S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మంచి ప్రవర్తన (స్ఫూర్తి)

స్కూల్ నించి ఇంటికి తిరిగి వచ్చిన సహర్ష్ తన తల్లితో చెప్పాడు.
‘అమ్మా! ఇవాళ మా క్లాస్‌లో డ్రాయింగ్ పోటీలు పెట్టారు’
‘ఓ! ఇవాళేనా? వారం రోజుల నించి దానికి ప్రిపేర్ అవుతున్నావు కదా? ఎలా గీసావు?’ తల్లి అడిగింది.
‘అక్కడక్కడ చిన్నచిన్న తప్పులు ఉంటే చివర్లో రబ్బర్‌తో తుడిచి కరెక్ట్ చేద్దామనుకున్నాను. కాని అందుకు టైం లేకపోయింది.. అమ్మా! నాన్న ఫ్రెండ్ ఒకాయన మనింటికి వస్తూంటారు కదా? బొమ్మలు గీసే ఆయన పేరేమిటి?’
‘కార్టూనిస్టా? ఎందుకు? రవీంద్ర’
‘ఆయన్ని న్యాయ నిర్ణేతగా తీసుకున్నారు. ఆయనే మా బొమ్మలని చూసి బహుమతులని నిర్ణయిస్తారుట. నాన్నతో చెప్పి నా ఎడారి, ఒంటె బొమ్మకి మొదటి బహుమతి వచ్చేలా చేయమను’
‘నువ్వే అడుగు’ తల్లి ముభావంగా చెప్పింది.
ఆఫీస్ నించి తండ్రి వచ్చాక సహర్ష్ తండ్రికి మళ్లీ అవే విషయాలు చెప్పాడు.
‘కొట్టివేతలు లేకుండా టైంకి గీసిన వారు ఉన్నారా?’ తండ్రి ప్రశ్నించాడు.
‘ఉన్నారు’
‘అప్పుడు బహుమతి ఎవరికి వెళ్లాలి?’
‘టైం తక్కువ ఇచ్చారు నాన్నా’
‘తక్కువ టైంలో కొట్టివేతలు లేకుండా చక్కగా గీయడం ఇంకా గొప్ప కదా?’ తండ్రి నవ్వుతూ అడిగాడు.
సహర్ష్ తండ్రి వంక నిస్సహాయంగా చూశాడు.
‘సరిగ్గా గీయకపోయినా నీకే బహుమతి రావాలని ఎందుకు అనుకుంటున్నావు?’
‘అంతా మెచ్చుకుంటారని’
‘అంతా మెచ్చుకోవటాన్ని ఏమంటారో తెలుసా?’
సహర్ష్ తల అడ్డంగా ఊపాడు.
‘కీర్తి. మనిషికి కీర్తి కంటే మంచి ప్రవర్తన ముఖ్యం. కీర్తి అంటే నీ గురించి ఇతరులు ఏం తెలుసుకుంటారో అది. కేరెక్టర్ అంటే నీ గురించి నీకేం తెలుసో అది. కీర్తి విషయంలో మనం ఇతరులని మభ్యపెట్టచ్చు. కాని ప్రవర్తన విషయంలో మనల్ని మనం మభ్యపెట్టుకోలేం. నీకు ప్రథమ బహుమతి వచ్చినా మనసులో అందుకు నీకు అర్హత లేదని తెలుస్తూనే ఉంటుంది’
ఆ సంభాషణ వింటున్న తల్లి చెప్పింది.
‘కేరెక్టర్ అంటే ఇతరులు నిన్ను చూడనప్పుడు నువ్వేం చేస్తున్నావో అది. మనిషికి కీర్తి కన్నా కేరెక్టర్ ముఖ్యం’
‘కేరెక్టర్ చెట్టులాంటిది. దానికి అనుబంధంగా ఉండేది కీర్తి. మనం నీడని చూసి చెట్టుని మర్చిపోకూడదు’ తండ్రి హితవు చెప్పాడు.
‘ఐతే వద్దు నాన్నా. చక్కగా గీసిన వారికే బహుమతి వెళ్లడం సబబు’ సహర్ష్ తండ్రితో చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి