S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 8

ఆలోచనల మధ్య మేము చేరవలసిన అడ్రస్‌కి చేరాం.
కారు ఆపి కిందకు దిగాడు షరీఫ్.
నేను కూడా కిందకు దిగాను. చుట్టూ చూసిన నాకు షరీఫ్ అక్కడ ఎందుకు ఆపాడో అర్థం కాలేదు. ‘ఎక్కడ ఉంటాడు అతను?’ అడిగాను.
‘అదుగో!... ఎదురుగా రోడ్డు కవతల చెట్టు కింద నిలబడి ఉన్నాడు...’ చూపించాడు షరీఫ్.
రోడ్డు మీద ట్రాఫిక్ విపరీతంగా ఉంది. మేమిద్దరం రోడ్డు క్రాస్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాం.
నా దృష్టి ట్రాఫిక్ మీద కంటే రోడ్డుకు అవతల నిలబడి ఉన్న నైజీరియన్ వ్యక్తి మీద ఉంది. ఆ వ్యక్తి చూపు మాటమాటకీ పక్కన ఉన్న టీ స్టాల్ వైపునకు పోతోంది.
అతను ఎందుకు అంతలా అటు చూస్తున్నాడో అర్థంకాక, నేను కూడా ఆ పరిసరాలను తీక్షణంగా చూశాను.
ఆ టీ స్టాల్‌లో ఎక్కువమంది లోయర్ మిడిల్ క్లాసుకు చెందినవారు ఉన్నారు. జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. వారిలో ఇద్దరు మాత్రం గుంపులో ఇమడకుండా ఒక పక్కన కూర్చుని ఉన్నారు. వారి చూపులు మధ్యమధ్యలో నీగ్రో అతని చూపుతో కలుస్తున్నాయి.
నాకు ఏదో అనుమానం వచ్చింది. ఆ నీగ్రో వ్యక్తి చూపులు అనుమానాస్పదంగా ఉన్నాయి.
‘ఆగు షరీఫ్ భాయ్...!’ రోడ్డు దాటబోతున్న షరీఫ్ చేయి గట్టిగా పట్టుకుని ఆపుతూ అన్నాను నేను.
‘ఏమయింది?...’ ఆశ్చర్యంగా అడిగాడు షరీఫ్.
‘చెప్తాను. ముందు వెనక్కి రా!...’ అతన్ని వెనక్కి నడిపిస్తూ అన్నాను. ఇద్దరం వెనక్కి తిరిగి మా కారు దగ్గరకు వచ్చాం. ఇద్దరం కారు ఎక్కి కూర్చున్నాం.
‘ఏమిటి చంద్రం భాయ్? ఎందుకంత భయపడుతున్నావ్?’
‘నిజం చెప్పు షరీఫ్ భాయ్! నువ్వు ఆ నల్లోడికి డబ్బు ఇచ్చి తెచ్చేది ఏమిటో నీకు తెలుసా, తెలియదా?’
‘నాకేం తెలుసు చంద్రం? వాడితో నోరు తెరచి మాట్లాడను కూడా మాట్లాడను. నేను డబ్బులివ్వగానే వాడు చిన్న అగ్గిపెట్టె లాంటి పార్సిల్ ఇస్తాడు. అది తీసుకు వెళ్లి సారుకు ఇస్తాను...’
‘అగ్గిపెట్టె అంత పార్సిల్‌లో ఏముంటుంది?...’ అని కాస్త ఆలోచించగానే తట్టింది. ‘నా అనుమానం నిజం అయితే నువు తెచ్చేది డ్రగ్స్’ షరీఫ్‌కి చెప్పాను.
‘అమ్మో! డ్రగ్స్ అమ్మటం అంటే పెద్ద నేరం అంటగా...’ భయంగా అన్నాడు షరీఫ్.
