S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రైలు ప్రయాణం

ఎం.ఎస్.సిలోకి వచ్చిన తరువాత అంటే, వరంగల్ చేరిన తరువాత అన్నమాట. కొత్త మిత్రులు వచ్చారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఒకతను తానింకా రైలు ఎక్కలేదని చెపితే నాకు పట్టరానంత ఆశ్చర్యం అయ్యింది. నేను మరి పాలమూరు నుంచి హైదరాబాద్ దాకా బస్సులో వచ్చినా, అక్కడి నుంచి మాత్రం కాజీపేటకు రైల్లో వచ్చినట్టున్నాను. పాలమూరు నుంచి పట్నం అనే హైదరాబాదుకు రైలు లేదని కాదు. ఆ రైలు సమయానికి మనం వెళ్లాలి. బస్సులయితే మన సమయానికి కొంచెం అటుఇటూగా దొరుకుతాయి. తరువాతి కాలంలో నేను వరంగల్‌కు కూడా బస్సుల్లోనే ఎక్కువగా వెళ్లినట్టున్నాను.
మా పల్లె రైలు ట్రాక్ పక్కనే ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో ఈ మధ్యన మా పల్లెల్లో రైళ్లు ఆగుతున్నాయట కూడా! అంటే ఏనుగొండ అని ఒక రైల్వేస్టేషన్ ఉందన్నమాట. పట్నం నుంచి ఉద్యోగాల కొరకు వచ్చేవాళ్లు పాలమూరు స్టేషన్ దాకా వెళ్లకుండా మా ఊళ్లో దిగి ఆటోల్లో ఆఫీసుకు వెళతారట. నేనింకా మా ఊళ్లో రైలు దిగలేదు.
నేనసలు పెద్దవాడినయ్యేదాకా రైలు ఎక్కలేదు. మొదటిసారి రైలు ఎక్కి తిరుపతి వెళ్లడం గుర్తుంది. మన దేశంలో ప్రయాణం అంటే పెళ్లికి లేదా యాత్రకు మాత్రమే. నేను అసలయిన పల్లెటూరి వాడిని. ఎద్దులబండిలో తిరిగినవాడిని. తిరుపతికి రైల్లో వెళ్లి మళ్లీ రైల్లోనే తిరిగి వచ్చాము. దిగిన తరువాత ఒక రోజు వరకు ఇంకా రైల్లో కదులుతున్న భావమే మెదడులో ఉంది. అప్పటి రైళ్ల నడక అంత కుదుపుగా ఉండేదేమో.
హైస్కూల్లో చదువుతున్నపుడు ఇంట్లో వాళ్ల ప్రమేయం లేకుండా, డబ్బులు ఖర్చు లేకుండా రైలెక్కే అవకాశం వచ్చింది. నాకు ఆట, పాటలు చేతకాలేదు. శరీరంలో ఇవాళటికి బాగా పని చేస్తున్న భాగం మెదడు ఒకటే. చదువులో మాత్రం ముందంజగానే ఉండేవాడిని. కనుక నన్ను స్కౌటింగ్‌లో చేర్పించారు కొంతమంది పెద్దలు. స్కౌటింగ్‌లో శరీర కష్టం కొంచెం తక్కువ. అక్కడ మెదడుతో చేసే పనులు కూడా కొన్ని ఉంటాయి. నేను ప్రెసిడెంట్ స్కౌట్‌గా కూడా ఎంపికయ్యాను గానీ, అప్పటి తెలంగాణ ఉద్యమం కారణంగా దిల్లీ వెళ్లి ఆ బ్యాడ్జ్‌ని తెచ్చుకోలేక పోయాను. బడిలో ఉన్నంతకాలం స్కౌటింగ్‌లో కొనసాగాను. అక్కడే మంచి నైపుణ్యం చూపించినట్టున్నాను.
