాడుగా నిలబడి ఉన్నాడు. కొంతసేపటికి యమధర్మరాజు, చిత్రగుప్తుడు వచ్చారు. విచారణ ప్రారంభం అయ్యిందన్న సంకేతానికి గుర్తుగా, చిత్రగుప్తుడు చిన్న గంటను కొట్టాడు.
కోటేశ్వరరావు పక్కనే ఉన్న భటుడు. తనని తీసుకెళ్లి వృత్తంలో నిలబెట్టాడు. పాపులకు శిక్షలు అమలవుతున్న గదిలో చూసిన వృత్తం కంటే ఈ వృత్తం కొంచెం పెద్దగా ఉంది. చేతికి ఉన్న 5 నక్షత్రాల తాడుని విప్పి చిత్రగుప్తునికి
ఇచ్చాడు. చిత్రగుప్తుడు, కోటేశ్వరరావు వంక అదోలా చూసి, యమధర్మరాజుతో మాట్లాడసాగాడు. మహారాజు, గత దశాబ్దకాలంలో 5 నక్షత్రాల పాపి రావడం ఇదే మొదటిసారి అనేసరికి, యమధర్మరాజు వెంటనే అవునా చిత్రగుప్తా... ఏమి ఈ మహాపాపి చేసిన పాపములు అని అడిగాడు. వృత్తంలో నిలబడి ఉన్న కోటేశ్వరరావుకి ఇప్పుడు యమధర్మరాజు మాటలు కూడా వినబడుతున్నాయి. అంతా ఈ వృత్తముయొక్క మహిమ అనుకొన్నాడు.
చిత్రగుప్తుడు పుస్తకం తీసి, కోటేశ్వరరావు యొక్క పాపాల పేజీని తీసి చదవడం మొదలుపెట్టాడు. మహారాజా... ఈ మహాపాపి యొక్క జీవితంలో ముప్ఫై సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి దశలోను చాలామంది స్నేహితులు, ఇతనికి ఆర్థికపరమైన విషయాలలో అండగా నిలబడుతూ వచ్చారు. ఈ మహాపాపి, ఒక దశలో డబ్బు బాగా సంపాదించేసరికి, ఇదివరకు తనకు సహాయం చేసినవాళ్లు, తిరిగి సహాయం చేయమని అడుగుతారని ముందే ఊహించి, కావాలనే చాలామంది స్నేహితులను దూరంగా పెట్టి, ఎవరైతే ఆర్థికంగా బాగా మంచి స్థాయిలో ఉన్నారో వాళ్లతోనే ఎక్కువ స్నేహంగా ఉంటూ, వాళ్లతో అనేక వ్యాపారాలు చేస్తూ, ఇంకా ఎక్కువగా సంపదలను కూడబెట్టాడు. ఈ మహాపాపి అత్యంత పిసినారి. కానీ పైకి మాత్రం పిసినారితనం కనిపించకుండా చాలా జాగ్రత్తపడేవాడు. ఎప్పుడు ఎవ్వరికీ కొద్దిగా కూడా సహాయపడక, ఒక నియంతలా బ్రతికి, ప్రతి పనిని స్వార్థపూరితంగా చేసేవాడు. నాలుక మీద తేనె, ఆలోచనల్లో విషం కలిగిన ఈ మహాపాపి, చాలామందిని నమ్మించి మోసం చేశాడు. ముఖ్యంగా ఈ మహాపాపి కట్టిన బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయ భవనం కూలి మూడు వందల నలభై రెండు మంది వ్యక్తులు చనిపోయారు. చాలామంది క్షతగాత్రులై, ఇప్పటికి కూడా వారి జీవితాలను దుర్భరంగా గడుపుతున్నారు అని చెప్పి, పుస్తకాన్ని మూసివేశాడు చిత్రగుప్తుడు.
కోటేశ్వరరావుకి, చిత్రగుప్తుని మాటలకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోటేశ్వరరావు చాలా పెద్ద స్వరంతో నేను ఏవిధమైన తప్పులు చేయలేదు, ఎవరినీ మోసం చేసి డబ్బు కూడబెట్టలేదు. అని ఇంకా ఏదో అనబోయాడు. వెంటనే చిత్రగుప్తుడు మూర్ఖుడా... ఇక్కడ ఖచ్చితమైన పాపాలను మాత్రమే వెలువరిస్తారు. నేను ఏవిధమైన తప్పులు చేయలేదు అని అన్నంత మాత్రాన, నువ్వు చేసిన తప్పులన్నీ, ఒప్పులైపోవు అని కాస్త తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
కొద్ది సమయం తరువాత యమధర్మరాజు, కోటేశ్వరరావు వంక చూస్తూ ఇలా అన్నాడు. నువ్వు ఎక్కువ ధనం సంపాదించడం వల్ల సుఖంగా ఉండవచ్చని అనుకొని ఉంటావు గానీ, అధికమైన డబ్బు ఎప్పటికైనా దుఃఖం కలిగించి, నీకు సంబంధించిన వారితో విరోధాన్ని తెచ్చిపెడుతుందని ఎందుకు గ్రహించలేకపోయావు. సంతోషం అంటే డబ్బుని కూడబెట్టడమే కాదు, మనతో కలిసి ఉన్న స్నేహితులకు, బంధువులకు తగినంత గౌరవం ఇస్తూ, వాళ్లని కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచడం అనే చిన్న విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయావు అని అడిగాడు.
యమధర్మరాజు, నేను ఏవిధమైన తప్పు చేయలేదు. ఏవిధమైన పాపం చేయలేదు. నా తెలివితేటలతో కష్టపడి పనిచేశాను. సంపాదించాను. నా జీవిత ప్రయాణంలో నాతో కొంత మంది చివరి వరకు ఉన్నారు. కొంతమంది మధ్యలోనే ఆగిపోయారు. అది ఎంత మాత్రం నా తప్పు కాదు అని అనగలిగాడే తప్ప, తన తప్పులను ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా ఇతను తన తప్పులను తెలుసుకోలేని, ఒప్పుకోలేని వ్యక్తిగా మిగిలిపోయాడేమిటి అని అనుకొని, యమధర్మరాజు చిన్నగా నవ్వి, కోటేశ్వరరావు వంక చూశాడు. కోటేశ్వరరావు ముఖంలో ఏవిధమైన భావాలు కనిపించలేదు.
సమయం తెల్లవారుజామున సుమారు 5 గంటలు కావస్తుంది. కోటేశ్వరరావు పడుకొన్న రూమ్‌లోంచి ఏవో మాటలు వినిపించి, పక్క రూమ్‌లో పడుకొన్న రాజారావు లేచి, కోటేశ్వరరావు దగ్గరకు వెళ్లాడు. యమధర్మరాజు... నేను ఏవిధమైన తప్పు చేయలేదు అంటూ పదేపదే గట్టిగా అరవసాగాడు కోటేశ్వరరావు. రాజారావుకి కొంతసేపు ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా ఆలోచించగా అనిపించింది, కోటేశ్వరరావు నిద్రలో ఏదో కల కంటున్నాడని.
