S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డాలర్ డ్రీమ్స్

ప్రపంచంలోని అతి ఐశ్వర్యవంతమైన నగరాల్లో ఒకటైన లాస్ వేగాస్ జూదానికి రాజధాని. ఎక్కడ జూదం ఉంటే, అక్కడ డబ్బుంటుంది. ప్రతీ రోజు కొన్ని కోట్ల డాలర్లని ప్రతీ జూద గృహం సాయుధులైన సిబ్బందితో వాహనాల్లో బేంక్‌లకి పంపిస్తూంటుంది. ఆ డబ్బుని దోచుకోవాలనుకునే నేరస్థులు కూడా అనేక మంది ఉన్నారు. వారిలో ఒకరు చక్ వీలర్. ఇటీవలే అతను బేంక్ దొంగతనం నేరంలో శిక్షని అనుభవించి కేలిఫోర్నియాలోని జైలు నించి విడుదలయ్యాడు.
గోల్డెన్ నగ్గెట్ కేసినో ప్రతీ రోజూ నగదుని సంచీల్లో ఉంచి సీల్ వేసి, ముగ్గురు సాయుధులైన సెక్యూరిటీ గార్డ్స్‌తో బేంక్‌కి తరలిస్తూంటుంది. శుక్రవారం మాత్రం ఇరవై లక్షల డాలర్లకి తక్కువ లేకుండా డబ్బు బేంక్‌కి వెళ్తుందని చక్‌కి తెలిసింది. కొంత పరిశోధన చేశాక అతను పథక రచన చేశాడు. దాని ప్రకారం ప్రతీ రోజు చక్ వీలర్ ఆ సమయాన్ని వాచీలో చూసుకుని నోట్‌బుక్‌లో రాసుకోసాగాడు. ఆ రోజు కూడా చక్ గోల్డెన్ నగ్గెట్ కేసినో నించి డబ్బు తీసుకుని బేంక్‌కి వెళ్లే వేన్ బయలుదేరే సమయాన్ని వాచ్‌లో చెక్ చేసుకుని రాసుకున్నాడు. ఉదయం పది ఏభై రెండు నిమిషాలు. గత మూడు వారాలుగా నోట్ చేసిన సమయమే అది.
డిసెంబర్ పంతొమ్మిది మధ్యాహ్నం చక్ హైవే పక్కన ఉన్న చిన్న కొండ మీద నించి, తన హైపవర్ రైఫిల్‌తో రోడ్డు మీద వెళ్లే ఓ వాహనం టైర్‌ని కాల్చాడు. గుండు ఆ కారు కుడివైపు ముందు చక్రాన్ని తాకడంతో అది పక్కనే ఉన్న స్టేజ్ కోచ్ గేరేజ్ కారు షెడ్ ముందు ఆగిపోయింది. దాని కారు డ్రైవర్ కారు టైర్ పంచర్ వేయమని కోరి కాఫీ షాప్‌లోకి వెళ్లాడు. కిందకి వచ్చిన చక్ షెడ్‌లోకి వచ్చి కారు వంక, టైర్ మార్చే తన మిత్రుడు జో వంక చూసి చెప్పాడు.
‘ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా?’
‘బాగా. రెండు వారాల్లో మూడు టైర్లని పేల్చగలిగావు’
‘ఐతే నాతో భాగస్వామివి అవుతావా?’ చక్ నవ్వుతూ ప్రశ్నించాడు.
‘తప్పకుండా’
జో కరచాలనం చేయడానికి చేతిని చాపాడు. చక్ అతని చేతిని అందుకోకుండా తలని అడ్డంగా ఊపి చెప్పాడు.
‘చేసాననే అనుకో. నీ చేతి నిండా గ్రీజ్’
‘పథకం ఏమిటి?’ జో అడిగాడు.
‘సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఈ తుపాకిని జాగ్రత్తగా దాచు’ చెప్పి చక్ తన కారెక్కాడు.
* * *
లాస్‌వేగాస్ శివార్లలోని ఓ మొబైల్ హౌస్ చక్ దొంగతనానికి హెడ్ క్వార్టర్స్. అతను లోపలికి వచ్చి అడిగాడు.
‘లూ. పనైందా?’
‘అయింది. పోలీస్ బేండ్ విడ్త్‌ని పట్టుకోగలిగాను’ అతని తోడు దొంగ లూయిస్ జవాబు చెప్పాడు.