రాష్ట్ర స్థాయిలో ప్రతి సంవత్సరం స్కౌట్‌ల క్యాంపులు జరిగేవి. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు. ఫస్ట్‌క్లాస్ స్కౌట్‌గా నేను హైదరాబాద్‌లో దోమల్‌గూడాలోని ఏవి కాలేజ్ ఆవరణలో శిక్షణ పొందాను. అక్కడ మంచి అనుభవం సంపాదించాను. ఆ తరువాత మా జిల్లా స్థాయిలో మంచి స్కౌట్‌గా పేరు పొందాను. అందులో భాగంగానే రైలెక్కే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం స్కౌట్ క్యాంప్ నిజామాబాద్‌లో ఉంది. దాన్ని నిజానికి క్యాంపోరి అనేవాళ్లు. అలాగే జాతీయ స్థాయిలో జరిగే పెద్ద క్యాంప్‌ను జంబోరి అనేవాళ్లు. నేను విద్యార్థిగా ఒకటి, రెండు క్యాంపోరిలకు వెళ్లగలిగాను. నిజామాబాద్ క్యాంపోరికి నేను ఎంపికయ్యానని తెలిసినప్పుడు ఎగిరి గంతేశాను. రైలు ఎక్కడం ఒక ఆకర్షణ అయితే, కొన్ని రోజులపాటు టెంట్ అనే గుడిసెలో మిత్రులతో అంటే తోటి బాయ్ స్కౌట్స్‌తో గడపవచ్చునన్నది మరింత ఆకర్షణ. నాకు కొన్ని చిత్రమయిన సంగతులు గుర్తున్నాయి. ఇంట్లో నా కోసం ప్రత్యేకంగా స్కౌట్ యూనిఫామ్‌లు కుట్టించుకునేంత వెసులుబాటు లేదు. కనుక బడివాళ్లే నాకు కాకి యూనిఫామ్‌లు ఇచ్చారు. ఇక తయారీలో మేము చేసిన చమక్కులు కొన్ని రాష్ట్రం మొత్తం మీద మాకు పేరు తెచ్చాయి. క్యాంపులో టెంట్ పక్కన మా వస్తువులు జాగ్రత్త చేసేందుకు కొన్ని మంచెలు కట్టాలి. కొన్ని జిల్లాల వాళ్లు ఇందుకోసం వెదుళ్లను, మరి కొన్ని రకాల కలపను కొని తెచ్చుకున్నారు. మేం మాత్రం గొడ్డళ్లు పుచ్చుకుని అడవి మీద పడి కర్రలు పోగుచేసి వాటిని రైల్లో తీసుకువెళ్లాం. మా క్యాంప్ సైటు నిజంగా సహజంగా కనిపించింది కనుక క్యాంప్ క్రాఫ్ట్ బహుమతి మాకే వచ్చింది.
ఇంతకూ మా రైలు ప్రయాణం గురించి చెప్పాలి. మాస్టర్లతో సహా క్యాంపోరికి వెళ్లేవాళ్లం. అందరమూ మూట ముల్లే సర్దుకుని బయలుదేరాము. రైల్లో హైదరాబాదు దాకా ప్రయాణం మామూలుగానే గడిచింది. నిజానికి వెళ్లింది సికింద్రాబాదు స్టేషన్. మేము తొందరపడి పొద్దునే అక్కడికి చేరినట్టున్నాము. లేక నిజామాబాదు వెళ్లే రైలుకు సకాలంలో అందించాలంటే అప్పట్లో మధ్యలో మరొక రైలు లేదనుకుంటాను. కనుక ఆ రోజంతా సికింద్రాబాదు ప్లాట్‌ఫామ్ మీదనే గడపవలసి వచ్చింది. బహుశా అన్ని జిల్లాల వాళ్లు నిజామాబాదు చేరడానికి ప్రత్యేకంగా ఒక రైలు ఏర్పాటు చేసినట్టు నాకిప్పుడు అనుమానం. సాయంత్రంలోగా మేము దొంగచాటుగా స్టేషన్ నుంచి జారుకుని ఒక సినిమా చూచి వచ్చాము. అప్పుడు రాణిగంజ్‌లో చిత్రాణి అని ఒక సినిమా టాకీస్ ఉండేది. అందులో ఏం సినిమా చూచామో మాత్రం గుర్తులేదు. మొత్తానికి సకాలానికి రైల్వేస్టేషన్ చేరుకున్నాము. చిన్నగా చీవాట్లు కూడా తిన్నామేమో! అలాంటివి గుర్తుండనవసరం లేదు.