‘అమ్మటమే కాదు. దగ్గర ఉంచుకోవటం కూడా నేరమే! వాడి దగ్గర ఆ డ్రగ్స్ కొన్నాక పోలీసులు నిన్ను పట్టుకుంటే ముందు అరెస్ట్ చేసేది నినే్న!’
‘ఆ పార్సిల్ తీసుకు వెళ్లకుండా ఇంటికి వెళ్తే మన సారు నన్ను తన్ని తగలేస్తారు’ భయంగా అన్నాడు షరీఫ్.
‘అలా అని... చూస్తూ చూస్తూ పులి నోట్లో తల పెడ్తావా? అందులో అక్కడ సెటప్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది’
‘పెద్ద వారి విషయాలు నీకు తెలియదులే భాయ్! చెప్పిన పని చేసుకు వెళ్లటమే మనం చేయవలసింది...’
‘నిజమే! కానీ ఒకసారి అటు చూడు. అక్కడ టీ కొట్లో కూర్చుని ఉన్నారే...! ఇద్దరు మనుషులు...’
‘ఎక్కడ...?’ సరిగ్గా గమనించలేక అన్నాడు షరీఫ్.
‘అదే! టీ షర్టులు వేసుకుని ఉన్నారు చూడు’
‘ఆ..! కనిపించారు’
‘వారి ఆకారాలు, హెయిర్ స్టెయిల్, చూపులు చూస్తుంటే వారు ఎవరని అనిపిస్తోంది?’
ఇప్పుడు నా భావం షరీఫ్‌కి కూడా అర్థమయింది. ‘మఫ్టీలో ఉన్న పోలీసులు’
‘కరెక్ట్... నాకెందుకో ఇది సెటప్ అని అనిపిస్తోంది. వాడిని ముందే పోలీసులు పట్టుకుని ఉంటారు. ఇప్పుడు వాడిని ఎరగా చూపించి డ్రగ్స్ కొనే వారిని పట్టుకోవాలని చూస్తున్నారు. మనం దొరికామంటే అడ్డంగా బుక్కయిపోతాం. కళానిధి శుభ్రంగా తనకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటాడు. మనం ఎటూ తప్పించుకోలేం. ఏ ఏడేళ్లో జైల్లో కూర్చోవాలి’
‘ననే్నం చెయ్యమంటావో నువ్వే చెప్పు బ్రదరూ! అయినా మన సారుకి ఈ అలవాటు కూడా ఉండాలా? అది తీర్చుకోవటానికి అమాయకులం మనమే దొరికామా? ఆ పార్సిల్ తీసుకు వెళ్లకుండా వెళ్తే ఆయన ఊరుకోడు. తీసుకుంటే నా పని ఔటని నువ్వంటున్నావ్. మరి ఏం చెయ్యమంటావ్...’
‘నన్ను ఒక్క క్షణం ఆలోచించనీ...’ అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూసిన నాకు రెండు నిమిషాల్లో ఒక ప్లాన్ తట్టింది. మేమున్న కారు దగ్గర్లో పేవ్‌మెంట్ మీద చిన్న గొడుగు కింద కూర్చుని ఉన్నాడు బూట్‌పాలిష్ చేసే కుర్రవాడు. వయసు పదేళ్ళుంటాయి.
విజిల్ వేసి ఆ పిల్లవాడి దృష్టి నా వైపు తిప్పుకున్నాను.
తలెత్తి ఏమిట్నట్లు చూశాడు ఆ కుర్రాడు. దగ్గరకు రమ్మని పిలవటంతో లేచి గబగబా నా దగ్గరకు వచ్చాడు.
‘ఒక పని చేసి పెడతావా?’ అడిగాను.
‘ఎదురుగా రోడ్డు మీద నిలబడి ఉన్నాడే... అతనికి ఈ డబ్బులు ఇచ్చి, అతను ఇచ్చింది తెచ్చి మాకివ్వాలి...’
‘నా బేరాలు పోతాయి సార్’
‘ఊరికినే ఎందుకడుగుతాం. ఈ వందా నువ్వుంచుకో’ నా జేబులో డబ్బులు తీసి ఇస్తూ అన్నాను.
‘అయితే సరే! ఆ డబ్బులిటివ్వండి...’ అంటూ షరీఫ్ దగ్గర డబ్బులు తీసుకుని, నా దగ్గర వంద తన జేబులో పెట్టుకుని రివ్వున పరుగెత్తాడు కుర్రాడు.
‘జాగ్రత్త...’ అంటున్న నా మాటలు గొంతు దాటక ముందే ఆ కుర్రాడు రోడ్డు దాటుతున్నాడు.
‘అనవసరంగా వంద వాడికిచ్చావేమో...’ షరీఫ్ అన్నాడు.
నేనేమీ మాట్లాడలేదు.
కుర్రాడు రోడ్డు దాటి నీగ్రో వ్యక్తిని కలిశాడు. ఇద్దరికీ ఒకరి మాటలు ఒకరికి అర్థం అవుతున్నట్లు లేదు. సైగలు చేసుకుంటున్నారు.
కుర్రాడు వేలుపెట్టి తమ కారు వైపు చూపిస్తున్నాడు.
‘నువు కారు స్టార్ట్‌చేసి ఉంచు...’ అన్నాను. షరీఫ్ మారు మాట్లాడకుండా చెప్పింది చేశాడు.
నా దృష్టి మాత్రం టీ స్టాల్‌లో కూర్చుని ఉన్న ఇద్దరి మీదే ఉంది. ఎప్పుడయితే బూట్ పాలిష్ కుర్రాడు నీగ్రో వ్యక్తిని సమీపించాడో వారు ఎలర్ట్ అయ్యారు. వెంటనే లేచి నిలబడి ఆ కుర్రాడి వైపు అడుగులు వేశారు.
‘పోనియ్...’ అన్నాను.
‘మన డబ్బులు...’ గొణుగుతున్నాడు షరీఫ్.
‘త్వరగా పోనీయ్!...’ ఇంకా బిగ్గరగా అరిచాను.
బూట్ పాలిష్ కుర్రాడు చెప్తున్న మాటలు అర్థమై పోలీసులు మా కారు కోసం చూసేటప్పటికి... అది దూరంగా మలుపు తిరుగుతూ కనిపించింది.
రియర్ వ్యూ మిర్రర్‌లో చూస్తున్న నాకు మేము తప్పించుకున్నామని అర్థమైంది.
కారు మరి నాలుగు సందులు మారేవరకు ఎవరం ఏమీ మాట్లాడలేదు. షరీఫ్ తన డ్రైవింగ్ నైపుణ్యం చూపించి అత్యంత వేగంగా ఆ లొకాలిటీ నుండి బయట పడేశాడు. అతని దృష్టి ఎదుటి రోడ్డు మీదకన్నా రియర్ వ్యూ మిర్రర్‌లో కనిపిస్తున్న వెనుక రోడ్డు మీదే ఎక్కువ ఉంది - ఎక్కడ పోలీసులు తనను తరముకు వస్తున్నారో అని.
‘కారు నెంబర్ చూసి ఉంటారంటావా?’ ఆత్రుతగా అడిగాడు షరీఫ్.
‘లేదు. చూడలేదు...’
‘రోడ్డు మీద కెమెరాలు ఉంటయ్యంటగా... వాటిల్లో కనిపించదా?’
‘అంత లోతుకు వెళ్తారనుకోను. అయినా కష్టపడి నెంబర్ సంపాదించినా మనం పోలీసులకు కనపడకుండా ఉంటే చాలు. సీన్‌లో కళానిధిగారు లేరు కాబట్టి ఆయన్ని ఏమీ చెయ్యలేరు...’
దాదాపు కళానిధి ఇంటికి చేరుకునేప్పటికి షరీఫ్‌కి కాస్త ధైర్యం వచ్చింది. ఇంతలో అతనికి పోయిన డబ్బు సంగతి గుర్తుకు వచ్చి భయం వేసింది.
‘చంద్రం! డబ్బుల సంగతి ఏమి చెయ్యాలి? జరిగింది చెప్తే సారు నమ్ముతారంటావా?’
‘ఎందుకు నమ్మరు? నా సంగతి వదిలిపెట్టు. నువు ఆయన దగ్గర ఎన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నావ్? అలాంటిది ఇంత చిన్న విషయానికి ఆయన నిన్ను అనుమానిస్తారనుకోను...’ అన్నాను.
నిజమే! నేను అనుకున్నట్లే... కళానిధి మమ్మల్ని అనుమానించలేదు.
తన మీద తనకే కలిగిన జాలికో, కొద్దిలో తప్పిపోయిన ప్రమాదం తలచుకునో... కుంగిపోయినట్లు అయిపోయాడు. జరిగినదంతా మరలా ఒకసారి చెప్పించుకున్నాడు. తరువాత చాలాసేపు ఆలోచనలో మునిగిపోయాడు.
నేను, షరీఫ్ ఆయన ఎదురుగా నిలబడే ఉన్నాం.
కాసేపటికి తేరుకున్నట్లయిన కళానిధి, ‘షరీఫ్.. నువ్వెళ్లి కాఫీ పట్టుకురా...’ అన్నాడు.
షరీఫ్ వెళ్లిపోయాడు.
అప్పుడు నా వైపు తిరిగాడు కళానిధి. ‘నీకు అక్కడ పోలీసులు ఉన్నారని అనుమానం ఎందుకు వచ్చింది?’ అని అడిగాడు.
‘ఎందుకంటే... ఏమో సార్! బహుశా సిక్స్త్ సెన్స్ అంటారే, అదే కారణమేమో..!’
‘ఏం చదువుకున్నావ్?’
‘చెప్పుకోదగినంత ఏమీ చదువుకోలేదు సార్... నేర్చుకున్నది ఏదైనా ఉందంటే అది సినిమాల ద్వారానే!...’
‘ఈ రోజు నువ్వు షరీఫ్‌ని ఆపకుండా ఉన్నట్లయితే ఏమి అయి ఉండేదో తెలుసా..?’
నేను ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయన చెప్పింది జరిగి ఉంటే ఏమయి ఉండేదో నాకు బాగా తెలుసు. ముందు మమ్మల్ని అరెస్ట్ చేసేవారు. మేము కళానిధి పేరు చెప్పక తప్పేది కాదు. వెంటనే మీడియాలో ఆయన డ్రగ్స్ వాడతారన్న పేరు మారుమోగిపోయేది. పోలీసులు కేసు రుజువు చేయగలుగుతారా లేదా అన్నది పక్కన పెడితే, ఆయన వృత్తిపరంగా కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చి ఉండేది.
అదే ఆయన కూడా అన్నాడు. ‘మీరు నా గురించి చెప్పినా చెప్పకపోయినా, కారు నెంబర్ ఆధారంగా నా పేరు బయటపడి ఉండేది. తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఎదురయ్యేది...’
‘సార్!... చిన్నవాడిని. మీకు చెప్పవచ్చో లేదో తెలియదు. కానీ.. ఇన్ని అనర్థాలకు మూలమవుతున్న ఆ అలవాటు మానలేరా?...’
కళానిధి వౌనంగా ఉండిపోయాడు. ఏ అలవాటయినా చాలా సులువుగా వొంటబడుతుంది. ముఖ్యంగా అది చెడు అలవాటయితే. కానీ, దాన్ని వదిలించుకోవటం అనుకున్నంత సులభం కాదు. ముందు కళానిధిని సరదాగా పలుకరించిన ఆ అలవాటు, ఇప్పుడు ఆయన్ని బానిసగా చేసుకుంది. తన డబ్బు, పేరు, పలుకుబడి... అన్నీ పణంగా పెడుతున్నానని తెలిసి కూడా ఆయన ఆ అలవాటు నుండి బయట పడలేక పోతున్నాడు.
