S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిడిమిడి జ్ఞానం (సిసింద్రీ)

మగధ మహారాజు మారుతి మారు వేషంతో తన రాజ్యంలో సంచరిస్తున్నాడు. ప్రజల సంక్షేమం చూడటంలో అతను శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. వేగుల ద్వారా వార్తలు తెలుసుకుంటున్నా తను కూడా స్వయంగా అడపాదడపా ప్రజల స్థితిగతులు గమనిస్తూ ఉంటాడు.
ఆ రోజు అతను ఒక బ్రాహ్మణ అగ్రహారంలో పర్యటిస్తున్నాడు ఒక సన్యాసి వేషంలో. విప్రుల ఇళ్లల్లో నుండి వేదాధ్యయనం చెవికింపుగా కొనసాగుతున్నది.
అలా పర్యటిస్తూ నాలుగు వీధుల చావడి దగ్గరకొచ్చేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది.
ఒక పెద్ద గుంపు ఒక వ్యక్తిని శిక్షిస్తోంది. అతను లబోదిబోమంటూ దండాలు పెడుతున్నాడు. గుంపులోని పెద్ద మనుషులు అతన్ని చెప్పులతో సన్మానిస్తున్నారు.
‘ఆగండి ఆగండి! ఎందుకు ఈతన్ని కొడుతున్నారు?’ అడిగాడు మారుతి.
‘కొట్టాలా చంపాలా? మేం కాబట్టి ఇతని మీద జాలి చూపిస్తున్నాం. ఇంకొకళ్లయితే చంపి పాతర వేసేవాళ్లు!’ ఒకతను చెప్పాడు.
‘ఏమోయ్! చంపి పాతరేసేటంతటి తప్పు ఇతను ఏం చేశాడు?’ విస్మయంగా అడిగాడు మారుతి.
‘వీడికి ఎన్ని గుండెలుంటే గుడిలో జొరబడి దేవుడిని అపవిత్రం చేస్తాడు!’ పూజారి కోపంగా అన్నాడు.
‘అయ్యా! నాకేమీ అర్థం కావడంలేదు. జరిగింది కాస్త వివరంగా చెప్పండి’ మారుతి అడిగాడు.
‘మీరెవరో ఈ ఊరికి కొత్తవారిలాగున్నారు. ఆ కనిపిస్తున్న గుడి పరమ పవిత్రమైనది. ఈశ్వరుడు, పార్వతి, లలితాంబ తల్లి కొలువై ఉన్నారు. నిష్ఠాగరిష్ఠులు రోజూ పూజలు చేస్తూ ఉంటారు. మడికట్టుకుని భక్తిశ్రద్ధలతో. అటువంటిది వీడు మడి ఆచారాలు మంటగలిపి దేవాలయాన్ని అంటు చేశాడు!’ పూజారి చెప్పాడు.
‘అంటు చెయ్యడం ఏంటి?’
‘సన్యాసివి నీకెలా అర్థమవుతుంది. ఈ దేవాలయంలో మడి ఆచారాలు ఎక్కువ. అగ్రవర్ణాల వారికే ప్రవేశం. దళితులకు, నిమ్న కులస్తులకు ప్రవేశం నిషేధం! దళితులు బయట నుంచే దండం పెట్టుకుని పోవాలి! అటువంటిది వీడు మేమెవ్వరం లేకుండా చూసి, నేరుగా లోపలికి జొరబడి అమ్మవారికి పూలహారం వేసి దేవాలయాన్ని మైల చేశాడు. ఇప్పుడు దేవాలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం శుద్ధి చెయ్యాలి! అప్పుడు కాని ప్రజలు దర్శనం చేసుకోలేరు’ పూజారి వివరించాడు.
‘ఇతనికి ఏ శిక్ష విధిస్తారు?’ సన్యాసి వేషంలో ఉన్న మారుతి అడిగాడు.
‘ఏ చేత్తో అమ్మవారికి పూలమాల వేశాడో ఆ చెయ్యిని నరికెయ్యాలి! ఇతరులకు హెచ్చరికగా ఉంటుంది’ చెప్పాడు పూజారి.
ఆ దళితుడు భయపడిపోయి సన్యాసి పాదాల మీద పడిపోయాడు.
‘అంటే ఇతని తప్పు నిర్ధారించబడిందనా మీ ఉద్దేశం?’
‘ఆ! ఇతడు దేవుళ్లను, దేవాలయాన్ని మైల పడేశాడు’
‘మూర్ఖులారా! ఇతగాడికి దేవుళ్లను, దేవాలయాన్ని మైల పడేసేటంతటి శక్తి ఉంటే, దేవునికంటే ఇతడే గొప్పవాడు గదా! అప్పుడు మనం వాళ్లని వదిలి ఇతణ్ణి కొలవాలి’ అంటూ తర్కం లేవదీశాడు మారుతి.
‘సన్యాసికి తిక్క లేచినట్లుంది’ అనుకున్నారంతా.
‘పవిత్రమైన దేవుళ్లను ముట్టుకుంటే అపవిత్రులు కూడా పవిత్రులుగా మారతారు. నిప్పును పట్టుకున్న ప్రతి చెయ్యి కాలుతుంది కాని, ముట్టుకున్నంత మాత్రాన నిప్పు ఆరిపోదు కదా?’
ఆ మాటలకు పూజారి తలదించుకున్నాడు.
‘అగ్రకులస్తులను, నిమ్న కులస్తులను కూడా ఒకే దేవుడు సృష్టించాడు. అప్పుడు అస్పృశ్యత ఎలా వచ్చింది కొందరికి? సర్వం జగన్నాథం. అందరిలో భగవంతుడున్నాడని వేదాలు ఘోషిస్తున్నాయి. మిడిమిడి జ్ఞానంతో తోటి మానవులను హీనంగా చూసి ఆ భగవంతుడిని అవమానపరచవద్దు. నేటి నుంచి అన్ని దేవాలయాలలో అందరూ ప్రవేశించవచ్చు. ఇది రాజాజ్ఞ’ అంటూ మారుతి తన మారువేషం తొలగించాడు.
ఆ గ్రామస్తులంతా ఆయన కాళ్ల మీద పడ్డారు అపరాధం మన్నించమని. ఆ దళితుడికి బహుమతులు ఇచ్చి పంపాడు మారుతి.

-వియోగి