S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చేబదులు

‘మా నాయన్ని దహనం చెయ్యాలి, వస్తావా?’
‘పోయారా? అయ్యో! ఐ యామ్ వెరీ సారీ, నీకెంత కష్టమొచ్చింది!’
‘అంత సానుభూతి చూపించనక్కర లేదు, పోయి నన్ను బతికించాడు. ఉన్న డబ్బంతా ఆయన రోగానికే ఖర్చయింది. ఆపైన ఆంక్షలు! నేనెక్కడికి వెళ్లాలన్నా ఆ ముసలాడికి చెప్పి చావాలి’
అతనికి తెల్సిన విషయమే అది. ‘సరే వస్తున్నాను’ అని ఫోన్ ఆఫ్ చేసి, బట్టలేసుకుని బయలుదేరాడు.
‘ఇప్పుడే కదా ఆఫీసు నుండి వచ్చావు. ఎక్కడికీ మళ్లా బయలుదేరావు?’ అనడిగింది శేషగిరి తల్లి తులసమ్మ.
అతనికి చెప్పటం ఇష్టంలేదు. రేవతి అంటే తల్లికి ఇష్టం లేదు. పైగా ఇప్పుడు ఆమె తండ్రి దహనానికి వెళ్తున్నానంటే తన తల్లి అభ్యంతరం చెప్పొచ్చు. కానీ, తనకు రేవతి వల్ల కలిగిన అనుభవాల కారణంగా తల్లి నుండీ ఏదీ దాచాలనుకోలేదు అతను.
‘రేవతి తండ్రి పోయాట్ట! సాయానికి రమ్మని పిల్చింది’
‘అయ్యో, పాపం! వెళ్లిరా!’
భర్త పోయాక కొడుకును చూసుకుని బతుకుతున్నది తులసమ్మ. తల్లిదండ్రులకు లేకలేక కలిగిన ఏకైక సంతానం శేషగిరి. అతడి తండ్రి వెంకటేశ్వర్రావు ఒక ఐరన్ ఫౌండ్రీలో పనిచేశాడు. శ్రమజీవి. యాభై యేండ్ల వయసులో హృద్రోగంతో పోయాడు అకస్మాత్తుగా. అప్పటికల్లా శేషగిరి ఇంజనీరింగ్ చదువు పూర్తవ వచ్చింది. కొడుకు తల్లిని చూసుకుంటాడన్న విశ్వాసంతోనే పోయాడు ఆయన. కొడుకు మీద ఆయనకు గట్టి నమ్మకముంది. తల్లికి ఆ నమ్మకం లేదు.
రేవతితో సంబంధం పెట్టుకున్న కొత్తల్లో, కొడుకు ఒకరోజు ఉల్లాసంగా, మరో రోజు విషాదంగా కొంప ముంచుకు పోయినట్లు ఉండటం, డబ్బుకు గిజాటు పడటం ఆమె గమనిస్తూనే ఉంది. మొదట్లో ఎవితెనో కొడుకు ఉంచుకున్నాడని అనుమానపడింది ఆమె.
ఒకరోజు ‘తప్పుడు పనులు చేసినవాడెవడూ బాగుపడడు’ ఆఫీసు నుండి ఇంటికొచ్చిన కొడుక్కు, భోజనం పెడ్తూ అంది తులసమ్మ, ఉపోద్ఘాతం లేకుండా.
‘ఎవరి సంగతి నువ్వు చెప్పేది?’ అనడిగాడు అతను.
‘ఎవరి సంగతో నాకెందుకు? నీ సంగతే?’ అంది తల్లి.
‘నేనేం తప్పుడు పన్లు చేశాను?’
‘నీ మనస్సాక్షి నడుగు. పరసతిని ఆశించిన రావణాసురుడు నాశనమయ్యాడు’
‘నేనెవరి పెళ్లాం వెంటా పడటం లేదు’
‘మరి ముండల దగ్గరకెళ్తున్నావా?’
‘్ఛఛీ; ఏం మాట్లాడతావమ్మా, నువ్వు’ అని కంచంలో చెయ్యి కడుక్కుని లేచి వెళ్లిపోయాడు శేషగిరి.
క్రితంరోజు ఏకాదశి. తల్లికి ఉపవాసం. ఆ రోజు ద్వాదశి పారాయణం. పొద్దునే్న లేచి, కొడుకు ఆఫీసుకు పోతాడని హడావుడి పడ్తూ వంట చేస్తే, శేషగిరి ‘నాకు టైము లేదం’టూ ఆఫీసుకు బయలుదేరాడు.