ఇంతలో షరీఫ్ కాఫీ తీసుకుని వచ్చాడు. మా సంభాషణ ఆగిపోయింది.
‘సార్! మన తరువాత షెడ్యూల్ విశాఖపట్నంలో అన్నారు. ఎప్పుడు వెళ్లాలి?’ అని అడిగాను.
ఆయన నా మాటకు సమాధానం చెప్పలేదు. ‘నీ చురుకుదనం చూస్తుంటే ముచ్చట వేస్తోంది..’ అన్నాడు ఏదో ఆలోచనలో మునిగితేలుతూ. ‘నీలాంటి తెలివితేటలు ఉన్నవాడు ఇక్కడ ఇండస్ట్రీలో ఇమడటం చాలా కష్టం. అయినా అసలు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావ్?’ అని అడిగాడు.
ఆయన అలా అడగటంతో నా కళ్లు మిలమిలా మెరిశాయి. ఎప్పుడెప్పుడు ఎవరికి చెబ్దామా అని దాచుకున్న కోరికని ఆయన ముందు వెల్లడించాను. ‘నటుడ్ని అవుదామని వచ్చాను సార్! పెద్ద హీరోని కావాలన్నది నా కోరిక’
పెద్దగా నవ్వాడు కళానిధి. ‘ఇక్కడ స్పాట్ బాయ్ కూడా అవకాశం వస్తే హీరోగా చేద్దామనే అనుకుంటాడు. అర్హత ఉందా లేదా అన్నది పక్కనపెడితే, ఎంత మందికి ఆ అవకాశం వస్తుంది? అందులో ఎంతమంది నిలదొక్కుకో గలరంటావ్?’
‘అంటే నాకు ఆ అర్హత లేదంటారా?’
‘ఆ మాట నేనెలా అంటాను చంద్రం? అర్హత లేదు, పనికిరావు పొమ్మన్న మాట అమితాబ్ బచ్చన్ అంతటి వాడికి కూడా తప్పలేదు. ఇక్కడ ఏ పనికి ఎవడు పనికివస్తాడో పర్ఫెక్ట్‌గా జడ్జ్ చేయగల మొనగాడు ఎవడూ లేడు. ముఖ్యంగా నటుల విషయంలో ప్రేక్షకుల టేస్ట్‌కి, ఇండస్ట్రీ టేస్ట్‌కి సంబంధం ఉండదు. ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పగలరు?’
‘మీ ఉద్దేశం చెప్పండి సార్. హీరో అవటానికి నేను పనికి వస్తానా?’
కళానిధి నన్ను పరిశీలనగా చూశాడు. ఆయన ఏమి పరిశీలిస్తున్నాడో నాకు తెలుసు. ఒక సినిమాటోగ్రాఫర్‌గా ముందు నా పర్సనాలిటీని పరిశీలిస్తున్నాడు. చివరికి ఏ నిర్ణయానికి వచ్చాడో కానీ, ‘వద్దు చంద్రం! నువు మాతో విశాఖపట్నం రావద్దు...’ అన్నాడు.
‘అదేంటి సార్..’ ఆందోళనగా అన్నాను.
‘మరెలా? కోరికలేమో పెద్దవి. ఇలా ట్రాలీ తోసుకుంటూ తిరుగుతుంటే అవి ఎలా తీరతాయి?
‘మరేమి చెయ్యమంటారు?’
