S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వయసుకి మర్యాద

సునందుడు మంగళపురిని ఏలూతున్న కాలంలో సుమంతుడనే క్షత్రియ కుమారుడు రాజు సైనిక శిబిరంలో తన తండ్రిగారి మాట పలుకు ఆసరాతో కొలువు సంపాదించాడు. కాలక్రమాన అక్కడి వ్యాయామశాలకు పర్యవేక్షకుడిగా పదోన్నతి పొందాడు. ఐతే అతడిలో బాల్యదశ నుండి అణువణువునా గర్వం ఎగసిపడేది. పెద్దాచిన్నా అన్న తారతమ్యం లేకుండా ఎదుటివారిని తూలనాడేవాడు. తనకు సమానమెవడూ లేడని విర్రవీగుతుండేవాడు. శాంతం భూషణం అన్న ధర్మసూత్రాన్ని మరిచాడు
ఒకసారి రాబోతూన్న ఊరి ఆలయ ఉత్సవాలకు మల్లయుద్ధ పోటీలు జరగబోతున్నాయని ప్రకటించాడు సునందుడు. పోటీలో చివరి వరకూ నెగ్గుతూ వచ్చి, చివరి ప్రత్యర్థిని కిందపడేలా పడగొట్టగలిగిన వాడికి సైన్యాధిపతి పదవితోపాటు తన ముద్దుల తనయ మాలినిని కన్యాదానం చేసి వివాహం జరిపిస్తానని దండోరా వేయించాడు. ఆ ప్రకటన విన్న వెంటనే సుమంతుడి మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. తన ముందు నిలవగల మొనగాడు ఆ ఊళ్లో ఇంకెవడున్నాడు? ఇదీ అతడిలోని అహంకారపూరిత స్వగతం. కాని అప్పుడప్పుడు మనిషి ఒకటనుకుంటే - దేవుడు మరొకటి అనుకుంటాడేమో కదా!
మల్లయుద్ధ పోటీలు ప్రారంభం కావడానికి వారం దినాలుండగా అదేమి మాయోగాని సుమంతుడికి కంటి వ్యాధి తాకింది. కళ్ల నుండి నీరు అదే పనిగా స్రవించటాన చూపు మందగించింది. మల్లయుద్ధ బయలులో అభ్యాసం తగ్గింది. రాజకుమారి మాలిని తనకిక లభించదేమోనన్న వ్యాకులతతో సుమంతుడి మనసు కృశించింది. సునందుడి కొలువులో మహామంత్రిగా ఉన్న తండ్రి ప్రమేయంతో పొరుగూళ్ల నుండి పలు వైద్య శిఖామణులను రప్పించారు. ఊహు! ప్రయోజనం శూన్యం. మాలిని వంటి సౌందర్యవతిని పొందలేని తన బ్రతుకూ ఒక బ్రతుకేనా? ఆ రీతిన తలపోస్తూ ప్రాణ త్యాగమే శరణ్యమన్న నిర్ణయానికి రాసాగాడు సుమంతుడు. అప్పుడు ఇంటి మొగసాల వద్ద ఎవరిదో గొంతు వినిపించి సుమంతుడు చూపు ఆనక తడబడుతూ ‘ఎవరదీ!’ అంటూ బైటకు వచ్చాడు. మొదటి నవ్వు వినిపించి పిదప బదులు వినిపించింది!
‘నేనూ పరంధామయ్యను!’
‘అదెవర’ని అడిగాడు సుమంతుడు.
మరొకసారి నవ్వుతూ బదులిచ్చాడు పరంధామయ్య ‘నీకు మా బోటి చిన్నవాళ్లు ఎలా గుర్తుంటారు చెప్పు? ఇప్పుడు చెప్తున్నాను. గుర్తుకు తెచ్చుకో! నన్ను పేద పరంధామయ్యంటారు. నేనొకరోజు నా గోడు రాజుగారితో చెప్పుకుని సహాయం పొందడానికి ఆయన దర్శనార్థం నీ సహాయం కోరాను. ఆయన అనుమతి కోసం ద్వార పాలకులకు నా తరఫున ఒక మాట ఆసరాగా చెప్పమని. అప్పుడు నువ్వేం చేశావో తెలుసా? నా వయసూ నా పెద్దరికమూ లక్ష్యపెట్టకుండా ఇంటి గడప కూడా తొక్కనివ్వకుండా మీ ఇంటి రక్షక భటులచే గెంటించావు. హీనపర్చావు. కానీ నేనది మనసున పెట్టుకోను. ఎందుకంటే? నేను వయసులో పెద్దవాణ్ణి. అనుభవంలో అగ్రజుడను. గతం గతః అన్న ధర్మసూత్రాన్ని మనసున తలచుకుని నేనుగా వచ్చాను. ఎంతైనా నువ్వు మా ఊరి బిడ్డవు కదా! అందుకని నీకు సహాయం చేయడానికి కర్ర చేతబట్టుకొని తడబడుతూ నీ ఇంటి ముంగిటకి వచ్చాను. నాకు తెలిసిన ఔషధమొక్కటి ఉంది. దాని పస గాని రెండు కళ్లల్లోనూ వేసుకుంటే నీ కంటి వ్యాధి చిటికెలో మటుమాయమవుతుంది.’
‘అలాగా! చెప్పు తాతా! ఆ ఔషధ మొక్క ఎక్కడుంది? అది చిట్టడవిలో ఉన్నా సరే! నా అనుచరుల్ని పంపించి వెతికించి పట్టుకు వస్తాను. నేనొక రోజు అవివేకంతో చూపించిన దూకుడుతనాన్ని క్షమించి నాకు దారి చూపించు తాతయ్యా!’
‘ఓరి వెర్రి మనవడా! నీ వ్యాపకం గొర్రెపిల్లను మెడపై నుంచుకుని ఊరంతా వెతికినట్లుంది. ఆ ఔషధ మొక్క ఎక్కడో లేదు. మీ ఇంటి పెరట్లోనే ఉంది నాయనా!’ అంటూ పరంధామయ్య కుంటుతూ తడబడుతూ వాళ్ల పెరట్లోకి వెళ్లి ఔషధ మొక్కను తెంపుకుని వచ్చి దాని పసరుని సుమంతుడి రెండు కళ్లల్లోనూ పోశాడు. మరు నిమిషం సుమంతుడికి చూపు దివ్యంగా వచ్చేసింది. వారం రోజుల్లోపల జరిగిన మల్లయుద్ధ పోటీలలో అందరినీ ఓడించి రాజ పతకాన్ని గెలుపొంది లావణ్యవతి ఐన మాలినిని జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు సుమంతుడు. అప్పుడు అతడు చేసిన మొదటి కార్యం భార్యాసమేతంగా వెళ్లి తమ ఊరికి పెద్దవాడూ వయోవృద్ధుడూ అయిన పరంధామయ్య కాళ్లపైన పడి ఆశీర్వాదం పొందడమే.

-పాండ్రంగి సుబ్రమణి