‘నిన్న ఉపవాసం కదురా. అందుకనే నీరసంగా ఉండి పొద్దునే్న లేవలేక పోయాను. అయినా పెద్ద ఆలస్యమేమయింది కనుకా?’ అంది తులసమ్మ.
‘ఈ ముసలితనంలో ఈ ఉపవాసాలు, పూజలు పునస్కారాలు అంత ఇదిగా చెయ్యాలా? మన శరీరం చూసుకున్నాకే ఏదయినా?’
‘అవున్నిజమే! నిన్నడిగితే నిజం చెప్పవు. కన్నందుకు నీ పాపశమనం కోసం కూడ ఉపవాసాలు చెయ్యాలి కదా? నా కొడుక్కు వండకుండానే భోజనం కావాలి. పెళ్లి కాకుండానే ఆడది కావాలి!’
ఇంక అతనికి చెప్పక తప్పలేదు. ‘నేనేం తప్పుడు పనులు చెయ్యటం లేదు. రేవతి అని మా ఆఫీసులోనే పని చేస్తున్నది. ఆమెను పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను’
‘మరయితే ఆ అమ్మాయిని ఓమాటు మనింటికి తీసుకురా’
‘అలాగే’ అని చెప్పి అతను హడావిడిగా వెళ్లిపోయాడు.
శేషగిరి, రేవతులు ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తారు. పరిచయమైన కొన్నాళ్లకే వారికి ఒకరంటే ఒకరికి ష్టం కలిగింది.
తల్లి అడిగినట్లు రేవతిని తీసుకువచ్చాడు కానీ, తులసమ్మకు ఆమెలో రెండు లక్షణాలు నచ్చలేదు. ఒకటి తన కులం కాకపోవటం, మరొకటి, తాము కొన్నాళ్లయ్యాక పెళ్లి చేసుకుంటామని చెప్పటం.
‘అయితే, మా అబ్బాయికి వేరే సంబంధం చూస్తాను’ అంది తులసమ్మ తన కొడుకేదో తన చేతిలో ఉన్నట్లు.
‘మీ ఇష్టం!’ అని చెప్పి ఆమె మరోమాట మాట్లాడకుండా, శేషగిరికి వెళ్లి వస్తానని కూడా చెప్పకుండా వెళ్లిపోయింది.
అది జరిగిన కొన్నాళ్లకు, కొడుకు రెండు నెల్లకూ, మూడు నెల్లకూ బెంగుళూరు, మంగుళూరు క్యాంపు అంటూ వెళ్లటం చూసి, ‘ఆ పిల్ల కూడా నీతో క్యాంపునకు వస్తున్నదా?’ అనడిగింది తులసమ్మ.
‘్ఛ, ఫో, నీవన్నీ అనుమానాలు!’ అని అప్పుడు అతను కొట్టిపారేశాడు.
సుమారుగా రేవతి తండ్రితోనూ వ్యవహారం అలాగే నడిచింది. రేవతి తండ్రి ఒక ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. కూతురుకు పదేళ్ల వయసులో భార్య కాన్పులో పోయింది. పుట్టిన బిడ్డా బతకలేదు. ఆయన మళ్లా పెళ్లి చేసుకోలేదు. పిల్లకు విద్యాబుద్ధులు చెప్పించి, పైకి తీసుకురావటమే ధ్యేయంగా బతికాడు. తనకున్నది ఒకతే కూతురు కనుక, ఆయన ఆమె మీద ఆంక్షలు పెట్టి ఉండవచ్చు. గాంధీగారు అన్నట్లు ఆడపిల్లల నిర్భయంగా అర్ధరాత్రిపూట సంచరించ గలిగేంతగా మన సమాజం ఎదగలేదు. అయితే, ఆమెకు ఆ ఆంక్షలు నిషేధాలనిపించసాగాయి. కొంతకాలమయాక ఎలా వాటిని అధిగమించాలో నేర్చుకుంది; తండ్రికి నచ్చే సమాధానాలు ఇవ్వసాగింది. కానీ, తన ఇష్టాన్ని మాత్రం మార్చుకోలేదు. ఒకసారి తండ్రి కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే, ‘నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నువ్వా ప్రయత్నాలు చెయ్యకు’ అని గట్టిగా చెప్పేసింది తండ్రికి రేవతి.
