S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిప్పుసుల్తాన్ వేసవి విడిది

టిప్పు సుల్తాన్ విడిదిగా వాడుకున్న రాజప్రాసాదం బెంగళూరులో ఉంది. 200 ఏళ్ల క్రితం నిర్మితమైనా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. దీనిని పూర్తిగా టేకు కలపతో నిర్మించారు. ఇది అద్భుతమైన చారిత్రక కట్టడం. చల్లగా ఉండే ఈ రాజప్రాసాదంలో టిప్పుసుల్తాన్ వేసవిలో గడిపేవారు.
జూన్ 1781లో ఈ రాజప్రాసాద నిర్మాణాన్ని నవాబ్ హైదర్ అలీఖాన్ ప్రారంభించారు. ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ 1791లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. టిప్పు సుల్తాన్‌కు ‘టైగర్ ఆఫ్ మైసూర్’గా పేరుంది. ఆయన బ్రిటీష్ పాలకులను గడగడలాడించాడు. ఈ భవంతిని 17వ శతాబ్దంలో కెంపెగౌడ మట్టి కోటగా నిర్మించారు. ఇది రెండంతస్థుల చిన్న భవనం. అయినా రెండువైపులా విశాలమైన ఉద్యానవనాలు ఉన్నాయి. భవనం లోపల కలప చెక్కడాలు అద్భుతంగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. శ్రీరంగ పట్టణంలో వున్న దారియా దౌలత్‌బాగ్‌ని ఇది పోలి ఉంటుంది. ఈ డిజైన్‌ను అక్కడి నుంచే తీసుకుని ఉంటారని అంటారు. ఈ హెరిటేజ్ భవనాన్ని ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ భవనం మొఘల్ పద్ధతిలో ఎతె్తైన పునాదులపై నిర్మించారు. అలహాబాద్‌లోని అక్బర్ దర్బారు హాలును ఇది తలపిస్తుంది. పరిపాలన, వాణిజ్యం, పరిశ్రమల పరంగా ఒక స్వర్ణ యుగానికి ఈ బంగళా ప్రతీక. మైసూరు మహారాజైన టిప్పు సుల్తాన్ ఈ బంగళాకు ‘రష్-ఎ-జన్నత్’ అని పేరు పెట్టుకున్నాడు. దాని అర్థం ‘ఆనంద ఆశ్రమం’ అని. ఆయన స్వయంగా టేకు కలపపై చెక్కుకున్న ఈ పేరు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
టిప్పు సుల్తాన్ వేసవి బంగళా ప్రధాన అంతస్తు చిన్నదైనా కళాత్మకంగా ఉంటుంది. ఎతె్తైన టేకు స్తంభాలు మొదటి అంతస్తును తాకి ఉంటాయి. భవనంలో మొత్తం 160 టేకు స్థూపాలు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండో అంతస్తు పైకప్పు వరకు ఉండటం విశేషం. గోడలు, టేకు పైకప్పులు లేత రంగుల్లో ఉంటాయి. గొప్ప అభిరుచి ప్రతి భాగంలోనూ కన్పిస్తుంది. బంగారు పుష్పాల వంటి డిజైన్లు బోర్డర్లపై కన్పిస్తాయి.
పై అంతస్థును, బాల్కనీలను నాలుగు స్టెయిర్‌కేస్‌ల ద్వారా చేరుకోవచ్చు. మొదటి హాలు విశాలంగా ఉంటుంది. టిప్పు ఈ హాలులోనే అధికారులను కలుసుకునేవారు. అతి ముఖ్యమైన నిర్ణయాలను ఇక్కడే తీసుకునేవారు. కోట అంతర్భాగంలో గణేశ మందిరం ఉండటం మరో విశేషం. టిప్పు సుల్తాన్ శౌర్యానికి ప్రతీకలైన కత్తులు, కటారులు, కిరీటాలను మ్యూజియంలో భద్రపరిచారు. టిప్పుసుల్తాన్ స్వయంగా గీసుకున్న మహా సింహాసనం పెయింటింగ్ ఉంది. అసలైన సింహాసనం బంగారు రేకులతో, రత్నాల పొదిగి ఉండేది. బ్రిటీష్ సైన్యాన్ని పూర్తిగా జయించేవరకు ఆ సింహాసనంపై కూర్చోనని ఆయన నిర్ణయించుకున్నాడు. టిప్పు సుల్తాన్ మరణం తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం ఆ సింహాసనాన్ని ముక్కలు చేసి వేలం వేసింది. అంత పెద్ద, అంత విలువైన సింహాసనాన్ని ఒక్కరే కొనుక్కోవటం కుదరదు కాబట్టి అలా చేశారు. నాలుగో ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం 1867 వరకు ఈ రాజప్రాసాదాన్ని సచివాలయంగా ఉపయోగించుకుంది.

-బి.ఎం.ఎన్.