‘నీకు శరీర పరంగా అర్హతలన్నీ బానే ఉన్నాయి. కాకపోతే ఉత్త ఆకారమే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. అన్నీ నీకు నేర్పి అవకాశం ఇచ్చే ఓపిక ఇప్పటి దర్శకులకు లేదు. సినిమాలో ఛాన్స్ రావటానికి ముందే అన్నీ నేర్చుకుని ఉండాలి. వెళ్లి ఫిల్మ్ నగర్‌లో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. దాన్లో చేరు. ట్రాలీ తోసే వాళ్లకి ఎవరూ హీరో వేషాలివ్వరు. నలుగురి కళ్లలో పడాలంటే అలాంటి చోటే ఉండాలి...’ అన్నాడాయన.
‘కానీ దాని గేటు దాటి కూడా నన్ను వెళ్లనివ్వరు సార్!... అది ఎంత ఖరీదయినదంటే...’
‘నాకు తెలియదనుకున్నావా? ఆ సంగతి నాకు వదిలిపెట్టు. నువు వెళ్లి దాని ప్రిన్సిపాల్‌ని ఈ రోజే కలువు. నేను ఆయనతో మాట్లాడతాను’
నేను వింటున్నది నిజమో, కలో అర్థం కాలేదు. నిలబడ్డ వాడిని నిలబడ్డట్లు ఆయన కాళ్ల మీద పడిపోయాను. వద్దనుకున్నా గొంతు గద్గదమవుతుంటే, ఏమనాలో తోచక ‘సార్...’ అని మాత్రం అనగలిగాను.
‘నేను నిజమే చెప్తున్నాను వెళ్లు...’ అన్నాడు ఆయన నన్ను లేపుతూ.
ఎక్వుక భాగం సంభాషణ జరిగినపుడు షరీఫ్ గదిలో లేకపోవటంతో అతనికి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ నాకు ఏదో మంచి జరుగుతుందని మాత్రం అర్థమైంది.
నాతోపాటు గది బయటకొచ్చిన షరీఫ్ ‘నువు పెద్దవాడివి అయితే నన్ను మర్చిపోకు బ్రదర్...’ అన్నాడు.
* * *
ప్రస్తుతం
సడన్‌గా ఎదురైన స్పీడ్ బ్రేకర్‌ను తప్పించటానికి వేసిన బ్రేక్‌తో కారు ఒక్కసారిగా వేగం తగ్గించుకుంది. ముందు సీటుకు కొట్టుకోబోయి అతి కష్టం మీద ఆపుకున్నాడు చంద్రం.
‘ఏమయింది షరీఫ్...’ అడిగాడు.
‘సారీ సాబ్! దగ్గర వచ్చే వరకూ కనపడలేదు’
‘ఇంకొకసారి సాబ్ అని పిలిస్తే వేరే వాళ్ల దగ్గర నౌకరీ చూసుకోవచ్చు’
‘అలాగే సాబ్!’ యధాలాపంగా అన్నాడు షరీఫ్.
నుదురు కొట్టుకున్నాడు చంద్రం. ‘నేనేమన్నానో విన్నావా? వినకుండానే ప్రతిదానికీ అలాగే సాబ్.. అంటే ఎలా?’
‘నా పని మిమ్మల్ని చెప్పిన చోటుకు జాగ్రత్తగా చేర్చటం. మిగిలిన విషయాలు నాకెందుకు సాబ్?’
షరీఫ్ చంద్రం దగ్గర పనికి చేరి సంవత్సరాలయింది. అప్పటి నుండి చంద్రం ఈ మాట చెప్తూనే ఉన్నాడు. షరీఫ్ సరే అంటూనే ఉన్నాడు.
‘ఇంకెంతసేపు పడుతుంది ఊరు చేరటం?’
‘ఇంకో రెండు గంటలు పడుతుంది సాబ్! మధ్యాహ్నం భోజనాల సమయానికి చేరిపోతాం...’