‘ఏం ఎవర్నయినా ప్రేమించావా? పోనీ అతనే్న పెళ్లి చేసుకో. ఈ కేన్సర్ నన్ను ఎప్పుడు ఎత్తుకు వెళ్తుందో తెలియదు. అప్పటికల్లా నీకు ఒక తోడూ నీడా దొరికితే నేను ప్రశాంతంగా పోతాను’
ఆయనకు ఇంటెస్టయినల్ కేన్సర్. ఆపరేషన్ చేసి కొంతభాగం తీసేశారు. కీమోథెరపీ చేశారు. అప్పటికది తగ్గినట్లు కన్పించినా ఎప్పుడయినా ముంచుకు రావచ్చుననే భయం పురుషోత్తమరావుది.
తండ్రి బాధ పడలేక ఒకరోజు శేషగిరిని తీసుకువచ్చి, ‘ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను.
పెళ్లి చేసుకుందామంటున్నాడు. నేనే కొంతకాలమాగుదామని చెప్పాను’ అంది.
ఆయన శేషగిరి వివరాలన్నీ తెల్సుకుని సంతృప్తిపడ్డాడు. శేషగిరిది తమ కులం కాదు. అయినా, తనకు అంత పెద్దగా ఇష్టం లేకపోయినా, ఆయన రాజీపడిపోయాడు. తను కాదన్నా కూతురు అతన్ని పెళ్లి చేసుకుంటుంది. కూతురు విషయం ఆయనకు బాగా తెల్సు. అందుకే గౌరవప్రదంగా వాళ్ల వివాహం తనే జరిపిద్దామని నిశ్చయించుకున్నాడు కానీ, కూతురు మరి కొంతకాలం పెళ్లి వాయిదా వెయ్యాలనటం పురుషోత్తమరావుకేం నచ్చలేదు.
‘ఇద్దరికీ ఇష్టమయినప్పుడు ఇంక పెళ్లి పోస్ట్‌పోన్ చేయటంలో అర్థంలేదు. మీ అమ్మగారితో నేను వెళ్లి మాట్లాడతాను’ అన్నాడు.
‘నేనిప్పుడు చేసుకోనని చెప్తుంటే నీకర్థం కాదా?’ అని కోపంగా తండ్రిని విసుక్కుంది రేవతి.
‘మరెప్పుడు?’
‘నా ఇష్టమొచ్చినప్పుడు’
‘నీకిష్టమయినంత కాలం అతను వేచి ఉండటాని కిష్టపడకపోతే?’
‘అతనికిష్టమైన అమ్మాయిని చేసుకుంటాడు. దేశమేం గొడ్డుపోలేదు’
ఇంక పురుషోత్తమరావుకు నోట మాట పడిపోయింది. శేషగిరి ఎదురుగుండా ఇంకా ఆ చర్చ కొనసాగించ ఇష్టపడలేదు.
తండ్రికి అతన్ని చూపించటమనే కార్యక్రమం అయిపోయింది కనుక, ఇంట్లో నుండి బయటపడ్డారు ఇద్దరూ. శేషగిరికి కూడా రేవతి మాటలు అర్థం కాలేదు. ఆమెలో అందం కంటే ఆకర్షణ ఎక్కువ. అతని వ్వనపు కళ్ల ఆ సౌందర్య రాశిని ఎప్పుడు తన సొంతం చేసుకుందామని తహతహలాడేవి. ఆ విషయమే కదుపుదామన్న ఉద్దేశంతో అతడు ‘ఎక్కడైనా ఒక కప్పు కాఫీ తాగి వెళ్దాం’ అన్నాడు. ఆమె కాదనకపోవటంతో ఇద్దరూ ఇంటర్ కాంటినెంటల్‌కు వెళ్లారు.
కాఫీ ఆర్డరు చేశాక ‘మీ ఫాదర్‌తో అట్లా మాట్లాడావేమిటి? ఆయనన్న దానిలో తప్పేముంది? మా అమ్మ కూడ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నది. ఉద్యోగాలు చేస్తున్నాం. ఇంకా పెళ్లి వాయిదా వెయ్యాల్సిన అవసరం ఉందా?’ అన్నాడు శేషగిరి.
‘నాకిప్పుడే బంధనాల్లో ఇరుక్కోవటం ఇష్టంలేదు. ఇప్పుడు ప్రియుడిగా ఉన్నవాడివి నా ప్రతి కోరికను మన్నిస్తావు. రేపు పెళ్లామయ్యాక, నేను నీకు దాసిలా, పనికిమాలిన ఆడదానిలా కన్పిస్తాను. అందుకే ఇప్పుడే పెళ్లి వద్దు’ అంది రేవతి.
‘మరెప్పుడు? ఎప్పుడు నువ్వు నా చేతుల్లో వచ్చి వాల్తావా అని ఎదురుచూస్తున్నాను’
‘నేను నీక్కావాలి. అంతేకదా! అందుకు, ఇప్పుడే నా స్వాతంత్య్రాన్ని త్యజించాల్సిన పనిలేదు’
‘ఏమిటి నువ్వనేది? పెళ్లి కాకుండానే సెక్సా?’
‘తప్పేం? అప్పుడు మనం ఒకరికొకరం మరింత బాగా అర్థమవుతాం’
ఒక్క క్షణం అతడు తడబడ్డా, ఆమె ఎలాంటి బంధనమూ లేకుండా తన చేతుల్లో వాల్తానని అనటం అతనికెంతో సంతోషం కల్గించింది. ‘ఎప్పుడు?’ అన్నాడతను ఉత్సాహంగా.
‘సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌కు మన స్ట్ఫాను ఏ బెంగుళూరో, ముంబయో డిప్యూట్ చేస్తుంటారు కదా? ఈసారి ఆ అవకాశం మనకొచ్చేట్టు చూడు. వారం రోజులయినా అక్కడ హాయిగా గడిపేసి రావచ్చు. ఈ ముసలాడి గోల భరించలేకుండా ఉన్నాను’ అంది రేవతి.
శేషగిరికెంతో సంతోషమేసింది. ఒక్కసారిగా లేచి, వంగి, చేతుల్లో ఆమె ముఖం తీసుకుంటూ, ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.
‘్ఛఛీ! ఈ కోరికల ప్రదర్శన అవసరమా?’ అంది, అతని చేతుల్ని తోసేస్తూ.
నెలకూ, మూడు నెల్లకూ వారికలాంటి అవకాశం లభిస్తూనే ఉంది. కలల్లో కాకుండా వాస్తవ జీవితంలో బతుకుతున్నాడు శేషగిరి. ఆమె చక్కటి సుఖం అతనికిచ్చేది. ఆమె అంటే పిచ్చి వ్యామోహంలో పడిపోయాడతను. ఇలా ఏ నెలకో, రెండు నెల్లకో ఆమె ఇచ్చే సుఖంతో అతడు తృప్తి పడలేదు. అతడికి ఆమె రోజూ కావాలి అనే ఉధృతమైన ఇచ్ఛ కలిగింది.
ఆమె కాదనలేదు. ‘అలాగే, ఉయ్ కెన్ లివ్ టు గెదర్’ అంది.
‘మరెప్పుడు పెళ్లి చేసుకుందాం?’
‘నీక్కావాల్సింది పెళ్లా, నేనా?’
‘రెండూ’
‘పెళ్లి కానప్పుడే ఇష్టంలేదు. నేను నీకు ఎప్పుడు కావాలన్నా, అభ్యంతరం చెప్పను’
‘సహజీవనమంటే ఎలా కుదుర్తుంది? మా అమ్మ ఊరుకుంటుందా, మీ నాయన ఊరుకుంటాడా?’
‘నిజమే, మరి! ఈ ముసలాళ్లు చచ్చిందాకా మనం ఆగలేం కదా?’
‘అందుకే పెళ్లి అంటున్నాను’
‘అది తప్ప నువ్వింకేమయినా చెప్పు’
‘నువ్వింకో ప్రమాదం గురించి ఆలోచించటం లేదు. మన ఈ రహస్య సంగమం వల్ల నీకు కడుపు వస్తే...?’
అందుకు రేవతి నవ్వింది. ‘నేనంత తెలివితక్కువ దానిననుకోకు. నేను ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. ఆ విషయంలో నువ్వు భయపడాల్సిందేం లేదు’
‘కంపెనీ మనె్నప్పుడూ ముంబయికో, బెంగుళూరుకో డెప్యూట్ చేయటం కుదరదు. మనం వేరే ఊళ్లో ఉద్యోగం చూసుకోవటం కంటే గత్యంతరం లేదు’ అన్నాడు శేషగిరి.
‘నీది మట్టిబుర్ర! అప్పుడు మనతో మీ అమ్మా, మా నాయనా వస్తామంటే?’
కాస్తసేపు బుర్ర గోక్కుని ‘అందుకే పెళ్లి చేసుకుందామంటున్నా’ అన్నాడు శేషగిరి.
‘ప్రస్తుతానికి ఇలా సాగనీ. తరువాత చూసుకుందాం’
ఈ లోపల పురుషోత్తమరావు రోగం తిరగబెట్టింది. పదిహేను రోజులు ఆయన్ని ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. తండ్రి దాచుకున్న డబ్బంతా ఎప్పుడో ఖర్చయింది. పది లక్షలు దోచేసి, ‘ఉయ్ హావ్ ప్రొలాంగ్డ్ హిజ్ లైఫ్’ అంటూ డాక్టర్లు ఆయన్ని డిశ్చార్జి చేశారు. రేవతి చేతిలో పైస లేకుండా పోయింది. శేషగిరి కూడా నాలుగు లక్షల సాయం చేశాడు.
ఇంతలో శేషగిరి తల్లికి కూడా ఆరోగ్యం చెడిపోయింది. డాక్టరుకు చూపిస్తే, ఆమె ఆర్టరీలో బ్లాకులు ఉన్నాయనీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాలనీ అన్నారు. రెండు లక్షలు అవసరమయ్యాయి. అతడికీ రేవతిని అడగడం కష్టమయింది. కానీ గత్యంతరంలేక, తల్లి విషయం చెప్పి, కనీసం తనకు ఇవ్వాల్సిన డబ్బులో ఓ రెండు లక్షలు సాయం చెయ్యమని అడిగాడు.
‘నా దగ్గర ఇప్పుడు లేవు. ఉన్నప్పుడు ఇస్తాను’ అంది ఆమె.
‘మరెలా?’ అన్నాడతడు.
‘ఎలాగో సర్దుకో. తరువాత చూద్దాం’
అతడు ఇల్లు బ్యాంక్‌లో కుదువబెట్టి లోను తీసుకున్నాడు. తల్లికి వైద్యం చేయించాడు. సమయానికి డబ్బు లేకపోయింది. అందుకు కారణం రేవతికి డబ్బు అప్పివ్వటమే అన్న ఆలోచన అతనికి రాలేదు. అతను తీసుకున్న డబ్బు అప్పని అన్నప్పటి నుండి ఆమె అతన్ని పరిహరించ నారంభించింది. ఆఫీసులో కలిసినా మాట్లాడటంలేదు. ఇప్పుడు బయటి అసైన్‌మెంట్లకు రాజారావుతో కల్సి పోతున్నది. ఒకసారి శేషగిరి మిత్రుడు పరమానందం అతన్ని అడిగాడు, ‘ఏం, మీ ఇద్దరికీ పేచీ వచ్చిందా?’ అని.
‘ఎవరి సంగతీ నువ్వు చెప్పేది?’
‘ఇంకెవరి సంగతి, నీ ముద్దుల ప్రేయసి రేవతి గురించే. మొన్న బెంగుళూరు వెళ్లినప్పుడు - ఆ టీంలో నేను కూడా ఉన్నానులే - రాజారావు, ఆమె హోటల్‌లో ఒకే గదిలో ఉండటం నేను చూశాను. బహుశః మీ ఇద్దరికీ పడటం లేదేమోనని నేననుకున్నా’
ఆ రోజు నుండి శేషగిరి మనస్సు చెడిపోయింది. అంతకు ముందు అనుభవించిన మానసిక ప్రశాంతత కరువయింది. ఆ తర్వాత ఆమె పొందు కోసమూ మనస్సు తహతహలాడింది. ఉండబట్టలేక ఒకరోజు రాత్రి అతను ఆమెకు ఫోన్ చేశాడు. ‘నువ్వు లేక నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. ఒకసారి ఎక్కడికయినా వెళ్లి తిరిగి వద్దాం. ఏమంటావు?’ అని.
‘నాకు కుదరదు’ అని ఫోను పెట్టేసింది ఆమె. ఆ తర్వాత మళ్లా మళ్లా ఫోను చేసినా ఆమె కాల్‌ను రిసీవ్ చేసుకోలేదు. ఆఫీసులో ఆమెను ఒంటరిగా కలిసే అవకాశమే ఇవ్వటంలేదు. ఒకరోజు రాజారావుతో నవ్వుతూ మాట్లాడుతూంటే ‘ఒకసారి ఇట్లా వస్తావా? నీతో పర్సనల్‌గా మాట్లాడాలి’ అన్నాడతను.
‘నాకు నీతో పర్సనల్‌గా మాట్లాడాల్సిందేం లేదు’ అని ముఖం తిప్పుకుంది ఆమె.
‘కాదు. ఒక్కసారి...’
‘ఆమె చెప్తోందిగా, మాట్లాడాల్సింది లేదని! మర్యాదగా వెళ్లిపో, బాగుంటుంది’ అన్నాడు రాజారావు
ఇంక ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసి ప్రయోజనమేం లేదని అతనికి తెలిసిపోయింది. రభస చేసి అందరి నోళ్లలో నానటమూ, తెలియని వాళ్లకు కూడా తెలియజెప్పి తన ఉద్యోగానికి ఎసరు తెచ్చుకోవటమూ అని అతనికి అవగతమయింది.
