S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కరవు కాటకాల్లో రైతాంగం

డిచ్‌పల్లి, మే 13: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కరవు పరిస్థితులతో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు దుర్భర జీవితాలను వెల్లదీస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని దర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాల్లో కరవు తీవ్రంగా ఉంది. గడిచిన రెండు సంవత్సరాలు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు సాగు చేసిన పంటలకు సరిపడా నీరందకా అన్నదాతలు తీవ్ర నష్టాలను చవిచూశారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఈసారి ప్రజలు తాగునీటి కోసం సైతం నానా అవస్థలు ఎదుర్కొవాల్సిన దుస్థితి ఏర్పడింది. సిరికొండ మండలంలోని మారుమూల గ్రామాలైన చీమన్‌పల్లి, కోటాల్‌పల్లి, తూంపల్లి, దర్పల్లి మండలంలోని దొన్కల్, రాంసాగర్‌తండా, డిచ్‌పల్లి మండలంలోని కోరట్‌పల్లి, గన్నారం తండాల్లోని ప్రజలు తాగునీరు లభించక అల్లాడుతున్నారు. జక్రాన్‌పల్లి మండలంలో చింతలూర్, కలిగోట్, నిజామాబాద్ మండలం ముదక్‌పల్లి, మంచిప్ప గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల రైతులు పండించిన ఉల్లిగడ్డలు, ఇతర కూరగాయలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా కృంగిపోయారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లోని పూడిక మట్టిని తీయడం తప్పా, అవసరమైన నీటి తొట్టెల నిర్మాణం చేపట్టకపోవడంతో రైతాం గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రస్తుతం పశువులకు దాన, గ్రాసం లేకపోవడం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దర్పల్లి పాల సేకరణ కేంద్రంలో రోజుకు సుమారు 5వేల లీటర్లు సేకరించే వారు కాగా, ప్రస్తుతం కనీసం 300లీటర్లు కూడా రాకపోవడంతో ఈ కేంద్రాన్ని మూసివేసే పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రైతు సదస్సులు రైతులకు ఎంతమేరకు ఉపయోగపడ్తాయో అధికారులే వివరించాలని అన్నదాతలు కోరుతున్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి 3నుండి 5వేల రూపాయల ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తామని చెప్పిన అధికారులు, ఇంతవరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవు నివారణకు నిధులు మంజూరైనట్లు కాగితాలపై చూపుతున్న అధికారులు, ఇప్పటి వరకు కనీసం ఒక్క రైతుకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు చైతన్య సదస్సుల్లో రైతులకు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని చెప్పిన మాట తప్ప, ఇతర సమస్యల గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమని రైతులు పేర్కొంటున్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం వల్ల అప్పులు పెరిగిపోయి, ఇప్పటికే అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం విదితమే. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు విముఖత చూపించడంతో పెట్టుబడులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ సర్కార్ పార్టీ బలోపేతంపై మాత్రమే దృష్టి సారిస్తోందని, రైతుల సంక్షేమం గురించి పట్టించుకున్న పాపానపోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని ఒకేసారి అమలు చేసి, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలను ఇప్పించాలని, పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు, రైతు శ్రేయోభిలాషులు కోరుతున్నారు.