అతను పోలీసుల నించి తప్పించుకు తిరిగే చిన్నసైజు దొంగ. వైర్లెస్ కమ్యూనికేషన్‌లో నిపుణుడు. ఈ ముగ్గురి టీమ్ కనీసం ఇరవై లక్షల డాలర్ల దొంగతనానికి దిగింది. సగ భాగం సూత్రధారి అయిన చక్‌కి, మిగతాది ఇద్దరూ చెరో సగం పంచుకోవాలి అన్నది వారి ఒప్పందం. లూకి, జోకి అంతదాకా ఒకరితో మరొకరికి పరిచయం లేదు. తన పథకంలో భాగంగా చక్ ఇంత దాకా వాళ్లని కలపలేదు.
లూయిస్ రేడియోని ఆన్ చేశాడు. హెడ్ క్వార్టర్స్ నించి పోలీస్ పెట్రోల్ కార్‌కి వచ్చే సమాచారం వినపడింది.
‘కార్ సెవెంటీన్. ప్లీజ్ ప్రొసీడ్ టు మార్కెట్ ప్లేస్. సస్పెక్టెడ్ రాబరీ’ వినిపించింది.
‘ఎలాగైనా నువ్వు నిపుణుడివి’ చక్ మెచ్చుకున్నాడు.
వెంటనే చక్ తన చేతి గడియారం వంక చూసుకున్నాడు. పనె్నండుకి సరిగ్గా పది నిమిషాలు తక్కువ. కొద్దిసేపటికి వేన్ బేకర్ అని రాసి ఉన్న ఊళ్లోకి ప్రవేశించింది. చక్ టేప్‌రికార్డర్‌ని ఆన్ చేశాడు. కొద్ది నిమిషాల తర్వాత వినిపించింది. ‘యునైటెడ్ కాలింగ్ 421 ఎక్స్. చెక్ ఫోర్ టు ఎక్స్’ మైక్‌లో వినిపించింది.
చక్ టేప్ రికార్డర్ పాజ్ బటన్‌ని నొక్కాడు.
‘యునైటెడ్ చెకిన్ 902. యునైటెడ్ చెకిన్ 902’ గార్డ్ కంఠం వినిపించింది.
‘ఓకే’
వెంటనే చక్ థమ్సప్ సైన్‌ని జోకి చూపించి నవ్వుతూ చెప్పాడు.
‘ఊరు దాటగానే కారులోకి మారదాం’
ఐతే ఊరి చివరలో చాలా కార్లు ఆగి ఉన్నాయి. ఆ వేన్‌ని చూడగానే తుపాకులు ధరించిన యూనిఫాంలోని పోలీసులు దాన్ని చుట్టుముట్టారు. వాళ్లని చూసిన చక్ మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్కలేదు.
‘అంతా పథకం ప్రకారమే జరిగిందిగా? మరి ఇదేమిటి?’ జో నివ్వెరపోతూ అడిగాడు.
‘ఏమో?’ పాలిపోయిన మొహంతో చక్ చెప్పాడు.
ఇద్దరూ చేతులెత్తి కిందికి దిగారు. వెనక కారులో గ్రీజ్ దుస్తుల్లో ఉన్న లూని ఓ పోలీస్ చూసి అడిగాడు.
‘ఎక్కడికి?’
‘కారు డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను’
‘సరే’ డిక్కీ, కారు వెదికి అతన్ని వెళ్లమనడం చక్, జో చూశారు.
* * *
అరగంట తర్వాత పోలీసుస్టేషన్‌లోని లెఫ్టినెంట్‌ని చక్ ప్రశ్నించాడు.
‘మీకెలా తెలిసింది?’
‘చెక్ పాయింట్ నించి మీ వేన్‌ని ఆపమని మాకు సమాచారం వచ్చింది’
‘దేనికి ఆపమన్నారు?’
‘జనవరి ఒకటి నించి కోడ్ మార్చారు. మీరు క్రితం సంవత్సరం కోడ్‌ని వాడడంతో వాళ్లకి అనుమానం వచ్చింది’
ఆ మాటలు విని చక్ బాధగా చూశాడు.

(పాల్ గేంగ్లిన్, జెరోమ్ శేక్ హైమ్‌ల కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి