ఆమె అస్తిత్వం!
Published Sunday, 15 March 2020నవ మాసాలగండం నుంచి
గట్టెక్కిందో లేదో
నిమిషం నిమిషం
మృత్యుద్వారం ముందు
ఎదురుచూపులు
ఆడపిల్లగా పుట్టడమే
శాపమైన దేశంలో దినామూ
వొక సంఘర్షణే
ఎదిగే సీతాకోకచిలుకని
కబళించడానికి ఎన్ని చేతులో
లాఘవంగా తప్పించుకోని
ఎదిగిన క్రమం కష్టమే
యవ్వనాన్ని దాచలేని
శరీరంతో రాక్షస ప్రేమల నుంచి
రక్షించుకోవడం
కత్తిమీద సామే కదూ
చదువుల నుంచి క్రీడలు
వ్యవసాయం నుంచి అంతరిక్షం దాకా
బతుకు కోసం పోరాటం
తన బతుకుకి విలువ ఇవ్వని
నిర్దయ ప్రపంచంతో
అస్తిత్వం కోసం
తరతరాలుగా కొట్లాడుతూనే ఉంది
పితృస్వామ్య పంజరం
విడుదల కోసం
వొకటే యుద్దం
తానుగా కోరుకొని
యుద్దమిది
లింగబేధాలలో ఓడిపోతూ
తనని తాను గెలవడానికి
ప్రతీ క్షణం తపన
మూఢనమ్మకాల చీకటిదారులని
చీల్చుతూ తానొక వెలుగు కాగడా
ఆడవాళ్లు ఏమి చేయగలరన్న
అపవాదుకి కాలం చెల్లింది
ఇప్పుడు ఆమె
తన అస్తిత్వాన్ని సగర్వంగా లోకం
ముందు నిలబెట్టుకుంది
ఇక అంతా మహిళావరణమే!
*