రైలు బయలుదేరింది. మేము ఉన్న పెట్టె మీద మహబూబ్‌నగర్ అన్న అక్షరాలు రాసిన అట్ట బోర్డును ఏర్పాటు చేశాము. పసుపు పచ్చ రంగులో ఆ బోర్డును నేనే తయారుచేసినట్టు సగర్వంగా చెపుతున్నాను. మొత్తం జిల్లా బృందం కవాతు జరుపుతూ ఉంటే మొదట్లో వాళ్లు పట్టుకునే బ్యానర్ కూడా స్కౌట్ పద్ధతిలో ముదురు నీలం గుడ్డ మీద రాసి తయారుచేశాను. రాని విద్య లేదు. కనుకనే నాకు స్కౌటింగ్‌లో చోటు దొరికింది. నిజామాబాదులో క్యాంపు సమయంలో మా అనుభవాల గురించి చెప్పాలంటే అది ప్రత్యేకంగా ఒక కథ అవుతుంది. ఎందుకోగానీ నిజామాబాదు దాకా వెళ్లిన ప్రయాణం గుర్తున్నంతగా తిరుగు ప్రయాణం వివరాలు నాకు గుర్తు లేవు. ఇది నిజంగా ఆశ్చర్యం.
తరువాత సిర్పూర్ కాగజ్‌నగర్‌లో మరొక క్యాంపోరికి నేను వెళ్లాను. అయితే అప్పటికి కాలేజిలో ఉన్నట్టున్నాను. స్కూలు వయసు దాటిన వారిని స్కౌటింగ్‌లో రోవర్స్ అంటారు. వీళ్లకు సేవ ఒకటే పని. పోటీల్లో పాల్గొనే వీలుండదు. కాగజ్‌నగర్ క్యాంపు కూడా బాగా గుర్తుంది. స్కౌట్‌లు నిక్కర్లు తొడుక్కుంటారు. రోవర్లు పెద్దవాళ్లు కనుక ప్యాంట్‌లు వేసుకోవచ్చు. మిగతా సంగతులన్నింటికన్నా సిర్పూర్‌లో కాగితం మిల్లు కంపు కడుపులోనుంచి బయటకు రావడం బాగా గుర్తుంది. కార్ఖానా చూచి వచ్చిన నాడు భోజనం తరువాత తేన్చితే కడుపులో నుంచి కాగితం గుంజు కంపు వచ్చింది. నాకెందుకో సిర్పూర్ రైలు ప్రయాణం వివరాలు గుర్తులేవు. ఆ తరువాత చాలా చోట్లకు చాలా దూరాలకు రైళ్లలో తిరిగానను. అయినా సరే మొదటి, రెండు తిరుపతి ప్రయాణాలు, ఆ తరువాత నిజామాబాదు ప్రయాణం నాకు కలకలం గుర్తుంటాయి.
ఈ దేశంలో కేవలం సరదా కొరకు తిరగడానికి కూడా రైళ్లు ఉన్నాయట. వారం రోజులపాటు ఆ రైళ్లలో తిరగవచ్చునట. అందులో అయిదు నక్షత్రాల హోటేల్ పద్ధతిలో సౌకర్యాలు ఉంటాయట. దినం ఊరు ప్రకారం తిప్పి చూపిస్తారట. ఆ రైల్లో ఎక్కుదామని, చుట్టూ తిరిగి వద్దామని ఒక ప్రతిపాదన ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. నిత్యం రైలు వచ్చి ఊరి మీది నుంచి వెళ్లే సమయానికి ట్రాక్ పక్కన నిలబడి ఇంజన్ డ్రైవర్‌కు గ్రీటింగ్ చెప్పిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకప్పుడు అక్కడెక్కడో ఇంజన్ డ్రైవర్ తలటోపీ గాలికి ఎగిరిపోతే రైలు ఆపి అందరూ దిగి దాన్ని వెతికి తెచ్చారని ఈ మధ్యన ఒక పాత కథ చదివాను. నాదంతా నాస్టాల్జియా పద్ధతిగా ఉందని నాకు కూడా తెలుసు. ఇందులో ఎంతో ఆనందముంది మరి.

కె.బి. గోపాలం