కోటేశ్వరరావుకు డెబ్భై రెండు సంవత్సరాలు. ఇతని ప్రవర్తన, మనస్తత్వం ఎవరికీ నచ్చక, అయినవాళ్లు అందరూ దూరంగా బ్రతుకుతున్నారు. పెరాల్సిస్ వచ్చి గత రెండు సంవత్సరాలుగా మంచానికి పరిమితమయ్యి, జీవచ్ఛవంలాగా బ్రతుకుతున్నాడు. గత పది సంవత్సరాలుగా ఆ ఇంటికి ఒక స్నేహితుడు గానీ, ఒక బంధువుగానీ ఎవ్వరూ రాలేదు. చనిపోయే చివరి రోజుల్లో కూడా, నా అనే వారు నలుగురు లేని జీవితం కూడా ఒక జీవితమేనా? ఒక వ్యక్తి నీచ మనస్తత్వానికి ఇంతకంటే కొలమానం ఏమి ఉంటుంది. కోటేశ్వరరావుకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చాలా సంవత్సరాలుగా రాజారావే చూస్తుంటాడు. ఒంటరివాడైన రాజారావు తప్పనిసరి పరిస్థితుల్లో, చాలా కాలంగా కోటేశ్వరరావు దగ్గర పనిచేస్తున్నాడు. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. లక్షలాది రూపాయల బ్యాంకు బాలెన్స్ ఉంది. అయినా, ఇప్పటికి కూడా సమయానికి రాజారావుకి జీతం ఇవ్వడు.
కొద్ది సమయం తరువాత కోటేశ్వరరావు అరవడం మానేశాడు. కొంతసేపు కోటేశ్వరరావు మంచం పక్కనే నిలబడి కోటేశ్వరరావునే చూడసాగాడు రాజారావు. అంతా బాగానే ఉందని అనుకొని కోటేశ్వరరావు ఉన్న గది లోంచి రాజారావు తన గదిలోనికి వెళ్లి మంచం పక్కనే ఉన్న వాటర్ బాటిల్‌లోని వాటర్ తాగి, మంచం మీద కూర్చున్నాడు. అప్పుడు వినిపించింది రాజారావుకి. ఒక హృదయవిదారకమైన శబ్దం కోటేశ్వరరావు గది నుండి, రాజారావు వెంటనే పరిగెత్తుకుంటూ కోటేశ్వరరావు గదిలోకి వెళ్లాడు. రాజారావు ఆ గదిలోకి అడుగుపెడుతున్న సమయానికి, పెద్ద శబ్దంతో, కోటేశ్వరరావు మంచం మీద నుండి కింద పడ్డాడు. రాజారావు ఒక్క ఉదుటున కోటేశ్వరరావు దగ్గరకు వెళ్లాడు. కోటేశ్వరరావు గుండె మీద చేయి వేసి చూశాడు. గుండె కొట్టుకోవడం లేదు. కొంతసేపటి తరువాత డాక్టర్ వచ్చి కోటేశ్వరరావుచనిపోయినట్లుగా నిర్ధారించాడు.
ఎన్నో తప్పులు చేసి, అక్రమ మార్గంలో ఎన్నో ఆస్తులను పోగేసి, జీవితంలోని ప్రతి దశలోనూ చెడ్డవానిగా ముద్రవేసుకొని, చనిపోయే సమయంలో కూడా నా అనేవారు ఎవరూ కూడా దగ్గర లేకుండా చేసుకొని, కోటేశ్వరరావు ‘‘జీవితంలో ఏమేమి విజయాలు’’ సాధించాడో ఎవరికీ అర్థం కాదు.
ఈ రోజుల్లో ఎవరు ఏ తప్పులు చేసినా, ఎదుటివారు వాటిని ఖండించడం లేదు. ముఖ్యంగా ఆ తప్పు చేసిన వ్యక్తి అది తప్పని ఒప్పుకోడు. ఆ తప్పుని ఖండించని వ్యక్తి. దానిని పెద్దగా పట్టించుకోడు. ఆ వ్యక్తుల రిలేషన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడున్న చాలా బంధాలు, స్నేహాలు ఫేక్‌గానే ఉంటున్నాయి.
‘‘ఎన్ని సంపదలు కూడబెట్టినా... మంచితనాన్ని మచ్చిక చేసుకోలేని ఏ మనిషయినా, జీవితంలో అపజయాన్ని పొందినట్టే.’’

-గొల్లవిల్లి సూర్యనారాయణ.. 7799459933