S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆనందం

కోళ్ళఫారమ్‌లో కోళ్లని పెంచినట్టు
మనం ఇక్కడ పిల్లల్ని పెంచుతాం
మన ఇరుపక్కల ఉన్న కోళ్లతోని
మన ముందున్న కోళ్లతోని
మన కిందా పైనా వున్న కోళ్లతోని
మనకి సంబంధాలుండవు
వాటితో మాట్లాడుకోవడం కానీ
వాటిని ముక్కులతో పొడుచుకోవడం కానీ
అసలే వుండదు.
* * *
నెలవంకల్ని చూపించడానికి
గోరుముద్దలు తినిపించడానికి
మన పిల్లలు బాల్ ఆడుకోవడానికి
సైకిల్ మీద తిరగడానికి
మనకి నేల ఎక్కడా కన్పించదు.
* * *
నగర జీవితంలో పిల్లల పెంపకం గురించి ఓ తెలుగు కవి ఆవేదన.
ఈ రోజుల్లో పిల్లలు చిన్నచిన్న సంతోషాలకు చిన్నచిన్న ఆనందాలకు దూరమవుతున్నారు.
నా చిన్నతనంలో స్మార్ట్ఫోన్ లేదు. కంప్యూటర్ గురించి విననే లేదు. ప్లాస్మా టీవీ సంగతి దేవుడెరుగు టీవీ గురించే తెలియదు. కానీ జీవితం ఎప్పుడూ విసుగనిపించలేదు. ఎలా గడిచిందో తెలియకుండా కాలం గడిచిపొయ్యేది.
ఒక్కరోజు సెలవు దొరికిందంటే చాలు. కాళ్లు నొప్పి పుట్టేంత వరకు సైకిల్ తొక్కేవాణ్ని. వాగు దగ్గరకెళ్లి స్నేహితులతో కలిసి ఈతలు కొట్టేవాళ్లం.
ఆటల సంగతి చెప్పాల్సిన పనిలేదు. గోటీలు, అష్టాచెమ్మా, కబడ్డీ, మారంఫీట్, పిల్ల గీతలు, గిల్లీ దండ ఎన్నో ఆటలు. ఎందరో స్నేహితులు. ఎన్నో కథలు. పెరడులో బీర తీగతో బీడీలు. ఊరవతల చెట్ల మీద కోతికొమ్మచ్చి ఆటలు. ఉయ్యాల జంపాల. రేణిపండ్లు, పెసర కాయ, కందికాయ తెంపుకొని రావడం. భీమన్న గుడిలో దొంగతనంగా జామకాయలు తెంపుకొని రావడం. ఎన్నని చెప్పేది. అవన్నీ గుర్తుకొస్తే ఇప్పటికీ ఒళ్లు పులకరించిపోతుంది. ఆ ధైర్యం ఆ తెగింపు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఆ చిన్నచిన్న సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటే ఎంతో ఆనందానికి గురవుతుంటాను. నవ్వొస్తుంది. కన్నీళ్లొస్తాయి. ఎప్పుడూ విసుగురాని రోజులు. ఎప్పుడూ ఏదో పని వుండేది. కొత్తకొత్త ఆటలు పుట్టించేవాళ్లం. మా అందరిలో సృజనాత్మకత ప్రవహించేది.
ఈ రోజు పిల్లల్ని కోళ్లఫారమ్‌లోని కోడిపిల్లల్లా పెంచుతున్నాం. ఓ చిన్న దెబ్బ తాకకుండా వాళ్లని చూస్తున్నాం. మట్టివాసన తెలియకుండా, భూమి తెలియకుండా పెరుగుతున్నారు. చంద్రుడు తెలియదు. సూర్యుడు తెలియదు. ఉడుత తెలియదు. కోడి తెలియదు. వరి తెలియదు. బావి తెలియదు. బొక్కెన తెలియదు. ఎంత ప్రపంచాన్ని ఇప్పటి పిల్లలు కోల్పోతున్నారు.
ఈ సాంకేతిక యుగంలో వాళ్లు అనుభవించి ఆనందించాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్రేమపూర్వక కౌగిలింత వాళ్ల హృదయాన్ని వెచ్చపరుస్తుంది. భూమీద ఆడే ఓ చిన్న ఆట వాళ్లని ఆనందింపజేస్తుంది. స్నేహితుల్తో చేయి పట్టుకొని నడవడం, భుజం మీద చేయి వేసుకొని నడవడం వాళ్ల మనస్సుని ఉత్సాహపరుస్తుంది.
ఇవి చూట్టానికి చాలా చిన్న విషయాలుగా కన్పిస్తాయి. కానీ ఈ చిన్న విషయాలే గొప్ప ఆనందాలని ఇస్తాయి. ఆనందమే ఆరోగ్యాన్నిస్తుంది. జీవితానికి కావల్సింది ఏమిటీ ఆనందమా? డబ్బా..? -ఆనందమే!!!

====================
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు,
రచనలు, కార్టూన్లు, ఫొటోలు
bhoomisunday@deccanmail.comకు
కూడా పంపించవచ్చు.

=======================

-జింబో 94404 83001