‘ఈ రోడ్లేంటి షరీఫ్? ఇన్ని గుంతలు పడిపోయి ఉన్నాయి. ఈ లెక్కన మన ప్రయాణం పూర్తి అయ్యేటప్పటికి నా నడుము విరిగి పోతుందేమో...’
‘సాబ్! మీరు ఆ మాట గట్టిగా అనకూడదు సాబ్! అధికార పార్టీకి ప్రచారం చేసి మీ అభిమానులందరినీ ఓట్లెయ్యమని అడిగారు. ఇంకా రిజల్ట్ కూడా రాకముందే, వాళ్లనే విమర్శిస్తే ఎలా సాబ్?’
‘ఇదుగో షరీఫ్, ఎవరో తెలియని వాళ్లు అనుకుంటే సరే! నాకే బాధా లేదు. నువు కూడా అలా అంటే ఎలా? నేను నా స్నేహితురాలికి ప్రచారం చేశాను తప్ప అధికార పార్టీకి కాదు. నా ప్రచారంలో అది కూడా చెప్పాను. రేపు ఒకవేళ వసుంధర వేరే పార్టీలో ఉన్నా ఆమెకే నేను ప్రచారం చేస్తానని కూడా చెప్పాను. నా ప్రయత్నంలో భాగంగా అధికార పార్టీ కూడా లాభపడితే నేనేమీ చెయ్యలేను...’
‘సాబ్! మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట. మీరు ప్రచారానికి వస్తారనీ, మీ పాపులారిటీని వాడుకోవచ్చనే ఆమెకి అధికార పార్టీ సీటు ఇచ్చిందని కూడా ఒక టాక్ ఉంది’
‘అంటే ఆమె నియోజకవర్గానికి చేసిన శ్రమ అంతా వృధానా? నా మొహం చూసి ఆమెకు సీటు ఇచ్చారంటావా?’ ఒకింత కోపంగా అన్నాడు చంద్రం.
‘బయట అనుకుంటున్న మాట చెప్పాను సాబ్..!’ అతని కోపాన్ని పట్టించుకోకుండా చెప్పాడు షరీఫ్.
ఏదో అనబోతున్న చంద్రం ఫోను రావటంతో మాటలు ఆపి ఫోను ఎత్తాడు.
ఎక్కడయినా పాతనీరు పోయాక ఆ స్థానంలోకి కొత్త నీరు వస్తుంది. ఒక్క సినీ ఇండస్ట్రీలో మాత్రం పాతనీటిని తీసేసి మరీ కొత్త నీరు రావాలి. ప్రతిభకి పట్టం కట్టే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే, అది సినీ ఇండస్ట్రీ. ఐఐటిలో టాపర్‌గా నిలిచిన వాడికి వచ్చే ప్యాకేజ్ కూడా సంవత్సరానికి పాతిక లక్షలు దాటదు. అదే ఒక డైరెక్టర్ మీద గురి కుదిరితే అతని మీద యాభై కోట్లు పెట్టుబడి పెట్టటానికి నిర్మాతలు తయారుగా ఉంటారు. ఒక కొత్త ఆర్టిస్టు కానీ, టెక్నీషియన్ కానీ ఇండస్ట్రీలోకి వచ్చారంటే ఒక పాత ఆర్టిస్టు కానీ, టెక్నీషియన్ కానీ తప్పుకోవలసిన సమయం ఆసన్నమయిందన్న మాట.
ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, కళానిధి తన వ్యసనం నుండి బయటపడలేక పోయాడు. ఏ వ్యసనమయినా వృత్తి మీద ఎఫెక్ట్ చూపటానికి ఎక్కువ రోజులు పట్టదు. ఆ తరువాత అతని బలహీనత గురించి అందరికీ తెలియటానికి ఎక్కువ రోజులు పట్టదు. ఒకసారి అతని బలహీనత గురించి బయటపడ్డాక అతని అవకాశాలు ఆటోమేటిగ్గా తగ్గిపోతాయి.

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002