అలాగని అతని మనస్సు సమాధానపడలేదు. రాత్రి నిద్రపట్టక, పక్క మీద మసలుతుంటే, నుదుటిన చల్లటి చెయ్యి పడ్డట్టయింది. అతను ఉలిక్కిపడి కళ్లు తెరిచేటప్పటికి, తల్లి అతని వంక చూస్తోంది, ‘ఏం నిద్ర పట్టటం లేదా నాన్నా? మనసు బాగా లేదా? రేవతి ఎలా ఉంది? మీ ఆఫీసులోనే పని చేస్తుందా?’ అనడిగింది.
‘అవును. మా ఆఫీసులోనే పని చేస్తున్నది’ అన్నాడు, ఏదో చెప్పక తప్పదన్నట్లు.
‘మేం ముసలివాళ్లమే. కానీ నా మాట విను. మొన్న ఆ రేవతి తండ్రి వచ్చి వాపోయాడు. తన కూతురును నీకు చేసుకోమని ప్రార్థించాడు. నేనడిగాను. ‘మీ కూతురు మీ మాట వింటుందా’ అని. ‘వినేట్టు చేస్తాను’ అన్నాడు. ‘అంత బలవంతాన పెళ్లి చేయాల్సిన పనిలేదు. ఇష్టం లేని పెళ్లి చేయటమెందుకూ? మనం చెయ్యాలనుకున్నా వాళ్లు మన మాట వినరు. నాకు ఎవర్నీ ఒక మాట అనటం ఇష్టంలేదు. మన పొరపాటో ఎవరి పొరపాటో జరిగిపోయింది. ఇహ వదిలెయ్యండి’ అన్నాను. ఆయన నన్ను సమాధానపర్చాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ‘ఏవో కొత్తగా వచ్చాయి కదమ్మా, స్ర్తి స్వాతంత్య్రం, సమాన హక్కులు అంటూ వాటిని పట్టుకుని వేలాడుతూంది. తెలియని పిల్ల! మీరు పెద్ద మనసు చేసుకుని దాన్ని కడుపులో పెట్టుకోవాలి’ అన్నాడు. ‘అవి బతుకులో వ్యక్తమవాలి కానీ, మాటల్లో రావు. మీ అమ్మాయి తెలివిగలది. నేను ఆమెకు చెప్పలేను. మీరే చెప్పలేక, పరాయివాళ్లం మా దగ్గరకు వచ్చి కడుపులో పెట్టుకు చూడాలని అభ్యర్థిస్తే కుదిరేదేనా? ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు. క్షమించండి’ అన్నాను. ఆయన చేసేది లేక వెళ్లిపోయాడు. ఇష్టంలేని పిల్లను పట్టుకుని వేలాడి ప్రయోజనమేంటి? మనస్తాపం కలిగించేది స్వర్గమైనా వదులుకోవల్సిందే’ అన్నది.
అప్పుడతనికి గుర్తుకు వచ్చింది. ఒకరోజు దొరక్క దొరక్క తన్ను తప్పించుకు పోబోతున్న రేవతిని ఆపి, ఉద్విగ్నంగా ‘ఏమిటీ, రాజారావుతో సహజీవనం మొదలుపెట్టావా?’ అని రేవతిని అడిగాడు.
అప్పుడు, రేవతి కాదనే ప్రయత్నం చెయ్యలేదు. ‘అవును. హి ఈజె గుడ్ ఫ్రెండ్! గుడ్‌బై’ అని చెప్పి వెళ్లిపోయింది.
తల్లి ఏదో మాట్లాడటంతో అతను ప్రస్తుతానికి వచ్చాడు. ‘ఒకసారి ఏమయిందో తెల్సా? నా పెళ్లి చేసినప్పుడు, మా నాయన నా పేరన రెండు ఎకరాలు చదివించాడు. ఆయన బతికి ఉన్నంతకాలం దాని మీద వచ్చిన ఫలసాయం మనకు పంపేవాడు. ఆయన పోయాక మా అన్న మానేశాడు. ‘అదేమిటి?’ అని నేను అడిగితే, ‘నాయన కొనసాగించిన దాతృత్వం నేను కొనసాగించాలని ఏమన్నా ఉందా?’ అన్నాడు. ‘దాతృత్వమేమిటి? అది నాన్న నాకు ఇచ్చిన పొలం!’ అన్నాను. ‘ఏమన్నా పత్రాలుంటే పట్టుకురా. అప్పుడు నీ పొలం పంచి ఇస్తాను’ అన్నాడు. పత్రాలేవీ లేవని మా అన్న అది అవకాశంగా తీసుకుని నా పొలం కాజేశాడు. ‘మాట తప్పే మనిషితో ఇంక మాటలు వద్దు. పద’ అన్నారు మీ నాన్న. ‘అది మా నాన్న నాకు ఇచ్చింది’ అన్నాను. ‘కానీ. ఇప్పుడు మనస్ఫర్థలు కలిగిస్తున్నది. మనస్తాపం కలిగించేది స్వర్గమైనా వదులుకోవల్సిందే!’ అన్నారు మీ నాన్న.
తల్లి అలా ప్రేమగా మాట్లాడుతుంటే, శేషగిరికి ఏడుపొచ్చింది. జరిగిన విషయమంతా చెప్పాడు. ‘ఏడ్చి ప్రయోజనం లేదు. మనసు దిటవు పర్చుకోవాలి. ఆ పిల్లకు కావల్సింది పెళ్లి, సంసారం కాదు! నేను ఆమెతో మాట్లాడినప్పుడే ఆ విషయం గ్రహించాను. మీరు ఎలా ప్రవర్తించారో నాకు తెలియదు అనుకున్నావా? కానీ, సమాజపు కట్టుబాటును అధిగమించి బతక ప్రయత్నించి నందువల్ల మనకు కలిగేది మనస్తాపమే కానీ, మరేం లేదు. కులాంతర వివాహం వరకు నేను అంగీకరిస్తాను. మీరనుకున్న సహజీవనాన్ని నేను సహించలేను. అందుకెంతో మానసిక సంస్కారం అవసరం. అందువల్ల మీరు ఎదుర్కోలేని సమస్యలొస్తాయి. ఆ పిల్లను మర్చిపో...’ అంది తల్లి. అతనికి సాంత్వన కూర్చుతూ.
ఆ తర్వాత అతడు రేవతిని మర్చిపో ప్రయత్నించాడు. తల్లి కూడా అతన్ని పెళ్లి చేసుకోమని బలవంతపెట్టలేదు. అందుకు కొంత సమయం పడ్తుందని ఆమెకు తెల్సు.
అతను వెళ్లేటప్పటికి, శవాన్ని తీసుకెళ్లటానికి ఏ ఏర్పాట్లూ జరగలేదు.
తండ్రి పోయాడని బాబాయికి ఫోన్ చేస్తే, దహనానికి తను వస్తానని ఆయన చెప్పాడు. అతను రాకపోయేసరికి ఏం చెయ్యాలో తోచక క్రితం మధ్యాహ్నమే రాజారావుకు ఫోన్ చేసింది ఆమె. ‘నాకు కుదరదు. నువ్వేదయినా ఏర్పాటు చేయించు’ అన్నాడతను.
‘నా దగ్గర డబ్బు లేదు’
‘ఓ లక్ష సరిపోతుందా? సాయంత్రానికి పంపిస్తాను’
సాయంత్రానికి అతడు వచ్చి డబ్బు ఇచ్చాడు. కానీ, ఉండమంటే ఉండలేదు. తను తల్లిదండ్రులు ఉన్నవాడు. శవ దహనాలు, శవానికి కాపలాలు అంటే తన తల్లిదండ్రులు అంగీకరించరు. మరి బాబాయి దహనం టైముకు వస్తాడేమో! తనొక్కతే రాత్రిపూట శవంతో ఉండలేక ఆమె శేషగిరికి ఫోను చేసింది.
వెళ్ళాక, శేషగిరి అన్ని ఏర్పాట్లూ చేశాడు. ‘రేపు వస్తాను’ అని అతను వెళ్లబోతే, ‘రాత్రికి ఉండరాదూ?’ అంటూ ఆమె వచ్చి అతన్ని కౌగిలించుకుంది.
అది దుఃఖం వల్ల వచ్చిన ఉద్వేగమో, కోరికవల్ల కలిగిన ఉద్రేకమో అతనికి తెలియలేదు.
‘్ఛ లే!’ అని ఆమెను పక్కకు తోసి, ‘రేపు పొద్దున వస్తాను’ అతను వెళ్లిపోయాడు.
తరువాత తెలిసింది. ఆమె బాబాయి వచ్చేటప్పటికి రాత్రి పది దాటిందని. దహన సంస్కారాలయ్యాక, ఇంటికి వచ్చి, ఆమెకు వెళ్తానని చెప్పాడు.
‘ఉండరాదూ? నేను ఒక్కదాన్నీ ఈ వ్యవహారాలన్నీ నిర్వహించుకు రాలేను’
‘మీ బాబాయి ఉన్నాడుగా? అంతగా అయితే, రాజారావును పిలువు. ఇంకో విషయం. మీ నాన్నగారికి జబ్బుగా ఉన్నప్పుడు నా దగ్గర నాలుగు లక్షలు అప్పు తీసుకున్నావు. నా డబ్బు తిరిగిచ్చేస్తే నేను సంతోషిస్తాను. ఇంక ఇద్దరిలో ఎవరికీ ఒకరి మీద ఒకరికి క్లయిములు ఉండవు’
‘నీ మీద నాకేదో క్లయిము ఉందని నేనెప్పుడూ చెప్పలేదు. నేను స్వతంత్రం కోరుకునే మనిషిని. ఇతరుల స్వాతంత్య్రానికి అడ్డురాను. అసలు నువ్వు నన్నిలా డబ్బు తిరిగి అడుగుతావనుకోలేదు. మనకున్నదేదో ఉమ్మడిగా పంచుకున్నాం. నా దగ్గర ఉన్నదేదో నీకిచ్చాను. నాకవసర పడింది కనుక నువ్వు డబ్బిచ్చావు, నేను తీసుకున్నాను. నేను నీకిచ్చింది వాపసు చెయ్యమని అడగలేనుగా? అలాగే నువ్విచ్చిందీ వాపసు చెయ్యమని అడక్కు’
నవ్వాడు శేషగిరి.
‘ఎందుకు నవ్వుతావు?’
‘నీకేదో పెద్ద ఆదర్శాలున్నాయి అనుకున్నాను. సమాజ ఉద్ధరణ ధ్యేయం కానీ, దేశసేవ చేసే ఉద్దేశం కానీ నీకుంటే, అందుకు పెళ్లి ఆటంకకారి అని నువ్వు భావిస్తే నేను అర్థం చేసుకోగలను. నువ్వు మామూలు బజారు ఆడదానివి! నువ్వు లైంగిక స్వాతంత్య్రం ఉండాలని అన్నావుకానీ, నీకు కావల్సింది స్వేచ్ఛకానీ, స్వాతంత్య్రం కాదు. స్వేచ్ఛ అంటే బరితెగించి ప్రవర్తించటం. స్వాతంత్య్రంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించటం సాధ్యంకాదు. స్ర్తిలు పురుషులతో సమానమన్నావు. అలాగే ప్రవర్తించావు. ఇప్పుడు నేను నిన్ను అనుభవించానంటున్నావు! నీకు కూడ నన్ను అనుభవించిన భావం ఉంటే నేను నువ్వు చెప్పే స్ర్తి స్వాతంత్య్రాన్ని నమ్మేవాడిని. కనుక, మనం ఇద్దరం ఒకరి కామేచ్ఛను మరొకరం అనుభవించాం. నువ్వు నాకిచ్చివు, అలాగే నీకు కావల్సింది నేను ఇచ్చాను. అవి చేబదుళ్ళే! అలాగే డబ్బు విషయంలోనూ. నేను నీకు చేబదులు కింద డబ్బిచ్చాను. అది వాపసు ఇస్తే మంచిది’
‘నా దగ్గర డబ్బు లేదు’
‘రాజారావును చేబదులు అడుగు. అతను ఇస్తాడు. నా బాకీ తీరిపోతుంది’
‘చచ్చినాడు. మా నాయన పోయి నేనేడుస్తూ డబ్బులేక అడిగితే లక్ష రూపాయలిచ్చాడు. అవి దహనానికే అయిపోయాయి’
‘ఆడపిల్లవు కనుక, నీకు మిగిలిన పితృకార్యాలు నిర్వహించాల్సిన పనిలేదు. ఎందుకంటే, నువ్వనే సమాన హక్కులు వగైరా నోటి మాటలు మాత్రమే! వాటి మీద నీకు విశ్వాసం లేదు. పురుషుడు అనుభవించే వాడయినప్పుడు, స్ర్తి భోజ్య వస్తువే కదా? పరతంత్రకు బాధ్యతలు, హక్కులు ఏముంటాయి?’
‘పరతంత్రకు బాకీ తీర్చాల్సిన పనిలేదు. వెళ్లు’ అంది, రేవతి కోపంగా అతని వంక చూస్తూ.
‘ఓకే. మళ్లా చేబదులంటూ రాక. నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. గుడ్‌బై!’ అని వెళ్లిపోయాడు శేషగిరి.
*

డా.కాకాని చక్రపాణి
6-1-149/10, ఫ్లాట్ నెం.101
విశ్వంభర అపార్ట్‌మెంట్స్,
పద్మారావునగర్
సికిందరాబాద్-500 025
040-2750 1409; 90006 11409

-కాకాని చక్రపాణి